
జీవ వైవిధ్యం సమస్త ప్రకృతికి సంబంధించిన విలువైన ఒక విలువ. భూమి, గాలి, నీరు అడవుల వంటి సహజ సిద్ధమైన ప్రకృతి వనరుల ఆధారంగానే సకల మానవజాతి, జీవరాశుల మనుగడ సాగుతున్నది. ప్రకృతి అందిస్తున్న అందమైన జీవితాన్ని అందిపుచ్చుకోవడం కాకుండా తన గుప్పిట పట్టుకుని తన ఒక్కరి జేబులోనే వేసుకోవాలనే అత్యాశ మనిషిని, మనిషి జీవితాన్ని వికృతం చేస్తుంది. అడవి ఆదివాసులకే పరిమితమై ఉన్నప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదు. జీవ వైవిధ్యానికి ముప్పు రాలేదు. ఆదివాసులూ, అడవిలోని సకల జీవరాశుల మధ్య వైరుధ్యాలతో పాటు కలసి మెలసి జీవనం సాగింది. అడవిలోనూ, అడవి బయటా అంతటా పచ్చదనమే.
ఎప్పుడైతే ఆధునిక మానవుడు, కార్పోరేట్ వ్యాపారీ అడవిలో పాదం మోపారో అప్పుడే అడవితల్లి జీవన ధ్వంసం ప్రారంభమైంది. అడవుల నరకివేత వివిధ జీవరాశులను నిరాశ్రయుల్ని చేసింది. అడవుల నరికివేతవల్ల వాతావరణ మార్పులు జరిగి విపరీత వర్షాలు, వరదలు, కొండ చరియలు పడిపోవడం భారీ ప్రాజెక్టుల వల్ల నదీ ప్రాంతాల నేలలు నిస్సారమవడం, భూకంపాలు, స్థానిక ప్రజలు నిరాశ్రయులవటం, ఒక అజమాయిషీ లేని పారిశ్రామిక విధానాల వల్ల పరిశ్రమలు కల్పిస్తున్న జలకాలుష్యం, వాయు కాలుష్యం వంటి వాటి వల్ల పర్యావరణ సమతుల్యత నాశనమవుతున్నది. జీవ వైవిధ్యాన్ని వివిధ వ్యవస్థలూ, విధానాలూ తారుమారు చేస్తున్నాయి.
ప్రజల భద్రత పట్ల, జీవరాశుల భద్రత పట్ల జవాబుదారీతనం లేకుండా పోతున్నది. ఈ పద్ధతిని నివారించాలంటే బలమైన పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు ఒక్కటే మార్గం. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1730లో భీష్ణాయ్ ఉద్యమం జరిగింది. రాజు తన సౌధ నిర్మాణం కలప కోసం చెట్లను నరికించే ప్రయత్నం చేయగా అమృత అనే మహిళా నాయకత్వంలో 356 మంది మహిళలు చెట్లను కావలించుకుని ‘ముందు మమ్మలి నరకండి. తరవాత చెట్లను నరకండి’ అని నిలబడ్డారు. ఆ సైనికులు వాళ్లందరినీ నరికి తర్వాత చెట్లను నరికారు. రాజు నివ్వెరపోయి చెట్లు నరికివేతను నిషేధించాడు. ఈ సంఘటన ప్రేరణతో తరువాత అనేక ఉద్యమాలు జరిగాయి. 1973 సుందర్‍లాల్ బహుగుణ నాయకత్వంలో చిప్కో ఉద్యమం మొదలైంది. చిప్కో అంటే హత్తుకోవడం, ఆలింగనం చేసుకోవడం అని అర్థం. చిప్కో ఉద్యమానికి గిరిజన మహిళ గౌరాదేవి కూడా నాయకత్వం వహించింది. చిప్కో ఉద్యమం ప్రపంచ వ్యాప్త
ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. చిప్కో మొదలు మన సోంపేట వరకు దేశవ్యాప్తంగా ఇరవై
ఉద్యమాలు జరిగాయి. అన్ని శాంతియుతంగా అహింసా పద్ధతుల్లో జరిగాయి.
మానవ ప్రవర్తన ద్వారాగానీ, పాలనా విధనాల వల్ల గానీ ప్రకృతి సహజ వనరులకు హాని జరగకుండా కాపాడుకోవాలి. అడవుల నరికివేత, ఖనిజ సంపద కోసం తవ్వకాలు, భారీ ప్రాజెక్టుల నిర్మాణాల మీద నియంత్రణ ఉండాలి. జల, వాయు కాలుష్యాలకు తావులేని పారిశ్రామిక విధానాలు అవలంభించాలి. వాతావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటటం, చెరువుల నిర్మాణాలు, ఎత్తిపోతల వంటి పథకాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు లేని సేంద్రియ వ్యవసాయం కోసం కృషి చేయాలి.
జీవ వైవిధ్యం మనిషి మనుగడకు అత్యంత అవసరం. ప్రకృతిని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత
ఎడిటర్
(మణికొండ వేదకుమార్)