వ్యవ‘సాయ’ వర్సిటీ..
అరవై ఏళ్లుగా రైతులకు సేవలందిస్తూ…
అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాల స•ష్టి
కళాశాల నుంచి వ్యవసాయ పరిశోధనల వరకూ..
వ్యవసాయంలో నిత్య పరిశోధనలు.. వివిధ పంటలకు సంబంధించి కొత్త వంగడాల సృష్టి, సూక్ష్మనీటి సేద్యం, వ్యవసాయంలో యాంత్రీకరణ, పశువైద్య శాస్త్రం దిశగా పురోగమనం, వ్యవసాయ విద్య ద్వారా రైతులకు మేలు చేస్తూ, శాస్త్రవేత్తలను అందించడం.. ఇలా అనేక రకాలుగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం విశేష కృషి చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు జరిగాయి.
వ్యవసాయ కళాశాల నుంచి జయశంకర్ వర్సిటీ దాకా..
దేశ తొలిప్రధాని పండిట్ జవహర్‍లాల్ నెహ్రూ మార్గదర్శకంలో వ్యవసాయ విద్య ఆలోచనలకు తొలిబీజం పడింది. 1955 జనవరి 6న అప్పటి భారత ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజేంద్రనగర్‍లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 1964 జూన్ 12న వ్యవసాయ కళాశాల ప్రారంభం కాగా, 1965 మార్చి 20న అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చేతుల మీదుగా వర్సిటీని రైతులకు అంకితం చేశారు.
ఆంధప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ప్రారంభమై.. 1996లో ఆచార్య ఎన్‍జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరు మార్చుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 సెప్టెంబర్ 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అవతరించింది.
‘ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 11 కళాశాలలు, 12 వ్యవసాయ పాలిటెక్నిక్, మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు, 12 వ్యవసాయ పరిశోధన స్థానాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు, 9 ఏరువాక కేంద్రాలు కొనసాగుతున్నాయి.
‘అరవై ఏళ్ల వర్సిటీ ప్రస్థానంలో వ్యవసాయవిద్యలో సుమారు 32,300 మంది విద్యార్థులు డిగ్రీలు, 12,300 మంది పాలిటెక్నిక్ పట్టాలు సాధించారు. ఇంకా 9,500 మంది విద్యార్థులు వ్యవసాయశాస్త్రంలో పీజీ, 1500 మంది విద్యార్థులు పీహెచ్‍డీ పూర్తి చేశారు.
నూతన వంగడాల సృష్టి.. పరిశోధనలు
వరి, మొక్కజొన్నతోపాటు 50కిపైగా పంటల్లో దాదాపు 500 నూతన రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. 1968లో వర్సిటీ భాగస్వామ్యంతో అఖిల భారత వరి సమన్వయ పరిశోధన సంస్థ ద్వారా తొలిసారిగా వరిలో అధిక దిగుబడి ఇచ్చే ‘జయ’అనే సంకర జాతి తొలి వంగడాన్ని అందుబాటులోకి తెచ్చారు.
నాటి నుంచి స్వర్ణ, బీపీటీ-5204, ఎంటీయూ-1010, ఎంటీయూ-1001, తెలంగాణ సోనా ఇలా వరి ఎన్నో రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. ఈ ఏడాది అధిక దిగుబడి ఇచ్చే ఎక్స్ట్రా ఎర్లీ రకం కంపసాగర్ వరి 6251 (కేపీఎస్ 6251)ని విడుదల చేసింది.
- దేశవ్యాప్తంగా వరిసాగులో ఈ వర్సిటీ అభివృద్ధి చేసిన వరి రకాలు 25 శాతం దాకా ఉన్నాయి. 12 రాష్ట్రాలలో 12 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడి వరి వంగడాలే సాగవుతున్నాయి.
- దేశవ్యాప్తంగా మొక్కజొన్న విస్తీర్ణంలో 10-12శాతం వరకూ ఇక్కడి సంకర రకాలే సాగవుతున్నాయి. వర్సిటీ అభివృద్ధి చేసిన దాంట్లో హైబ్రిడ్ రకాలైన డీహెచ్‍ఎం-115, 117, 121 ఉన్నాయి.
- వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో చేసిన 23 ఆవిష్కరణలకు పేటెంట్లు సైతం సొంతం చేసుకుంది.

కలుపు తీస్తుంది.. ఎరువు జల్లుతుంది!
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కిసాన్‍మేళాకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. గవర్నర్ జిష్ణుదేవ్‍వర్మ, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఈ స్టాళ్లను ప్రారంభించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతోపాటు పశు వైద్య విశ్వవిద్యాల యానికి చెందిన శాస్త్రవేత్తలు, విద్యార్థులు తమ పరిశోధనలను ప్రదర్శించారు.
ఆగ్రో, బయోటెక్, ఫెర్టిలైజర్ కంపెనీలు తమ ఉత్పత్తులు, యంత్రాలను ప్రదర్శించాయి. సంప్రదాయ చిరుధాన్యాలే కాకుండా వివిధ రకాల పండ్లు, వివిధ పంటల్లో వచ్చిన కొత్త వంగడాలు, యంత్ర పరికరాలతోపాటు కోళ్లు, కుందేళ్లు, పందులు, గొర్రెలు, పక్షుల పెంపకానికి సంబంధించిన స్టాళ్లు కూడా కొలువుదీరాయి.
‘ఈ కెనాన్’తో కోతులు పరార్
కోతులు, పందులు, ఇతర జంతు వుల నుంచి పంటలకు విముక్తి కల్పించేందుకు ‘సోలార్ ఆటోమేటిక్ ఈ కెనాన్’తోపాటు ఈ కెనాన్ (మంకీగన్)ను ప్రదర్శనలో ఉంచారు. సోలార్ ఆటోమేటిక్ ఈ కెనాన్ ధర రూ.26 వేలు. ఇది సోలార్ బ్యాటరీతో పనిచేస్తుంది.
జంతువులు, పక్షులు పంటలపై దాడి చేయకుండా ఆటోమేటిక్‍గా సౌండ్స్ చేస్తాయి. ఈ సౌండ్స్ భయానికి అవి పారిపోతాయి. మంకీగన్ ధర రూ.3,500. క్యాల్షియం కార్బైడ్ దీనిలో నింపి, కొంచెం నీటిని వేయడం వల్ల గన్‍లోపల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ట్రిగ్గర్ నొక్కిన వెంటనే బాంబు పేలిన శబ్దం బయటకు వస్తుంది. ఈభారీ శబ్దానికి కోతులు, పందులు పారిపోతాయి.
ఆహార వ్యర్థాల నుంచి వంటగ్యాస్
ఇంట్లో సహా హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో ఆహార పదార్థాలు, కూరగాయలు ఇతర వ్యర్థాలను వృథాగా పడేస్తుంటారు. ఇవి ఒకటి రెండు రోజుల్లోనే కుళ్లి, దుర్వాసన వెదజల్లుతాయి. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతాయి. ఈ ఆహార వ్యర్థాల నుంచి ‘నానో బయోగ్యాస్ ప్లాంట్’ద్వారా వంట గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చు.
ప్రస్తుతం కేరళలో విరివిగా వాడుతున్న ఈ నానో బయోగ్యాస్ ప్లాంట్‍ను కిసాన్ మేళాలో ప్రదర్శించారు. దీనికి పెద్ద శ్రమ అవసరం లేదు. ఖర్చుకూడా తక్కువే. దీని ధర రూ.28 వేలు. ఐదు లీటర్ల సామర్థ్యంతో ఏకధాటిగా రెండు గంటల పాటు వంట చేసుకోవచ్చు.
‘ఫార్మ్రోబో ఆర్-1’తో గొర్రు, గుంటుక
పొలంలో గొర్రుకు ఎద్దులను వాడుతుంటారు. రైతు కూడా రోజంతా పని చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా ‘ఫార్మ్ రోబో ఆర్-1’ అందు బాటులోకి వచ్చింది. ఇది మనిషితో పనిలేకుండా పూర్తిగా రిమోట్ కంట్రోల్‍తో పని చేస్తుంది. కేవలం విద్యుత్ చార్జింగ్ బ్యాటరీల ద్వారా పనిచేస్తుంది. గుంటక, గొర్రు, రోటావేటర్‍గా పనిచేస్తుంది.
ఎరువులను కూడా వెదజల్లుతుంది. చేలో ఏపుగా పెరిగిన కలుపు మొక్కలను కూడా తొలగిస్తుంది. రూ.4.25 లక్షలు దీని ధర. డ్రైవర్‍తో పనిలేదు. బ్యాటరీలను ఒకసారి చార్జింగ్ చేస్తే 3-4 గంటల పాటు పని చేస్తుంది. గంట వ్యవధిలోనే ఎకరం భూమిలో గుంటుక కొడుతుంది. పటాన్‍చెరుకు చెందిన సంస్థ దీన్ని ప్రదర్శనలో ఉంచింది.
స్మార్ట్ వ్యవసాయానికి ‘స్మార్ట్ డ్రోన్లు’
చీడపీడల నివారణకు రైతులు చేతి పంపులు, పెట్రోల్ పంపులను వాడుతారు. ఇది అనేక వ్యయ ప్రయాసలతో కూడినది. రైతు శ్రమ, ఖర్చు తగ్గించేందుకు పవ్‍మెన్ ఏవియేషన్ కంపెనీ సహా మారుతి డ్రోన్స్ ఏజీ 335హెచ్, వ్యవసాయ డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇవి 120 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. క్రిమిసంహారక మందులను నేరుగా పంటపై వెదజల్లుతాయి. వీటి ధర రూ.4.15 లక్షలు. బ్యాటరీ బ్యాకప్‍తో పనిచేస్తుంది. పైలెట్‍కు సదరు సంస్థే శిక్షణ సహా లైసెన్స్ను కూడా ఇప్పిస్తుంది. పది లీటర్ల ట్యాంకు సహా రోజుకు కనీసం 25 నుంచి 30 ఎకరాలు పిచికారీ సామర్థ్యం ఉంది.
- కట్టా ప్రభాకర్,ఎ : 8106721111