గద్వాల సంస్థానం

తెలంగాణ సంస్థానాలలో విశేషఖ్యాతి గాంచినది గద్వాల సంస్థానం. ఇది తెలంగాణలోని మహబూబ్‍నగర్‍ జిల్లాలో క•ష్ణా- తుంగభద్రా నదుల మధ్యన వెలసిన ప్రాంతం, దీనికి తూర్పున క•ష్ణానది, దక్షిణాన తుంగభద్రానది, పశ్చిమాన రాయచూరు,
ఉత్తరాన మహబూబ్‍ నగర్‍ పట్టణం ఉన్నవి. దీని వైశాల్యము 864 చ.మై. దాదాపు 214 పైగా గ్రామాలు. లక్షకు పైగా జనాభా. ఆదాయం ఆరు లక్షలు, సాలుసరి కప్పము 86,840 హాలీ సిక్కా నాణాలు, పడమరనున్న సారవంతమైన నేలతో విరాజిల్లింది గద్వాల సంస్థానం. భారతదేశము స్వాతంత్య్రం పొందిన తరువాత హైదరాబాద్‍ పై పోలీసు చర్య పిదప సంస్థానాల విలీనం అయ్యేవరకు గద్వాల సంస్థానం సివిల్‍ మెజిస్ట్రేట్‍ అధికారాలతో ఉన్నది. తెలంగాణాలోని గద్వాల, వనపర్తి, జటప్రోలు మొదలైనవి సివిల్‍ మెజిస్ట్రేట్‍ అధికారం ఉన్నవే. నైజాం నవాబు తన క్రిందనున్న సంస్థానాధీశులందరికీ సర్వాధికారాలు ఇవ్వటం వల్ల సర్వజన సమ్మతంగా పరిపాలన జరిగి సంస్థానాలు అభివ•ద్ధి చెందినవి.
గద్వాల సంస్థానానికి గద్వాలనే ముఖ్య పట్టణం, గద్దపల్లె అనే గ్రామం దగ్గర నిర్మించిన పట్టణం కావున దీనికి గద్వాల అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. గద్వాల కోటను కీ.శ. 1698- 1704 మధ్య కాలంలో పెదసోమభూపాలుడు (సోమనాద్రి) నిర్మించాడు. గద్వాల కోట చుట్టూ దాదాపు 40 అడుగుల ఎత్తు గల విళామైన మట్టిగోడ ఉంది. ఈ కోట మధ్యన రాజప్రసాదముండేది. కోటలో తైలవర్ణ చిత్రాలుండేవి. ఇక్కడ గల చారిత్రక వస్తువులలో చెప్పుకోదగ్గది సుమారు 30 అడుగుల పొడువుగల పెద్ద ఫిరంగి ఒకటి, రాజ ప్రసాదం పక్కన రెండు దేవాలయాలు ఉన్నవి. ఒకటి చెన్నకేశవస్వామిది రెండవది శ్రీరామాలయం, చెన్నకేశవస్వామి ఆలయం ఉండటం వల్ల ఈ నగరానికి కేశవనగరం అని కూడా పేరు.
గద్వాల సంస్థానంలో ప్రధానంగా కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాటిలో,
పూదూరు: ఇది అతి ముఖ్యమైన గ్రామం. గద్వాల ప్రభువులకు ఇది మొదటి నివాసస్థానం. రాజులు ఇక్కడ ఉండే గద్వాల కోటను నిర్మించారని చెప్తారు. గద్వాల మాదిరిగా ఇక్కడ కూడా చెన్నకేశవస్వామి ఆలయం ఉంది.
బోరవెల్లి : గద్వాలకు ముందే ఇది ప్రసిద్ధికెక్కిన సంస్థానం. ఒకప్పుడు స్వతంత్రంగా ఉండిన బోరవెల్లి సంస్థానం తరువాత కాలంలో గద్వాల సంస్థానంలో విలీనమైంది. నాడగౌడు తమ్మారెడ్డి ఈ సంస్థానంలో మూల పురుషుడు.
ఐజ: గద్వాల సంస్థానంలో ఇది అతి ముఖ్యమైన గ్రామం. గద్వాల సంస్థాన మూల పురుషుడు బుద్దారెడ్డి ఈగ్రామం వాడే. కాకతీయ ప్రతాప రుద్రుని వలన ఈయన ఐజ మొదలగు ఏడు సీమలపైన అధికారం పొందాడు. ఇక్కడ మూడు ప్రాచీన శాసనాలు ఉన్నవి. అందులో ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్న శాసనం కాకతీయ ప్రతాపరుద్రుని గురించి చెప్తుంది.
బీచిపల్లి: ఇది గద్వాలకు తూర్పున పది మైళ్ళ దూరంలో క•ష్ణానది తీరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధమైన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు అంజనేయస్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఈ దేవాలయంలో
ఉన్న ఎన్నో ఏళ్ళనాటి వేపచెట్టు ఆకులు చేదుగా ఉండవని అంటారు. ఈ ఆలయం పక్కగా ప్రవహిస్తున్న క•ష్ణా నదిలో మధ్య ఒక ద్వీపం ఏర్పడ్డది. ఆ ద్వీపంలో ఒక కోట ఉంది. ఆకోటనే నిజాం కోట అంటారు. బీచిపల్లి రెండవ మంత్రాలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం.
దరూరు: ఇది గద్వాలకు 6 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోని స్వామిని 15, 16వ శతాబ్దంలో విజయనగర రాజులు తమ కులదైవంగా ఆరాధించారని అంటారు.
మొదలకల్‍: ఇది గద్వాలకు 10 మైళ్ళ దూరంలో ఉంది. దీనిని బ్రహ్మండపురాణంలో ఆదిశిలా క్షేత్రంగా పేర్కొనబడినట్లు చెప్తారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వేంకటేశ్వరస్వామికి రథోత్సవం జరిగేది.
వేణీ సోంపురం: ఇది గద్వాలకు 15 మైళ్ళ దూరంలో
ఉంది. శ్రీ వ్యాస తత్త్వజ్ఞులు ఇక్కడ ఒక చెఱువును త్రవ్విస్తుందగా లభించిన రెండు వేణు గోపాలస్వామి విగ్రహాలలో ఒకదానిని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు.
ఉత్తనూరు: ఇది ఐజకు 2 మైళ్ళ దూరంలో ఉంది. 1732-62 మధ్య కాలంలో భగవన్‍ దాసుడు అనే కన్నడ మహనీయుడు ఇక్కడ జీవించాడు. ఇప్పటికీ అక్కడ భగవన్‍ దాసరబావి అన్న పేరుగల బావి ఉన్నది.
రాజోలు: ఇది గద్వాల సంస్థానానికి మొదటి రాజధాని, సోమభూపాలుని కాలంలో రాజధాని రాజోలునుండి గద్వాలకు మారింది. గద్వాలలో వలె ఏడంకణాల దర్బారు హాలు ఉండేది. దుర్గ మధ్యన వీరనారాయణస్వామి ఆలయం ఉండేది. దీని పక్కనున్న తుంగభద్రా నదీ తీరాన రామేశ్వరాలయంలో గల తెల్లరాతి మీద చాళుక్య భూలోక ముల్లుని శాసనం ఉంది. ఇవికాక వల్లూరు, కూచినెర్ల, చింతరేవుల మొదలగు ప్రసిద్ధ ప్రదేశాలు గద్వాల సంస్థానంలో ఉండేవి.
గద్వాల ప్రభువుల ఇంటిపేరు ముష్టిపల్లివారు, వీరిది మిడిమిళ్ళ గోత్రం, వీరిది పాకనాటి రెడ్లవంశం, గద్వాల సంస్థానాధీశుడు, గద్వాల కోట నిర్మాత అయిన పెదసోమ భూపాలుని తండ్రి నుండి చిట్టచివరి పరిపాలకురాలగు ఆది లక్ష్మీదేవమ్మ కుమారుడు. యువరాజు క•ష్ణరామ భూపాలుడు వరకు అనేకులు గద్వాల సంస్థానాన్ని పరిపాలించారు.


అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వాడు శ్రీ సోమనాద్రి. ఇతనే పెదసోమ భూపాలుడు. ఈయన 1683-1712 వరకు పాలించాడు. ఇతను బక్కాంబిక పెద్ద భూపాలుర కుమారుడు. సోమనాద్రి ఎంత వీరుడో అంత భగవద్భక్తుడు. ఇతని రాజ్య వైశాల్యము గురించి ‘‘యథాశ్లోక భారతోద్యోగపర్వం’’ కావ్యాన్ని రాసిన వీర రాఘవాచార్యులు ఇట్లా ప్రశంసించాడు.
సీ. ‘అవిజ’ ‘దరూరు’ లకాదిగా ‘దేశాయి
‘నాడగౌడ’ మహోన్నతిఁదనర్చి,
మించి వైరులను భంజించి ‘‘కందనవోలు’’
‘‘బనగానపల్ల్యహోబలము’’ ప్రకట
మగు ‘‘సిరువెళ్ల’’ నంద్యాల ‘‘సిద్ధాపుర’’
మను పరిగణలెల్ల నాక్రమించి,
ధీరుడై లోక దుర్వారతేజమున ‘‘యా
ధవని’’ రాజ్యమున కాధ్యక్షుడగుచు
గీ. ‘‘నాడగౌడు, దేశాయి, సర్నాడగౌడు’’
తానయై, దోర్భలోగ్ర ప్రతాపదాన
వహ్నులను మ్లేచ్ఛకాసన ప్రజములేర్చి
సోమన•పమౌళి విలసిల్లె ధామమౌళి.
(సంస్థానముల సాహిత్య సేవ, పేజీ నెం 31)
అని కవులచేత ప్రశంసింపబడ్డవాడు.


అంతే కాక 1698-1704 మధ్యన గద్వాల కోటని నిర్మించడమేకాక ‘శోభనాద్రి’ అని కవులచే కీర్తింపబడ్డాడు. ఈయన సర్వతోముఖ ప్రజ్ఞ కలిగిన పరిపాలకుడు. దక్కను సుల్తానులను ముఖ్యంగా బీజపూరు సుల్తానులను జయించటంలో ఔరంగజేబుకు సహాయపడ్డాడు. ఇతని సాహసానికి మెచ్చి బెరంగజేబు 1704 ‘రాజా’ బిరుదును ప్రసాదించి గద్వాల ప్రాంతంపై ఆధిపత్యం ఇచ్చి సత్కరించాడు. వీరి పూర్వపు రాజధాని రాజోలు. గద్వాలలో కేశవస్వామి ఆలయాన్ని ఈయనే కట్టించాడు. నైజాం ఉల్‍ ముల్క్ పంపిన సర్దారు దిలీల్‍ఖాన్‍కును సోమనాద్రికిని నిడుదూర్‍ మిట్టల వద్ద పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో క్రీ.శ. 1712 నందన సంవత్సర జ్యేష్ట శుద్ధ అష్టమినాడు సోమభూపాలుడు మరణించాడు.
పెదసోమభూపాలుని తరువాత అతని పుత్రుడు తిరుమల రాయుడు చిన్నవాడు కావటం చేత వెంకన్న, రమణయ్య అను రాజోద్యోగులు కొంతకాలం రాజ్యభారం చేసారు. అనంతరం సోమనాద్రి భార్యలు అమ్మాంబ, లింగాంబ రాజ్యాధికారం చేసారు. వీరిలో క్రీ.శ. 1725-38 మధ్య గద్వాల నేలిన లింగమాంబ రాణి ప్రసిద్ధురాలు. ఈమె కాలంలో గద్వాల రాజ్యం విస్తరించింది. గద్వాలలో గల లింగమ్మ బావిని త్రవ్వించింది ఈమెనే. లింగమ్మరాణి తరువాత ఆమె కొడుకు తిరుమల రాయుడు మూడేండ్లు పరిపాలించాడు. తిరుమలరాయని తరువాత అతని తమ్ముడు రామరాయలు 1746-1761 రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన కాలంలో గద్వాల ఎంతో అభివ•ద్ధి చెందింది.
రామరాయల తరువాత ఆయన అన్న కుమారుడు తిరుమల రాయని కొడుకు చినసోమ భూపాలుడు రాజ్యానికి వచ్చాడు. ఈయన మహావీరుడు. ఈయన 1762 నుండి 1793 వరకు పరిపాలించారు. నైజాం ప్రభువుల చేత ప్రశంసలు పొందినవాడు. తరువాత 2వ రామరాయుడు క్రీ. శ. 1794 – 1806 మధ్య రాజ్యపాలన చేసాడు. తరువాత 1924లో సీతారామ్‍ భూపాల్‍ అకాల మరణంతో గద్వాల సంస్థానం అనేక సమస్యలకు లోనైంది. కానీ లక్ష్మీదేవమ్మ చాకచక్యంగా పరిపాలించి గద్వాల పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చింది. ఈమె కాలంలో గద్వాలకు ‘విద్వద్గద్వాల’ అని పేరు వచ్చింది. ఈమె కాలంలో జరిగిన సాహిత్యసేవ గద్వాల చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది. 1947లో గద్వాల సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనం వరకు ఈమె గద్వాల రాణిగా ఉన్నారు. ఈమెకు కొడుకులు లేనందున తన పెద్ద కుమార్తె వరలక్ష్మీదేవి కొడుకు క•ష్ణరామ భూపాల్ని దత్తత తీసుకొని రాజ్య పట్టాభిషేకం చేసింది. కాని శ్రీ ఆదిలక్ష్మి దేవమ్మనే రాజ్య భారము నిర్వహించటం వలన ఆమెనే గద్వాల రాజ్యానికి చివరి పరిపాలకురాలిగా చెప్పవచ్చు. ఈ విధంగా గద్వాల సంస్థానాన్ని అనేక మంది రాజులు, రాణులు రాజోద్యోగులు పరిపాలించారు.


గద్వాల సంస్థానంలో గొప్పగా చెప్పుకోవల్సింది వీరి సాహిత్య సేవ. తెలుగు భాషలో ప్రామాణిక సాహిత్యం నన్నయ్యకు పూర్వం ఎంత ఉన్నదో తెలియదు. కానీ నన్నయ్య నుండే మనకు ప్రామాణిక సాహిత్యం దొరుకుతుంది. నన్నయ్యను ఆదరించిన చాళుక్య చక్రవర్తులకు పూర్వం తెలుగు నేలను పాలించిన శాతవాహనులు కాని, ఇక్ష్యాకులుకాని, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినులు మొదలైన రాజవంశాల వారు ఎవ్వరు తెలుగు భాషలో కావ్యాలు రాయించినట్లు కానీ తెలుగును రాజభాషగా చేసినట్లు కానీ మనకు ఆధారాలు కనబడటంలేదు. వీరు సంస్క•త ప్రాక•త భాషలనే రాజభాషలుగా వాడినట్లు తెలుస్తుంది. నన్నయ్య కాలం తరువాతనే తెలుగు సాహిత్యం వికాసం పొందిందని చెప్పవచ్చు. నన్నయ్య నుండి నేటి ఆధునికంలో అత్యాధునిక కాలం వరకు తెలుగు సాహిత్యం దశలను దిశలను దాటుకుంటు మార్చుకుంటు సాగుతుంది. ఇట్లా వికాసం చెందటానికి పూర్వం తెలుగు సాహిత్యంలో జరిగిన క•షి, అన్వేషణ, పోషణనే కారణం.
సంస్థానాలలో జరిగిన సాహిత్య పోషణ తెలుగు సాహిత్య చరిత్రలో పేర్కొనదగింది. సంస్థానాధీషులు కవులను, కళాకారులను పోషించటమే కాక వేదశాస్త్ర పండితులను, సంగీత న•త్యాది లలిత కళానిపుణులను సన్మానించి, విజ్ఞాన, వినోద, వికాసాలకు కారణ మయ్యారు. సంస్థానాధీషులలో కొందరు సాహితీ సంస్థలకు, గ్రంథ ప్రచురణ సంస్థలకు విరాళాలు ఇచ్చి భాషోద్దరణ చేసారు. కవి పండిత గాయకులను పోషించటమే కాక ఇతర ప్రాంత కవి పండితులను గౌరవించారు. సంస్థానాదీషులలో కొందరు కవి పోషకులే కాక స్వయంగా కవులు కూడా.
నిజాం రాష్ట్రంలోని సంస్థానాలలో గద్వాల సంస్థాన వాఙ్మయ చరిత్ర సువర్ణాక్షరాలతో రాయదగింది. గద్వాల సంస్థానం అన్నింటికీ మించి ‘విద్వద్గద్వాల’ అని సార్ధక్యం పొందింది. తెలంగాణలోని గద్వాల సంస్థానం సాహిత్య పోషణలో పేరెన్నికగన్న సంస్థానం. పెదసోమభూపాలుడు మొదలుకొని క•ష్ణరామ భూపాలుని వరకు గద్వాల రాజులు సాహిత్య పోషణలో పేరుపొందినవారు.
గద్వాల సంస్థానాధీషుడు, పెదసోమ భూపాలుడు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పండితులను, మాఘమాసంలో కవిగాయకులను సన్మానం చేసే సత్సంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఈయనకు కవిత్వంలో ప్రశంసనీయ ప్రావీణ్యం ఉండేది. ఇతను సంస్క•తంలో రాసిన ‘గీతగోవిందం’ గ్రంథాన్ని ఆంధ్రీకరించాడు. ప్రతిశ్లోకానికి ఒక పద్యం, ప్రతి అష్టపదికి ఒక చూర్ణికను రచించాడు. ఈయన ఎందరో ప్రసిద్ధమైన కవులను పోషించాడు. అందులో శ్రీ కొటికెలపూడి వీర రాఘవకవి ఒకరు.ఈయన వినుకొండ సంస్థానవాసి. పెదసోమ భూపాలుడు ఇతని కవితా ధోరణికి ఆనందించి ‘‘నూతన తిక్కన సోమయాజులు’’ అనే బిరుదు నిచ్చి సత్కరించాడు. అట్లాగే శ్రీ ఆయలూరు కందాళ యార్యుడు ‘అలంకారశిరోభూషణం’ రాసాడు. పెదసోమ భూపాలుడు తన కాలంలో ఎందరో కవి పండితులను పోషించి, సత్కరించి హితోధికంగా సాహిత్యసేవ చేసాడు.
పెదసోమభూపాలుని తరువాత ఆయన మనుమడు శ్రీ చిన సోమభూపాలుడు (1762-1793) చెప్పుకోదగ్గ సాహిత్య పోషకుడు. ఈయన ఆస్థానంలో దిగ్గజాలైన కవీశ్వరులు ఉండిరి. శ్రీ కాణాదము పెద్దన సోమయాజి చతుర్విద కవితలను చెప్పగల సమర్ధుడు. ఈయన ‘ముకుందా విలాసము’, ‘ఆధ్యాత్మరామాయణం’ యథాశ్లోక తాత్పర్య రామాయణ బాలకాండ రచించిన విద్వత్కవి. మరో విద్వత్కవి శ్రీ కొత్తపల్లి రామాచార్యులు. ఈయన యథాశ్లోక తాత్పర్య రామాయణంలోని అయోధ్య కాండను ఐదు ఆశ్వాసాలలో రాసాడు. చిన్నభూపాలుని ఆస్థానంలో ఉన్న మరోకవి శ్రీ గార్గేయపుర సుబ్బశాస్త్రి యథాశ్లోక తాత్పర్య రామాయణంలోని అరణ్యకాండను మూడు ఆశ్వాసాలు రాసాడు. శ్రీ కామసముద్రం అప్పలాచార్యులు మరో విద్వత్కవి. ఈయన ‘‘విద్వత్కవికుంజర’’ బిరుదాంకితుడు, సంస్క•త ప్రాక•తాంధ్ర భాషలలో శతాధిక గ్రంథాలను రాసాడు. ‘క•ష్ణలీలా తరంగిణి’ ని ‘ఆంధ్రాష్ఠావది’ అన్న పేరున తెలుగు అనువాదం చేసాడు. ఇలా అనేక మంది కవి పండితులను చినసోమభూపాలుడు పోషించాడు.
గద్వాల సంస్థానంలో శ్రీ ఆదిలక్ష్మి దేవమ్మ కాలం సువర్ణాక్షరాలతో లిఖింపదగినది. సీతారామ భూపాలుడు మరణించిన తరువాత ఈమె రాజ్యభారం వహించింది. కార్తీక – మాఘ మాసల్లో జరిపే సన్మానాలు ఈమె కాలంలో ఎంతో అపూర్వమైనవి. ప్రాచీన తాళపత్ర గ్రంధాలు, అముద్రిత గ్రంథాలు ఈమె క•షితో వెలుగులోకి వచ్చాయి. ఈమె కాలంలో జరిగిన సాహిత్య సేవను ఆశ్రితుల సాహిత్యసేవ, నవీనుల సాహిత్య సేవ, రాజబంధువుల సాహిత్యసేవ అని మూడు విధాలుగా విభజించవచ్చు. శ్రీ ఆదిలక్ష్మి దేవమ్మ ఆస్థానంలో చెప్పుకోదగ్గ కవి పోకూరి కాశీపతి. ఈయన విశ్వబ్రాహ్మణ కులసంభూతులు. చతుర్విధ కవితా విశారదుడు. ఈయన ‘హరిశ్చంద్రోపాఖ్యానము’, ‘సారంగధరీయము’ అనే గ్రంథాలు రాసారు. అనేక సన్మానాలు, సత్కారాలు పొందిన కవి. ఆదిలక్ష్మీ దేవమ్మ గారి సంస్థానంలో మరో ప్రసిద్ధకవి శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి. ఈయన ‘శ్రీకేశవేంద్ర విలాసము’ రాసారు. ఈయన లక్ష్మీదేవమ్మ గారి ఆస్థానంలో విద్యాధికారిగా కూడా ఉన్నారు.


రాజమండ్రిలోని ఆంధ్రేతిహాస పరిశోధక మండలి పోషకురాలిగా శ్రీ ఆదిలక్ష్మీదేవమ్మ గారి సేవ అనిర్వచనీయమైంది. శిరోమణి సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రిగారి గొప్ప లక్ష్యలక్షణ పరిజ్ఞానంగా రూపొందిన ‘తత్సమ చంద్రిక’ శ్రీ ఆదిలక్ష్మి దేవమ్మగారి ప్రాచ్య విద్యాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంది. మహారాణి కాలంలో సత్కారాలు పొందిన అనేక మంది కవి పండితులలో శ్రీయుతులు నెమలూరి వేంకటశాస్త్రి శతావధాని, సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి వీరు సంస్క•తాంధ్రంలో అనేక గ్రంథాలు రాసారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి, దీపాల పిచ్చయ్య శాస్త్రి, అనుముల వెంకటశేషకవి శతావధాని, శ్రీ విక్రాల నరసింహాచార్యులు శతావధాని, శ్రీ గోపాలపేట రామచంద్రాచార్యులు శతావధాని, శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి, జానపాటి పట్టాభిరామశాస్త్రి (సంస్క•తాంధ్ర కవనమున భావ కల్పక శిరోమణి అన్న బిరుదు గద్వాలలో పొందినారు). తెల్కపల్లి రామచంద్రశాస్త్రి మల్లాది, అచ్యుతరామశాస్త్రి, అవధానం చంద్రశేఖరశర్మ మొదలైన పండితులు గద్వాల సంస్థానంలో సత్కారాలు పొందినవారే.
తరువాత పేర్కొనదగిన గద్వాల రాజు శ్రీ ముష్టిపల్లి రామభూపాలుడు. ఈయన స్వయంగా పండితుడు. వీరికి పురాణం దీక్షాచార్యుల వారు విద్యాగురువులు. ఆ కాలంలో ప్రధాన విద్యలు సంస్క•త తెలుగు భాషలలో మాత్రం బోధన జరిగేది. రాజ్య వ్యవహారాలు మాత్రం ఫార్శీ, ఉర్దు వంటి భాషల్లో జరిగేవి. ఈ రాజు అస్థానంలో భైరంపల్లి తిరుమలరాయకవి సంస్క•తాంధ్రాలలో ఆశుకవితను చెప్పేవాడు. తరువాత పేర్కొనదగిన వాడు రామభూపాలుని గురువు పురాణం దీక్షాచార్యులు. ఈయన సహాయం వల్లనే భూపాలుడు ‘ఛందోముకురం’ అనే సంస్క•త గ్రంథాన్ని రాసారు.
ఈ రామభూపాలుని సమయంలోనే శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులు మొదటిసారి గద్వాలకు వచ్చారు. వీరు తమ ఆశుకవితా, శతావధానాల చేత విద్వత్కవిగాయక పండిత గద్వాల సభను మెప్పించి ఆనందపరిచిరి. ఆ తరువాత శ్రీ తిరుపతి వేంకటకవులు మూడు నాలుగు సార్లు గద్వాలకు వచ్చి రామభూపాలుని ఆయన కొడుకు సీతారామభూపాలుని చేత విశేష సత్కారాలను, నవరత్న కంకణ బహుమానాలను పొందారు. గద్వాల సంస్థాన కీర్తిని ‘‘అటు గద్వాల ఇటు చెన్నపట్టణ’’ అనే పద్యాలతో నలుదిశల వ్యాపింపజేసారు.
ఆంధ్రనాటక పితామహుడు శ్రీ ధర్మవరం క•ష్ణమాచార్యులు (1853-1912) వారికి 1910లో ‘‘ఆంధ్ర నాటక పితామహా’’ అనే బిరుదును ప్రసాదించి ఆదరించింది గద్వాల సంస్థానాధీషులే. చల్లపల్లి సుబ్బయ్య గద్వాల సంస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసుడుగా గౌరవం పొందినవాడు. తమ ఆస్థానంలో కవులకు పండితులకు సముచితస్థానం ఇచ్చి గౌరవించారు గద్వాల సంస్థానాధీషులు.
ఈ విధంగా గద్వాల సంస్థానం సాహిత్య సంపదతో విరాజిల్లింది.
ఉపయుక్త గ్రంథ సూచిక
1) గద్వాల సంస్థానము- సాహిత్య సేవ డా. హరి శివకుమార్‍, శ్రీక•ష్ణ ప్రచురణ వరంగల్‍ – 1987
2) సంస్థానములు సాహిత్య పోషణ, ఆచార్య తూమాటి దొణప్ప, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు- 1969
3) గోల్కొండ కవితా సంచిక
4) కాకతీయ కవితా సంచిక
5) సంస్థానముల సాహిత్య సేవ శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‍, 2012
6) The Ruling chiefs, Nobles & Zamindars of India, A. Vadivelu, 1915

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *