‘జాతరంటె జాతర పుల్లూరుబండ జాతర
పుల్లూరు బండజాతర, పోదాము పదే జాతర’
ఈ జానపదగీతం పుల్లూరుబండ జాతరను గొప్పగా కీర్తిస్తుంది. పుల్లూరుబండ మీద వెలసిన ‘నరసింహస్వామి’కి ప్రతి సంవత్సరం పుష్యబహుళ అమావాస్య, మాఘశుద్ధ పాడ్యమి, విదియల్లో మూడురోజులు జరిపే ఉత్సవాలే పుల్లూరుబండజాతర.
సిద్ధిపేట జిల్లాకేంద్రానికి 6కి.మీ.ల దూరంలోనే ఉన్న పుల్లూరు పురాచారిత్రక ప్రదేశం. పుల్లూరుబండను ఆనుకునే చరిత్రపూర్వయుగ విశేషాలు, మధ్యయుగాలనాటి గుడులు, గోపురాలు విస్తరించివున్నాయి.
ఇపుడు పుల్లూరు గుట్ట తొవ్వకు కట్టిన కొత్త కమాన్ కాదు, గుట్టమీద ఒక నిరాలంకారమైన ద్వారతోరణముంది. తెలంగాణ అంతటా దేవాలయాల ముందర కనిపించే వైవిధ్య భరితమైన, శిల్పసంపన్నమైన ద్వారతోరణాలలో ఈ ద్వారతోరణం నిరాడంబరంగా వున్నది. ఈ తోరణం నుంచి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా కనిపించే ధ్వజస్తంభం నిర్మాణశైలినిబట్టి జైనమాన స్తంభం. నరసింహస్వామి గుడిలోపల మంటప స్త్తంభాలన్నీ రాష్ట్రకూటశైలికి చెందినవే. గుడి అర్థమంటప నిర్మాణ పద్ధతిలో నిర్మించింది.
బయట నుంచి దేవాలయాల అధిష్టానంమీద రాష్ట్రకూటశైలి కుడులు (గవాక్షాలు) అగుపిస్తాయి. అంటే ఇక్కడ రాష్ట్రకూటులకాలంలోనే దేవాలయాలు నిర్మించబడ్డాయని,తర్వాతికాలంలో గుడులు పునరుద్ధరించ బడ్డట్లు తెలుస్తున్నది.

పుల్లూరు గుడులు-గోపురాలు:
గుట్టమీద రెండు పురాతన దేవా లయాలున్నాయి. మొదటిది వేంకటేశ్వర ఆలయం. రెండవది ప్రసన్నకేశవ, వైజేశ్వరాలయమనే త్రికూటాలయం. ఆరడుగుల ఎత్తైనా లేని మంటపం, ఉపాలయాలు. వైజేశ్వరుని గుడిలో శివలింగం, వెనక పార్వతీసమేత శంకరుని విగ్రహశిల్పం, పక్కన వినాయకుడున్నారు. వైజేశ్వరుడు చతుర్భుజుడు. నిజహస్తాలలో కుడిచేయి అభయహస్తంగా, ఎడమచేయి పార్వతిని ఆలింగనం చేస్తున్నది. పరహస్తాలలో త్రిశూలం, ఢమరుకాలున్నాయి. సకలాలంకారశోభితుడైన వైజేశ్వరుడు వక్షబంధంతో, జంధ్యంతో కనిపిస్తున్నాడు. సుఖాసనంలో కూర్చున్న శివుని ఎడమ తొడమీద పార్వతి అభయహస్తం, తామరమొగ్గలతో కనిపిస్తున్నది. నందివాహనాన్ని చెక్కివున్న ఈ దేవతాధిష్టానపీఠం చక్కటి శిల్పం.
ఈ త్రికూటాలయంలో వుండాల్సిన ప్రసన్నకేశవుడు విరిగి, శిథిల రూపంలో మరొక ఆలయంలో వున్నాడు. కటికముద్రలో శంఖం, చక్రం ధరించివున్నాడు. నిజహస్తం కుడిచేతిలో ఫలమగుపించడం విశేషం. ఆ తోడుగుడిలో… వేర్వేరు కాలాలకు, వేర్వేరు శైలులకు చెందిన ఇద్దరు ఆదిత్యులున్నారు. ప్రభావళితో కనిపించే సూర్యునికి హార, గ్రైవేయయాలు, జూకాలు, వక్షబంధం, జంధ్యం, కటిమేఖలతో కనిపిస్తు న్నాడు. చాళుక్యశైలి. రెండవ సూర్యుడు కాకతీయశైలిలో చెక్కిన స్థానకమూర్తి. చాళుక్యశైలిలో లలితాసనంలో ఒక గణపతి, రెండే చేతులతో మరొక వినాయకుడు అగుపించాడు. ఆరడుగుల ఎత్తున్న రాతిస్తంభం మీద చెక్కిన రాష్ట్రకూటశైలి 5 పడగల నాగరాజు, షడ్భుజి, రాష్ట్రకూటశైలి మహిషాసురమర్దిని విగ్రహా లున్నాయి. ఒక దేవాలయ విమానం అపూర్వంగా వుంది. చెక్కిన రాతిపలకల అమరిక పైనుండాల్సిన శిఖర శిలలు లేవు. రెండు విమానాలున్నాయి త్రికూటాలయానికి. మరొక ఆలయగోపురం పాతకాలపు పెద్ద ఇటుకలతో నిర్మించబడి వుంది. ఆలయ ద్వారశాఖలమీద కలశాలున్నాయి. ఒక గుడి ద్వారశాఖమీద స్తంభికలున్నాయి. శైవద్వార పాలకులు న్నారు. రెండు ఆలయాల మధ్యన గుండం (పుష్కరిణి) వుంది. గుడికి తూర్పు, ఉత్తర ద్వారాల ముందు రెండు నందులున్నాయి. ఉత్తర ద్వారం దగ్గర సప్తమాత•కల శిలాఫలకం వుంది. ఉత్తరం వైపున గుడికవతల గుట్ట అంచున అందమైన 9 అడుగుల గరుడ విగ్రహం వుంది. ఆ ప్రాంగణంలోనే నడుంవరకు విరిగిన భైరవుని శిల్పమున్నది.
గుడిలో కాకతీయ శాసనం:
తెలంగాణ శాసనాలలో పులగనూరు-70 కంపణంగా పేర్కొనబడిన పుల్లూరు వైజేశ్వరాలయంలో కాకతీయ శాసనముంది.
అక్కడి ఆలయస్తంభాల్లో ఒకదానిపై శాసనం చెక్కబడివుంది. పరిష్కృతమైన ఈ శాసనం గణపతిదేవచక్రవర్తి కాలం( సంవత్సరం లేదు)నాటిది. ‘భోగం దాని గుడి’గా పిలువబడే ఈగుడిలోని ఇద్దరు దేవరలకు తీర్థం చేయడానికి ఒకరు(?) వ్రిత్తులిచ్చినట్లు తెలుపుతున్న దానశాసన మది.
స్తంభానికి 1,2 వైపుల కాకతీయ వంశం ప్రస్తావన, గణపతిదేవ చక్రవర్తి పేరున్నది…
స్తంభానికి 3డో వైపున
‘మటప్రోల……
గా పద్మ….రాయ
కొడ్కు రామనాధ
ఎత్తించిన దేవ
లు భలు….ర….’ అని వుంది…
గుడి ఆవరణ చుట్టు నిర్మించిన ప్రాకారపు గోడ లోపల, బయటా దీపాలు వెలిగించడానికి దీగూళ్ళున్నాయి. సత్రపు గదులు, ఇతర కట్టడాలు కూలిన ఆనవాళ్ళున్నాయి.
వైష్ణవుల పరమపద ‘చరమస్థలం’:
గుట్టకు ఉత్తరాన దిగుడంచుల్లో చర్మస్థలం అని పిలువబడే వైష్ణవాచార్యుని సమాధి వున్న చిన్న సొరంగం వంటి నిర్మాణం. లోపల దేవుని పాదాలు రెండుచోట్ల, శంఖ, చక్రాలతో కూడిన తిరునామాలున్నాయి. మరొక చర్మస్థలి పూర్తిగా ధ్వంసస్థితిలో వుంది.
పుల్లూరు గ్రామ శివాలయం:
సిద్ధిపేట జిల్లా కేంద్రానికి దగ్గరగా వున్న పుల్లూరు గ్రామంలో తూర్పున పునర్నిర్మించిన శివాలయం వుంది. 2014లోని రూపురేఖలు ఇవి. దేవాలయ స్తంభాలు, స్తంభాల కింది దిమ్మెలు రాష్ట్రకూటుల నాటివి. దేవాలయ ద్వారబంధాలు కాకతీయం. గర్భగుడిలోని ఎత్తైన పానవట్టంమీద కాకతీయశైలి సమలింగం అమరివుంది. నందిమంటపం అప్పటికి పూర్తికాలేదు. గుడిముందర కొత్తనందిని ప్రతిష్టించారు. అక్కడే ఒక వీరగల్లు వుంది.
గర్భాలయ ద్వారం ముందర శంఖలతాతోరణం వుంది. ఇది జైనదేవాలయ లక్షణం. గ్రామంలో బాట అవతల పొదల్లో పడివున్న జైనశిల్పం, చామరధారి విగ్రహాలు అక్కడ పూర్వం జైనబసది వుండేదనడానికి ఆనవాళ్ళు. ఒకప్పటి జైన దేవాలయాలు శైవాలయాలుగా పరివర్తన చెందాయనడానికి నిదర్శన గుడి.

పుల్లూరులో జైనబసది అవశేషాలు:
గ్రామంలో రోడ్డు పక్కన పొలంలోని దిబ్బమీద పొదల్లో జైనవిగ్రహాలు రెండున్నాయి. ఒకటి జైన తీర్థంకరులలో ఆదినాథుడైన ఋషభుని శిల్పం. ముఖం శిథిలమైపోయింది. భుజాలమీద గిరజాలజుట్టు కనబడుతున్నది. నడుమువరకు భూమిలోనే మునిగిపోయివుంది. రెండవది తీర్థంకరులకు పరిచారకుడైన యక్షుని శిల్పం. కుడిచేత చామరం, ఎడమచేత నిమ్మజాతిఫలం ధరించివున్నాడు. ఇది కూడా భూమిలో దిగబడేవున్నది. అక్కడ మరికొన్ని దేవాలయ శిథిలాలు అగుపించాయి. ఈ శిల్పాల ఆధారంగా ఇక్కడ ఒక జైనబసది వుండివుంటుంది. నిర్మాణశిథిలాలు మాత్రం మిగిలున్నాయి. అక్కడ లభిస్తున్న కుండపెంకులు, పెద్దగాబుల ముక్కలు అక్కడ పుల్లూరు పాటిగడ్డ వుందని తెలిపే ఆధారాలు.
పుల్లూరుగుట్టమీద పురాతన శిలారూపాలు…
ఇక్కడ ఈ రాతిగుండ్లమీద ప్రాకృతిక సహజమైన లైకిన్స్ అంటే శైవలాలు, శిలీంధ్రాలు వివిధ రంగులలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిదేం పెద్దచరిత్రకాదు. లైకిన్స్ సర్వసాధారణం. రాతిసిరలు కూడా అంతే. అయితే రాతిసిరలు భూమ్మీద రాళ్ళు ఏర్పడేకాలానికి సంబంధించిన భూపరిణామాల గుర్తులు.
పుల్లూరుగుట్ట గ్రానైట్ బండ. ఈ గ్రానైట్ రాయి మీద అక్కడక్కడ గాఢమైన రంగు మచ్చలతో కనిపిస్తుంది. దానిని టెక్నికల్ గా ఎంఎంఇ(మాఫిక్ మైకోగ్రాన్యులార్ ఎంక్లేవ్) అంటారు. ధార్వార్ శిలలలో గ్రానైట్ లలో ముందే ఎంఎంఇలను కలిగివున్న క్సెనోలిథ్స్ అంటే మాగ్మా వెలువడ్డప్పుడు ఏర్పడే రాళ్ళల్లో విశేష శిలారూపాలు. తనకు హోస్ట్ రాయి కరిగిన స్థితిలో ఉన్నపుడు దానితోపాటు సమానంగా పుట్టుకొచ్చేది ఎంఎంఇ. చల్లబడే గ్రానైట్ మాగ్మాలో ఇరుక్కున్న ప్రత్యేక శిలారూపాలివి. ఎంఎంఇ, క్సెనోలిథ్స్ రెండు వేర్వేరు. క్సెనోలిథ్ పాక్షికంగా వాతావరణంతో శైథిల్యం చెంది రాతిగుంట ఏర్పడుతుంది. క్సెనోలిథ్ నెమ్మదిగా చెదిరిపోతుంది. ఒక గుంట, లేదా కుండంలెక్క ఏర్పడుతుంది. వాటిలో వర్షపునీరు నిండిపోతుంది. ఏడాదంతా నీరుంటుంది. అక్కడ దేవాలయాలు నిర్మించినపుడు అది దేవుని గుండమౌతుంది. అటువంటి ఆనవాళ్ళు పుల్లూరు మీద కనిపిస్తున్నాయి.

పుల్లూరు బండలో మెగాలిథిక్ సమాధుల తవ్వకం:
2014-15 జూలైలో ప్రస్తుత తెలంగాణ వారసత్వశాఖ పుల్లూరు గ్రామంలో మెగాలిథిక్ బరియల్ తవ్వకాలను చేపట్టింది.
తెలంగాణా రాష్ట్రంలో మెగాలిథ్స్ ప్రత్యేకమైనవి. తెలంగాణా గ్రామాల్లో మెగాలిథ్ మాన్యుమెంట్స్లో వందలాది నిలువురాళ్ళు, బంతిరాళ్ళు, డోల్మన్లు, డోల్మనాయిడ్ సిస్టులున్నట్టు నివేదికల వల్ల తెలుస్తున్నది. స్త్రీ, పురుష విగ్రహరూప నిలువురాళ్ళు, శిలువరూప ఏకశిలలు మల్లూరుగుట్ట, గలాభా, కాంచనపల్లివంటి మధ్యగోదావరిలోయలో కన్పిస్తాయి. ప్రత్యేకమైన మెగాలిథిక్ సంస్కృతి ఇక్కడి విశేషం. తెలంగాణాలో కనిపించే ఈ మెగాలిథిక్ మాన్యుమెంట్స్ క్రీ.పూ.2000 సం.ల నుంచి క్రీ.శ. 400 సం.ల మధ్యవి.
భౌగోళికంగా 18010’34’’డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 78048’41’’డిగ్రీల తూర్పు రేఖాంశాల మీద సిద్ధిపేట జిల్లా, పుల్లూరు బండలో దాదాపు 50కి పైగా పెదరాతియుగం సమాధులున్నాయి. వాటిలో నిలువురాళ్ళు, కుప్ప సమాధులు(కైరన్లు), డోల్మన్లు రకాలున్నాయి. పుల్లూరు మెగాసమాధుల సంప్రదాయాలు, సంస్కృతి అర్థం చేసుకోవడానికి తవ్వకాల నిమిత్తం మూడు సమాధులను ఎంపిక చేసింది పురావస్తుశాఖ. పెదరాతియుగం సమాధుల తవ్వకాలపై ప్రత్యేక నివేదికనిచ్చింది వారసత్వశాఖ.
నిలువురాళ్ళు:
వారసత్వశాఖ తవ్వకాలకు ఎంపిక చేసిన మొదటి పెద్ద సమాధికి ఉత్తరాన 5.4మీ.ల ఎత్తైన నిలువురాయి వుంది. దాని మీద పెట్రోగ్లైఫ్స్ వున్నాయి. ఇంకా ఆ ప్రదేశంలో వున్న నిలువురాళ్ళు ఎన్నోవున్నాయి. వాటిలో ఒకదానిని గ్రామస్తులు ‘మైసమ్మ’గా పూజించడం విశేషం. పురామానవ సంస్కృతి అవశేషం కొనసాగింపు.
పుల్లూరు అమ్మదేవత:
పుల్లూరులో వారసత్వశాఖ తవ్వకాలలో ఒక మెగాలిథిక్ సమాధి నుంచి బయటకు తీసిన పురావస్తు సముదాయంలో ఒక రాతి కడ్డీ వుంది. అంతా అంగుళంన్నర మందం వున్న చతురస్రాకారపు రాతికడ్డి 11, 12 అంగుళాల ఎత్తుంది. పైభాగంలో కొంచెం భాగం వదిలేసి రాతికడ్డీచుట్టు చెక్కిన గాడి వుంది. తర్వాత 3అంగుళాల కింద పక్కల్లో మరొక ఏటవాలు గాడి చెక్కివుంది. పిదప కింద నుంచి ముందు 1అంగుళం నుంచి వెనక 2అంగుళాల ఎత్తులో రెండుగాడులు వున్నాయి. బొమ్మలా కనిపించే ఈ రాతికడ్డీ ముందుభాగంలో కింద కడ్డీ కింద నుంచి పైకి 1అంగుళం గాడి కనిపిస్తున్నది. ఆ గాడి పైన కొంచెం ఖాళీతో ఆ పైన చిన్న గాడి వుంది.
వీటన్నిటిని క్రమంగా గమనిస్తే ఈ రాతికడ్డీ ఒక స్త్రీ రూపాన్ని చెక్కిన అతిప్రాచీన శిల్పం అనిపించింది. పైన 1అంగుళం లోపుననే వున్న గాడి తలభాగానికి ప్రాతినిధ్యంగా అనుకుంటే, దాని కింది భాగం నడుం నుంచి శరీర పైభాగం, మధ్యలో చెక్కిన రెండువరుసల గాడుల కింద చుక్కలెక్క పెట్టిన గాడి స్త్రీ జననేంద్రియాన్ని సూచిస్తున్నది. దాని కింద చెక్కిన గాడి శరీర శిల్పంలో కాళ్ళను వేరుచేస్తున్న శిల్పభాగం.
పుల్లూరులో మెగాలిథిక్ (పెదరాతియుగం) సమాధులను పురావస్తుశాఖవారు తవ్వినపుడు పెద్ద మెన్హర్ నిలిపివుంచిన సమాధిలో ఈశాన్యభాగంలో లభించిన అస్థిపంజరం పక్కన ఈ రాతికడ్డీశిల్పం వున్నది. ఆ అస్థిపంజరం అక్కడి ఆవాసంలోని పురామానవుల నాయకుడిదో, పూజారిదో అయివుంటుంది. ప్రముఖులకే మెన్హర్ నిలుపడం, పెద్ద రాతిబండ క్యాప్ స్టోన్(మూతరాయి)గా వేయడం ఆచారమైవుంటుంది.
ఈ రాతికడ్డీ బొమ్మ…ఒక అమ్మదేవతాశిల్పం. హరప్పా నాగరిక ముద్రలు, శిల్పాలలో కూడా టెర్రకోట బొమ్మలే దొరికాయి కాని, రాతిశిల్పాలు తక్కువ. ఈ పుల్లూరు అమ్మదేవత ప్రాచీన దేవత. నగ్నకబంధ వంటిదే.
ఈ పుల్లూరు అమ్మదేవత ప్రత్యేకంగా పరిశోధించాల్సిన పురాయుగ శిల్పం.

పుల్లూరు భద్రపరచవలసిన చరిత్రపేటిక:
పుల్లూరు గుట్ట చుట్టూ, బాటవెంట వందలాది ఆదిమానవుల సమాధులను చూసాం. వీటిలో మెన్హర్లు, గూడుసమాధులు, కుప్పసమాధులు, కైరన్లు, సిస్టులున్నాయి. అక్కడ ఈ సమాధులను ఎక్కడా లేనివిధంగా పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు గ్రామస్తులు. మెన్హర్ ను కొచ్చెగుండు అని, డోల్మన్‍లను పాతమైసమ్మ అని పేర్లు పెట్టుకున్నారు. చాలా చోట్ల వ్యవసాయం కోసం తవ్వేయడం వల్ల చాలా సమాధులు లుప్తమై పోతున్నాయి. రాతిపనిముట్లు చెల్లాచెదురైపోతున్నాయి. తవ్వేసిన సమాధుల్లోంచి బయటపడిన కుండపెంకుల అంతటా పరుచుకుని వున్నాయి. మాకు కొత్తగా ఒక రాతిపలక అంచున రాతలవంటి పెట్రోగ్లైఫ్స్ లభించాయి.
వీటిని త్వరగా పరిరక్షించే ప్రయత్నాలు చేయకపోతే గొప్ప చారిత్రకసాక్ష్యాలను కోల్పోతాం.
ధన్యవాదాలు:
పుల్లూరుగుట్టమీది పురాతన శిలారూపాల గురించి వివరించిన కొత్త తెలంగాణచరిత్రబృందం సలహాదారులు, గౌరవనీయులు చకిలం వేణుగోపాలరావు గారికి, 18.02.15న సిద్దిపేట మండలం పుల్లూరును నాతో కలిసి సందర్శించిన వేముగంటి మురళీకృష్ణ, వేముగంటి రఘునందనన్న, కరుణాకర్ లకు, ఇంకా ఇటీవలికాలంలో పుల్లూరులో చారిత్రక ప్రదేశాలను గుర్తించిన చరిత్రకారులు డా. ఈమని శివనాగిరెడ్డిగారికి, మహమ్మద్ నసీరుద్దీన్‍లకు, మా చరిత్ర బృందం సభ్యులు కొలిపాక శ్రీనివాస్, సిరిపురం నరేందర్‍లకు, ధన్యవాదములు.
- శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698