రాగి రకాలు – సాగు మెళకువలు

చిరుధాన్యపు పంటలు పూర్వ వైభవాన్ని సంతరించు కుంటున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక సమస్యలకు పరిష్కారమంటున్నారు. ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పడు పూర్వ వైభవం వస్తోంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్ళీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది.
రాగి విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ప్రాంతాలను బట్టి రాగిని తైదలు, చోడిగా వ్యవహరిస్తారు. రాగులు.. బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు.. నేడు అనేక ఆరోగ్యసమస్యల వల్ల, తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.


రాగిలో ఉండే పోషక విలువలే దీనికి గల ప్రధాన కారణం. రాగుల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది. వీటిని సంకటి (గడ్క), అన్నం, జావ తయారీతోపాటు, తెల్ల రాగులను బేకరీ ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‍ సుగుణాలు, హైటోకేమికల్స్ ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెరస్ధాయి అదుపులో ఉంటుంది. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధి గ్రస్తులకు రాగి మంచి ఆహారం. స్థూలకాయం, బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది శ్రేష్ఠమైన ఆహారం.
ఖరీఫ్‍లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకుంటారు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది. కానీ ఇప్పుడు అందుబాటులో కొచ్చిన కొత్త రకాలతో రైతులు ఎకరానికి 12-15 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. క్వింటా ధర 1500 -2000 పలుకుతుండటంతో రైతులు సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.


రాగిని తేలిక రకం ఇసుక నేలలు, బరువైన నేలలు, కొద్దిపాటి చౌడు సమస్య ఉన్న భూముల్లో సాగుచేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనువైనవి కావు. ముఖ్యంగా సరైన సాంద్రతలో మొక్కల పెట్టినట్లు అయితే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. రాగి సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. అంతే కాకుండా సమయానుకూలంగా నత్రజని, భాస్వరం, పొటాష్‍ను అందిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు.


నేరుగా విత్తే పద్ధతితో పాటు నారుపోసి నాటు వేసుకునే పద్ధతిలో కలుపు యాజమాన్యం ముఖ్యం. సకాలంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు కలుపును నివారిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చు. ముఖ్యంగా రాగి పంటకు అగ్గితెగులు, మెడవిరుపు తెగులు, కంకితెగులుతో పాటు ఈ మధ్య గులాబి రంగు పురుగు ఆశించి పంటను తీవ్రంగా నష్టపరుస్తోంది. సకాలంలో వీటిని గుర్తించి నివారించాలని శాస్త్రవేత్త సూచిస్తున్నారు. రాగి పంటలో ప్రస్థుతం మేలైన రకాలు అందుబాటులో వుండటం వల్ల మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 నుంచి 12క్వింటాళ్ల దిగుబడి సాధించే వీలుంది.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *