కీ.శే. ముకురాల రామారెడ్డి గారు తెలంగాణ ముద్దు బిడ్డలలో ఒకరు. అప్పటి మహబూబునగరం జిల్లా కల్వకుర్తి తాలూక ముకురాల గ్రామంలో 1929వ సంవత్సరంలో జన్మించారు. వారి చదువు ఒక బడిలో గాని, ఒక గురువు దగ్గరగాని స్థిరంగా సాగలేదు. వీధిబడి నుంచి విశ్వవిద్యాలయం చదువుదాకా చాలావరకు స్వయం కృషితోనే సాగింది. ఆంధ్ర (తెలంగాణ) సారస్వత పరిషత్తు నిర్వహించే ‘విశారద’ పాసై, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తూ, ప్రైవేటుగా B.A., B.Ed., M.A. చదివి ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడై, మహబూబునగర్ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తూ, తెలుగు అకాడమిలో 1970వ సంవత్సరంలో చేరి 17 ఏళ్ళపాటు వివిధ హోదాలలో పనిచేసి, ఉప సంచాలకులుగా రిటైరైనారు. తెలుగు అకాడమిలో ఉద్యోగం చేస్తూ, ఆచార్య సి. నారాయణరెడ్డి గారి పర్యవేక్షణలో ‘ప్రాచీనాంధ్ర కవిత్వం ఆదర్శాలు పరిణామాలు’ అనే అంశంమీద పరిశోధన చేసి Ph.D. పట్టా పొందారు. 1946-48 ప్రాంతంలో విద్యార్థి దశలోనే గ్రంథాల యోద్యమం. నిజాం వ్యతిరేక పోరాటం వంటి ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. ‘దుందుభి’ మాస పత్రికకు గంగాపురం హనుమచర్మత్ కలిసి సంపాదక బాధ్యతలు నిర్వహించారు.
ముకురాల స్వయం కృషితో తెలుగు, ఇంగ్లీషు, సంస్క•తం, హిందీ, ఉర్దూ భాషలను గట్టిగా చదువుకొన్న వ్యక్తి. ఉపాధ్యాయ వృత్తి నుంచే ఆయన కవితలు, విమర్శన వ్యాసాలు రాస్తూ వచ్చారు. ప్రచురితమైన వాటిలో ఆయన తొలికృతి ‘దేవరకొండ దుర్గం’. ఈ గేయ కావ్యం 1957లో అచ్చయింది. దేవరకొండ దుర్గం 8 పేజీల లఘు కావ్యమైనా, ఆయనకు అమోఘమైన కీర్తిని తెచ్చిపెట్టింది. దేవరకొండ దుర్గం రాచకొండ రాజ్యంలోని భాగం, వెలమ ప్రభువులు పాలించిన ప్రాంతం. ఈ సీమను పాలించిన ప్రభువులలో సర్వజ్ఞ సింగభూపాలుడు ప్రసిద్ధుడు. ఈ కావ్యంలో కథ ఏమీలేదు. కేవలం వర్ణనాత్మకమైన, ప్రశంసాత్మకమైన కావ్యం.
‘అలరాచకొండలో
తలిరాకు మొలబాకు నాజోకు భోగినిషోకు
కవిరాజురాజు సింగమనీని దర్బారు కవులకే
వాకట్టు గట్టు వాగ్యుద్ధములు
తిరుగునా కలలో గిరగిరన
నా అంతరంగమే ఒక చిత్రరంగమై భ్రమియించు
ఒకనాడు వెలమలకు ఉనికిరా ఈ కొండ
ఇదియె దేవరకొండ ఇదియె దేవరకొండ
ఇదెకొండ, ఇదెకోట – ఈ కొండ కిదిదండ
ఇట ఎన్నడో ఎగిరెనటరా తెలుగుజెండ
ఏనాటిదీ వీర ధాని దేవరకొండ’ అని నాటి పురాణ వైభవాన్ని వర్ణిస్తారు.
‘నేలతల్లి కెరుక నింగి సామి కెరుక
నాటి కతలు వెతలు నాటి మాట
మనసు రకగనేడు వినిపించు నొక్కటే
గాలిపిల్ల వాని జీవి మాట’ అని నేటి జీర్ణస్థితిని కళ్ళకు కట్టిస్తాడు.
నవ్వేకత్తులు: ముకురాలా రెండో కావ్యం. దీన్ని కవిగారే ‘జాతీయ విప్లవ కావ్యం’ అని పేర్కొన్నారు. ఈ కావ్యాన్ని రెండు భాగాలుగా రాయడం జరిగింది. సంప్రదాయం చచ్చిపోతున్నదని ఏడుకొండల వాడికి వినతిపత్రం (దరఖాస్తు ద్వారా విన్నవించడం మొదటి భాగం. రెండో భాగం ఎండార్స్మెంట్. కొత్త సమాజం కావలసిందేనని, అది కొత్తగా రూపొందవలసిందేనని, దానికి ముఖ్యంగా కావలసింది కొత్త వ్యవస్థేనని ఈ కావ్యంలో ప్రతిపాదించడం జరిగింది.
‘‘హేతుమతి పెరగని సంఘంలో – మతముంటుంది మనిషిని మనిషినీ విడదీయిస్తూ’’ అని కవి భావం.
భారత విదేశాంగ నీతిలోని లోటే చైనా దాడికీ, పాకిస్తాన్ కోతి చేస్టలకూ కారణమైందని, లౌకిక రాజ్యాంగం అని చెప్పుకొంటూ, వివిధ మతాలకు స్వాతంత్య్రం ఉండటం దేశంలో మతకలహాలకు ద్విజాతి సిద్ధాంతాలకు మూలకారణమైందని ముకురాల నిశ్చితాభిప్రాయం.
‘‘ఒక జాతిది ఒక సత్యం-
ఒక జెండా, ఒక్క పాట
అడగవోయి సముద్రాల- అలలు తాకినంతమేర
ఒక జాతిది ఒక తత్త్వం ఒక గమ్యం ఒక్క మాట
అడుగు నేటి తత్వం హద్దులు ఏర్పడిన మేర
అని తన జాతీయ తత్త్వమేమిటో తన కవితలో వెల్లడిస్తాడు.
హృదయశైలి: 1957 నుంచి 77 వరకు అప్పుడు వివిధ అంశాలమీద రాసిన 36 కవితల సంపుటి ‘హృదయశైలి’.
‘శాంతి వచనమ్’ అనే ఖండికలో
‘‘ఓ శాంతీ! ఎంతమెత్తని పేరు నీది –
నీ విలాసం పాతదే
అయినా నీతో సంధి చేసుకొనే సమయం కొత్తది.
అన్ని దేశాల్లోనూ, అన్ని ఫొటోల్లోనూ నెగ్గిన విశ్వసుందరివిగా’’ అని ఛలోక్తి విసురుతారు.
పాలమూరు జిల్లాను వలసల జిల్లా అంటారు. దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా, ఏ రోడ్డు వేసినా, పంట పొలాలకైనా పాలమూరు లేబరు తరలివెళ్ళవలసింది. వలస కూలీలుగా తూర్పు కోస్తాకు వెళ్ళిన పాలమూరు జాలర్లు కొందరు 1977 నాటి తుఫానులో చిక్కుకుని మరణించిన ఉదంతం ముకురాల రామారెడ్డి చేత ‘పాలమూరు జాలరీ’ అనే గొప్ప పాటను రాయించింది. ఆ పాట ఇది.
కూలి మస్తుగ దొరకుతాదని కోస్తదేశం పోతివా
ఎన్నడొస్తవు లేబరీ పాలమూరు జాలరీ
కోస్త బెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు
ఏడ ఉంటివో లేబరీ ఎన్నడొస్తావు జాలరీ
గుర్తు తెలియని పీనుగులతో గోతి పాలైపోతివా!
ఎక్కడుంటివి లేబరీ – ఎన్నడొస్తవు మళ్ళెందుకొస్తవు జాలరీ
అప్పటి ఆంధప్రదేశ్‍లో కృష్ణానది తొలి అడుగు మోపేది పాలమూరు జిల్లాలోనే అయిన, ఈ పాట కాసేనాటికి కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు నిర్మితం కాలేదు. ఈ జిల్లాలో రెండు నదులు పారుతున్నా పాలకుల కుతంత్రాలవల్ల పాలమూరు జిల్లా వలసల జిల్లా అయిన దుస్థితిని ఈ పాటలో రాసి, కన్నీటి ఊటను
ఉబికించినాడు ముకురాల.
అందుకే ప్రజల కష్టాలు చూసిన వాడు గానేకాక, స్వయంగా రైతుబిడ్డ అయిన ముకురాల 1969 నాటి తొలి తెలంగాణ
ఉద్యమంలో ప్రముఖ కవులందరూ సమైక్యాన్ని కోరినా, కాళోజి లాగా ప్రత్యేక తెలంగాణాను కోరుతూ కవితలు రాశాడు.
సమైక్య పాలనలో తెలంగాణవారికి నీటి పంపకంలో,
ఉద్యోగ నియామకాలలోను జరుగుతున్న అన్యాయానికి, తెలంగాణ భాష, సంస్కృతిపట్ల అవహేళన, అపహాస్యం చూపుతున్న అన్నల ధోరణికి తీవ్రంగా స్పందించి ఎంతో ఆవేదనతో కవితలు రాశాడు.
కాళిదాసు రచించిన ‘మేఘ సందేశం’ కావ్యాన్ని ముకురాల ‘మేఘదూత’ అనే పేరుతో గేయానువాదం చేశారు. కావ్యం చివరి ముగింపులో కాళిదాసు మేఘానికి మార్పు తీసుకొనిరావడం జరిగింది. దశేంద్రియ జీవితంకాని ‘మేఘం’ సందేశాన్ని ఎట్లా తీసుకొనిపోతుంది అని ప్రశ్నించిన కాళిదాసు, చివరికి సందేశాన్ని తీసుకొనిపోయి చెప్పినట్లు రచించడం యుక్తంవాదని, పూర్వాకాలం కార్మికులు విమర్శించినందుకుగాను, రామారెడ్డి సహజమైన రీతిలో ముగించడానికి కొత్తగా సన్నివేశ కల్పన చేసినాడు. యక్షుని భార్య దీనావస్థను గురించి ఆనోటా ఆనోటా కుచేలుని భార్యకు అందంగా ఆమె భర్తతో చెప్పి యక్షుని శిక్ష తగ్గింపజేస్తుంది.
‘‘మనుషులుండేదిదాక – గగన భాగాల మేఘాలు మెదలెడిదాక.
విరహవీణల మీటి వీనగవచ్చునది – కాళీదాసుని విధురకలత కావ్యమిది’’
అని కాళిదాసుని ప్రశంసతో కావ్యాన్ని ముగిస్తాడు. ముకురాల ‘పుట్ట గోచిలింగ పూలరంగ’ అనే మకుటంతో హాస్యపూరితమైన, వ్యూహాత్మకమైన శతకం కూడా రాశారు.
మొత్తంమీద వీరి కవిత్వంలో ముకురప్రాయంగా కనిపించే ప్రధానలక్షణం వక్రోక్తి! సూటిగా దేన్ని చెప్పడు. తెనుగు నుడికారం. జాతీయాలు, తెలంగాణా పలుకుబడి భాష, ముఖ్యంగా పాలమూరు భాష ఆయన కవిత్వంలోని మౌలిక గుణాలు
ముకురాల ఎంతటి కవో అంతటి విమర్శకుడు, పరిశోధకుడు కూడా. వీరి సిద్ధాంత వ్యాసం ‘‘ప్రాచీనాంధ్ర కవిత – ఆదర్శాలు, పరిణామాలు’’ ఒక మౌలికమైన, ప్రామాణికమైన పరిశోధనా గ్రంథంగా గణితి కెక్కింది.
ముకురాల కొన్ని కథలు కూడా రాశారు. అవి 4,5 కథలకంటె మించవు. ముకురాల పుంఖాను పుంకంగా రచనలు చేయకపోయినా, రాసిన ప్రతి రచన ఒక పుత్తడి రచనే. ఆయన కలం ఎంత బలమైనదో, కంఠం కూడా కంచు కంఠం కావడంవల్ల కవిసమ్మేళనాలలో శ్రోతలను ఆకట్టుకొన్నాడు. వక్తగా కూడా రాణించినాడు.
ముకురాల రామారెడ్డి గారికి జరిగిన సన్మానాలలో ఆలిండియా రేడియో న్యూఢిల్లీ నుంచి జాతీయ కవిగా సన్మానం, ఆధునిక పరిశోధకుడిగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రత్యేక సన్మానం, కవిరాజు సూతపురాణ వ్యాఖ్యను భారత ఉపరాష్ట్రపతి సన్మానం, పద్యకవితకు మధునాపంతుల అవార్డు ముఖ్యమైనవి.
తెలుగు అకాడమిలో ఉద్యోగిగా ఉంటూ తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన సేవ కూడా ప్రస్తుతించదగినదే. ముఖ్యంగా ‘పరిపాలన న్యాయపదకోశం’ తయారీ వీరి ఆధ్వర్యంలోనే కొనసాగింది. ‘తెలుగు సాహిత్య పదకోశాన్ని’ మిరియాల రామకృష్ణగారితో కలిసి రచించారు. కార్యాలయ పదావళి, రెండో భాషగా తెలుగు బోధన కార్యక్రమాలు, వాచక రచనలు (తెలుగు), శబ్ద సంపద పరిశీలన మొదలైన ప్రాజెక్టులను ఎంతో దక్షతతో పర్యవేక్షించి, పని చేయించి తాము పనిచేస్తున్న సంస్థకు పేరుప్రతిష్ఠలను తెచ్చిన ఉన్నతోద్యోగి (వీరు మార్చి 3, 2003 నాడు కల్వకుర్తిలో మరణించినారు).
తెలంగాణ కావ్యాలలో ముకురాల రామారెడ్డిది బలమైన గొంతుక, విశిష్టమైన కవిత్వం. వినూత్నమైన పరిశోధన చేసిన పరిశోధకుడు.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-డా।। జి. చెన్నకేశవరెడ్డి