భారతదేశంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్, శాశ్వత ప్రేమ మరియు వాస్తు నైపుణ్యానికి చిహ్నం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన తాజ్ మహల్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు ఆధునిక ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా ఉంది. దాని అందమైన సౌందర్యం, సంక్లిష్ట ఇన్‍లేలు (inlays) మరియు కొలతల్లో ఖచ్చితమైన నిష్పత్తులు దానిని ఒక ప్రముఖ సందర్శనీయ ప్రదేశంగా మార్చాయి.
తాను కట్టించిన తాజమహల్ గురించి షాజహాన్ రాసిన కవిత:
‘‘ఇక్కడ దోషి ఆశ్రయాన్ని ఆపేక్షిస్తాడు,
క్షమించబడిన వాడిలా, పాపం నుండి విముక్తి పొందుతాడు.
పాపి ఈ సౌధంలోకి ప్రవేశించాలని కోరుకుంటాడు,
అతని గత పాపాలన్నీ కడిగివేయబడతాయి.
ఈ సౌధం వీక్షణ ఒక విచార నిట్టూర్పుని సృష్టిస్తుంది,
సూర్య చంద్రులు తమ కన్నీటిని విడుస్తారు.
ఈ ప్రపంచంలో ఈ దివ్య కట్టడం నిర్మించబడింది.
ఇది సృష్టి కర్త యొక్క కీర్తిని ప్రదర్శిస్తుంది.’’
తాజమహల్ నిర్మాత దృష్టిలో ఇదొక దివ్యసౌధం. సృష్టికర్త కీర్తి. సూర్య, చంద్రులే కన్నీరు విడిచే ఒక నిట్టూర్పు.
గుర్రం జాషువా కవి ఒక పద్యంలో… తాజ్ మహల్‍ను
‘‘ఏ వన్నె గల తీవకే పచ్చ సవరింప జెలువారునో దాని చిలికిజేసి
ఏ పుష్పదళమునకే పుష్యరాగంబు సరిపోవునో దాని సంఘటించి
ఏ కిసాలంబునకే కెంపు జోడింప కొమరారునో దాని కూర్పుజేసి
ఏ గులాబీ మొగ్గకే రవ్వ బొదిగింప నందగించునొ దాని నతుకబెట్టి
ప్రకృతిసిద్ధమైన వన్నెతో వన్నెకు
చెలిమి గలిపి భావముల నిమిడ్చి
చలువరాతి ఫలకములు దీర్పసాగిరి
చిత్ర చిత్ర గతుల శిల్పివరులు’’ అని వర్ణించాడు…
అయితే మహాకవి శీశ్రీ…
‘‘తాజ్ మహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?’’ అన్నాడు.
తాజ్ మహల్ కవులను, కళాకారులను, చరిత్రకారులను, కళాభిమానులను, ప్రేమికులను… అందరిని ఆకట్టుకుంది.
రవీంద్రనాథ్ ఠాగూర్ తాజ్ మహల్‍ను ‘‘కాలం చెక్కిలి మీద కన్నీటి చుక్క’’ అని వర్ణించాడు.

తాజ్ మహల్ నిర్మాణ వివరాలు:
నిర్మాణ కాలం: 1632 నుండి 1653 వరకు (22 సంవత్సరాలు) దాదాపు 20,000 మంది కార్మికులు మరియు 1,000 మంది కళాకారులు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు.
ఖర్చు: అప్పటి రూపాయిలో 3.2 కోట్లు (ప్రస్తుతం దీని విలువ సుమారు 53 కోట్ల రూపాయలకు సమానం). ఇది కేవలం అంచనా మాత్రమే. ప్రపంచంలో ఏడవ వింతగా నిలిచిన ఈ అద్వితీయ కట్టడం యొక్క విలువ కట్టడం ఎవ్వరికీ సాధ్యంకాదు. ఈ అద్భుతనిర్మాణం 1983లో ప్రపంచవారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
నిర్మాణ సామగ్రి:
మార్బుల్ ఆగ్రా నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్‍లోని మక్రానా నుండి వచ్చింది. మక్రానా తెల్లని పాల వంటి రంగుకల పాలరాయికి ప్రసిద్ధి.
ఆగ్రానుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పతేపూర్ సిక్రీ ప్రాంతం నుంచి ఇసుకరాయి వచ్చింది. (Voysey1825). దగ్గరలో ఉన్న రూపబాస్ తాంతపూర్ క్వారీల నుంచి వచ్చినరాయి కూడా వాడినట్లు (Balasubramaniam 2009).
ఇటుకలతో నిర్మించిన గోడలపై పాలరాయి అతికించబడింది. జాస్పర్ మరియు అనేక ఇతర విలువైన రాళ్లు ఈ నిర్మాణంలో ఉపయోగించబడ్డాయి.
తాజ్ మహల్ ఆర్కిటెక్ట్:
ఉస్తాద్-అహ్మద్ లహోరీ ప్రధాన ఆర్కిటెక్ట్. అతనితో పాటు ఎందరో గుర్తింపు పొందిన దేశీయ కళాకారులు కూడా శ్రమించి నిర్మించిన తాజ్ మహల్ ఆర్కిటెక్చర్ మొఘల్ వాస్తు నిర్మాణ శైలికి చెందినది. ఈ అద్భుతమైన నిర్మాణం యొక్క రూపకల్పనలో పర్షియన్, ఒట్టోమన్, భారతీయ మరియు ఇస్లామిక్ వాస్తు నిర్మాణ శైలుల ప్రభావం కనిపిస్తుంది.
ఇందులో కేంద్రకట్టడం చుట్టూ నాలుగు మినార్లు ఉన్నాయి. తాజ్ మహల్ గుమ్మటం అనేది ఒక అద్భుతమైన నిర్మాణం, ఇది 80 అడుగుల ఎత్తులో ఉంది. తాజ్ మహల్ మొత్తం విస్తీర్ణం 66.62 ఎకరాలు, పరిరక్షించబడిన ప్రధాన కట్టడం 42 ఎకరాలు. ప్రధాన కట్టడం యొక్క విస్తీర్ణం: 186 చదరపు మీటర్లు తాజ్ మహల్ ప్రధానద్వారం దక్షిణదిశలో ఉంది. ప్రధానకట్టడం తూర్పు-పడమర దిశలో ఉంది. నాలుగు మినార్లు ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పడమరదిశల్లో ఉన్నాయి.
తాజ్ మహల్ పునాది:
యమునా నది ఒడ్డున పెద్ద చతురస్రాకారపు గొయ్యితీసి, దానిని మట్టి కలప మెదలైన వాటితో నింపి, పటిష్టంగా తయారు చేశారు. ఆ తరువాత ఇసుకరాయిపలకల వరుస, దానిపై పాలరాతి పలకలు పేర్చి నది ఒడ్డున 50 మీటర్ల ఎత్తులో దాదాపు 95 చదరపు మీటర్ల ఒక ప్లాట్ ఫాం ఏర్పాటు చేసి దానిపై ఏడు మీటర్లఎత్తుగల చతురస్రాకారపు దిమ్మపై ద్విపార్శ సౌష్టవం కలిగిన ఈనిర్మాణం జరిగింది. తాజ్ మహల్ ముందు ఉన్న ఉద్యానవనంలో నాలుగు కాలువలు ఖురాన్‍లో ప్రస్తావించబడిన నాలుగు నదులకు ( Rivers of Paradise ) ప్రతీకగా నిర్మించినట్లు చారిత్రకారులు చెబుతున్నారు. (Begley1979). తాజ్ మహల్ గోడలపై ముఖద్వారం మొదలైన వాటిపై లతలు పూల ఉల్బణ చిత్రాలు, పవితగ్రంథంలోని వాక్యాల కాలిగ్రఫీ, రత్నాలు, రంగురాళ్ల పొదిగిన విస్తృతమైన అలంకారాలు ‘‘పియత్రా దురా’’ (Pietra Dura) మరియు ‘‘పర్చిన్ కారీ’’అని పిలువబడే రాతి పనితనంతో అమర్చబడి ఉన్నాయి.
వీటితోపాటు షాజహాన్ కాలంలో అభివృద్ధి చెందిన ‘‘ఎనామిల్ పనితనం’’ కూడా ముంతాజ్. మహల్ సమాధి చుట్టూ ఏర్పాటు చేయడానికి తయారు చేయించిన బంగారు తెరలో కనిపిస్తుంది (బాలక్రిష్ణ 2001).
పర్చిన్ కారి కళ:
‘‘పర్చిన్ కారి’’ వంశపారంపర్యంగా వచ్చే కళ ఇప్పటికీ ఈ పక్రియ ద్వారా జీవనోపాధి పొందుతున్న కళాకారులు ఆగ్రాలో ఉన్నారు. ఇందులో ముందుగా పాలరాయిపై గోరింటాకుతో ఆకృతిని వేస్తారు. ఆ డిజైన్ ప్రకారం పాలరాయి ఉపరిభాగం కొంతమేరకు తొలగించి ఆ ఖాళీస్థలంలో సానబట్టిన రత్నాలు, రంగురాళ్ళు జాగ్రత్తగా నింపుతారు. ఇలాచేయటం వల్ల పాలరాయిలో రత్నం సరిగ్గా ఇమిడిపోయి అమర్చబడినట్టు కాకుండా పాలరాయిలో భాగంగా కనిపిస్తుంది. ఇలా పొదిగిన (inlay) విధానాన్ని ‘‘పర్చినకారి’’ అంటారు. ఈ విధంగా పొదిగిన అత్యంత సంక్లిష్ట డిజైన్లు తాజ్ మహల్‍లో కనిపిస్తాయి.
పిట్రాడురా (Pietre Dure):
ఈ పక్రియ మెదట గ్రీస్‍లో ప్రారంభమై తర్వాత ఇటలీలో వికసితం అయింది. ఇందులో నున్నని పాలరాతి ఉపరితలంపైన సానబట్టిన రత్నపు ముక్కలు, రంగురాళ్ల ముక్కలు ఒకపద్దతిలో ఒక ప్రత్యేక సేంద్రియ జిగురుతో అమర్చడం ద్వారా పుష్పాలు ఉద్యానం లేదా వివిధ ఆకారాలు ఏర్పడుతాయి.
ఈ రకంగా రత్నాలు పొదిగిన డిజైన్లు తాజ్‍మహల్ కనిపిస్తాయి.
ఇస్లాం పవిత్ర గ్రంథం లోని వాక్యాల బ్లాక్ ఓనిక్స్ పొదుగులు (Inlays) తాజ్ మహల్‍లో కనిపిస్తాయి.
తాజ్ మహల్‍లో ఉపయోగించిన రత్నాలు, రంగురాళ్లు:

- యాకుత్ ఎ గులాబ్/గులాబ్ /గులాబీ రంగు నీలం/ శ్రీలంక నుంచి వచ్చింది.
- హజ్రత్ ఉల్ దమ్/పిటునియా/రక్తశిల/ blood stone/ భారతదేశంలో దొరికింది.
- రుక్మా / Alabaster/ పాలరాయి మక్రానా నుంచి వచ్చింది.
- యాఖూత్ /Amethyst/ కటెల్లా/ జంబుమణి, ఇది భారతదేశంలో ఉంది. మాల్డోవా నుంచికూడా వచ్చింది.
- నీల్గాన్ బిల్లోర్ /Aquamarine/జలనీలం భారతదేశం, శ్రీలంక నుంచి వచ్చింది.
- మర్మరే సియా/నలుపు రంగు పాలరాయి, ఇది భారతదేశంలో ఉంది.
- అకీక్ ఎ జగారి/కార్నేలియన్ భారత దేశంలో ఉంది, యెమెన్ దేశం నుంచి కూడా వచ్చింది.
- సంగ్ ఎ యెమెనీ /Chalcedony భారతదేశంలో ఉంది.
- జైతూని జబర్ జాద్/ Chrysolite/ చైతన్యరత్నం, ఇది నైలు నది ప్రాంతం లోనుంచి వచ్చింది.
- సదఫ్ హలజోని/Conch shell// శంఖం మున్నార్, పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చింది.
- మర్జాన్ Red coral పగడం భారత దేశంలో ఉంది.
- బోలూర్ Crystal quartz / స్పటికం భారతదేశంలో హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చింది.
- అల్మాస్ Diamondఇది గోల్కొండ ప్రాంతం నుంచి వచ్చింది.
- జమ్రోద్ Emerald పన్నా / పచ్చ, ఇది దక్షిణ అమెరికా మరియు ఈజిప్టుల నుంచి వచ్చింది.
- లాల్/ Garnet /గోమేధికం గంగానది ప్రాంతం నుంచి వచ్చింది.
- సంగ్ Golden stone/ golden topaz or citrine భారతదేశంలో ఉంది.
- దాల్చీనీ యాఖూత్ /Hessonite Garnet/ గోమేధికం శ్రీలంక నుంచి వచ్చింది.
- యష్మ /Jasper/జటిలం/ పుష్ప రాగం భారతదేశంలో కాంబే ప్రాంతం నుంచి వచ్చింది.
- లాజ్వార్డ్ /Lapis lajuri/ రాజావర్తం అఫ్గానిస్థాన్ నుంచి వచ్చింది.
- అహన్ రోబా/ Load Stone/మకాంటిస్/చుంబక శిల ఇది భారత దేశంలో గ్వాలియర్ ప్రాంతం నుంచి వచ్చింది.
- మలక్వీట్ / malachite/మాక్షికం/ ధనేఫరాంగ్ ఇది రష్యా నుండి వచ్చింది.
- సదఫ్ మొర్వారిడీ/mother of pearl/ముత్యపు చిప్ప పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ మున్నార్ నుంచి వచ్చింది.
- నఫరైట్/Nephrite/ వ్యోమశిల చైనా మరియు తుర్కిస్తాన్ల నుండి వచ్చింది.
- మోర్వరిడ్/ దుర్/Pearl / ముత్యం, పర్షియన్ గల్ఫ్ మున్నార్ నుంచి వచ్చింది.
- సంగ్ ఎ సురా/Red Stone/ సురా భారతదేశంలోని గ్వాలియర్ ప్రాంతం నుంచి వచ్చింది.
- యాఖుత్ /Rubyమాణిక్య మయాన్మార్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చింది.
- యాఖుత్ ఎ కబుడ్/Sapphire/నీలం భారతదేశం తోపాటు మయాన్మార్ మరియు శ్రీలంకనుంచి వచ్చింది. భారత దేశంలో ఉంది.
- సంగ్ ఎ లూహ్ /Slate/ అభ్రశిల అఫ్గానిస్థాన్ నుంచి వచ్చింది.
- హ్ర ఎ అజ్రక్/Sodalite/ ఆకాశమణి అఫ్గానిస్థాన్ నుంచి వచ్చింది.
- చషమ్ ఎ బాబరీ/Tiger eye/ వ్యాఘ్ర నయనం భారతదేశంలో ఉంది.
- జబర్ జాద్ ఎ హెండీ /Topaz/ పుష్యరాగం శ్రీలంక నుంచి వచ్చింది.
- ఫిరోజా/Turquoise/ పర్షియా మరియు టిబెట్ నుంచి వచ్చింది.
- ఈ పర్షియన్/ అరబిక్ భాషలో ఉన్న పేర్లకు సమానమైన ఖనిజ పరమైన పదం దొరకదు. అందువల్ల కొన్ని పదాలు మళ్ళీ మళ్ళీ వాడబడ్డాయి.
ఈ నిర్మాణంలో ఉపయోగించిన రత్నాలు వాటి రంగును బట్టి, వాటికి ఆపాదించిన దివ్య శక్తులను బట్టి ఎన్నిక చేయడం జరిగింది. పర్చన్కారీలో ఎక్కువగా వాడబడిన కార్నేలియన్ (రక్తశిల) ముస్లింలు శుభసూచకంగా భావిస్తారు. ప్రవక్త తన కుడిచేతి చిటికెన వేలుపై వెండి ఉంగరంలో ధరించేవారు అంటారు. మరియు దానిని ముద్రగా ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఈ ఉంగరం ధరించడం వల్ల కోరికలు తీరుతాయని ఇమాం జాఫర్ అన్నట్టు కుంజ్ (Kunz 1938) వల్ల తెలుస్తోంది.
జేడ్ మరియు క్లోరైట్ (వ్యోమశిల/హరితమణి/పచ్చపర్వతం) ప్రవక్తకు ఇష్టమైన రంగుగా బ్రిల్ (Brill1933) అభిప్రాయం. జేడ్ కు జబ్బులు నయం చేసే గుణాలు ఉన్నాయి అని నమ్మకం.
లాపిస్ లాజురి (రాజావర్తం) కూడా చాలా శుభప్రదం అనే నమ్మకం ఉంది (Thomas and Pavitta1993).
మెసొపొటేమియా నాగరికతలొ జాస్పర్ (పుష్ప రాగం/ జటిలం)ను ఒక దివ్యమణిగా భావిస్తారు. ఇది దుష్టశక్తులను పారద్రోలుతుందని విశ్వాసం ఉంది (Horovitz 1998).
చాల్సిడోని (శుక్తిరత్నం) శత్రువులను భయపడేలా చేయడమే కాక ప్రశాంతత చేకూరుతుంది (Budge 1968) అని నమ్మకం.
ఫలాలకు వాడిన ఎరుపు రాయి మృత్యువుకు సూచనగా పసుపురంగు పునరుజ్జీవంకు సూచించేదిగా వాడినట్లు తెలుస్తోంది.
కొన్ని రకాల రంగురాళ్ళు కేవలం వాటి అందం కారణంగా పర్చినకారిలో ఉపయోగించటం జరిగిందని అంచనా.
దాదాపు 40 రకాల రత్నాలు, రంగు రాళ్ళు, పర్చినకారిలో ఉపయోగించటం జరిగినట్లు (Voysey 1825) అభిప్రాయం.
పర్యాటక దర్శనీయం తాజమహల్:
అందాల తాజ్ మహల్ పరిరక్షణకు అవసరమైన కృషి జరుగుతోంది. ప్రతిదినం 40వేల మంది, ఏటా 14 లక్షల మంది పర్యాటకులు తాజ్ మహలును చూడటానికి వస్తారు. ఈ అధిక సంఖ్యలో వచ్చే పర్యాటకుల వల్ల కూడా కొన్నిసమస్యలు వస్తాయి. దీనికితోడు పర్యావరణ కాలుష్యం వల్ల తెల్లని రాయి కాస్తా పసుపు రంగులోకి మారి అందవిహీనంగా తయారవుతుంది.
పూర్వం ఇక్కడ సెక్యూరిటీ సరిగా లేకపోవడంవల్ల కొన్ని విలువైన అలంకరణలు చౌర్యానికి గురియైనట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే వారు సంరక్షణ చర్యలు చేపట్టారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1996 తాజ్ మహల్ నుండి చుట్టూ ఉన్న 10400 చదరపు కిలోమీటర్ల పరిధిలో తాజ్ ట్రెపీజియం జోన్‍గా ప్రకటించి అక్కడ పరిశ్రమలను వేరేచోటికి తరలించడం జరిగింది. వాయుకాలుష్యం అరికట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. తాజ్ మహల్ చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. తాజ్ మహలు పరిసరాల్లో పాదరక్షలకు అనుమతి లేదు.
-చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్సై(రి)
ఎ: 9866449348
శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698