పాతరాతియుగపు మానవుడు, తోటి మానవుడు మరణిస్తే, ఆ మృత కళేబరాన్ని అతడు ఎక్కడ మరణిస్తే అక్కడే వదిలి పెట్టాడు. కొత్తరాతియుగంలో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఏకారణం చేత మరణించినా ఆ శవాన్ని తామున్న స్థావరంలోనే పూడ్చి పెట్టాడు. ఆ తరువాత మానవ జీవన వికాస క్రమంలో, ఇనుమును కనుగొనటం ఒక అద్వితీయ ఘట్టంగా పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తారు. క్రీ.పూ. 2000- క్రీ.శ.200 సం।।ల మధ్య కాలంలో తెలంగాణలో విలసిల్లిన ఈ కాలాన్ని ఇనుప యుగమనీ, మరణించిన వారి శవాలను భూమిలో పాతిపెట్టి గుంటను పూడ్చి, చుట్టూ పెద్ద పెద్ద గుండు రాళ్లను గుండ్రంగా అమర్చే ఆచారాన్ని కొనసాగించటం వల్ల బృహత్ శిలా (మెగాలిథిక్) యుగమనీ పిలిచారు. ఇలాంటి సమాధుల్ని భూమిలోపల పాతిపెట్టి నిర్మించేవి, భూమిపైన రాతిగోడలతో నిర్మించేవీ అని రెండు రకాలు. వీటిని తెలంగాణలో రాకాసి గుళ్లనీ, రాక్షసగూళ్ళని, రక్కీసబండలనీ, పాండువల గుళ్లని, వీర్లపాడులనీ పిలుస్తారు.
ఈ ఇనుపయుగపు సమాధుల్ని గుంట సమాధులని, గూడు సమాధులనీ, రాళ్ల గది సమాధులనీ, రాతిని తొలచిన సమాధులనీ నాలుగు రకాలుగా విభజించారు. వీటికి అనుబంధంగా నిలిబెట్టే ఎత్తైన రాళ్లను నిలువురాళ్లనీ, నిలువు రాళ్ల వరుసలనీ, నిలువురాళ్ల గుంపులనీ, మానవాకారశిల్పాలనీ, శిలువాకృతులనీ పిలిచారు. సమాధుల్లో, ప్రత్యేకించి గుంట సమాధుల్లో మట్టి శవపేటికల్లో శవాల్ని ఉంచి పాతి పెట్టడం, భూమిపైన నిర్మించే రాతి గూళ్ల సమాధులల్లో రాతి శవపేటికల్లో అస్థికలను నిక్షిప్తం చేసుకొన్నారు. సమాధి ఏ రకానికి చెందినా, మరణించిన వారు, వారి జీవితకాలంలో వాడిన మట్టిపాత్రలు, ఆహారధాన్యాలు, ఇనుప పనిముట్లు, మట్టి, లోహపు ఆభరణాలను కూడ వారితో పాటే నిక్షిప్తం చేసేవారని తెలంగాణాలో జరిపిన అనేక తవ్వకాలు రుజువు చేశాయి.
మరణించిన వారి జ్ఞాపకంగా సమాధి పక్కన ఎత్తైన నిలువురాతిని పాతిపెట్టడం, స్మారక కట్టడ ప్రారంభదశను సూచిస్తుంది. అలా నిలబెట్టిన నిలువున్న రాళ్లను, శిలువా కారంగా తీర్చిదిద్ది వాటిపై మరణించిన వారు ఆడ, మగ అని తెలియజేయటానికి వీలుగా, మగవారిని సాదా శిలువాకారపు బొమ్మగానూ, ఆడవారిని, ఆదే శిలువాకృతిపైన వక్షస్థలాన్ని చెక్కి, స్మారకశిల నిర్మాణంలో ప్రత్యేకతను కనబరిచారు.
ఇదే కాలంలో మరో అడుగు ముందుకేసి, ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపురం మండలంలోని చిన్నమారూరు వద్ద జరిపిన తవ్వకాల్లో ఇనుపయుగపు గూడు సమాధిపై నుంచే రాతిపైన మరణించిన వారి చిత్రాన్ని, గీతల్లో చెక్కారు. ఇదే తొట్టతొలి స్మారక చిత్రంగా గుర్తింపుపొంది, తెలంగాణా చరిత్రలో మైలురాయిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446