గౌరాదేవి – చిప్కో ఉద్యమ బీజం

ఈ అడవి మా తల్లిగారిల్లు అన్నారు ఆ తల్లులు. ఈ ఇంటి నుంచే మేం కట్టెపుల్లలు తెచ్చుకుంటాం. గడ్డికోసుకుపోతాం. మూలికలు ఏరుకుంటాం. ఈ ఇంటి నుంచే కూరలు, కాయలు, పండ్లు ఫలాలు సంపాదించుకుంటాం. ఈ అడవిని నరొకొద్దన్నారు. ఈ అడవిని కొట్టివేస్తే కొండచరియలు విరిగి మా ఊరి మీద పడతాయి. వరదలొస్తాయి. మా పొలాలు కొట్టుకుపోతాయి. మా తల్లిగారింటిని ధ్వంసం చేయొద్దు. మా ఇల్లు కూల్చొద్దు అన్నారా మహిళలు. ఆ అన్నవారితో ఏభై ఏళ్ల గౌరాదేవి ఉంది. అట్లా పలికిన వారిలో యాభై రెండేళ్ల మూంగాదేవి ఉంది. బాలదేవి, రూప్సా బాడి, మూసి, హర్కి, మాల్మతి, ఫగుణ లాంటివారు మొత్తం గౌరాదేవితో కలిపి ఇరవై ఒక్క మంది. ఏడుగురు ఆడపిల్లలు అడవులను నరుక్కుపోయే, ఆరణ్యాలను మాయం జేసే ముఠాలకు కాంట్రాక్టర్లకు ఎదురు నిలిచారు. సంఘర్షించారు. అవమానితలయ్యారు. అయినా అదరక బెదరక తలపడ్డారు. అదొక చరిత్ర అయ్యింది. పర్యావరణ
ఉద్యమాలకు, పోరాటాలకు, ప్రతిఘటనలకు తలమానికంగా నిలిచిన చిప్కో ఉద్యమమైంది. వారికి మార్కస్ తెలియదు. లెనిన్‍ ఎరుగురు. గాంధీ, వినోబా బావేలూ తెలియరు.
ఎప్పుడు చిప్కో ఉద్యమం ప్రస్తావనకు వచ్చినా రెండేరెండు పేర్లు ప్రముఖమంగా వినిపిస్తాయి. ఒక పేరు సుందర్‍లాల్‍ బహుగుణ అయితే, రెండవ పేరు చండీప్రసాద్‍ భట్‍. ఇద్దరూ ఇద్దరే. పర్యావరణ ఉద్యమ చరిత్రలో చిరఃస్మరణీయులే. పర్యావరణ పోరాటాలకు పర్యాయపదాలుగా ఉన్నవారే. అయినప్పటికీ చిప్కో ఉద్యమం గురించి శేఖర్‍ పాఠక్‍ ప్రజల చరిత్రగా అభివర్ణించి మరుగున పడ్డ అనేక విషయాలను తన పరిశోధనాత్మక గ్రంథం ‘ది చిప్కో మూమెంట్‍’ను వెలువరించాడు. ఎన్నో విలువైన విషయాలను పాఠక్‍ ఈ గ్రంథంలో వివరించాడు.
మార్చి 26 నాడు హిమాచల్‍ ప్రదేశ్‍ నుండి కూలీలు పదిగంటల ప్రాంతంలో జోషీమర్‍ నుండి రేని గ్రామానికి బస్సులో బయలు దేరారు తమను గుర్తు పట్టకుండా తలపాగాలు తగిలించుకున్నారు. బస్సు కిటికీలకు పరదాలు కట్టుకున్నారు. వారి వెనుక అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులూ జీపులో అనుసరిస్తూ బయలుదేరారు. గ్రామ ప్రజల కంట పడకుండా అడవికి ప్రధాన రహదారి ద్వారా కాకుండా రిషిగంగా నది ఒడ్డున దారి ద్వారా అడవికి చేరాలి.
వారు అడవికి వెళుతున్న సంగతిని రేని గ్రామంలోని ఒక బాలిక చూసింది. గ్రామంలో పురుషులు ఎవరూ అందుబాటులో లేరు. ఎవరో అపరిచితులు అడవి దిశగా సాగుతున్నారనే విషయం ఎవరికి చెప్పాలి. మహిళా మంగళ్‍దళ్‍ పెద్ద దిక్కైన గౌరాదేవికి తాను చూసిందేమిటో వివరించి చెప్పింది. గ్రామంలో చిప్కో కార్మికులు పెట్టే సమావేశాల్లో వెనకెక్కడో కూర్చునే స్త్రీలు మహిళాదల్‍ సభ్యులు అటువంటి సమావేశాలకు గౌరాదేవి పెద్దగా హాజరయ్యేది కాదు. కొడుకు మాత్రం అటువంటి సమావేశాలకు వెళ్లేవాడు.
రేని గ్రామంలో పదకొండు గంటల సమయమంటే ప్రతీ ఇంట్లోనూ వంట చేసే పనులను స్త్రీలు మొదలెడతారు. తన పనులను విడిచి పెట్టి గౌరాదేవి కొంతమంది తోటి మహిళలను కూడదీసింది. కార్పెట్‍ నేతలో మునిగిన ఓ స్త్రీ తన నేత ఆపింది. ఇస్త్రీ చేస్తున్న మహిళ ఒకరు పనిని ప్రక్కకు పెట్టింది. ఒకామె వండుతోంది. ఇంకొకరు పిల్లకు నీళ్లు పోసుకుంటోంది. తమ తల్లుల హైరానా, వడివడిగా నడుస్తూ పోవటం చూసిన ఏడుగురు ఆడపిల్లలు తల్లుల వెనకే పరుగుపెట్టారు. గౌరాదేవితో పాటు ఆ మహిళలు కూలీలు ఎక్కడ జమయ్యారో అక్కడికి అడ్డదారిలో చేరుకున్నారు. కూలీలు వంటలు చేసుకోవడంలో మునిగి ఉన్నారు. కాంట్రాక్టరు తరఫున పనిచేసే క్లర్కులు అటవీ శాఖ ఉద్యోగులు ప్రణాళికలు వేస్తున్నారు. చెట్లు కొట్టడానికే వాడే పనిముట్లు, ఇతర సాధనాలు నేలమీద పరచి ఉన్నాయి.


కొండ ఎక్కుతూ వచ్చిన మహిళలు ఆయాసంతో వేగంగా శ్వాస తీసుకుంటున్నారు. గుమస్తాలు, అటవీ సిబ్బంది వీరిని చూసి కొంత వెనక్కి తగ్గారు. కానీ వాళ్లు తమ ఆశ్చర్యాన్ని బయటకు వ్యక్తం కానీయలేదు. హిమాచల్‍ నుంచి వచ్చిన కూలీలు ఆశ్చర్యపోయారు. అప్పుడా స్త్రీలు చెప్పిన మాట చెట్లు కొట్టొద్దు. చెట్లను కొట్టనీయం.
తల్లులు కనుక కూలీలు వంటవండుకోవటం చూశారు. వండుకున్నవి తిని కొండ దిగి వెళ్లిపోండి అని సూచించారు. తమ పనిని అడ్డుకుంటున్నందుకు కాంట్రాక్టరుకు చెందిన వ్యక్తులు అటవీ ఉద్యోగులు తాగి ఉండటం చేత గౌరాదేవితో వచ్చిన మహిళలను దూషించారు. బెదిరించారు. అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఆ సిబ్బందిలో ఒకరి దగ్గర తుపాకీ కూడా ఉంది ఆ గన్‍ మాన్‍ తమవైపు తూలుతూ రావటం చూసి గౌరాదేవి అతడికి ఎదురునిలిచి ‘‘నన్ను ఇక్కడ కాల్చి, నా తల్లిగారి ఇల్లైన ఈ ఈడవిని కొట్టి తీసుకుపో’’ అని గర్జించింది. ఆమెకు దిగువన రిషిగంగా ప్రవాహం. ఆమెకు ఎగువన పర్వతాలు ఆమె విసిరిన సవాలు అక్కడి వారినందరినీ నిశ్శబ్దంలోకి నెట్టింది. ఉత్తరాఖండ్‍ చరిత్రలో అదొక అసాధారణమైన రోజు. ఆ రోజు మార్చి 26, 1974 ఒక గౌరాదేవి ఒక్కరే మాట్లాడలేదు. ఉత్తరాఖండ్‍తో పాటుగా దేశంలోని అటవీ సంపదమీద ఆధారపడి బ్రతుకులు వెళ్లదీసే వారంతా మాట్లాడినట్లైంది. ఈలోపు గ్రామంలోని మిగతా మహిళలంతా అక్కడికి చేరుకున్నారు. అడవులు నరకడానికొచ్చిన కూలీలు రేషన్‍ కొండపైకి తీసుకురావటం చూశారు. ఆ మహిళలు వారిని అక్కడే ఆపి, భోజనం చేశాక కొండ దిగి రమ్మని చెప్పారు. అడవికి చేర్చే దారిని సిమెంటు దిమ్మలు పగలగొట్టి మూసివేశారు. ఆ దారిలో సమీప వంతెన దగ్గర 1800 బ్యాగుల రేషన్‍ రోడ్డు పక్కన ఉండటమూ చూశారు. అంటే ఆ అడవిలో కలపను ఎంతగా కొట్టివేయడానికి సిద్ధపడ్డారో గమనించవచ్చు. అడవికి వెళ్లేదారిలో జంక్షన్‍ వద్ద మహిళలు బైఠాయించారు. కాంట్రాక్టర్‍ మనుషులు ఆ సాయంత్రం గౌరాదేవిని ప్రక్కకు పిలిచి బెదిరించారు. ఆమెపై ఉమ్మివేశారు. అయినా ఆమె చలించలేదు. మౌనంగానే వారి దూషణలను అవమానాలను సహించింది. ఆ రాత్రంగా ఆ మహిళలు అక్కడే కూర్చుని అడవికి కాపలా కాశారు. నందాదేవి, ఇతర స్థానిక దేవతల గురించి పాటలు పాడుకున్నారు. వారేమీ నినాదాలు ఇవ్వలేదు.


దౌల నది వెనక ఉన్న పర్వత శిఖరాగ్రం మీంచి సూర్యుడు ఉదయించాడు. అది 1974 మార్చి 27. ఉదయం తొమ్మిదిగంటల ప్రాంతంలో నాయకులు రావటం మొదలైంది. జోషిమర్‍ నుంచి గోవింద్‍సింగ్‍ రానర్‍, గోపేశ్వర్‍ నుండి చండీప్రసాద్‍ తదితర నాయకులు వచ్చారు. వారినందరినీ ఆ మహిళలు స్వాగతించారు. వారిలోంచి గౌరాదేవి ముందుకు వచ్చి ‘‘మేం ఏది చేయాలో అదే చేశాం. మాకు పశ్చాత్తాపం లేదు. మేమేమీ భయపడనూ లేదు. హింస లేదు. ఎవరూ ఎవ్వరినీ కొట్టలేదు. మేం వాళ్లతో హుందాగానే మాట్లాడాం. ఒక వేళ పోలీసులు అరెస్టు చేస్తే అందుకు మేం భయపడం. మేం మా పుట్టింటిని కాపాడుకున్నాం. మా పొలాలు, నేలను రక్షించుకున్నాం’’ అని పలికింది. జరిగిన సంఘటనలను మహిళలు వచ్చిన నాయకులకు వివరించారు. మిగతాది అంతా పర్యావరణ
ఉద్యమ చరిత్ర.
చిప్కో ఉద్యమం భారతీయ అటవీ విధానాలపై పెద్ద చర్చనే లేవనెత్తిందంటారు రామచంద్ర గుహ. వ్యాపార ధోరణుల సంకుచితత్వాన్ని ఎత్తి చూపించి కొద్దోగొప్పో చిప్కో ఉద్యమ మూలంగానే ప్రభుత్వాలు అటవీ ఉత్పత్తులమీద దృష్టి నిలుపగలిగాయి. చిప్కో ఆకస్మికంగా పుట్టుకొచ్చిన ఉద్యమం కాదు. వేలాది సంవత్సరాలుగా గ్రామీణ ప్రజల నియంత్రణలో ఉన్న వనరులను ఎవరికో ధారాదత్తం చేస్తుంటే ప్రతిఘటిస్తూ వచ్చిన శతాబ్దాల పోరాట చరిత్రల సంగమస్థితి. గౌరాదేవి లాంటి మహిళలు మన చుట్టుప్రక్కల కూడా ఉండే ఉంటారు. వారికి అండగా నిలబడటమంటే ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నిలవటంకాదు. ప్రకృతికి అనుకూలంగా స్పందించటం ప్రతిస్పందించటం.

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *