ఎడితనూర్‍-రాతిపుటల్లో రాసిన చరిత్ర

సంగారెడ్డి జిల్లా, మండలంలోని ఎడితనూర్‍ గ్రామాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ పాతరాతి యుగం నుండి రాచరిక యుగాల దాకా విలసిల్లిన అఖండ నాగరికత గురించిన ఆనవాళ్లు మాలో ఆనందాన్ని నింపాయి.


ఎడితనూరు గోదావరి నది, ఉపనది మానేరుకు పిల్ల నదులైన వాగులో ఒకటైన నక్కవాగు ఒడ్డున ఉంది. ఇప్పుడున్న ఎడితనూర్‍ గ్రామానికి ఉత్తరాన కొండల గుంపు ఉంది. ఆ కొండల్లో తూర్పు దిక్కున ఎత్తయిన బండలతో కూడిన ప్రాకారం లాంటిది ఉంది.ఈ గుట్టలను ‘చౌడమ్మగుట్టల’ని పిలుస్తారు. చౌడమ్మ గుట్టలో వున్న ఈ పెట్రోగ్లైఫ్స్ చౌడమ్మ గుడినానుకుని వున్న గుహలో వున్నాయి. గుడిలోంచి ఒక దారి వుంది. గుహలో దక్షిణపు రాతిగోడపై 5 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు కొలతలతో అద్భుతమైన గంటుబొమ్మల వేటదృశ్యం కాన్వాస్‍ వుంది. అన్ని బొమ్మల్ని ఒకే ఫ్రేంలో చెక్కిన కళాత్మకమైన రాతిచిత్రాల పటం. ఈ చిత్రపటంలో పొడవైన కొమ్ములున్న రెండు పెద్ద ఎద్దులు చెక్కబడ్డాయి. బొమ్మల లోపల ఎన్నో చిన్న, చిన్న ఎద్దులు, మనుషుల బొమ్మలు నింపబడి వున్నాయి. ఇట్లాంటి చిత్రాలు అరుదు. మహబూబ్‍ నగర్‍ జూపల్లిలోని పెట్రోగ్లైఫ్స్ కంటె పెద్దవి ఇవి. ఎద్దుల చిత్రాలతో పోలికలున్నాయి.


చిత్రించిన తీరులో అక్కడి కన్నా ఎక్కువ కళాత్మక ప్రతిభ వుంది. చేయి తిరిగిన కళాకారుల సృష్టినే సవాలుచేసే గొప్ప కళాఖండమిది. రెండు ఎద్దులను చుట్టుముట్టిన లేదా ఆరాధనలో వున్న మనుషులను పుల్లగీతలతో (Stick Drawing) చెక్కారు. మొదటి ఎద్దుబొమ్మను పరిశీలనగా చూస్తే అది పిల్ల ఏనుగు ఆకారంలో కనిపిస్తుంది. దాన్ని ఏనుగు బొమ్మగానే భావించారు. కాని అది కొమ్ములు చిత్రించడంలో లోపం వల్ల ఏనుగువలె కన్పడ్డదేమో. ఈ బొమ్మలకాన్వాసులో ఎద్దులలోపల చిత్రించిన బొమ్మలు గీతలతో, చతురస్రాకారాలతో, వివిధ ఆకృతులతో వున్నాయి. వీటినే కృష్ణశాస్త్రి గారు గణితరేఖలుగా భావించారు. గుహలో నలువైపుల పెట్రోగ్లైఫ్స్ చిత్రించబడి వున్నాయి.


ఉత్తరపు గోడలపై ఒక చోట కుక్క, 5 మొనల ఈటె చెక్కబడి వున్నాయి. మరొకచోట అలలవంటి గీతలు, వృత్తాకారాలు, నీటిలో చేప వలె చిత్రించబడివున్నాయి కాని పరిశీలనగా చూస్తే అది ఒక స్త్రీమూర్తిచిత్రమని, ఆమె అమ్మదేవత అయివుండా లనిపిస్తుంది. అన్ని చిత్రాలను కలిపి చూస్తే ఇది ప్రాచీనమానవుని ఆరాధనా ప్రదేశమని తేలుతున్నది. జనుల రాకపోకలు, కూర్చుండడంవల్ల ఇక్కడి బండరాళ్ళు బాగా అరిగి పోయి నున్నబారిపోయి వుంటాయి.
ఇపుడున్న చౌడమ్మదేవతను తర్వాతి కాలంలో ప్రతిష్టించి వుంటారు. దేవతవున్న గుహలో వంద మంది కూర్చునేంత విశాలంగా వుంది. ఈ గుహలో నుండే 6 అడుగుల ఎత్తులో వున్న ఇరుకైన మార్గం నుండే ప్రధాన ఆరాధనాలయమైన ఎద్దుబొమ్మల గుహలోనికి ఒక దారి వుంది. ఈ తొలువుడు బొమ్మల్లో పుల్లగీతల వంటి ఆకృతిలో మనుషులు, చేతి ఆకారాలు, గణిత సంబంధమైన అనేక రూపాలు న్నాయి. అయితే, ప్రపంచంలోని అనేక ఆదిమానవుల ఆవాసాల్లో ఇటువంటి గంటు బొమ్మలు అగుపిస్తుం టాయి. మన దేశంలో లడఖ్‍లో, గోవా-ఉస్గరిమల్‍, తమిళనాడు-పెరుముక్కల్‍, కేరళ-ఎడక్కల్‍ల లోనూ ఈ గంటు బొమ్మలున్నాయి. ఇవన్నీ ఆదిమానవుల ప్రతీకాత్మక (symbolic) రేఖారూప భాషలు.


‘గంగిగోవులబండ
చౌడమ్మగుట్టలోని 17.610942 ఉత్తర అక్షాంశాలు, 78.171787 తూర్పురేఖాంశాలపై ప్రాచీనమానవుని మధ్యశిలా యుగపు, నవీనశిలాయుగపు గంటు బొమ్మలు (Petroglyphs or Rock carvings), ఎరుపురంగు రాతిచిత్రాలు (Rock paintings) వున్నాయి. వీటిని స్టేట్‍ ఆర్కియాలజీకి చెందిన నరహరిగారు మొదట కనుగొన్నారు.
‘గంగిగోవులబండ’ మీద చిన్నపడిగెరాయి కింద ఎరుపు రంగు చిత్రాలున్న చిత్రితశిలాశ్రయ ముంది. లోపలికి దారి చేసుకుని వెళితే గుట్ట అంచున ఒక పడిగెరాయికింద లోపలివైపు రాతి చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రిత శిలాశ్రయం మధ్య శిలా యుగాల (Mesolithic Period) నాటిదిగా తెలుస్తోంది. ఆ చిత్రాలలో వేటలో ఉన్న ఆదిమానవుల చేతుల్లో వలరి, రాగోల వంటి పనిముట్లు బరిసె, వలలున్నాయి. మూపురాలున్న ఎద్దులు, ఆవులు, ఎడ్లబండి, బండి కిరువైపుల ఆవు, ఎద్దు, ఆవుదూడ, తాబేలు బొమ్మలు కన్పిస్తున్నాయి. మరికొన్ని రాతి పెచ్చులూడి వర్షానికి తడిసి పాడైపోయి తేటగా కన్పించడం లేదు. ఈ బొమ్మల వల్ల అప్పటి మనుషులు జంతువులను మచ్చిక చేసుకుని ఉంటారని, వేట, వ్యవసాయాలు తెలిసిన వారై ఉంటారని, ప్రాచీనులనీ తెలుస్తున్నది. ఈ చిత్రాలు నవీనశిలాయుగపు ఆదిమానవ జీవనానికి ఆనవాళ్ళు. జంతువుల వేట నుండి జంతువులను మచ్చిక చేసుకున్న మానవుని నాగరికపు అంతర్దశకు అద్దం పడుతున్న చిత్రాలివి. అక్కడ అనేకచోట్ల రాతిపనిముట్లు గొడ్డళ్ళు, గీకుడురాళ్ళు లభిస్తున్నాయి.


ఈ రాతిచిత్రాలలో ఎద్దుల బండి చిత్రణ గురించి న్యూమెయిర్‍ అనే ప్రసిద్ధ రాతిచిత్రాల నిపుణుడు ప్రత్యేకంగా పరిశోధనాపత్రమే సమర్పించాడు. భారతదేశంలోని రాతిచిత్రాలలో బండ్లు, రథాల మీద అదొక గొప్ప అన్వేషణ. ఒకనాటి పురామానవుల జీవనంలోనికి వచ్చిచేరిన వస్తువులు, వాటి సంస్కృతి, మార్పులు వాళ్ళను ముందుకే ప్రగతివైపే నడిపించాయి. వీటిని అర్థం చేసుకోవడానికి రాతిచిత్రాల పరిశీలన, పరిశోధనలు అవసరం.


చౌడమ్మతల్లి
ఈ ఆదిమానవుల ఆవాసాల నుంచి వెనకకు పోతే 30, 40 అడుగుల ఎత్తున్న ఏటవాలు కొండగుహలలో చౌడమ్మతల్లి వెలసింది. అమ్మ దేవతల ఆరాధనలకు ప్రతీక ఈ చౌడమ్మ దేవత. ఆమె పేరు మీదే ఈ గుట్ట చౌడమ్మ గుట్ట అయింది. ఈ తల్లి గిరిజనుల దేవతే. తర్వాత ఎవరో దుర్గ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లుంది. ఇక్కడ ఏటేటా జాతర చేస్తారు. ఈ గుహాలయం పక్క మరొక సన్నని దోనెలో భైరవుని (బయ్యన్న) విగ్రహం ఉంది. ఈ శిల్పాన్ని బట్టి 5, 6 శతాబ్దాల కిందటిది అనిపిస్తుంది.
చౌడమ్మ, బయ్యన్నల గుళ్ళ ముందరి విశాలమైన వేదిక వంటి బండ మీద కప్పులేని మంటపం ఒకటి వుంది. పడమట శివాలయంగా మార్చబడ్డ ఒక రాతిగూడు ఉంది. లోపల రాష్ట్ర కూటుల నాటి పానవట్టంపై శివలింగం, బయట మెడ తెగిపోయిన ఇసుకరాతి నంది ఆకారం ఉన్నాయి. ఆ పక్కనే చిన్న జలాశయం.
పడమటి వైపు గుట్ట దిగబోతుంటే ఏదులబండగా పిలువబడే నీటి చెలిమె సొరికె ఉంది. దాంట్లోంచి ప్రవహించే నీటితో అక్కడొక రైతు రెండు ఎకరాలు పండించుకుంటున్నాడు. మిగిలిన నీరు కొండదిగి కట్టుకాలువ ద్వారా చెరువులోకి పోతున్నది.


గిరిజన గణరాజ్యం
ఏనుగులలొద్దికివతల ఆ పొలందాటి గుట్టలనడుమ లోయలోకి ప్రవేశించగానే ఎదుట మూడు రాళ్ళ వరుస గుండు కన్పిస్తుంది. అదే గద్ద గుండు. దీని గురించే కాశీపాండ్యన్‍ తన పుస్తకం మరుగున పడ్డ వారసత్వంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ గుండుకు పడమటి వైపు ఎనుపోతు ఆకారం (గీత రూపంలో) చెక్కి ఉంది.
ఈ మహిషం బొమ్మ ఇక్కడ వేలాది ఏళ్ళుగా జీవించి రాజ్యాల నేలిన మహిషగణం-టోటెం, ఒక జాతి చిహ్నం. ఆదిలాబాద్‍లో భైంసా వంటి గ్రామాలైనా, మన వూర్లలోని మైసమ్మలైనా మహిషకుల ప్రతినిధులే కదా! ఎర్థనూరులో వర్ధిల్లిన పురాతన జాతి మహిషకగణంలోనిదని దీని భావం. మేం దీనిని రెండవసారి పరిశీలించినపుడు మరొక మహిషం పెట్రోగ్లైఫ్‍ అగుపించింది. మొదటి మహిషం 30 అంగుళాల ఎత్తు, 50 అంగుళాల వెడల్పులో వుంది. రెండవ మహిషం 26 అంగుళాల ఎత్తు, 33 అంగుళాల వెడల్పుతో వుంది. బొమ్మల్లో సగం వరకు విస్తరించిన పెద్దకొమ్ములతో ఈ రెండు గద్దగుండు బొమ్మలు చరిత్రాత్మకమైనవి. ఎర్థనూరు అతి ప్రాచీనకాలం నుండి ఆధునిక కాలం వరకు వర్థిల్లిన గొప్ప గ్రామం, గిరిజన గణరాజ్యం.


Ancient Society అనే పుస్తకంలో రచయిత మోర్గాన్‍ జాతుల పేర్లు ఆయా జాతుల చిహ్నాలను బట్టి వచ్చాయని, ఈ పేర్లన్నీ పక్షులు, జంతువులవిగానే ఉన్నాయని చెబుతూ, ఆదిమ సమాజాలు ఆటవిక దశలో తమకు పక్షినో, జంతువునో తమ గుర్తు (టోటెం)గా పెట్టుకునే వారంటూ, ఆ గుర్తులతోనే ఆయా గణసముదాయాలన్నీ గుర్తించబడ్డాయనీ రాశారు. ఎడితనూరు గుట్టల వరుస చౌడమ్మ గుట్టనుండి సిద్ధ్దేశ్వరుని గుట్టవరకు 6 గుట్టలుగా విస్తరించి ఉంది. ప్రతిగుట్ట కొక పేరు, వాటి చేరువలో ఆదిమానవుల ఆవాసాల గుహలు అగుపిస్తున్నాయి. చౌడమ్మ గుట్ట, దేవతల కుచ్చె, వెంకన్న గుట్టల మధ్య గద్ద గుండు ఉంది.


దానికి తూర్పు, పడమరలుగా విస్తరించిన విశాలమైన లోయను ఏనుగుల లొద్ది అని పిలుస్తారు. ఈ లోయలో రాజుల కాలంలో ఏనుగుల సంత జరిగేదని పెద్దలు చెబుతుంటే విన్నామని మాకు గైడ్‍గా వచ్చిన యం. నరేందర్‍ తెలిపారు. ఏనుగుల లొద్దిలో కొంత దూరంలో ఒక ringing rock లేదా musical stone ఉండేదట. అది తర్వాత కాలంలో క్వారీ పనుల వల్ల పాడైపోయిందని, దానిమీద నిలబడి రాయిని తొక్కుతూ ఊపితే చప్పుళ్ళొచ్చేవని ఆయన వివరించారు. పూర్వం ఒంటరిగా ఉన్న రాయసగాండ్రు రాయిని ఊపి పుట్టించిన నాదంతో వారకాంతలను తమ ఏకాంత సేవలకు రమ్మని పిలుచుకునే వారట. దానిని గ్రామస్తులు లంజగుండు అని పిలుస్తారు. ఇది ఒకప్పటి ఆదిమానవులు, ఆపై గిరిజనులు వార్తలు పంపుకునే తుడుం వంటి రాతివాద్యమే. ఆదిమానవుల ఆవాసాలున్న ఇట్లాంటి Ringing Stones గల అనేక ప్రాంతాలు తాజాగా వెలుగుచూస్తున్నాయి.
ఇంకా ఇక్కడ ఆ లోయ పరిసరాల్లో పాటిగడ్డలు (పాత ఊరి దిబ్బలు) రెండు చోట్ల కనిపించాయి. అక్కడ మొద్దు పెంకలు, రాతి పనిముట్లు దొరికాయి. నాలుగైదు రక్కసిగూళ్ళు (సిస్త్లు) పెదరాతియుగపు ఆనవాళ్ళుగా మిగిలి కనిపించాయి.


ఆ సమాధులకు ఒక పక్కన చిన్నగుట్ట్ట, గుట్టకొక గుహ. ఆ గుహలో వెంకన్నగా పిలువబడే రెండు చేతుల దేవుడు, కుడి పక్కనే ఒక స్త్రీ మూర్తి ఉబ్బెత్తు బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. దానికున్న ద్వారం చౌడమ్మ తల్లి గుడికున్న మాదిరే చిన్నదిగా ఉంది. పరిశీలనగా చూస్తే ఆ దేవుడి చేతిలో శంఖుచక్రాలు లేవు. ఫలమో, తామర మొగ్గో ఉన్నట్టుగా ఉంది. ఏదైనా, జైనయక్షిణులై ఉండొచ్చు! అక్కడికి దగ్గరలో రెండు నాగయక్షిణుల బొమ్మలు దొరికాయి. ఇక్కడున్న గుహాలయాల్లో మరొకటి సిద్ధేశ్వరుని గుట్టపై ఉంది. ఇప్పుడా గుడిలో శివలింగం లేదు. ముస్లింల సమాధి రాయొకటి, ఊదు పాత్రలు ఉన్నాయి. రాజులు మారినప్పుడల్లా వారి మతాధిపత్యాలు కూడా మారిపోతాయి, దేవుళ్ళు కూడా, అనిపించింది, చూస్తుంటే!
ఎడితనూరు గ్రామానికి వాయవ్యాన వున్న చెరువుకు అంచున జంగిడి గుళ్ళుగా పిలువబడే చోట రెండు వీరగల్లున్నాయి. ఇద్దరు గిరిజన వీరుల, (స్త్రీ, పురుషుల) వీరగల్లులలో విల్లమ్ములు, గొడ్డలి ఆయుధాలున్నాయి. తలకట్టు, ఆభరణాలు గిరిజన సంప్రదాయాలే. మరొక వీరగల్లు 6, 7 శతాబ్దాల కాలం నాటి ఆహార్యం ధరించిన వీరుని స్మారకశిలగా ఉన్నది.


జంగిడిగుళ్ళు అనగానే మా ఊళ్ళో మా చిన్నప్పుడు బలాదూరుగా తిరిగే పిల్లల్ని ఏమిరా! మిమ్మల్ని జంగిడి కొదిలిన్రా అనేవాళ్ళు. జంగిడికి విడవడం అంటే జన్నె (యజ్ఞం) కొదిలిన అర్థంలో దేవుడికి అంకితం చేసినట్టా లేక జంగిడి అంటే జంగల్‍ (అడవి) అనే అర్థంలోనా? ఆలోచించాల్సిన మాటే! ఎడితనూరు వేలయేళ్ళుగా వర్థిల్లిన గిరిజన రాజ్య కేంద్రమని, పాతరాతి యుగం నుండి ఆధునిక రాజ్యాలదాకా చారిత్రిక కాలాన్ని తనలో దాచుకుని రాతిపుటల్లో రాసుకున్నదని ఈ ఊరిని సందర్శించిన వాళ్ళకెవరికైనా అనిపిస్తుంది.


ఈ ఊరిలో ఎక్కడా శాసనాలు లభించలేదు. కాని, ఊరికి దక్షిణాన చెరుకు తోటలో ఒక శిథిల దేవాలయం బయటపడింది. ఆలయ ద్వారబంధం మీద వేణు వూదుతున్న కష్ణుడు, ఇరువైపుల గోపికలు, గోవులు అందంగా చెక్కబడి ఉన్నాయి. అంతరాళం పూర్తిగా తవ్వేయబడి ఉంది. ఆ ద్వారానికి ఆరాకుల పువ్వు చెక్కబడి ఉంది. ఇట్లాంటి చిహ్నాలే ఉన్న ఆలయాలు రాష్ట్రకూటుల కాలం నాటివని, వర్గల్‍లో కూడా ఇట్లాంటి గుర్తులున్నాయని మా గురువు విరువంటి గోపాలకష్ణ (కొలనుపాక) చెప్పారు.
ధన్యవాదాలు: మాకు గైడ్‍గా వచ్చిన ఎడితనూర్‍ గ్రామస్తుడు యం.నరేందర్‍ బ•ందానికి.

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *