మంత్రి శ్రీనివాసరావు

నిజాం కళాశాలలో సాధారణ విద్యార్థిగా ఓ తెలంగాణ యువకుడు చదువుతోపాటు నాటకాలపై దృష్టి సారించాడు. ఆ అభిరుచి అంతటితో ఆగిపోకుండా లండన్‍ వెళ్ళి నాటక రంగంలో అధ్యయనం చేసేలా బాటలు వేసింది. నటశిక్షణలో ఉన్నత విద్యనభ్యసించిన ఆయన తెలుగు నాటకం రంగంలో ఆధునిక నాటక ప్రయోగాలకు మార్గదర్శకుడయ్యాడు. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఏర్పడిన రంగస్థలం విభాగానికి యూనివర్శిటీ స్థాయిలో అధిపతి అయ్యారు. ఆయన ఎవరోకాదు మంత్రి శ్రీనివాసరావు.
మంత్రి శ్రీనివాసరావు రంగారెడ్డి జిల్లా కందుకూరు సమీపంలోని బచ్చుపల్లిలో మంత్రి రామచంద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులకు 1928 జనవరి 1న జన్మించారు. ఆయన పాత నగరంలోని ముఫీద్‍-ఉల్‍-ఆలం హైస్కూలులో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత నిజాం కళాశాలలో ఇంటర్‍, డిగ్రీ, మాస్టర్‍ డిగ్రీలను పూర్తిచేశారు. అప్పట్లో నిజాం కళాశాల గొప్ప సాంస్క•తిక కేంద్రంగా వర్థిల్లేది. అక్కడ అధ్యాపకుల ప్రోత్సాహంతో విద్యార్థులు షేక్‍స్పియర్‍, బ్రెక్ట్, చెకోవ్‍ల ఆంగ్ల నాటకాలను నిజాం కళాశాల వార్షికోత్సవాల్లో విరివిగా ప్రదర్శించేవారు. ఈ నేపథ్యమే కళాశాలలో చేరిన మంత్రి శ్రీనివాసరావుపై ఫ్రభావం చూపింది. 1945లో నిజాం కళాశాల విద్యార్థిగా చేరిన మంత్రి నాటకాల పట్ల ప్రభావితుడై ఆంగ్ల నాటకాలతోపాటు తెలుగు నాటకాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు.
మంత్రి శ్రీనివాసరావు నిజాం కళాశాలలో చదువుతున్నపుడే ప్రముఖ సాహితీవేత్త, జర్నలిస్టు అబ్బూరి వరద రాజేశ్వరరావుతో స్నేహం ఏర్పడింది. మంత్రి నాటక ఆసక్తిని గమనించిన ఆయన ప్రపంచ నాటక రంగాన్ని పరిచయం చేసాడు. అంతేకాదు సరోజినినాయుడి కుమారుడు జయసూర్య ద్వారా కావలసిన నాటక పుస్తకాలను సంపాదించి మంత్రికి ఇచ్చేవాడు. ఈ అధ్యయనమే మంత్రి శ్రీనివాసరావు ఆధునిక తెలుగు నాటకంవైపు దృష్టి సారించేలా చేసింది. అదే సమయంలో నాటకరంగ ప్రముఖులు ఏ.ఆర్‍. కృష్ణతో పరిచయం ఏర్పడింది.
ఆధునిక నాటక ప్రయోగాలపట్ల ఇద్దరి భావాలు ఏకసూత్రం కావడంతో నాటక వికాసంకోసం నడుంకట్టారు. 1952లో ఇండియన్‍ నేషనల్‍ థియేటర్‍ (×చీ•) హైదరాబాద్‍లో ప్రారంభించారు. హైదరాబాద్‍లో ఆంగ్ల నాటకాల వ్యాప్తికి కృషి చేసిన హరీంద్రనాథ్‍ ఛటోపాధ్యాయ భార్య కమలాదేవి ఛటోపాధ్యాయ జాతీయ నాట్య సంఘానికి అధ్యక్షులుగా ఉండేవారు. ఆమె ప్రోత్సాహంతో మంత్రి శ్రీనివాసరావు, ఏ.ఆర్‍. కృష్ణలు ×చీ• నాటకోత్సవాలను సిటీ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఇందులో బెల్లంకొండ రామదాసు ‘మాస్టార్జీ’ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకం హైదరాబాద్‍, ఇతర తెలంగాణా ప్రాంతాల్లో విశేషంగా ఆదరించడంతో మరిన్ని కొత్తనాటకాలు ఆవిష్క•తమయ్యాయి.
అబ్బూరి రామకృష్ణారావు బహుభాషావేత్త. ప్రఖ్యాత కవి, తెలుగు నాటక ప్రయోగాల మార్గదర్శిగా ప్రసిద్ధులు. వరద రాజేశ్వరరావు ద్వారా అబ్బూరి వారి పరిచయం ఏర్పడ్డది. అబ్బూరి ఆధునిక నాటక ప్రయోగాల పట్ల మంత్రి ప్రభావితుడయ్యాడు. నాటకాన్ని ఆధునిక దృక్కోణంలో దర్శించడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లోనే మంత్రి నటశిక్షణ, నాటక ప్రదర్శన, శాస్త్రీయ పద్దతిలో సాగాలని పరితపించాడు. ఇందువల్లనే తరువాత కాలంలో మంత్రి శ్రీనివారావు అబ్బూరికి ప్రియశిష్యుడయ్యాడు.
హైదరాబాద్‍ నాట్య సంఘం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సికింద్రాబాద్‍ మహబూబ్‍ కాలేజ్‍ వేదికగా నాటక పోటీలు నిర్వహించారు. మంత్రి సారథ్యంలో ‘ఇన్స్పెక్టర్‍ జనరల్‍’ నాటకాన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఈ నాటకం మంత్రికి గుర్తింపు తెచ్చిపెట్టింది. 1957లో ఐఎన్‍టి నాటకోత్సవాల సందర్భంగా కుందుర్తి ఆంజనేయులు వచన కవితాశైలిలో రాసిన ‘ఆశ’ నాటకాన్ని మంత్రి ఎక్స్పరిమెంట్‍ డ్రామాగా ప్రదర్శించారు. ఈ నాటకానికి ఆయనే ప్రయోక్త. ఈ నాటకంలో మంత్రి, ప్రొఫెసర్‍ రమామేల్కొటే కలిసి నటించారు. ఈ నాటకం మంత్రిని సృజనాత్మక నాటక ప్రయోక్తగా నిలబెట్టింది.
1957లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రి శ్రీనివాసరావును అకాడమీ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. అకాడమీ ప్రారంభోత్సవాల సందర్భంగా ‘నిచ్చెనలు’ అనే నాటికను ప్రదర్శించారు. ఇందులో మంత్రి శ్రీనివాసరావు, పన్నురి రామారావు మొదలైనవారు నటించారు.
ఉద్యోగిగా మంత్రి శ్రీనివాసరావు
హైదరాబాద్‍లో పోలీస్‍ యాక్షన్‍కు పూర్వం నిజాం ప్రభుత్వంలో పోలీసు శాఖలో మంత్రి శ్రీనివాసరావు పనిచేసేవారు. ఆ తరువాత హైదరాబాద్‍ రాష్ట్రం సెక్రటేరియట్‍లో అనువాదకుడిగా సేవలందించారు. ఆంధప్రదేశ్‍ రాష్ట్రం ఏర్పడ్డాక సమాచార శాఖలోని అనువాద విభాగంలో కొత్త ఉద్యోగంలోకి మారారు. ఆ విభాగానికి ప్రముఖ సాహితీవేత్త డా. బోయి భీమన్న అధిపతిగా ఉండేవారు. తరువాతికాలంలో అదేశాఖలో పౌరసంబంధాల అధిపతిగా నియమితులయ్యారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే నాటక రంగానికి అంకితమై పనిచేశారాయన. ఈ ఉద్యోగం ఎంతోమంది కవులు, కళాకారులను పరిచయం చేసింది. ఆయన చేసే నాటకరంగ కార్యక్రమాలకు దోహదపడేలా చేసింది.
తొలితరం నటశిక్షణ అధ్యాపకుడు
నాటకరంగానికి శాస్త్రీయపద్ధతిలో నటీనటులను తయారు చేయాలన్న సంకల్పంతో 1959తో నాట్యవిద్యాలయం హైదరాబాదులో ఏర్పడింది. అబ్బూరి రామకృష్ణారావు డైరెక్టరుగా ఏ.ఆర్‍. కృష్ణ. మంత్రి శ్రీనివాసరావు అధ్యాపకులుగా విద్యార్థులకు నటనలో శిక్షణ లందించేవారు. ఆనాటి నాట్య విద్యాలయం ఒక ధియేటర్‍ లేబరేటరీగా పనిచేసేది. ఇక్కడ సరికొత్త ప్రయోగాలకు ఓ రూపాన్నిచ్చి ఆధునిక పక్రియలో నాటకాలను ప్రదర్శించేవారు. ‘కన్యాశుల్కం’, ‘మృచ్చకటికం’ వంటి నాటకాలను ప్రయోగాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు.
‘కన్యాశుల్కం’ నాటకాన్ని గొప్ప గొప్ప నటులు ఇదివరకే ప్రదర్శించినప్పటికీ మంత్రి శ్రీనివాసరావు నిర్వహణ, అబ్బూరి రామకృష్ణారావు దర్శకత్వం, అబ్బూరి గోపాలకృష్ణ డిజైన్‍తో పబ్లిక్‍ గార్డెన్‍లో విభిన్న సాంకేతిక అంశాలతో ప్రదర్శితమైంది. ఆ రోజుల్లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన చైనీస్‍ గార్డెన్‍ (సరోర్‍బాగ్‍)లో కొత్త తరహా రంగాలంకరణతో వేదికపై తెరలు లేకుండా ‘లైట్సాఫ్‍-లైట్సాన్‍’ లోనే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ప్రదర్శించారు. ఆనాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పూర్తి నాటకాన్ని చూసి నటీనటులను అభినందించారు. ఆ రోజుల్లో గొప్ప ప్రయోగంగా ఆ తరంవారు ఇప్పటికీ చెప్పుకుంటారు.


నిరంతరం నాటకం గురించి ఆలోచించే మంత్రికి నాటక ప్రయోగాలపట్ల వ్యామోహం తగ్గలేదు. రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న సమయంలోనే ఆయన 1961లో సంవత్సరంపాటు సెలవు తీసుకుని ప్రముఖ బ్రిటిష్‍ రంగస్థల నిపుణులు ‘హెర్బట్‍ మార్షల్‍’ బొంబాయిలో నిర్వహిస్తున్న నటశిక్షణ పాఠశాలలో ప్రత్యేక కోర్సును పూర్తిచేశారు. అక్కడ ‘‘డైరీ ఆఫ్‍ అనే ఫ్రాంక్‍’’ ఆంగ్లనాటకంలో ప్రాముఖ్యత కలిగిన పాత్రను పోషించి అభినయ ప్రదర్శనలో తన ప్రత్యేకతను చాటాడు. ఆ తరువాత 1963లో నటనలో ప్రత్యేక శిక్షణ నిమిత్తం లండన్‍లోని బ్రిటిష్‍ డ్రామా లీగ్‍కు దరఖాస్తు చేసుకున్నారు. భారతదేశం నుండి కేవలం నలుగురిని మాత్రమే ఎంపిక చేసే ఈ కోర్సుకు అనేక వడపోతల్లో మంత్రి శ్రీనివాసరావు ఎంపికయ్యారు.
విమానంలో వెళ్ళడానికి ఆయన దగ్గర సరిపడా డబ్బు లేకపోవడంతో 13 రోజులపాటు ఓడపై సముద్ర ప్రయాణం చేసి మంత్రి శ్రీనివాసరావు లండన్‍ చేరుకున్నారు. లండన్‍లో సంవత్సరం పాటు శిక్షణ కొనసాగింది. ఈ మధ్యలో శ్రీనివాసరావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అయినప్పటికీ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది విదేశాల్లో ‘యాక్టింగ్‍ డిప్లొమా’ సాధించిన కీర్తి మంత్రి శ్రీనివాసరావుకు దక్కింది. లండన్‍ నుండి హైదరాబాదుకు తిరిగి వచ్చిన తరువాత మంత్రి శ్రీనివాసరావు తన చివరి మజిలీ వరకు నాటకాన్ని వదలలేదు. విదేశాల్లో నేర్చుకున్న విద్యను మంత్రి తెలుగునాట నాటక వ్యాప్తికి ఉపయోగించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి రంగస్థల శాఖాధిపతిగా…
ఆంధ్ర విశ్వవిద్యాలయం 1966లో నాటక శాఖను (•ష్ట్రవ••తీవ •తీ•• ణవజూ•.) ప్రారంభించింది. అప్పటివరకూ భారతదేశంలో కేవలం చీ••ఱశీఅ•శ్రీ ••ష్ట్రశీశీశ్రీ శీ• ణతీ•ఎ• (చీ•ణ) మాత్రమే ఉండేది. ఉద్యోగ ప్రకటన ద్వారా హైదరాబాద్‍ నాట్య విద్యాలయంలో అధ్యాపకుడుగా పనిచేస్తున్న మంత్రి శ్రీనివాసరావును ఆనాటి విశ్వవిద్యాలయ వైస్‍ ఛాన్స్లర్‍ శ్రీనివాస అయ్యంగార్‍ నాటకశాఖ ఆచార్యుడిగా ఎంపిక చేశారు. విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనార్హతలు ఆ రోజుల్లో మంత్రి శ్రీనివాసరావుకు ఉండటంతో దక్షిణ భారతదేశంలో ఏర్పడిన తొలి రంగస్థల శాఖకు ఆయన మొదటి శాఖాధిపతిగా నియమితులయ్యారు.
మంత్రి తెలంగాణ భాషను, యాసను ఎంతగా ప్రేమించేవాడో తాను పనిచేస్తున్న ప్రాంత మాండలికాన్ని కూడా అంతే గౌరవించేవాడు. మాండలికాల్లోనే ప్రజల జీవితం దాగుందని ఆయన భావన. ఇక్కడి మాండలికాల్లో ప్రదర్శిస్తే ప్రజలు నాటకాన్ని ఆదరించి బ్రతికిస్తారని మంత్రి విశ్వసించాడు. ఆ ప్రయత్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటక ప్రయోగాల్లో కనిపిస్తుంది. ఆ ప్రాంత సంస్క•తిని ప్రతిబింబించేలా గణేశ్‍పాత్రోచే శ్రీకాకుళం మాండలికంలో ‘కొడుకు పుట్టాల’ నాటకాన్ని, అత్తిలి కృష్ణారావుచే విశాఖ మాండలికంలో ‘యుగసంధ్య’ నాటకాన్ని రచించేలా మంత్రి దోహదపడ్డారు. విద్యార్థులచే ప్రదర్శితమైన ఈ నాటకాలకు ఆ రోజుల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దానికి మంత్రి మార్గదర్శకత్వమే మూలకారణం.
తెలుగు అకాడమీ ప్రచురించిన ‘రంగస్థలశాస్త్రం’ అనే పాఠ్యగ్రంధానికి మంత్రి రచయితగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా నాటకరంగంలో తలమునకలై పనిచేస్తున్న మంత్రి శ్రీనివాసరావుకు తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండేదికాదు. ఆంధ్ర యూనివర్శిటీలో పనిచేస్తున్న కాలంలోనే అనారోగ్యంతో బాధపడ్డారు. రంగస్థల కళల శాఖ విద్యార్థులు ప్రదర్శించబోయే నాటక ఏర్పాట్లలో మునిగి పోయిన సమయంలోనే మంత్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అత్యవసర వైద్య నిమిత్తం విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ 9 అక్టోబరు 1974లో అకాల మరణం చెందారు. అప్పటికాయనకు 46 ఏండ్లే. తెలుగు ఆధునిక నాటక వికాసానికి, తెలంగాణ ఆధునిక నాటక చైతన్యనానికి మంత్రి శ్రీనివాసరావు చేసిన కృషి చిరస్మరణీయం.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్క•తిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)

  • డా. జె. విజయకుమా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *