అది 1873వ సంవత్సరం. ఈస్టిండియా కంపెనీ కలకత్తా నగరంలో ప్రజారవాణా నిమిత్తమై ట్రామ్స్‌ను ప్రవేశపెట్టింది. పోతే, అవి యంత్రశక్తితో కాకుండా, గుర్రాలతో లాగబడేవి. కాలక్రమంలో అవి యాంత్రికశక్తికి మార్చబడినాయి. అదే కాలంలో లండన్‌లో కూడా గుర్రాల ద్వారానే బండ్లు (టాక్సీ) లాగబడేవి. దాదాపు ప్రపంచ వ్యాపితంగా గుర్రాలచే, గాడిదలచే, ఒంటెలచే, ఎడ్ల, దున్నలచే, మంచు ప్రాంతాల్లో కుక్కలచే (స్లెడ్జ్లను) రవాణా సాధనాలు నడపబడేవి.ఆయా దేశాల ఇతిహాసాలని, రాచరిక వ్యవస్థల్ని గుర్తు చేసుకున్నా గుర్రాలు, ఏనుగులు, ఆలమందలు మదిలో మెదులుతాయి. యుద్ధరంగంలో అయితే విధిగా, రాజుల బలాలు గుర్రాలచే, ఏనుగులచే, కొన్ని ప్రాంతాల్లో ఒంటెలచే గుర్తించబడేవి. సైనికబలంతో పాటుగా, ఈ అశ్విక, గజ బలగాన్ని బట్టి రాజుల శక్తి అంచనా వేయబడేది. కాని, నిజానికి మాకు (జంతువుల) ఆసలు యుద్ధతంత్రమే తెలియదు. తెలిసిందల్లా మీరు చెప్పినట్లు మేము నడవడమే. మీరు వీరోచితంగా పోరాడి గెలిచినా, ఓడినా, ప్రాణాలు పోగుట్టుకున్నది మేమే! ఇరువర్గాలు శత్రువులుగా భావిస్తే, ఇరువైపుల వున్న మాకు ఎలాంటి శత్రుభావన వుండదని మీరేనాడు గుర్తించలేదు. చచ్చేది మేమైతే (సైనికులు కూడా), రాజ్యాల్ని విస్తరించుకున్నది మీరే!
గుర్రపు పందాలు, కోడి పందాలు, పొట్టేళ్ళ పోట్లాటలు మీ గొప్పతనాలకై ఏర్పాటు చేసుకున్నవే! మీరు రెచ్చగొట్టడంతో మేం పోట్లాడు కోవడం తప్ప, మాకు వైషమ్యాలే తెలియవు. గెలుపు, ఓటములు మాకసలే తెలియకున్నా, మీ విజయాన్ని మీసాల్ని మెలివేసుకొని చెప్పడం మీ దుర్బుద్ధికి చిహ్నం. అమెరికా పోలో గ్రౌండ్ నుంచి స్పేయిన్ బుల్‌ఫైట్, ఎడారి దేశాల్లో ఒంటెల పోటీలదాకా (అనాద బాలల్ని కొనితెచ్చి, వాటిపై ఎక్కించి వినోదం చూడడం) రాజస్థాన్ బికెనేర్లో ఒంటెల విన్యాసాలు, తమిళనాడు జల్లికట్టు, కర్నాటకలో దున్నలతో బురదగుంటల్లో పరుగు (సినిమా: కాంతారా), కోనసీమ కోడిపుంజుల జూదం… తదితర జంతువుల పోటీలు, విన్యాసాలు, సరదాలకు, షికార్లకు, వినోదాలకు, విలాసవంతానికి, దోచుకున్న సొమ్మును దుబారగా ఖర్చు చేయడానికే!
ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పినా మా జంతుజాతి శ్రమ వెలకట్టలేనిదే! శ్రమ మాదైతే, భోగం మీది. త్యాగం మాదైతే సౌఖ్యాలు మీవి. ఇక వ్యవసాయ రంగంలో, అనుబంధ రంగంలో, ఎడ్లు, దున్నలు, ఒంటెలు, గాడిదలు, గుర్రాలు చేసే శ్రమ ఏనాడు మీ జాతీయ స్థూల ఉత్పత్తిలో లెక్కకు రాలేదు. రావడం లేదు. ఇక ఆహార విషయంగా గొడ్లు, మేకలు, గొర్రెలు, పందులు, బాతులు, కోళ్ళు, కుందేళ్ళు, పక్షులు, జలచరాలైన చేపలు, రొయ్యలు, పీతలు, నత్తగుల్లలు, పాల విషయంగా ఆవులు, గేదెలు, మేకలు, ఒంటెలు… మీ మానవసేవకే అంకితమై పోయాయి. చివరికి కుక్కలు, పాములు కూడా మీ దృష్టినుంచి తప్పించుకోలేక పోయాయి. ఈ భూమిపై మా జంతువులు ఒక్క రోజు సమ్మె చేసాయనుకోండి… ఏం జరుగుతుందో ఊహించండి!
మా జంతు ప్రపంచం గూర్చి, మీ మానవ దాష్టికం గూర్చి, ఎంత చెప్పుకున్నా తక్కువనే! మానవ విన్యాసాలతో కూడుకున్న సర్కసులు కూడా మా జంతువుల విన్యాసాలు లేకుండా ప్రదర్శించబడవని తేలిపోయింది. సర్కసులలో జంతువుల నిషేధం తర్వాత అవి మూతపడ్డాయి. కోతులు, ఎలుగుబంట్ల విన్యాసాల్ని నియంత్రించడంతో వీటిపై ఆధారపడే కుటుంబాలు ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుకోవాల్సి వస్తున్నది. పాముల, గంగిరెద్దుల ఆటలు ఆడించే కుటుంబాలది ఇదే స్థితి! స్వేచ్ఛగా జీవించే మమ్మల్ని జంతు ప్రదర్శనశాలలో నిర్బంధించడంతో మా జీవన ప్రమాణం తగ్గిపోతున్నది. మీ దృష్టిలో మాకెంతో మేలు చేస్తున్నామని భావిస్తారు. కాని, అవి మాపాలిట యమకూపాలు. మీ వినోదానికి మమ్మల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. ఇక్కడ కూడా మాకు పెట్టాల్సిన ఆహారాన్ని దొంగచాటుగా కాజేస్తారు. (చూడు మలయాళ సినిమా: GRRR…) మమ్మల్ని మచ్చిక చేసుకొని, మా శరీరానికి మించిన బరువుల్ని మోయిస్తారు. లాగిస్తారు. దుక్కుల్ని దున్నిస్తారు. పెద్ద పెద్ద దుంగల్ని దొర్లింపచేస్తారు. పోలీసుల్ని మించిన రక్షణకై మమ్మల్ని మీ ఇండ్లకు, ఆస్తుల రక్షణకు జంతువులనే వాడుకుంటున్నారు. మీ ఆనందానికి జలచరాలచే (డాల్ఫిన్) విన్యాసాలు చేయిస్తారు. కాని, ఈ శిక్షణ వెనుక ఎంత క్షోభ్యత వుంటుందో ఏనాడు ఆలోచించరు. రథాల్ని, గుర్రపు బగ్గీలను, కచ్చడాలను లాగించారు. యాంత్రిక ప్రయాణ సాధనాలు రాకముందు మా గుర్రాలే కదా అతివేగవంతమైన ప్రయాణ సాధనాలు. అందుకే కాబోలు మా గుర్రాల పేరుననే మీ యంత్రశక్తిని గుర్తిస్తారు. అయినా మాకు ఒనగూరే ప్రయోజనం ఏమీలేదు.
మీ వికాసానికి, అర్థికాభివృద్ధికి, వ్యవసాయనికి, రవాణాకు, ఆహారానికి, వినోదానికి, అలంకరణ, సౌందర్య వస్తువులకు, మాచర్మాల్ని వొలిచి మీ శరీరఅందాల్ని కాపాడుకోవడానికి, పాలకు, మీగడకు, నెయ్యికి, మజ్జిగకు, నోరూరించే తియ్యటి పాల పదార్థాలకు, మీకు కావాల్సిన కొవ్వులకు, ప్రోటీన్లకు, సుగంధ పదార్థాలకు (కస్తూరి), ఒకటేమిటి యావత్ మానవ జీవితం, దినచర్య, ఉచ్వాస, నిశ్వాసాలకు మేమే వనరులం! కారకులం! మీ దేశాల, ప్రాంతాల ఆర్థిక ప్రగతిలో, స్థూల జాతీయోత్పత్తిలో మా వాటానే అత్యధికం. (దేశాల స్థూల జాతీయోత్పత్తిలో 55 శాతం ప్రకృతి, జంతువుల నుంచే). అయినా ఆ లెక్కలకు మమ్మల్ని ఏనాడు కర్తల్ని చేయలేదు. ఈ ప్రగతికి కేవలం మీ మానవ వనరులు, శక్తులే కారణమని, పాలకులే ప్రధాన సూత్రదారులనే లెక్కలు చెప్పుకుంటారు. ఇదెంత అన్యాయమో ఏనాడు ఆలోచించడంలేదు. మీ వ్యాపారాలకు, యజ్ఞాలకు యాగాలకు, పండగలకు, పబ్బాలకు, కోరికల్ని తీర్చుకునే మొక్కుల చెల్లింపులకు మమ్మల్నే కదా బలిపశువుల్ని చేసేది. పసిబాలల్నే బలి ఇచ్చే మీ సంస్కృతికి మేము లెక్కకు రాలేము కూడా!
బాధాకరమైన విషయమేమంటే, మానవులపై జరిగే హత్యాకాండలపై కనీసం చర్చలు, శిక్షలు వుంటాయి. కాని, మాపై జరిగే హత్యాకాండకు మాట్లాడేవారెవరు. (పైపైన కొంత చర్చ వున్నది). పైగా మా జంతువుల మారణకాండ, మానవుల హక్కుగా ప్రపంచవ్యాపితంగా చలామణిలో వుండడం గమనార్హం! పోతే, కొన్ని మతాల, వర్గాల వారు మాత్రం జంతువుల విషయంగా గౌరవంగా వుంటూ, మాంసాహారాన్ని మానండని, తినవద్దని, శాఖాహారానికి మారండని ప్రచారం చేస్తున్నారు. (ఆహారపు గొలుసులో భాగంగా ఈ చర్చ చేయడం లేదు).
వైద్యో…. అశ్వం:
మా జంతువులు శ్రమకు, వినోదానికే ననేది అత్యధికుల భావన! కాని, మీ వైద్యవిధానంచే స్వస్తత చేకూర్చని రుగ్మతల్ని మా జంతువులు తగ్గిస్తాయని అనేక ఉదాహరణలు చూపుతున్నాయి. గుర్రపు స్వారీతో పోలియోలాంటి రుగ్మతల్ని తగ్గించవచ్చని హైదరాబాద్‌లో గుర్రపుస్వారికై శిక్షణ ఇస్తున్న వారు చెపుతున్నారు. నేర్చుకుంటున్న వారు కూడా టివి (వి6) ఛానళ్ళకు తెలపడం గమనార్హం. బ్రిటన్‌లో జంతువులతో వైద్యంపై మాస్టర్ డిగ్రీ పొందిన క్లినికల్ సైకాలజిస్టు అంజనా తంపే కూడా ఈ విధానాన్ని పాటిస్తున్నారు. చాలా కాలంగా గుర్రాల సహచర్యంతో ముఖ్యంగా మానసిక సమస్యలు పరిష్కరించబడుతాయని ఆమె తెలుపుతున్నారు. హార్స్ టు హ్యూమన్ (H to H)ను తమిళనాడులోని ఆరోవిలేలో స్థాపించిన మిర్రాబెల్లే లిండెమన్ (Mirrabelle Lindemann) ప్రకారం జంతువుల సహచర్యంతో వైద్యం (animal assisted therapy) పురాతన కాలంలో కుక్కలతో జరిపేవారని, ఇప్పుడు పెంపుడు జంతువులన్నీంటితో ఈ విధానం కొనసాగుతున్నదని, ముఖ్యంగా గుర్రాలతో నరాల బలహీనతల్ని, మాటలు సరిగారాని పిల్లలకు మాటలు వచ్చేలా చేయడానికి ఈ విధానం బాగా పనిచేస్తుందని, ఈ కేంద్రానికి 2-70సం।। వయస్సుల వారు వచ్చి చికిత్సలు పొందుతున్నారని ఆమె తెలిపారు. (TOI : 5/10/24).
అరిస్టాటిల్ – కుక్కలు
ఆధునిక సైన్సు పితామహుడు తత్వవేత్త అరిస్టాటిల్, మానవులకు, కుక్కలకు గల సంబంధాల నేపథ్యంలో స్నేహితం మూడు రకాలని మొదటిది పరస్పర లాభాన్ని ఆశించేది, రెండోది పరస్పర ఆనందాన్ని పొందేది కాగా,మూడోది పరస్పర గౌరవాన్ని పొందేది అని విశ్లేషించాడు. ఈ మూడో రకం స్నేహితం మీ మానవుల్లో కొందరిలో వుంటే వుండవచ్చు గాని, జంతువులు మాత్రం ఈ మూడో కోవకు చెందినవే. అందుకే కాబోలు ఆయన కుక్కల్ని అమితంగా ప్రేమించేవాడు. టాటాగ్రూప్ అధినేత రతన్‌టాటా కూడా ఇలాంటి ఆలోచనాపరుడే కావడం గమనార్హం!
స్వార్థమే మీ (మానవ) పరమార్థం!
ఈ మాట మీకు నచ్చక పోవచ్చు! కాని, మానవ సమాజం ఎదిగిన నాటి నుంచి మీది స్వార్థ చింతననే! ఈ విషయం మీనైజం గూర్చి రాబర్ట్ గ్రీనె (Rober Greene) రాసిన మానవ గుణాలు (The Laws of Human Nature) చదవండి. ఆయన మీ గూర్చి ప్రస్తావించిన 18 సూత్రాలు అక్షర సత్యాలు కావా? అందులో చివరి సూత్రం (18) చావును వాయిదా (Meditate on our common Mortality) వేయడం గూర్చిన చింతనను మాపట్ల ఏనాడు ఆలోచించలేదు. పైగా, మాపై వేటు, వధ, వలవేసి పట్టడం, టక్కుటమారాలతో బోనుల్లో పడేలా చేయడం అనాదిగా జరుగుతున్నదేగా! కనీసం ఇప్పుడన్నా మామానాన మమ్మల్ని బతకనీయండి!
చివరగా..
మా జంతు ప్రపంచం గూర్చి, మా ప్రాముఖ్యత గూర్చి, పర్యావరణ రక్షణలో, ఆహారపు గొలుసులో మా పాత్ర గూర్చి (గత సంవత్సరం జూన్ 2023 నుంచి) సవివరంగా మీ దృష్టికి తేవడం జరిగింది. ప్రకృతి పరంగా జరుగుతున్న విధ్వంసం గూర్చి, భూగోళం ఎదుర్కుంటున్న విపత్తుల గూర్చి కూడా చర్చలు జరుగుతున్నా, ఆశించిన ఫలితాలు రావడం లేదు. మా జంతువుల వినాశనం ఎదేచ్ఛగా కొనసాగుతూనే వున్నది. కొన్ని పూర్తిగా కనుమరుగైతే, మరికొన్ని ప్రమాదపుటంచున వున్న విషయాల్ని కూడా మీ ముందుచాం! ఆలోచించు కోవాల్సింది మీరే!
ఈ వ్యాసపరంపరలో ఇది చివరి కథనం! (ప్రకృతి, జంతు ప్రేమికులకు, ఉద్యమకారులకు ఈ కథనాలు అంకితం.)
- డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162