ఏఐ, రోబోటిక్ టెక్నాలజీలను విరివిగా వాడాలి
దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఉద్యాన పంటల సాగు పెరగాలి: మంత్రి తుమ్మల
దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. వ్యవసాయ విద్య, పరిశోధనల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. రైతులకు మరింత చేరువయ్యేలా సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రెండు రోజులపాటు జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను చాన్స్లర్ హోదాలో గవర్నర్ ప్రారంభించారు. వజ్రోత్సవాల మీనియేచర్ పైలాన్‍ను మంత్రి తుమ్మల నాగేశ్వర్‍రావు, వర్సిటీ వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్యతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ గుర్తింపు పత్రాలని అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 2047 నాటికి వ్యవసాయ రంగంలో విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
గడిచిన 60 ఏళ్లుగా వర్సిటీ అసమాన సేవలందిస్తూ.. సోనామసూరి, తెలంగాణ సోనా వంటి ఎన్నో కొత్త వంగడాలను అభివృద్ధి చేసిందని కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి అధునాతన సాంకేతికతలను వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మారేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు.
ఉద్యానవన పంటల సాగు పెరగాలి: తుమ్మల
రాష్ట్రంలో వరి, పత్తి, మిరప పంటల సాగును తగ్గించి.. కూరగాయలు, ఆయిల్‍పామ్, ఇతర ఉద్యాన పంటల సాగు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‍రావు రైతాంగానికి సూచించారు. స్పోర్టస్ కాంప్లెక్స్లో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో వ్యవసాయ పట్టభద్రులు రావాలని ఆకాంక్షించారు. శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు పంటల సాగును సూచించాలని కోరారు.
ప్రతి వ్యవసాయ కళాశాల పరిధిలో ఒక ‘మోడల్ అగ్రికల్చర్ ఫార్మ్’ను అభివృద్ధి చేయాలని సూచించారు. నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి పారుదల సౌకర్యం పెరగటంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగిందని.. అదే సమయంలో కూరగాయలు, ఉద్యాన పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు నాదెండ్ల భాస్కర్‍రావు, సమరసింహారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీకల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డి. రాజిరెడ్డి, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు చింతల వెంకటరెడ్డి, వై. వెంకటేశ్వర్‍రావు, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు రఘువర్ధన్ రెడ్డి, రాఘవరెడ్డి, పద్మరాజు, వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ
ఉపకులపతి ప్రభాకర్‍రావు పాల్గొన్నారు.
- కె. సచిన్,
ఎ : 86866 64949