తెలంగాణలో బంజారా దార్శనికుడుసంత్‍ శ్రీ సేవాలాల్‍ మహరాజ్‍

తెలంగాణ సమాజంలో సుమారు ఆరున్నర శాతం జనాభా కలిగిన లంబాడీలు అందరూ ఆరాధించే ఆధ్యాత్మిక గురువు సంత్‍ శ్రీ సేవాలాల్‍ మహరాజ్‍. ఆయన క్రీ.శ. 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లాలోని గుత్తి సమీపంలో ఉన్న రాంజీ నాయక్‍ తండాలో జన్మించారు. యుక్త వయసు నుంచే వేల పశువులను మేపుకుంటూ భారతదేశమంతటా తిరిగి లంబాడి సమాజ నడవడికను క్రమబద్దం చేసి లంబాడీలకు ఆరాధనీయుడయ్యారు. ఇటీవల జరిగిన ఆయన 286వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన చరిత్రను, ఆయనకు-తెలంగాణకు గల సంబంధాన్ని ఒకసారి మననం చేసుకుందాము.
సుమారు మూడు శతాబ్దాల కిందట భారతదేశాన్ని మొఘలు చక్రవర్తులు పరిపాలిస్తున్నప్పుడు రాజపుత్ర సంతతికి చెందిన కొందరు ప్రజలు వలసలు పోయి స్థానిక గిరిజన జాతులతో కలిసిపోయారు. అలా కొందరు బంజారాలు, లంబాడీలు, సుగాలీలు అనే పేర్లతో తెలుగు రాష్ట్రాలలో స్థిరపడ్డారు – 3 శతాబ్దాల క్రితం నుంచి. వారిలో ఒక సముహం రాంజీ నాయక్‍. గుత్తి సమీపంలో ఆయన కొడుకు భీమా నాయక్‍ – ధర్మిణి యాడి దంపతులకు సేవాలాల్‍ జన్మించారు. ఇంటిపేరు రామావత్‍ అని కొందరు, రాథోడ్‍ అని కొందరు చెప్తుంటారు. కాలక్రమంలో వీరి కుటుంబం కూడా ఇంకా దక్షిణానికి వలస పోయింది.
సేవాలాల్‍ 12 ఏళ్ళ వయస్సు నుండే ఆధ్యాత్మిక చింతన కలిగి మేరా భవాని (సప్త మాతృకలలోని మేరామా / పెద్దమ్మ) ఆశీస్సులతో తన తండాకు, క్రమంగా అనేక తండాలకు ఆదర్శ జీవితం ఎలా గడపాలో బోధించి లంబాడీలందరికీ మార్గదర్శకుడు అయ్యాడు. ఆయన బ్రహ్మచర్య నిష్ట, అహింసా వాదం లంబాడీలను ఆయన వైపు ఆకర్షితులను చేసాయి.

సేవాలాల్‍, ఆయన అనుచర గణం చెన్నపట్నం (చెన్నై) వరకు వెళ్ళి, అక్కడి నుండి తిరిగి తిరుమల తిరుపతిలోని బంజారా గురువు హాథీరాం బావాజీ ఆశ్రమం దర్శించి, తదనంతరం ఆనాటి హైదరాబాదు రాష్ట్రంలోని ప్రస్తుతపు బంజారాహిల్స్ ప్రాంతానికి వచ్చారట. బంజారాలు నివసించిన ప్రాంతం కాబట్టి దానికి బంజారాహిల్స్ అనే పేరొచ్చింది అంటారు. అక్కడ నివసిస్తున్నప్పుడు సేవాలాల్‍ తండావాసుల ఆవులు ఆ ప్రాంతపు రైతుల పంట పొలాలు మేసాయని నిజాం అధికారులకు ఫిర్యాదులు వెళ్ళాయి. ఫలితంగా సేవాలాల్‍ మీద విషప్రయోగం జరిగింది. మేరామా దయతో ఆ గండం తప్పింది. అదే కాలంలో హైదరాబాద్‍ రాష్ట్రంలో కలరా వ్యాధి వ్యాపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. హైదరాబాదు నగరం అల్లకల్లోలానికి గురైంది – బంజారాలు నివసిస్తున్న ప్రాంతం తప్ప. ఈ నిజాన్ని గుర్తించిన హైదరాబాదు రాష్ట్ర పాలకుడైన రెండో నిజామ్‍ అలీఖాన్‍ సేవాలాల్‍ ను ఆహ్వానించి, ఆయనతో మేరామాకు పూజలు చేయించిన తరువాత కలరా తగ్గి ప్రజలు రక్షించబడ్డారని లంబాడీ ఢాడీలు (సాంప్రదాయ కథకులు) చెప్తారు. అందుకు సంతోషించిన నిజామ్‍ ప్రభువు సేవాలాల్‍ చిత్రలేఖనం గీయించాడట. ఎంతో కాలం హైదరాబాదులోని నిజామ్‍ వంశపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉన్న ఆ చిత్రపటాన్ని బెంగళూరుకు చెందిన బంజార పరిషత్‍ వారు తీసుకెళ్ళారట. దాని చిత్రం (ఫోటో) ఇప్పుడు సేవాలాల్‍ పుట్టిన ప్రదేశం ‘సీవాగఢ్‍’లో ఉందట. భారత దేశపు బంజారాలందరూ ఆరాధించే ఆధ్యాత్మిక గురువు సేవాలాల్‍ చిత్రలేఖనాన్ని గీయించి, ఈ నాటి ఆ తెగప్రజలందరూ చూసి మురిసిపోయే భాగ్యం కలిగించింది తెలంగాణ భాగ్యనగరమే (హైదరాబాద్‍ మొదటి పేరు).

బంజార సాంప్రదాయ కథకులు భాట్లు చెప్పే సాంప్రదాయ ఇతివృత్తాన్ని విశ్లేషిస్తే కూడా సేవాలాల్‍ తన పశువులు, పరివారంతో పాటు నాగర్‍కర్నూల్‍ జిల్లాలోని నల్లమల అడవుల మీదుగా తెలంగాణలో ప్రయాణించినట్లు అర్థమవుతుంది. భాట్ల కథనం నిజమైతే నల్లమల్ల అడవుల్లో ఉన్న అమ్రాబాద్‍- మన్ననూరు ప్రాంతంలో కూడా సేవాలాల్‍ కాంత కాలం నివసించిన కారణంగా ఆయన పశువులు స్థానిక పశువులతో సంగమించడం వల్ల ఒక కొత్త మేలైన పశుజాతి వృద్ధి చెందినట్లు అర్థమవుతుంది. ఈ అమ్రాబాద్‍ పీఠ భూమిపై మేలు జాతి ఆవులున్నాయని 1940 ప్రాంతంలో తను చూసిన అనుభవాలను ప్రొఫెసర్‍ హైమన్డార్ఫ్ అనే ఆస్ట్రియా మానవ శాస్త్రవేత్త రాయడం గమనార్హం. సేవాలాల్‍ పుట్టిన రాంజీ నాయక్‍ తండా వలస పోయిన తరువాత అక్కడ చెన్నరాయనిపల్లె ఏర్పడిందని, ఆ ప్రాంతంలో ప్రసిద్ధిపొందిన ‘రాల కుండం’లో సేవాలాల్‍ స్నానం చేసి చెన్నకేశవున్ని దర్శించి తన పశువులను వనాల్లో మేపి వృద్ధి చేశాడని భాట్ల కథనం. ఈ కథనంలో ప్రస్తావించబడిన చెన్నరాయనిపల్లె, చెన్నరాయనిగుట్ట, చెన్నరాయనిగండి, చెన్నకేశవ దేవుడు… ఇవన్నీ అమ్రాబాద్‍-మన్ననూర్‍ ప్రాంతంలో ఉన్నాయి. భాట్లు ఈ ప్రాంతపు పేర్లనే ప్రస్తావించారేమో! ఇక భారతదేశంలో కాలాపానీకి పేరొందింది మన్ననూర్‍ జైలు ఆవరణ ప్రాంతం. కరడుగట్టిన నేరస్థులను అక్కడి జైలులో బంధించి వారికి కాలాపానీ తాగించేవారు.


ఇక సేవాలాల్‍ చిన్నాన్న వంశస్థులు వికారాబాద్‍ జిల్లా తాండూరు ప్రాంతంలో ఉన్న తట్టిపల్లిలో నివసిస్తున్నారట. వారిని గుర్తించి సేవాలాల్‍ జయంతి ఉత్సవాల్లోనైనా వారిని సన్మానించుకోవలసిన అవసరం ఉంది. ఆ రోజుల్లో లంబాడీలను నేరస్థ తెగలుగా ప్రభుత్వాలు భావించేవి. సేవాలాల్‍ లంబాడీలను సత్ప్రవర్తనులుగా మార్చేందుకు చాలా కృషిచేశారు. ఆ కృషి ఫలితంగా నిజామ్‍ ప్రభుత్వం కొంతమందిని సత్ప్రవర్తనులుగా గుర్తించింది. ఇందుకు నిదర్శనంగా గుల్బర్గా జిల్లా, కొడంగల్‍ (ఇప్పటి వికారాబాద్‍ జిల్లా) తాలూకాకు చెందిన లంబాడీ పర్సయ్య కొడుకు భీమాకు అసిస్టెంట్‍ నాజమ్‍ కొత్వాల్‍ పాషన్‍ బహద్దూర్‍ 1345 ఫస్లీ మహర్‍ 23వ తేదీనాడు (1935 ఆగస్టులో) సత్ప్రవర్తన పత్రం ఒకటి జారిచేశాడు.
ఇలా తెలంగాణ లంబాడీలకు, 18వ శతాబ్దపు తెలంగాణ ప్రజలకు సాయం చేసిన సేవాలాల్‍ మహరాజ్‍ ను తెలంగాణ లంబాడీలు మాత్రమే కాదు తెలంగాణ ప్రజలందరూ స్మరించుకొని కృతజ్ఞతా భావనను ప్రకటించుకోవలసి ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచే సేవాలాల్‍ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2015, 2016 సంవత్సరాలలో ఉత్సవాలను నిర్వహించిన సంస్థలకు, జిల్లా కలెక్టర్లకు కొన్ని లక్షల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం 2017లో ప్రతి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సేవాలాల్‍ జయంతి ఉత్సవాల కమిటీలను ఏర్పరచి ప్రతి నియోజక వర్గంలో సేవాలాల్‍ జయంతి ఉత్సవాలు నిర్వహించేలా నిధులు (రూ. కోటి) విడుదల చేసింది. అప్పటి నుంచి అలా జరుగుతున్న ఉత్సవాలకు అదనంగా హైదరాబాద్‍లోని సేవాలాల్‍ బంజారా భవన్లో 2023 నుంచి మంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్సవాలు నిర్వహిస్తున్నది. 2024 నాటి రాష్ట్రస్థాయి ఉత్సవాలలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‍ రెడ్డి పాల్గొని సేవాలాల్‍ జయంతి ఉత్సవాలకు మరో కోటి రూపాయలను మంజూరు చేశారు.
2025 సంవత్సరపు రాష్ట్రస్థాయి ఉత్సవాలు హైదరాబాద్‍లోని బంజారాహిల్స్లో ఉన్న సేవాలాల్‍ బంజారా భవన్లో ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు అతిధులుగా విచ్చేసిన మంత్రివర్యులు భట్టి విక్రమార్క, డా. ధనసరి అనసూయ సీతక్క ఎంపీలు బలరాంనాయక్‍, అనిల్‍ యాదవ్‍, ప్రభుత్వ సలహదారు వేం నరేందర్‍ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్‍, విప్‍ రాంచందర్‍, ప్రజాప్రతినిధులు రాందాస్‍ నాయక్‍, రవీందర్‍ నాయక్‍, కార్పొరేటర్‍ విజయారెడ్డి, మాజీ ఎమ్మెల్సి రాములు నాయక్‍ తదితరులను గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డా. ఎ.శరత్‍ గారి ఆధ్వర్యంలో అధికారులు, లంబాడీ కళాకారుల బృందాలు కళా ప్రదర్శనలతో ఆహ్వానించాయి. అందరూ సేవాలాల్‍ విగ్రహం ముందు నంగారాలను మోగించి, భోగ్‍ సమర్పించి పూలు అర్పించారు.


ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన భోగ్‍ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని భోగ్‍ కుండ్‍లో నెయ్యి, పవిత్ర ద్రవ్యాలు సమర్పించి, సేవాలాల్‍ విగ్రహానికి పూలమాలలు వేసి ఉత్సవాలకు విచ్చేసిన వేలాది మంది లంబాడీ గిరిజన ప్రజలకు
శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పంచాయితీరాజ్‍ శాఖామాత్యులు డా. ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ… సేవాలాల్‍ చరిత్రను భావితరాలకు అందించడమే ఆ మహనుభావునికి మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. గిరిజన సాంస్కృతిక మూలాలను కనీసం సందర్భోచితంగానైనా ప్రదర్శించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజనులు తమ ఇళ్ళల్లోనైనా తమ తమ మాతృభాషలను మాట్లాడుతూ తమ తమ అస్థిత్వాలను కాపాడుకోవాలన్నారు. గిరిజన సమాజ అభివ•ద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో వక్తలు ప్రస్తావించినట్లుగా వచ్చే సంవత్సరం హైదరాబాద్‍ లోని ఎల్బీ స్టేడియం వంటి విశాలమైన స్థలంలో సేవాలాల్‍ జయంతి వేడుకలు నిర్వహించే అంశం, భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా భాషను చేర్చే అంశం ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకువెళ్ళి సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు క•షి చేస్తామన్నారు.


కార్యక్రమంలో భాగంగా బంజారా గురువులు, బంజారా గాయని రోహిణి, క్రికెటర్‍ కావ్యశ్రీ, పర్వతారోహకులు మోతె రాందాస్‍, భూక్యా యశ్వంత్‍, ఎంబ్రాయిడరి కళాకారుడు బని నవీన్‍ లను సన్మానించారు.
కార్యక్రమానికి గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డా.వి. శరత్‍ అధ్యక్షత వహించారు. గిరిజన తెగల జాతీయ సంఘం సభ్యులు హుస్సేన్‍ నాయక్‍, ట్రైకార్‍ చైర్మెన్‍ బెల్లయ్యనాయక్‍, మాజీ ఎంపీ వి. హన్మంతరావు ప్రత్యేక అతిధులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో బంజారా కళాకారులు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, బంజారా సంఘాల సభ్యులు, వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *