పామాయిల్‍ గెల – కాసులు గలగల


ఆయిల్‍ పామ్‍ రైతుకు అమ్మలా అండనిచ్చే మంత్రి తుమ్మల… ప్రస్తుతం ఏ రైతు నోట విన్నా… ఇదే మాట. అనుక్షణం పామాయిల్‍ రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచించే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుకు మేలు చేసే ఏ అవకాశాన్నైనా
ఉపయోగించుకుంటారు. సెప్టెంబర్‍ నెలలో కేంద్ర మంత్రి శివరాజ్‍ సింగ్‍ చౌహాన్‍ ఖమ్మం జిల్లా సందర్శించినప్పుడు వారికి ఆయిల్‍ పామ్‍ రైతుల సాధకబాధకాలు వివరించారు. నూనెల మీద దిగుమతి సుంకం తక్కువగా ఉండటం వల్ల జరిగే నష్టాన్ని వివరించారు. కేంద్ర మంత్రులు అధికారులతో అనేక మార్లు చర్చించి 5.5% ఉన్న దిగుమతి సుంకాన్ని 27.5% పెంచేటట్లు కృషి చేశారు. అందువలన 12వేల రూపాయల లోపు ఉన్న ఆయిల్‍ పామ్‍ గెలల ధర 19వేల రూపాయల పైచిలుకు పెరిగింది. దీనివల్ల రైతుల ఆదాయం పెరిగింది. కొత్తగా ఆయిల్‍ పామ్‍ తోటలు వేయాలనుకునే రైతులకు ఉత్సాహం వచ్చింది.


ఆయిల్‍ పామ్‍ తోటలు ఎందుకు వేయాలి:

భారతదేశ జనాభా వినియోగానికి 90 లక్షల మెట్రిక్‍ టన్నులు పామాయిల్‍ అవసరమవుతుంది. కానీ మన దేశంలో 2.90 లక్షల మెట్రిక్‍ టన్నులు పామాయిల్‍ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇంకా 87.10 లక్షల మెట్రిక్‍ టన్నుల పామాయిల్‍ మనం దిగుమతి చేసుకుంటున్నాం. దీనికోసం మనం 70వేల కోట్ల రూపాయలు వినియోగిస్తున్నాం. 70వేల కోట్ల రూపాయల విలువగల విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయాలంటే ఇంకా మనదేశంలో 70లక్షల ఎకరాలలో ఆయిల్‍ పామ్‍ పంట సాగు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‍ రాష్ట్రంగా ఉన్నప్పుడే తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్‍ పామ్‍ సాగు చేపట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఆదర్శంగా నిలిచారు. తెలంగాణలో ఆయిల్‍ పామ్‍ సాగుకు ఆద్యుడు తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. స్వయంగా ఆయన ఆయిల్‍ పామ్‍ తోటలు సాగు చేస్తూ ఇతర రైతులను ప్రోత్సహించారు. ఆ విధంగా ఖమ్మం భదాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఆయిల్‍ పామ్‍ సాగు విస్తరించింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రైతులు సత్తుపల్లి దమ్మపేట అశ్వరావుపేట లోని ఆయిల్‍ పామ్‍ తోటలు, ఆయిల్‍ ఫెడ్‍ ఫ్యాక్టరీ సందర్శించి, రైతులతో సంభాషించి, సాగు మెళకువలు తెలుసుకున్నారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పది నాలుగు వేల ఎకరాలు ఉన్న ఆయిల్‍ పామ్‍ సాగు రెండు లక్షల మూడువేల ఎకరాలకు విస్తరించింది.
ఆయిల్‍ పామ్‍ తోటలలో అంతర పంటలు వేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని నిరూపించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్‍ పామ్‍ తోటల ఆదాయం సాఫ్ట్ వేర్‍ జీతం కన్నా ఏమాత్రం తక్కువ కాదని చెప్పి ఇతర రైతులను ప్రోత్సహించేవారు.


ఆయిల్‍ పామ్‍ ఆదాయం :
ఎకరానికి 10 నుంచి 12 టన్నుల ఆయిల్‍ పామ్‍ గెలల దిగుబడి వస్తుంది. సగటున 10 టన్నులకి ప్రస్తుత ధర ప్రకారం (19,144/- టన్ను) 1,91,440/- రూపాయలు, ఇంకా అంతర పంటలపై 50,000/- రూపాయలు మొత్తం 2,41,440/- ఖర్చులు 36,000/- పోను 2,05,440/-రూపాయల నికర ఆదాయం రైతుకు వస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‍ పామ్‍ తోటలు వేసే రైతులకు ఉద్యాన శాఖ ద్వారా పలు రాయితీలు కల్పిస్తుంది. ఆయిల్‍ పామ్‍ మొక్కలు, అంతర పంటలు, తోటల యాజమాన్యం, డ్రిప్‍ సౌకర్యములకు గాను ఒక ఎకరానికి 50,918/- రూపాయలు రాయితీ ఇస్తుంది.
ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు శ్రీమతి యాస్మిన్‍ భాషా, ఐ.ఎ.యస్‍., రైతులకు రాయితీలు సకాలంలో అందించడంతో పాటు వివిధ కళారూపాల ద్వారా ఆయిల్‍ పామ్‍ పథకాన్ని విస్తృతంగా జిల్లాల్లో ప్రచారం చేయిస్తున్నారు. పాటలు, రేడియో ద్వారా ప్రకటనలు, లఘు చిత్రాల ద్వారా ఆయిల్‍ పామ్‍ తోటల లాభాలు రైతులకు తెలియజేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను రాజులుగా చేయాలనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆశయాల మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్‍ ముజమ్మిల్‍ ఖాన్‍, ఐ.ఎ.యస్‍., అలాగే భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‍ జీతేష్‍.వి. పాటిల్‍, ఐ.ఎ.యస్‍., వ్యవసాయ విస్తరణాధికారులకు తగు సూచనలు చేసి పంట మార్పిడి ద్వారా ఆయిల్‍ పామ్‍ సాగును ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నారు.
సంప్రదాయ పంటల ఆదాయం కన్నా నాలుగు నుంచి ఐదు రెట్లు అధిక ఆదాయం గల ఈ పంటకు కోతులు మరియు దొంగల బెడద లేదు. కూలీ ఖర్చు తక్కువ, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఈ పంట తట్టుకుంటుంది. గిట్టుబాటు ధర కలిగిన పంట. ఇతర పంటలతో పోలిస్తే, ఆయిల్‍ పామ్‍ పంట లాభదాయకం.
ఇన్ని రకాల ప్రయోజనాలు గల ఆయిల్‍ పామ్‍ పంట రైతులు సాగు చేసి అధిక ఆదాయం పొందడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడంలో తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షిద్దాం.

  • సముద్రాల విజయ్‍కుమార్‍
    ఎ : 8374449922

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *