కొల్లాపురం సంస్థానం

తెలంగాణ లోని ఏ ప్రాచీన చారిత్రక ప్రదేశాన్ని చూసినా దాని వెనక వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఆనాటి రాజులు రాజ్యాలు, సంస్థానాలు సంస్థానాధీషులు, కళలు సాహిత్యాలు, పరిపాలనా రీతులు నీతులు నేటి ఆధునిక ప్రపంచ జీవితానికి పునాదులుగా నిలబడతాయి, అట్లా నిలబడే వాటిలో సంస్థానాల సంస్థానాధీషుల పరిపాలన ప్రధానమైనది. తెలంగాణ లోని ప్రసిద్ధి చెందిన సంస్థానాలకు మహోన్నత చరిత్ర ఉంది. అలా ప్రసిద్ధి చెందిన సంస్థానాలలో కొల్లాపురం సంస్థానం ఒకటి. ఈ సంస్థానం ప్రస్తుతం తెలంగాణలోని నాగర్‍కర్నూల్‍ జిల్లాలో ఉంది. దీని వైశాల్యం 191 చ.మై. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరివాహక ప్రాంతంగా ఉన్నది.


పూర్వం జటప్రోలు సంస్థానానికి కొల్లాపురం రాజధాని, సురభి లక్ష్మారాయ బహద్దూర్‍ వరకు అంటే సుమారు క్రీ.శ. 1840. వరకు వీరి రాజధాని జటప్రోలు. వీరి కాలం నుండి రాజధాని కొల్లాపురంకు మారింది. అప్పటి నుండి కొల్లాపురం సంస్థానంగా పేరొంది ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా కొల్లాపురం సంస్థాన ప్రభువులుగానే ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో పెంట్లవెల్లి రాజధానిగా పాలన సాగించారు.


సురభి వంశస్తుల పూర్వీకులు దేవరకొండ (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. వీరు మొదట్లో జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీషుల కళాభిరుచిని చాటుతున్నాయి. ఇది మొదట విజయనగర చక్రవర్తులకు చివరి నిజాం ప్రభువుకు సామంతరాజ్యంగా ఉంది. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత, హైదరాబాద్‍ పోలీస్‍ చర్య జరిగి తెలంగాణంలోని సంస్థానాలు భారత్‍లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్‍ మెజిస్ట్రేట్‍ అధికారాలతో ఉంది. తెలంగాణలోని గద్వాల, వనపర్తి, కొల్లాపురం మొదలైన సంస్థానాలు సివిల్‍ మెజిస్ట్రేట్‍ అధికారంలో ఉన్నవి. నిజాం ప్రభువులు తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించి సర్వజన సమ్మతమైన పాలనను అందించాయి.


ఈ సంస్థాన పాలకులు రాచవెలమ తెగకు చెందినవారు. సురభి వీరి ఇంటి పేరు. వీరి గోత్రం రేచెర్ల. వీరి మూలపురుషుడు పిల్లలమర్రి బేతాళనాయుడు అని పిలువబడే చెవిరెడ్డి. ఈయన కాకతీయ చక్రవర్తి గుణపతి రుద్రదేవుని పరిపాలన కాలం వాడు. ఇతనికి తొమ్మిదవతరం వాడైన అనపోతనాయడు క్రీ.శ. 1243 కొల్లాపురం సంస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేసాడు. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార’, ‘పంచపాండ్య దళవిధాళ’, ‘ఖడ్గనారాయణ’ అనే బిరుదులు ఉన్నాయి. వీరు ఈ ప్రాంతంలో ఉన్న చిన్నమరూరు, పెంట్లవల్లి, వెల్లూరు మొదలగు గ్రామల్లో కోటలు కట్టి, చెరువులు త్రవ్వి, దేవాలయాలు కట్టించి సుమారు రెండు వందల సంవత్సరాల క్రింద ప్రస్తుతమున్న కొల్లాపురం రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. వీరిలో బేతళ నాయుని తరువాత చెప్పుకోదగ్గ పరిపాలకులలో దామానాయుడు, చెన్నమనాయడు. సింగమ నాయడు, అనపోతా నాయుడు, మాధవరావు, ధర్మానాయడు, తిమ్మానాయడు, పెద్దినేడు మల్లభూపతి, జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు మొదలగు వారు చెప్పుకోదగ్గవారు.


వీరిలో మాధవరావు తరువాత పరిపాలనకు వచ్చిన రెండవ జగన్నాథరావు అనేక కోటలను కట్టించి పాలన కొనసాగించాడు. ఈయన 1871 ప్రాంతంలో చంద్రమహల్‍ అనే రాజప్రసాదాన్ని నిర్మించాడు. అక్కడి నుండే రాజ్యపాలన చేసాడు. ఈయన తరువాత వచ్చిన సురభి వెంకటలక్ష్మారావు గొప్ప పరిపాలనదక్షుడుగా పేరు పొందాడు. కొల్లాపురం సంస్థానంలో గొప్పగా చెప్పుకోదగ్గ వారు రాజా వెంకటలక్ష్మారావు. ఈయన గొప్ప షికారి (వేటగాడు). ఈయన వేటలో చంపిన పులులను, సింహాలను ఫోటో తీయించి రాజ ప్రసాదంలో ఉంచేవాడు. ఈయనే కొల్లాపురంలో సుందరమహల్‍ నిర్మించాడంటారు. ఈయన పరిపాలన కాలంలోనే కొల్లాపురం సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దబడ్డది.


కొల్లాపురం సంస్థానాధీషులు కళలు, సాహిత్యం, ఆయుర్వేదం లాంటి అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కృష్ణా ఉపనదిపై లక్ష్మారావు పేరు మీద లక్ష్మాసాగర్‍ ప్రాజెక్టు నిర్మించారు. మంచాలకట్టలో మాధవస్వామి ఆలయం, సింగపట్నంలో లక్ష్మీ నరసింహసాగర్‍ అనే పెద్ద చెరువును నిర్మించారు. దీనికి ఆనుకునే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇది పెద్ద పుణ్య క్షేత్రం. ఈ ఆలయం సమీపంలో ఉన్న చెరువును ‘సింగపట్నం శ్రీవారి సముద్రం చెరువు’గా పిలుస్తారు. ఈ చెఱువుకు ఎదురుగా ఉన్న గుట్టపై లక్ష్మీదేవమ్మ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పేరుమీదుగానే ఆ గుట్టను లక్ష్మీదేవమ్మ గుట్ట అని పిలుస్తారు. కొల్లాపురం ప్రభువులు లక్ష్మీదేవమ్మను దర్శించుకొనుటకు వచ్చి ఇక్కడే విడిది చేసేవారు. అందుకోసం సుందరమైన భవనాలని నిర్మించారు.


సింగపట్నానికి 6 కి.మీ దూరంలో ఎత్తైన గట్టు ఉంది. ఆ గట్టు మీద రామస్వామి ఆలయం ఉంది. దానిని కొల్లాపురం ప్రభువులే నిర్మించారని చెప్తారు. సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, సోమశిల ప్రాంతంలో వీరు కట్టించిన దేవాలయాలు శ్రీశైలం డ్యామ్‍ కట్టడం వల్ల వెనకకి వచ్చిన నీళ్ళలో మునిగిపోతుండడం చేత వాటిని అక్కడి నుండి తొలగించి జటప్రోలు, కొల్లాపురం, సోమశిలలో పునఃనిర్మించారు. విమానయానం కోసం కొల్లాపూర్లో జఫర్‍ మైదానం నిర్మించారు. ప్రస్థుతం ఇందులో జూనియర్‍ కళాశాల కొనసాగుతుంది. రాజువారి కోటలో ఒక పెద్ద గంట వుండేది. ప్రతి గంటకు ఒక సారి దీనిని కొట్టేవారు. ఇది సమయ సూచి. ఈ గంట శబ్దం కొల్లాపురం మొత్తం వినిపించేది.


అంతేకాక వీరు కవులను, కళాకారులను పోషించటమే కాక వేదశాస్త్ర పండితులను. సంగీత న•త్యాది లలిత కళానిపుణులను సన్మానించి విజ్ఞాన, వినోద, వికాసాలకు కారణమయ్యారు. సంస్థానాధీషులలో కొందరు సాహితీ సంస్థలకు, గ్రంథ ప్రచురణ సంస్థలకు విరాళాలు ఇచ్చి తెలుగు భాషా సాహిత్యాలను పోషించారు. కొల్లాపురం సంస్థానంలో ఉన్న కవి పండితులనే కాక ఇతర ప్రాంత కవి పండిత గాయకులను గౌరవించి సన్మానించారు. కొల్లాపురం సంస్థానాదీషుల్లో కొందరు కవి పోషకులే కాక స్వయంగా కవులు కూడ.


ఈ సంస్థానంలో సర్వజ్ఞ సింగభూపతి కాలం నుండి చివరి సంస్థానాధీషుల వరకు సాగిన నిరంతర సాహితీసేవ ప్రసిద్ధమైనది. ముమ్మడి మల్లభూపాలుడు ఎలకూచి బాలసరస్వతి (క్రీ.శ. 1610-1670) తెలుగు అనువాదం చేసిన సుభాషిత త్రిశతికి కృతిభర్త, నీతిశతకంలో ‘‘సురభి మల్లా నీతి వాచస్పతీ’’ అనీ శృoగార శతకంలో ‘‘సురభీముల్లా మానినీ మన్మథా.’’ అనీ వైరాగ్య శతకంలో ‘‘సురభీమల్లా వైదుషీ భూషణా’’ అనే మూడు మకుటాలతో రూపొందిన మత్తేభ శార్దూల వృత్తాలలో ఉన్నది. ఎలకూచి బాలసరస్వతి ఈ త్రిశతిని మల్లభూపాలుని కోరిక మేరకు భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషితాలను తెలుగు చేసి గొప్ప పారితోషికాన్ని పొందాడు. ఈ విషయం అందులోని పద్యంలో చూడవచ్చు.


శా. ‘‘శ్రీమద్బాలసరస్వతీ ప్రకటలక్ష్మి హేతువై, శాంతమై
ఆమోదావహమై, నిజానుభవ వైద్యంబై, అనే హోదిగా
ద్యామేయ ప్రవిబోధ రూపమహితంబై యొప్పుతేజంబు ప్రా
పై మీకున్‍ సిరులిచ్చుతన్‍ సురభిమల్లా! నీతివాచస్పతీ!’’ (సంస్థానముల సాహిత్య సేవ, పేజి 25)


ఈ త్రిశతిని శ్రీ సురభి వేంకట లక్ష్మారాయ బహద్దూరు గారు శ్రీ కందుకూరి విరేశలింగం గారి చింతామణిలో ముద్రింప జేసాడు. అంతేకాక ‘చంద్రికాపరిణయం’, ‘మల్లభూపాలీయం’, ‘సురభివంశచరిత్ర’ లాంటి గ్రంథాల్ని ఈయనే అచ్చు వేయించాడు. ఈయన ధర్మపత్ని రాణి వేంకటరత్నమాంబ సంస్థాన మహారాణిగా ఎందరో కవి పండితులను పోషించింది. శ్రీ వనం సీతారామశాస్త్రిగారు ఆస్థాన కవిపండితునిగా అనేక శాస్త్ర విషయాలు చర్చించేవారు. మహారాణి గారి పోషణలో ఉన్న పండితులు సింగపట్నం ఓరుగంటి లక్ష్మీనారాయణ శాస్త్రి, పల్లా చంద్రశేఖర శాస్త్రి, శ్రీధర కృష్ణశాస్త్రి ముఖ్యులు, రాణీగారే వీరి కావ్యాలను అచ్చువేయించారు. ఆంధ్రాస్థానకవి, కవిసార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వీరి అభిమానాన్ని పొంది ఇతోధికంగా ఆర్ధిక సహాయం పొందాడు. మల్లభూపాలుని నాల్గవ భార్య వెంకటాంబ కొడుకు చినమల్లన్నపతి, ఈయన భార్య చెన్నాంబకు రామరాయుడు, మల్లభూపతి, మాధవరాయలు అని ముగ్గురు కొడుకులు, మాధవరాయడు రాసిన ‘చంద్రికా పరిణయం’ శ్లేష చమత్కార ప్రౌఢ ప్రబంధము. ఇది రామరాజ భూషణుని వసుచరిత్రకు దాదాపు సాటిరాగలిగిన ప్రౌఢ ప్రబంధం అని పండితులంటారు. మాధవరాయల కొడుకు నరసింగరావు ‘క్షత్రఖేలన’ అనే గ్రంథాన్ని రాసాడు. ఈయన కుమారుడు ‘శూద్రస్కృతి’ అనే సంస్కృత గ్రంథాన్ని రాసాడు.


లక్ష్మారాయ మనుమడు అయిన వేంకటలక్ష్మారావు (క్రీ.శ. 1850-1883) గారి కాలంలో ఈ సంస్థానంలో విద్వత్కవులు అనేక మంది సాహితీ సమారాధన చేసారు. కవితార్కిక సింహ మంచాలకట్ట గోవిందాచార్యులు, కవి కంఠీరవ కృష్ణమాచార్యులు, వైయాకరణ గజకంఠీరవ యణయవల్లి కృష్ణమాచార్యులు, వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రి, అక్షింతల సింగరశాస్త్రి. అక్షింతల సుబ్బాశాస్త్రి మొదలగు పండిత కవులు కొల్లాపురం ప్రభువుల పోషణలో ఉన్నవారే.


ఈ విధంగా రాజ్యవిస్తరణలో, పరిపాలన నిర్వహణలో సాహిత్య పోషణలో కొల్లాపురం సంస్థానానికి సుధీర్ఘమైన చరిత్ర వుంది.


ఉపయుక్త గ్రంథ సూచిక
1) సంస్థానములు – సాహిత్య పోషణ, ఆచార్య తూమాటి దొణప్ప ఆంధ్ర విశ్వకళా పరిషత్తు- 1969
2) గోల్కొండ కవితా సంచిక
3) కాకతీయ కవితా సంచిక
4) సంస్థానముల సాహిత్య సేవ శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‍ – 2012
5) The Ruling chiefs, Nobles & Zamindars of India, A. Vadivelu, 1915


-డా।। కె.కృష్ణమూర్తి
ఎ : 8500167845

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *