వజ్రగిరిరాజు వజ్రపాలుడు. అతడి పట్టపు రాణి వజ్రేశ్వరి. వజ్రగిరి పొరుగునే మణిగిరి ఉంది. మణిగిరి రాణి మణిమేఖల. ఆమె అందరి రాణులకు విందు ఇవ్వదలచి ఆ సౌహార్ద్ర విందుకు అందరికి ఆహ్వానం పంపింది. వజ్రేశ్వరి ఆ విందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. రాజుగారు తరచి తరచి అడుగగా ఆ రాణికి అగం జాస్తి. ప్రతి మాటకు తప్పు తీస్తుంది అంది. ఇరుగు – పొరుగు రాజ్యాలతో మంచిగా ఉండాలి. నీకు తోడుగా బట్లక్కని పంపిస్తాను. ఆమె నీకు మాట రాకుండా చూస్తది అన్నాడు. అర్ధాంగీకారంతోనే వజ్రేశ్వరి విందుకు వెళ్ళింది. చక్కని పొన్నపూలవనంలో వెన్నెల విహారం. పొన్నపూల వాసన ఎంత బాగుంది అంది వజ్రేశ్వరి. మణిమేఖల వెంటనే పంది బురద మెచ్చుతుంది అంది. వజ్రేశ్వరి మొహం చిన్నబోయింది. వెంటనే బట్లక్క అమ్మా! గాడిదకు ఏం తెలుసు గంధం వాసన అన్నారు. జగద్గురువు కృష్ణపరమాత్మ మెచ్చిన చెట్టు ఇది. వారికి సేవ పొన్నవాహన చేస్తారు. లోకో భిన్న రుచి అంది. మణిమేఖల వజ్రేశ్వరిని తను పంది అంటే, ఆమె చెలికత్తె తనను గాడిద అంది అని అర్థం చేసుకొని అక్కడి నుండి తన నోటి దూల తగ్గించుకుంది.
- వి. మంజురాణి
రామచంద్రాపురం, తెల్లాపూర్