
ఇది ఒక పూలతోట – నిజమే
కాని
పూలన్నీ ఒకటికాదు
పూల పేర్లన్నీ ఒకటికాదు
పూల రంగులన్నీ ఒకటికాదు
పూల వాసనలన్నీ ఒకటికాదు
కానీ
అవన్నీ పువ్వులే
ప్రకృతి ప్రసాదించిన భిన్నభిన్న అందాలే!
‘భిన్నత్వంలో ఏకత్వం’ మనదేశ విశిష్టత అని మనందరికీ తెలుసు. భిన్నమైన భౌగోళిక, ప్రాకృతిక స్థితులు, ప్రజలు, జాతులు, నాగరికతలు, సంస్కృతులు, సామాజిక, ఆర్థిక స్థితులతో యింత వైవిధ్యమైన భారతాన్ని ఒకేదేశం – ఒకేప్రజ అనడంలో ఔచిత్యం లేదు.
మన రాజ్యాంగం అధికారాన్ని కేంద్రం – రాష్ట్రాల మధ్య విభజించింది. యూనియన్ జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలతో అధికారాలను రాజ్యాంగం నిర్ధారించింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలను, హక్కులను, బాధ్యతలను సమన్వయ పరిచే వ్యవస్థనే మనం ఫెడరల్ వ్యవస్థ అంటున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ విధానాలు రాజ్యాంగాన్ని గౌరవించి ఆచరణతో తమ అధికారాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే ఫెడరల్ వ్యవస్థ ఉనికిలో వుంటుంది. మనదేశంలో 28 రాష్ట్రాలు, మరికొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు వున్నాయి. దేని ప్రత్యేకత దానిదే.
జీవించే హక్కు, భావప్రకటనా హక్కు, మతహక్కు విద్య, వైద్యం వంటి కొన్ని ప్రాధమిక హక్కుల్ని మన రాజ్యాంగం ప్రజలకు యిచ్చింది. వైవిధ్యపూరిత సామాజిక వ్యవస్థలో ఒకేదేశం ఒకేప్రజ, ఒకేదేశం – ఒకేమతం, ఒకేదేశం – ఒకేఎన్నిక వంటి ఆలోచనలు మన రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా భిన్నమైనవి. పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ జమిలి ఎన్నికల ప్రహసనం ఫెడరల్ వ్యవస్థకు ముప్పు అని మేధావులు ఆందోళన పడుతున్నారు.
ప్రతి రాజకీయ విధానం వెనుక అధికార ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ జమిలి ఎన్నికల విధానం రాజకీయ అధికార ఏకీకరణకు, కేంద్రీకరణకు దారితీస్తుంది. రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అస్థిరతకు గురవుతాయి. రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారాలను, స్వయం అభివృద్ధిని కోల్పోతాయి. స్థానికతకు సంబంధించిన అన్ని అంశాలు ధ్వంసమవుతాయి. ప్రాంతీయ పార్టీలు అంతర్ధానమవుతాయి. జాతీయ అంశాలే రాజ్యమేలుతాయి.
ఇప్పటికే ఒకేదేశం – ఒకే పన్ను విధానం జిఎస్టీతో ఆర్థిక కేంద్రీకరణకు తెరలేపింది. ఆర్థిక వనరుల కోసం రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడే విధంగా చేసింది.
కేంద్రం బలపడుతుంది. రాష్ట్రాలు బలహీనపడతాయి.
కేంద్రీకరణ అది ఏదైనా నియంతృత్వానికి పునాది. వికేంద్రీకరణ వికసితానికి ఆలంబన.
స్థానికతను దెబ్బతీసే ఏ చర్యా ఆమోదనీయం కాదు.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్