పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పర్యాటక రంగ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జనవరి 25న భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ఆర్థిక విలువలపై పర్యాటక రంగం ప్రభావం చూపుతుంది. భారతదేశం అద్భుతమైన పర్వతాలు, అడవులు, సముద్ర తీరాల నిధి అయినందున ఇది అందమైన పర్యాటక ప్రాంతం. ప్రకృతిని రక్షించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ఒక అద్భుతమైన మార్గం.
భారత ఉపఖండం పర్యాటకుల కోసం అనేక అంశాలను కలిగి ఉంది. మెరిసే ఇసుకతో విస్తారమైన బీచ్‍లు, మంచుతో కప్పబడిన అద్భుతమైన పర్వతాలు, అరుదైన, అందమైన వృక్షజాలం, జంతుజాలం, సాహసోపేత అడవులు, జలపాతాలు, పర్వత శిఖరాలు, ఎడారులు ఇలా ఎన్నో ప్రత్యేకమైన అందాలు భారత్ సొంతం.
తెలంగాణలో పర్యాటక ప్రాంతాలు
పురాతన కట్టడాలనే కాకుండా.. సంప్రదాయ ఉత్సవాలను ఆస్వాదించేందుకూ ఇక్కడకు వచ్చేవారి సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది.
నల్లమల అందాలు, ప్రాణహిత అభయారణ్యం, అనంతగిరి కొండలు, నాగార్జున సాగర్, కాళేశ్వరం ప్రాజెక్ట్, కోట్‍పల్లి, లక్నాపూర్, కాగ్నానది, ఎగువ మానేరు, మంజీరా నది, టేక్రియాల్ చెరువు, పాకాల చెరువు, కాకతీయులు కట్టించిన ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం, వరంగల్ కోట, రామప్ప దేవాలయం, ప్రతాపరుద్ర నక్షత్రశాల, ట్రికూటాలయం, రంగశాయిపేట, జలవిద్యుత్ కేంద్రం, ఎత్తిపోతల పథకం, బుద్ధవనం, నాగార్జున కొండ, డిండి ప్రాజెక్టు, భీముని పాదం జలపాతం, కొరవి వీరభద్రస్వామి, కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం, శివారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బుగ్గ రాజేశ్వరాలయం, సత్యనారాయణస్వామి ఆలయం, గుట్ట మల్లన్న స్వామి-వేలాల, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, ఏకశిల, ఖుష్ మహల్ ఇలా అనేకం తెలంగాణ ప్రాంతంలో చూడవచ్చు. ఇవి పర్యాటకలకు కనువిందు చేస్తాయి.
హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలు

- కుతుబ్‍షాహీలు, ఆసఫ్‍జాహీల కాలం నాటి చారిత్రక కట్టడాలు నగరానికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చార్మినార్, మక్కామసీదు, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‍నుమా ప్యాలెస్ నగర చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తున్నాయి.
- లుంబినీ పార్క్, కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సాలార్జంగ్ మ్యూజియం, స్టేట్ మ్యూజియం, జీఎస్‍ఐ వంటి సంగ్రహశాలలు, జూ పార్కు నగర ప్రత్యేకతను చాటుతున్నాయి.
- చౌమొహల్లా ప్యాలెస్ శిల్పకళ అద్భుతం. అరణ్యంలో సంచరించే అనుభవం కలిగించే జూపార్కు, నిజాంల రాజప్రసాదాలు, మ్యూజియంలు, హుస్సేన్ సాగర్‍లో బోటు షికారు… ట్యాంక్‍బండ్, నెక్లెస్ రోడ్డు ఇలా అంతా మనోహరమే.
- నగరానికి వచ్చిన స్వదేశీ, విదేశీ యాత్రికులకు గోల్కొండ కోట చూడందే పర్యాటక దాహం తీరదు. రోజంతా తనివి తీరా చూసి మురిసిపోతారు. గైడ్లు ఇక్కడి అందాలను వివరించిన తీరుకు మంత్రముగ్ధులవుతారు.
- కె. సచిన్, ఎ : 86866 64949