ఆదివాసీల ఐక్యతారాగం నాగోబా జాతర

ఆదివాసీల ఐక్యతారాగం… శిశిర రుతువులో విరిసే వసంతగానం… నాగోబా జాతర. ఇంద్రవెల్లి కానలో గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు మీసం మెలేస్తే… తెలంగాణమంతా పరవశించే ఘట్టం ఇది. తరతరాల ఆచారాలకు కాపుకాస్తూ… తాము నమ్మిన నాగరాజుకు కొమ్ముకాస్తూ… ఘనంగా జరిగే జనజాతరకు కేస్లాపూర్‍ స్వాగతం పలుకుతున్నది. జనవరి 28న మొదలైన నాగోబా జాతర ఐదు రోజులపాటు ఆదివాసీల జీవన వైచిత్రికి, నమ్మకాలకు అద్దం పడుతుంది.


ఆదివాసీల తెగువకు ‘సమ్మక్క-సారలమ్మ’ జాతర ప్రతీక అయితే.. ‘నాగోబా జాతర’ వారి ఆచారాలకు ఆలంబనగా నిలుస్తుంది. ఆదిలాబాద్‍ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‍ వేదికగా జరిగే ఈ ఆదివాసీ సంబురం తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందింది. ఏటా పుష్యమాసంలో నెలవంక తొంగి చూడటంతోనే.. నాగోబా జాతరకు సన్నాహాలు మొదలవుతాయి. నెలవంక కనిపించిన రెండో రోజు మెస్రం వంశీయులు నాగోబాకు తొలిపూజలు చేస్తారు. తర్వాత ప్రత్యేకంగా తయారుచేసిన ప్రచార రథంలో వారం రోజులు గ్రామాల్లో తిరుగుతూ.. జాతరకు హాజరు కావాల్సిందిగా మెస్రం వంశీయులను ఆహ్వానిస్తారు.


జాతరకు పక్షం రోజుల ముందు ఈ మహత్తర క్రతువుకు శ్రీకారం చుడతారు. తమ దైవం నాగోబాకు అభిషేకానికి గానూ గంగాజలం తీసుకురావడానికి మెస్రం వంశీయులు ప్రయాణం అవుతారు. కేస్లాపూర్‍ నుంచి జన్నారం మండలం కలమడుగు వరకు దాదాపు వంద కిలోమీటర్లు కాలినడకన బయల్దేరి వెళ్తారు. అడవి దారిలో చెప్పుల్లేకుండా నడక సాగిస్తారు. అక్కడి హస్తలమడుగు దగ్గర పంచలింగాలకు పూజ చేసి 151 కలశాలతో గోదావరి జలాలను తీసుకొని కాలినడకన తిరుగు ప్రయాణం అవుతారు.


పెద్దలను మెప్పించి: గంగమ్మ జలాలతో అందరూ ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. కేస్లాపూర్‍ నాగోబా ఆలయ సమీపంలో ఉన్న మర్రిచెట్ల వద్ద ఓ మోదుగు చెట్టుపై గంగాజలంతో ఉన్న ఝరిని ఐదురోజులు భద్రపరుస్తారు. పుష్య అమావాస్యకు ముందురోజు మెస్రం వంశీయులు ఒకే చోట తూం (పితృ కర్మ) పూజలు చేస్తారు. అమావాస్య నాడు సాయంత్రం సంప్రదాయ బద్దంగా ఎడ్లబండ్లతో ఆలయ సమీపంలోని గోవాడ్‍కు చేరుకుంటారు. రాత్రి నాగోబా ఆలయాన్ని పవిత్ర గంగాజలంతో శుద్ధి చేస్తారు.


22 పొయ్యిలు: నాగోబా దేవతకు గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తారు. వీరిలో 22 వంశాలు ఉన్నాయి. జాతరకు వచ్చే మెస్రం వంశీయులకు చెందిన మహిళలు వంటలు చేసుకునేందుకు గోవాడ్‍లో 22 పొయ్యిలను ఏర్పాటుచేస్తారు. మహాపూజలకు కావాల్సిన నైవేద్యాలు అక్కడే వండుతారు. గోవాడ్‍లో ఇతరులు రాకుండా నిబంధనలు విధిస్తారు. మెస్రం వంశీయులు వేలమంది తరలి వచ్చినా.. ఈ 22 పొయ్యిల మీద వండిన వంటనే అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇతర ఆదివాసీలు, జాతరకు వచ్చిన భక్తులు ఆలయ ఆవరణలో బస చేస్తారు.


బాన్‍ దేవతలకు మొక్కులు : నాగోబా ఆలయం వెనుక ఉన్న బాన్‍ దేవతలకు మెస్రం మహిళలు సంప్రదాయ పూజలు చేస్తారు. గోవాడ్‍లో ఉన్న మహిళలతోపాటు భేటింగ్‍కు వచ్చిన కొత్త కోడళ్లను సంప్రదాయ వాద్యాలతో సతీదేవతల వద్దకు తీసుకువస్తారు. అక్కడినుంచి మహిళలు మర్రిచెట్ల సమీపంలో కోనేరు వద్దకు చేరుకుని పూజలు చేస్తారు. కోనేరు నీటిని తీసుకుని బాన్‍ దేవతలు ఉన్న చోటికి చేరుకుంటారు. అక్కడ మట్టితో బాన్‍ దేవతలను తయారుచేసి పూజలు నిర్వహిస్తారు.జాతర జరిగినన్ని రోజులు మెస్రం వంశీయులు కేస్లాపూర్‍లోనే ఉంటారు. ఆదివాసీల ఐక్యత, సంస్కృతికి చిరునామాగా నిలిచే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‍, ఛత్తీస్‍గఢ్‍, ఒడిషా రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకుంటారు. జాతరలో మరో ముఖ్యఘట్టం ‘ప్రజాదర్బార్‍’. ఈ కార్యక్రమానికి ఆదివాసీ పెద్దలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అక్కడి ప్రజల స్థితిగతులు, అవసరాలు తెలుసుకొని, వారి సమస్యలకు పరిష్కారం చూపుతారు.


నాగరాజు దైవం: క్రీ.శ.740 లో కేస్లాపూర్‍ గ్రామ గిరిజనుడు పడియేరు శేషసాయి నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్లాడట. అక్కడ ద్వారపాలకులు అడ్డగించి నాగరాజు లేరని చెబుతారు. శేషసాయి నిరుత్సాహంతో నాగరాజు శేషతల్పాన్ని తాకి కేస్లాపూర్‍కు వెనుదిరుగుతాడు. శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకుని నాగేంద్రుడు ఆగ్రహిస్తాడు. శేషసాయిని అంతం చేయాలని భూలోకానికి వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శేషసాయి ప్రాణభీతితో కాలజ్ఞాన పురోహితుడు ప్రధాన్‍ పడమార్‍ దగ్గరికి వెళ్తాడు. నాగరాజును శాంతింపజేసే మార్గాన్ని తెలుసుకుంటాడు. ఏడు కడవల ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడు రకాలతో నైవేద్యంగా సమర్పిస్తాడు. గోదావరి హస్తలమడుగు నీటిని 125 గ్రామాల మీదుగా తిరుగుతూ తీసుకొచ్చిన గంగాజలంతో నాగరాజును అభిషేకిస్తాడు. దీంతో కేస్లాపూర్‍ వద్ద ఉన్న పుట్టలోకి నాగరాజు వెళ్లి, దాన్నే తన నివాసంగా మార్చుకున్నాడట. అప్పటినుంచి ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయులు నాగోబాకు పూజలు చేసి, జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.

  • కె. శ్యామల ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *