జీడికల్లు తీర్థం

జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో చివరి గ్రామం జీడికల్లు. గొప్ప రామాలయక్షేత్రంగా ప్రసిద్ధి. ప్రతి కార్తీకపున్నమినాడు జీడికల్లు జాతర జరుగుతుంది.


జీడికల్లు 16వ శతాబ్దం తర్వాత కాలం నుంచి వైష్ణవపీఠంగా ప్రసిద్ధం. జీడికల్లు నుంచే చుట్టుపక్కల వైష్ణవాలయాలకు కావాల్సిన సంభావనలు, అంతేకాదు ఉద్యోగులకు జీత, భత్యాలందుతుండేవి. జీడికల్లు చుట్టు సీతారాంపురంలో రాముడు, బ్రాహ్మణపల్లి వేణుగోపాలస్వామి, సుద్దాలలో వేణుగోపాలస్వామి, గొలను కొండలో వేణుగోపాలస్వామి, అమ్మనబోలులో కేశవుడు, షారాజిపేటలో వేంకటేశ్వరుడుగా కొలువబడుతున్న కేశవమూర్తి, కొల్లూరులో వేణుగోపాల స్వామి, సాయిగూడెంలో రాముడు, ఆలేరులో రంగనాథుల ఆలయాలు ఒక వైష్ణవాలయాల గొలుసు. రాయగిరి వేంకటేశ్వరస్వామికి, యాదగిరిగుట్ట నరసింహస్వామికి కళ్యాణోత్సవాల సందర్భంగా తలంబ్రాలు జీడికల్లు నుంచే వెళ్ళేవని భక్తులు చెప్పుకుంటారు. జీడికల్లులో ఉన్న వైష్ణవ పీఠాధిపతి ఎవరో తెలియరాలేదు. దేశికులవారు ఈ దేవాలయానికి ఆస్థాన పూజారులు. ప్రస్తుతం జీడికల్లులో క•ష్ణదేశికులు (ఆస్థానపూజారులు) న్నారు. వారి వారసులు వైష్ణవాలయాల అర్చక, పూజారులుగా వుండేవారు.


జీడికల్లు గురించి పురాణాలు, కైఫీయత్తులు చాలానే వున్నాయి. వాటిలో ఒకటి వీరుడనే రామభక్తుని తపస్సు ఉదంతం ఒకటి. భద్రాచలంలో భద్రుడు, వీరాచలం (జీడికల్లు)లో వీరుడు రాముని కొరకు తపస్పుచేసారని, వారిద్దరికి ప్రత్యక్షమైన రాముడు భద్రునికి భద్రాచాల రామునిగా, వీరునికి వీరాచలస్వామిగా అనుగ్రహించాడని చెప్పుకునే కథ వుంది. నిజానికి భద్రాచలానికి వీరాచలానికి సంబంధం కనిపించదు. శబరినది ఒడ్డున అడవిలో సీతారాములు, లక్ష్మణుల శిల్పాలెక్కడో వుండేవని వాటికి కంచర్ల గోపన్న గుడికట్టించిందే భద్రాచలమని ఐతిహ్యం. వీరాచలంలో రెండంచెల పరుపుబండ వుంది. కిందివైపుండే పరుపుబండమీద గుండమొకటి వుంది. చాలా వెడల్పుగా తెరుచుకుని వున్నదానిని ఇటీవల మూస్తూ వచ్చారు. ఆ గుండానికి ఆగ్నేయ దక్షిణాన శిలలో కనిపించిన వ్యక్తరూపాన్నే రాముడని పూజిస్తున్నారు.


వ్యక్తరూపం మీద వైష్ణవగురు పీఠాధిపతి ఎవరో తిరునామాలు, మీసాలు, కవచాన్ని అలంకరించారు. దానికి తీగెలు తీర్చిన చతురస్రాకారపు వెండి ద్వారచట్రం అమరించి వుంది. రామునికి దూరంగా ఎడంగా ఎడమవైపు దక్షిణం పడుమరగా సీతాశిల్పం చెక్కివుంది. అర్చామూర్తులలో సీతారామలక్ష్మణులు, సుదర్శన మూర్తి, ఆండాళు, రామానుజస్వాములున్నారు. బయట ద్వారపాలకులకు మీసాలున్నాయి. కొత్తశైలి. చతుర్భుజులు. పైరెండు చేతులతో చక్ర,శంఖాలు, గద, కటిహస్తాలతో ముందరిచేతులు, మణికిరీటాలతో, మూడువరుసల కంఠహారాలతో, దండకడియాలతో, కాళ్లుచేతులకు కడియాలతో, అంగవస్త్రాలతో, 5 అడుగుల ఎత్తున్నవి ద్వారపాలకుల విగ్రహాలు. దేవాలయనిర్మాణం, ద్వారగోపురం, ప్రాకారాలు, సత్రాలు అన్నీ 18, 19 శతాబ్దాలవే. మళ్ళీ కొత్తగా పునరుద్ధరణలు చేపట్టారు.


క్షేత్రపాలకుడుగా వున్న హనుమంతుడు మధ్వశైలి మూర్తే. ప్రాంగణంలో మరొక ఆంజనేయమూర్తి దక్షిణాభిముఖుడుగా, ఇంకొక హనుమంతుడు మధ్వశైలిలో భక్తాంజనేయరూపంలో వున్నాడు.
గుడికెదురగా ప్రవేశద్వారం మీద నౌబత్‍ ఖానా వుంది. దేవాలయ ప్రారంభం, ముగింపు వేళలలో ఈ ద్వారం పై అంతస్తులో సన్నాయిమేళం వాయించేవారని స్థానికులు చెప్పారు. అదొక ఆలయ సంప్రదాయం.
ఈ ప్రాంతంలోని సాయిగూడెం రామునిబండకు, జీడికల్లు వీరాచలాలకు రామాయణగాథలకు సంబంధ మున్నట్లు స్థానిక ప్రజలవిశ్వాసం. సాయిగూడెంలోని రామునిబండను యోగాచలమని, జీడికల్లుని వీరాచలమని అంటారు. రాముని బండమీద వనవాససమయంలో రాముడు సీతాసమేతుడై నివసించాడని, ఇది రాముని ధ్యానప్రదేశమని, జీడికల్లు వీరాచలం మీద నిలిచి మాయలేడిని సంహరించాడని, అది లేడిబండ అనేచోట పడి మరణించిందని గాథ.


‘లేడి పాయెరా,
బాణమేసెరా’ అని పాడుకుంటారు జనులు.
‘‘ఈ రామాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో పరుపు బండ ఉంది. దీనినే లేడిబండ అంటారు. ఈ బండకు రామాయణ గాథకు సంబంధం ఉందని ఇక్కడి ప్రజల విశ్వాసం. పర్ణశాల నుండి మాయాలేడిని వెంబడిస్తూ రాముడు ఈ జీడికల్లుకు వచ్చాడని, ఇక్కడి ఈ పరుపు బండపైన రాముడు మోకాలు ఆన్చి లేడిని సంహరించినాడని జానపదుల విశ్వాసం. అందుకే ఈ పరుపు బండకు లేడిబండ అని పేరు వచ్చింది. దీనిపై లేడి అడుగులు, నెత్తుటి మరకలు కనిపిస్తాయి. ఈ లేడిబండపైన చిన్న గుంట ఏర్పడి ఉంది. ఈ గుంట లోపలి అంచులను పరిశుభ్రమైన గుడ్డతో తుడిచినా గుంటలో నీరు ఊరుతుంది. పాప పుణ్య ఫలనిరూపణకు ఈ గుంట అంచులను తుడిచి యాత్రికులు సంతృప్తి చెందుతుంటారు. జీడికల్లు రామున్ని దర్శించే యాత్రికులు కచ్చితంగా లేడిబండను సందర్శించి, ఇక్కడి గుంటను తుడిచి, గుంటలో నీరూరినా పుణ్యాత్ములమని భావించి, ఆ తీర్థం స్వీకరించి వెళ్తుంటారు. లేడిబండ సమీపాన దూసమడుగు ఉంది. ఇది చాలా లోతైన మడుగు. మాయాలేడి సంహరణానంతరం రాముడు తన విల్లమ్ములను ఈ మడుగులోనే శుభ్రపరుచుకొన్నాడని జానపదుల విశ్వాసం.’’ (వికీపీడియా నుంచి)


ప్రతి కార్తీకపౌర్ణిమరోజున శ్రీరామకళ్యాణం జరుగుతుంది. ఆ రోజు జరిగే జాతర వందయేండ్లకు మించి చరిత్రవున్నది. ఇక్కడి రామునికి రెండోసారి శ్రీరామనవమిన కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. జీడికల్లు రామునికి మీసాల రాముడని పేరుంది. మీసాల వీరనారాయణుడు కొలనుపాకలో వున్నాడు. మీసాల వేణుగోపాల స్వాములు కూడా వున్నారు.


ఇక్కడ ప్రతివారం పశువుల అంగడి జరుగుతుంది. ఇది ఒక పురాతన ఆచారం. ఆలేరు దగ్గర ఏడూర్ల పొలిమేర వుంది. అక్కడ పురామానవులు పున్నమిరోజుల్లో కలుసుకునేవారని, జానపదుల కథ. జీడికల్లు కూడా ఒక పొలిమేర కూడలి. కూడలిలో కూడలి దేవతలుంటారు. ఆలేరులో బంగారిమైసమ్మ వుంది. జీడికల్లులో కూడా పొలిమేర దేవత వుండాలి. అక్కడ వున్న పరుపుబండ కొత్తరాతియుగం కన్న ముందునుంచి పురామానవుల ఆవాసమని చెప్పడానికి ఆధారాలున్నాయి.ఆ పరుపుబండమీద పురామానవులు రాతిపనిముట్లు నూరుకున్న ‘నూరుడుగుంటలు’, బండమీద నుంచి వాననీళ్ళకు కొట్టుకొచ్చి బండ అంచుల్లో పడివున్న సూక్ష్మరాతి పనిముట్లు (చిన్న, చిన్న బ్లేడ్లవంటి కత్తిముక్కలు, పనిముట్లు తయారీకి వాడిన క్వార్ట్జ్ కండరాళ్ళు) ఈ ప్రదేశం పురామానవులకు వేలయేండ్ల నుంచి ఆవాసమై వుంటుందని చెప్పడానికి సాక్ష్యాలు. చుట్టుపక్కల గొలనుకొండ, మూట కోడూరు, కళ్ళెం, శ్రీనివాసపురం, ఆలేరు-కాచారం, రఘునాథపురం, చల్లూరు, రాయగిరులలో పెదరాతియుగం సమాధులు, నిలువురాళ్లు, మధ్యరాతి యుగం, కొత్తరాతియుగం రాతిపనిముట్లు లభించాయి. అంతేకాదు, ఆలేరులోని పెదవాగు, ఏదులవాగు, రాయగిరి వాగుల అంచులలో పాతరాతియుగం మానవుల ఆవాసాల జాడలున్నాయని ఎస్‍.నాగభూషణరావు అనే పురాశాస్త్రవేత్త తన ‘స్టోన్‍ యేజ్‍ కల్చర్స్ ఇన్‍ నల్గొండ’ అనే పుస్తకంలో రాసాడు.


జీడికల్లుకు జీడికల్లు అనే పేరు రావడం వెనుక ఒక కథ వుందని చెప్తారు. జీడికల్లు రామాలయానికి పైన వున్న శివాలయాన్ని ఆనుకుని వున్న రెండు నీటిగుండాలను జీడిగుండం, కల్లు గుండం అంటారు. ఇవే రామలక్ష్మణులకు ప్రతిరూపాలంటారని నాకు పాఠశాల తెలుగు టీచర్‍ మల్లారెడ్డి చెప్పారు. జీడిగుండంలో స్నానం చేస్తే పాపాలు కడిగి వేయబడ్తాయని, కల్లు(తెల్ల) గుండంలో స్నానం చేస్తే పవిత్రులవుతారని భక్తుల విశ్వాసం.
ఒక గుండం నీళ్ళు తెల్లగా వుంటే అది కల్లు గుండమని, మరొక గుండం నీళ్ళు వుంటాయి కనుక జీడిగుండం అని జనం పిలుస్తారు. నిజానికి రెండింటి నీళ్ళు చిక్కగా కనిపిస్తాయంతే. గుండాలవల్ల ఈ బండకు జీడికల్లు అనే పేరు రాదు. జీడి అంటే నల్లనిది, కల్లు అంటే రాయి. జీడికల్లు అంటే జీడిలెక్క నల్లటిరాతిబండ అని అర్థం. దానిమీద అల్లుకున్న కథలు విశ్వాసాలకు సంబంధించిన పురాణాలే.


ఈ గుండాలకు పక్కన వున్నది శివాలయం. రెండడుగుల ఎత్తున్న శివలింగానికి చతురస్రాకారపు పానవట్టం నేలమట్టంగా అమరివుంది. ఈ శివాలయానికి గణపతి సోదరి కుందమాంబ దానాలు చేసినట్లు కాకతీయ శాసనాలవల్ల తెలుస్తున్నది. ఈ గుడికి ఎదురుగా రాతిస్తంభాలతో డంగుసున్నం, ఇటుకలు, రాతిఖనీలలో నిర్మించిన యాగశాల కనిపిస్తున్నది. దానికివతల ఒక ధ్వజస్తంభంపై చిన్న లేబుల్‍ శాసనముంది.
‘‘శ్రీరామాచంద్రా
గుముడవెల్లి కత్తుల
తిమ్మరెడ్డి కొడుకు
అంబరెడ్డి కంభము
శ్రీ శ్రీ శ్రీ జయస్తు’’
అని రాసివుంది.శాసనంలోని లిపి తెలుగు. శాసనభాష 100 లేదా 150యేండ్ల కిందదై వుంటుంది. శాసనంలో ‘క’ 3చోట్ల 3రకాలుగా చెక్కబడ్డది. జీడికల్‍ సమీప గ్రామమే గుముడవెల్లి. ఈ శాసనం మీద సూర్యచంద్రులు, శంఖు, చక్రాలు చెక్కివున్నాయి. పైన యాగశాల కట్టించినపుడు ఎత్తించిన స్తంభమైవుంటుంది.


జీడికల్లులో సంస్కృతపాఠశాల వుండేది. ఈ బడిలో మాగురువు మల్లారెడ్డిగారు, రామచంద్రాపురం నుంచి వచ్చి చదువుకున్న పుల్లారెడ్డన్న విద్యార్థులు. ఆ పరంపరలో చాలా చోట్ల ఈ పాఠశాలలు ఒక కమిటీ ఆధ్యర్యంలో నిర్వహించబడేవట. వాటి వివరాలు చెప్పేవారు లేరు. జీడికల్లు పాఠశాల నిర్వాహకుడుగా ప్రసిద్ధ రైతుకవి, సహజకవి ‘కాపుబిడ్డ’ కవి గంగులశాయిరెడ్డి గారు ఉండేవారు.
జీడికల్లు రామాలయానికి దేవాలయభూములు గుంటూరుజిల్లా వట్టిచెరువుమండం, కొర్నెపాడుగ్రామంలో 12 ఎకరాలు, జీడికల్లులో 50 ఎకరాలు, పొరుగు గ్రామం గుమ్మడవెల్లిలో 35 ఎకరాల భూమున్నదట.


కొసమెరుపు:

నిజాము పాలనకాలంలో ప్రసిద్ధ చారిత్రక, పర్యాటక క్షేత్రం కొలనుపాకలో బహిరామియా గ్రంథాలయం ఉండేది. అదిప్పుడు శాఖాగ్రంథాలయం. అప్పట్ల ఆ గ్రంథాలయం కార్యదర్శిగా వున్న గంగరాజు రఘునాథరావు రామన్నపేట వాస్తవ్యుడైన కేశవపట్నం నరసయ్య రచించిన జీడికంటిరామ శతకం అనే రాతపుస్తకాన్ని (అముద్రితకావ్యం) తప్పులు సవరించి 1934 ఫిబ్రవరిలో అచ్చు వేయించిండు. ఆ పుస్తకానికి రఘునాథరావు రాసిన పీఠికలో శతకకవి నరసయ్య వానకొండ శతకం నిరోష్ట్యంగా రాసిండని తెలిపిండు. ఇప్పుడా పుస్తకం దొరుకుతదో, లేదో.
జీడికంటిరామ శతకాన్ని కొలనుపాక వాస్తవ్యుడు శేషమఠం నర్సయ్య ముద్రణ కొరకు తనకిచ్చిండ్రని రఘునాథరావు రాసిండు. అచ్చుకొరకు ‘కాపుబిడ్డ’ కవి గంగుల శాయిరెడ్డి డబ్బిచ్చి సాయం చేసిండట.
ఈ పుస్తకంలో 100 పద్యాలున్నయి. అన్నీ సీసపద్యాలే. వ్యావహారిక భాషలో రాయబడిన శతకమిది. ఎక్కడోగాని గ్రాంథిక భాష వుండదు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పారసీ భాషాపదాల తోని పద్యాలు సాగుతయి. పద్యాలు అంత్యప్రాసలతో రాయబడ్డయి. క నుంచి ళ వరకు అక్షరాలు ప్రాసకు వాడబడ్డయి.

  1. శ్రీరామరామ నిన్‍ సేవింతు తొల్లింటి, నేటి నేరముల మన్నింపుమంటి
  2. బరిమార్చితౌర నీ శరజాలమున లంక, ఘోరదుష్ట రక్కసుల వంక
  3. తగ దాసజనుల బ్రోవగ గాంచితౌ జగ్గు, అసురాళి జేసితౌరౌర నుగ్గు
  4. పవననందనుడు నీ బంట్రౌతు బల్తేజి, సురల జేసితివిగా సర్ఫరాజి
  5. భువనాల సవరించితివిగదా నీపొట్ట, నీళ్ళపై నిలిపితౌ రాళ్ళకట్ట
  6. కుబ్జ నీకేపాటి గొప్పనజరు బెట్టె, సేవ యహల్యేమి జేసెనట్టె
    వైష్ణవభక్తి ప్రధానమైన ఈ పద్యాలలో విష్ణ్వవతార ఘట్టాలు వర్ణించబడ్డయి.

శతకంలోని తొలిపద్యం:
సీ. శ్రీరామ రామనిన్‍ సేవింతు తొల్లింటి
నేటి నేరముల మన్నింపుమంటి
ఏకాకివై బ్రోతె లోకాలనన్నింటి
నతిజేతు గావవే నన్ను నొంటి
అనిలో ప్రతాపమేమని జెప్ప నీ వింటి
తరిబాణముల విచిత్రంబు పొంటి
మునుమున్నె నినుగొల్చి ఘనడయ్యె ముక్కంటి
ధరమించె సిరి నీ పదంబులంటి
తె.గీ. ఘన దయాంబుధి వంచు నిక్కముగ వింటి
గావబూనెదవేని మే ల్గంటిమంటి
సిరుల కిరువైన జుంటి శ్రీ జీడికంటి
ధామ సుగుణాభిరామ శ్రీరామ రామ

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *