మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాల అయిన సందర్భంలో రాజ్యాంగ వజ్రోత్సవాలను ఈ నవంబర్ 26 నుంచి సంవత్సరం పాటు దేశమంతా జరుపుకోబోతుంది. వాడ వాడలా రాజ్యాంగం పట్ల దాని ఆచరణ పట్ల అవగాహన పెంపొందించడమే ఈ వజ్రోత్సవాల లక్ష్యం కావాలి.
డా. అంబేద్కర్ నాయకత్వంలో వివిధ దేశాల రాజ్యాంగాలు, భారతీయ సమాజపు నైతిక, తాత్విక మూలాలు అధ్యయనం చేసి దాదాపు మూడు సంవత్సరాలు కృషితో రూపొందించబడిన డాక్యుమెంట్ మన రాజ్యాంగం. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎలాంటి అసమానతలు, వివక్షలు లేని ప్రజాస్వామిక, మానవీయ స్పర్శతో విలసిల్లే మానవ సమాజాన్ని నిర్మించుకోవడం కోసం అవసరమైన భావనల, పాలనా విధానాల, బాధ్యతల సమోన్నత చట్టరూపమే మన రాజ్యాంగం. ఏ తారతమ్యాలు లేకుండా ప్రజలందరికీ ఓటు హక్కు, విద్య, వైద్య హక్కులు, ఆరోగ్యంగా ఆత్మాభిమానంతో జీవించే హక్కు, ఆలోచనలను, విశ్వాసాలను భయం లేకుండా చెప్పగలిగే భావ ప్రకటనా స్వేచ్ఛ, జీవిత విధానాన్ని ఇష్టపూర్వకంగా నిర్దేశించుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. పలు రాష్ట్రాలు, ప్రాంతాలు, జాతులు, కులాలు, భాషలు, భిన్న సంస్కృతులు, భౌగోళిక స్థితులతో వైవిధ్యపూరితమైన మన దేశ ప్రజలందరి మధ్య ఐక్యత సాధించి భిన్నత్వంలో ఏకత్వం సాధ్యమని నిరూపించింది మన రాజ్యాంగం. కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఫెడరల్ విధానం ద్వారా సమన్వయం చేసింది. తరతరాలుగా ఎలాంటి అవకాశాలు పొందలేకపోతున్న సమూహాల కోసం ప్రత్యేక సదుపాయాలు, రిజర్వేషన్లు కల్పించింది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఈ సమూహాలు విద్యావంతులై ఉన్నత పదవుల్లో, ఉద్యోగాల్లో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ, ఆదివాసీ సమూహాలు, స్త్రీలు సామాజిక ఆర్థిక, రాజకీయ రంగాల్లో బలమైన శక్తిగా ఎదిగారు. ఇది ఒక చారిత్రక మలుపు. ఈ రాజ్యాంగమే లేకపోతే ఈ అభివృద్ధి సాధ్యమయ్యేది కాదు.
భారతీయ సామాజిక వ్యవస్థను సమూలంగా మార్చి అసమానతలు లేని, వివక్షలు లేని, అందరికీ సమాన హక్కులు కలిగిన నూతన సమాజ నిర్మాణానికి శాంతియుత, సహేతుక మార్గాన్ని చూపుతున్న మన రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయడమే ఇవ్వాళ్టి మేధావుల, విద్యావంతుల, ప్రజాస్వామికవాదుల కర్తవ్యం.
ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరమంతా గ్రామగ్రామాన రాజ్యాంగం పట్ల, దాని ఆచరణ పట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. రాజ్యాంగాన్ని పాఠ్యాంశం చేసి ప్రతి పాఠశాలలో వారానికి ఒక పీరియడ్ రాజ్యాంగ శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. వివిధ రంగాల, వృత్తుల ప్రజల మధ్య అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి.
మన దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా నిలబెట్టుకోవడానికి తగిన రాజకీయ ఆచరణ కోసం కృషి చేయాలి.
ఈ రాజకీయ ఆచరణ ద్వారానే రాజ్యాంగ వజ్రోత్సవాల లక్ష్యాన్ని సాధించగలం…
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్