మరణ శిక్షను రద్దు చేయాలని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కోరుచున్నారు. కానీ చాలా దేశాలు రద్దు చేయలేదు. మన దేశంలో మరణశిక్షని రద్దు చేసే పరిస్థితి కన్పించడంలేదు. చాలా నేరానికి మరణ శిక్షని శిక్షగా శాసనకర్తలు నిబంధనలని మారుస్తున్నారు. జీవితకాలం శిక్షను అనుభవిస్తున్న ఖైది ఎవరినైనా హత్య చేస్తే అతనికి కోర్టులు విధిగా మరణశిక్షని విధించాల్సి వుంటుంది. ఈ పరిస్థితి చాలా అరుదుగా వుంటుంది. మిగతా కేసుల్లో మరణ శిక్షని కోర్టులు అరుదైన వాటిల్లో, అరుదైన కేసుల్లోనే విధిస్తాయి. అరుదైన వాటిల్లో అరుదైనవి ఏవో సుప్రీంకోర్టు చాలా కేసుల్లో ప్రకటించింది.
మరణశిక్షని కోర్టులు విధించినప్పటికీ అవి అప్పీలులో జీవిత ఖైదుగా మారిపోతాయి. స్థానికంగా వున్న పరిస్థితులు చాలాసార్లు న్యాయమూర్తులని మరణశిక్ష విధించే విధంగా ప్రభావితం చేస్తూ వుంటాయి. ఈ విషయాన్ని చాలా మంది న్యాయమూర్తులు అంగీకరించరు. కానీ ఇది వాస్తవం. అమానవీయంగా హత్య చేసినప్పుడు, హేతుపూరితంగా వున్నప్పుడు, ముద్దాయిని సంస్కరించడానికి వీల్లేదని కోర్టు భావించినప్పుడు మరణశిక్షని విధించాల్సి వుంటుంది. సమాజానికి విభ్రాంతి కలిగించే విధంగా నేరం చేసిన సందర్భంలో మరణశిక్షని విధించడం సబబు. అయినా కూడా కోర్టులు కొన్ని కేసుల్లో ఈ సందర్భాలు లేనప్పటికీ మరణశిక్షని విధిస్తూ వుంటాయి. అలాంటిదే – ధ్నానేశ్వర్ సురేశ్ చోర్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు. ఈ కేసులో మరణ శిక్షను కోర్టు రద్దు చేసింది. కవిత్వం కూడా అందుకు ఒక కారణం అయ్యింది.

కవిత్వం రాయడం వల్ల కష్టాల పాలైన వాళ్లని చూశాం. జైలుకి వెళ్ళిన వాళ్లను చూశాం. అది దాశరథి కావొచ్చు. వరవరరావు కావొచ్చు. కానీ కవిత్వం రాయడం వల్ల ఉరిశిక్షని తప్పించుకున్న కవి గురించి గతంలో మనం వినలేదు. ఈ మధ్యే అతని పేరు బయటకు వచ్చింది. ఆయన పేరు సురేశ్ చోర్కర్. అతను ఓ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ముద్దాయి. అతని కేసులోని చాలా విషయాలను పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు అతనికి సెషన్స్ కోర్టు విధించి హైకోర్టు ధృవీకరించిన మరణశిక్షను రద్దు చేసి జైలు శిక్షను ఖరారు చేసింది. అందుకు సుప్రీంకోర్టు చూపించిన కారణాల్లో ఒకటి అతను కవిత్వం రాస్తున్నాడని, అందులో అతని ప్రశ్చాత్తాపం వుందని, అతను మంచి మనిషిగా మారే అవకాశం కన్పిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఫిబ్రవరి 20, 2019 రోజున సుప్రీంకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బేంచి ఈ తీర్పుని ప్రకటించింది. మైనర్ అమ్మాయి ‘రిషికేశ్’ని కిడ్నాప్ చేసి హత్య చేసి, సాక్ష్యాలను మాయం చేసిన కేసులో అతను ముద్దాయి. పూణాలోని అదనపు జిల్లా జడ్జి అతనికి భారతీయ శిక్షాస్మ•తిలోని సెక్షన్లు 302, 264, 201 ప్రకారం మరణ శిక్షని విధించారు. హైకోర్టు ఆ మరణశిక్షని ధృవీకరించింది. ఈ తీర్పుపై ముద్దాయి ధ్నానేశ్వర్ సురేశ్ చోర్కర్ సుప్రీంకోర్టులో అప్పీలుని దాఖలు చేశాడు. అతని న్యాయవాది కేసు రుజువు కాలేదని వాదించలేదు. శిక్షను తగ్గించాలని మరణశిక్ష విధించే కేసు కాదని సుప్రీంకోర్టుకి విన్నవించాడు.
నేరం జరిగినప్పుడు ముద్దాయి వయస్సు 22 సంవత్సరాలని నేర చరిత్ర లేదని, అతనికి విధవరాలైన తల్లి వుందని, ఇప్పటికి 18 సంవత్సరాల జైలు జీవితం గడిపాడని, రెమిషిన్‍ని కలిపితే అతను 23 1/2 సంవత్సరాల జైల్లో వున్నాడని ముద్దాయి న్యాయవాది సుప్రీంకోర్టుకి విన్నవించాడు. జైల్లో అతని నడవడిక బాగుందని, నేరం జరిగినప్పుడు అతను యుక్త వయస్సులో వున్నాడని, 18 సంవత్సరాల జైలు జీవితంలో అతనిలో మార్పు తీసుకొని వచ్చిందని, తనకి తాను, అదే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు ముద్దాయి వున్నాడని కోర్టుకి విన్నవించాడు. జైల్లో వున్నప్పుడు అతను బి.ఎ. పూర్తి చేశాడని, గాంధీ ఆలోచనా విధానం మీద శిక్షణ కూడా పొందాడని కోర్టుకి చెప్పాడు. డబ్బు కోసం ప్రణాళిక వేసి చిన్న పిల్లని చంపాడని అందుకని శిక్ష తగ్గించకూడదని ‘రాజ్యం’ తరపున న్యాయవాది కోర్టుకి విన్నవించాడు.
శిక్షా కాలాన్ని, శిక్షని నిర్ణయించడానికి కోర్టులు అప్పుడు వున్న పరిస్థితులని పరిగణనలోకి తీసుకుంటాయి. శిక్ష తగ్గించడానికి, అదే విధంగా శిక్షను పెంచడానికి మధ్య సమతుల్యతని కోర్టు పరిగణిస్తుంది. ఈ కేసులో కూడా ఆ విషయాలని పరిగణనలోకి తీసుకొంది. శిక్షని తగ్గించడానికి కోర్టు పరిగణనలోకి తీసుకున్న అంశాలు ఇవి.
- నేరం జరిగినప్పుడు ముద్దాయి వయస్సు 22 సంవత్సరాలు.
- ఇప్పటి వరకు అతను 18 సంవత్సరాలు జైల్లో వున్నాడు.
- జైల్లో అతను ప్రవర్తన కలిగి వున్నాడు.
- నాగరికమైన వ్యక్తిగా సమాజంలోకి ప్రవేశించడానికి అతను కృషి చేస్తున్నాడు. బియ్యే కూడా పూర్తి చేశాడు. తనను తాను సంస్కరించుకోవడానికి కృషి చేస్తున్నాడు.
- జైల్లో వున్నప్పుడు అతను రాసిన కవితల్లో ప్రశ్చాతాపం, అదే విధంగా మంచిగా మారడానికి అతను చేస్తున్న ప్రయత్నం కూడా కన్పిస్తుంది.
ఈ అంశాల వల్ల అతను మంచివాడుగా మారే అవకాశం కన్పిస్తుందని, అతను మళ్ళీ ఇలాంటి నేరాలు చేస్తాడు అన్పించడం లేదని, సమాజానికి అతని వల్ల ఆపద వుందన్న అభిప్రాయం కలుగడం లేదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులోని అన్ని విషయాలను గమనిస్తున్నప్పుడు అతను చేసిన నేరం ‘అరుదైన వాటిల్లో అరుదైనది’గా అన్పించడం లేదని, అందుకని మరణ శిక్ష విధించాల్సిన అవసరం లేదని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. అతను చేసిన నేరం క్రూరమైనది, హేయమైనది. అయితే అతను గతంలో శిక్షపడిన వ్యక్తి కాదు, వృత్తిరీత్యా నేరస్తుడు కూడా కాదు. అందుకని మరణశిక్ష విధించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. న్యాయహితం కోసం అతనికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నాం. శిక్షని తగ్గించడం కోసం అతను సంబంధిత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వం అమల్లో వున్న నియమాల ప్రకారం అన్నింటిని పరిగణనలోకి తగు చర్య తీసుకోవాల్సి వుంటుందని సుప్రీంకోర్టులోని త్రిసభ్య బెంచి అభిప్రాయపడింది.
శిక్ష తగ్గించడానికి గల చాలా కారణాలని సుప్రీంకోర్టు ఈ కేసులో పరిగణనలోకి తీసుకుంది. మరణ శిక్ష విధించాలంటే ఆ నేరం అరుదైన వాటిలో అరుదైనదిగా వుండాలి. శిక్ష తగ్గించడానికి ఎన్నో కారణాలు వున్నాయి. అరుదైన కేసులో అరుదైనది ఈ నేరం కాదు. అన్ని కారణాలతో బాటూ కవిత్వం అనేది కూడా ఒక కారణం కావడం చాలా మందికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు దేశమంతా ఈ తీర్పుని పొగుడుతున్నారు. మరణశిక్ష విధించడానికి అవసరమైన కేసు అది కాదు అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఏమైనా కవిత్వాన్ని కూడా సుప్రీంకోర్టు శిక్ష తగ్గించడానికి పరిశీలించడం ఆనందించాల్సిన విషయమే!
-మంగారి రాజేందర్ (జింబో)
ఎ : 9440483001