జీవ వైవిధ్యానికి మారుపేరుగాగ్రేట్‍ హిమాలయన్‍ నేషనల్‍ పార్క్కన్జర్వేషన్‍ ఏరియా


గ్రేట్‍ హిమాలయన్‍ నేషనల్‍ పార్క్ కన్జర్వేషన్‍ ఏరియా అనేది ప్రపంచంలోని రెండు ప్రధాన బయోజియోగ్రాఫిక్‍ రాజ్యాలైన పాలెఅర్కిటిక్‍, ఇండోమలయన్‍ రాజ్యాల మధ్య పర్యావరణ పరంగా విభిన్నమైన పశ్చిమ హిమాలయాలలో ఉంది. ఈ ప్రాపర్టీ హిమాలయ ముందరి శ్రేణుల రుతుపవన ప్రభావిత అడవులు, ఆల్పైన్‍ పచ్చికభూములను రక్షిస్తుంది, ఇది ఎత్తు పరంగా అనేక విభిన్న సున్నిత జీవావరణ వ్యవస్థలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జాతుల వైవిధ్యం సుసంపన్నంగా ఉంది. ఈ పరిరక్షణ ప్రాంతం జీవవైవిధ్య పరిరక్షణకు దాని అత్యుత్తమ ప్రాముఖ్యతను చాటిచెబుతుంది.


ప్రాథమ్యం: (x)
(x): ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన జీవావరణ ప్రాంతంలో ఉంది, ఇది పెద్ద సంఖ్యలో అంతరించిపోతున్న పుష్ప, జంతుజాతులకు ఆవాసాలను అందిస్తోంది. శీతోష్ణస్థితి మార్పుల ప్రభావాల నుండి వాటిని కాపాడుతోంది.
గ్రేట్‍ హిమాలయన్‍ నేషనల్‍ పార్క్ కన్జర్వేషన్‍ ఏరియా హిమాచల్‍ ప్రదేశ్‍లోని బియాస్‍ నది పరీవాహక ప్రాంతంలో ఉంది. మారుమూల ప్రాంతంలో ఉండడం, అననుకూల వాతావరణ పరిస్థితులు, దాన్ని చేరుకోలేకపోవడం వంటివి అన్నీ కూడా ఈ ప్రాంత సంరక్షణకు దోహదపడ్డాయి. ఉదయం పూట సూర్యుని కిరణాలకు బంగారు రంగులోకి మారే హిమాలయ శిఖరాలు ఆకట్టుకునేలా ఉంటాయి. పగటిపూట సూర్యకిరణాల వేడికి మంచు కరిగిపోతుంటుంది. మంచుతో కప్పబడిన శిఖరాలు, హిమానీనదాల నుండి ముఖ్యంగా తీర్థన్‍, సైన్జ్, జీవా, పార్వతి వంటి అనేక శాశ్వత నదులు ప్రవహిస్తాయి. ఇవి బియాస్‍ నదిలో కలుస్తాయి.


ఉష్ణమండల వాతావరణం, సమశీతోష్ణ వాతావరణం కలిసే చోట గ్రేట్‍ హిమాలయన్‍ నేషనల్‍ పార్క్ కన్జర్వేషన్‍ ఏరియాఉంది. 1,300 నుండి 6,000 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం విభిన్న ఆవాసాలతో అపార జీవ వైవిధ్యాన్ని కలిగిఉంటుంది. ఇక్కడ సమశీతోష్ణ ఓక్స్ మొదలుకొని లోయలలో పైన్స్, ఫిర్‍, స్ప్రూస్‍, బిర్చ్ వంటి చెట్లు ఉంటాయి. దక్షిణం వైపున ఉన్న వాలు ప్రాంతాలలో ఆల్పైన్‍ పొదలు, గడ్డి వంటివి పెరుగుతాయి.


స్థానికంగా జుజురానా అని పిలువబడే వెస్ట్రన్‍ ట్రాగోపాన్‍ అనేది నెమలి కుటుంబానికి చెందిన అందమైన పక్షి. హిమాచల్‍ వాసుల హృదయాల్లో ఇది ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఈ ప్రదేశంలో ఈ పక్షులు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. జానపద కథల ప్రకారం ఇతర పక్షులు ఒక్కొక్క ఈకను దానం చేసినప్పుడు ఇది ఉద్భవించింది. అందుకే దీని శరీరం వివిధ రంగులలో చూసేం దుకు అందంగా ఉంటుంది. ఈ పక్షికి ‘‘పక్షుల రాజు’’ అనే బిరుదు కూడా ఉంది!
ఈ ప్రాంతంలో 832 వృక్ష జాతుల అద్భుతమైన వైవిధ్యం హిమాచల్‍ ప్రదేశ్‍ వృక్షజాలంలో దాదాపు మూడింట ఒక వంతును సూచిస్తుంది. గంభీరంగా కనిపించే దేవదారు, బ్లూ పైన్‍, అనేక అబీస్‍ (ఫిర్‍) మరియు టాక్సస్‍ (యూ) జాతులు ప్రధానంగా కనిపించే శంఖు ఆకారపు చెట్లు. వెడల్పాటి ఆకుల చెట్లతో కూడిన అడవులలో ఓక్స్ (బాన్‍ మోరు, ఖర్సు), హార్స్ చెస్ట్నట్‍, వాల్నట్‍, మాపుల్‍, ఆల్డర్‍, బిర్చ్, యాష్‍ వంటి చెట్లు కనిపిస్తాయి. ఇక్కడి వృక్ష శ్రేణి రోడోడెండ్రాన్‍, జునిపెర్‍ జాతులతో కలిపి ఉంటుంది. ఆల్పైన్‍ పచ్చిక భూములు వాటి సహజ పరిసరాలలో సంరక్షించబడిన పొదలు, ఔషధ, సుగంధ మొక్కలను కలిగి ఉంటాయి.


క్షీరద జంతుజాలం కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. మంచు చిరుత, కస్తూరి జింక, నీలి గొర్రెలు (భరల్‍), హిమాలయన్‍ తహర్‍, ఐబెక్స్, హిమాలయన్‍ గోధుమరంగు ఎలుగుబంటి, గోరల్‍, కొండ మేక వంటి ముప్పైకి పైగా జాతులు ఇక్కడ ఉన్నాయి. నెమలి కుటుంబానికి చెందిన ఐదు జాతుల పక్షులు కనిపిస్తాయి. యావత్‍ ప్రపంచంలోనే అత్యంత భారీ సంఖ్యలో ఇవి ఇక్కడ కనిపిస్తాయి. ఇతర అద్భుతమైన పక్షులలో చీర్‍, మోనాల్‍, కోక్లాస్‍, కలీజ్‍ నెమళ్లు, స్నో పార్ట్రిడ్జ్, హిల్‍ పార్ట్రిడ్జ్, హిమాలయన్‍ స్నోకాక్‍ ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ ఎత్తయిన ప్రాంతాల్లో వేటికవేగా తమ స్వంత ప్రత్యేక ప్రదేశంలో నివసిస్తాయి.


ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఈ ప్రాంతం నిజంగా ఒక అద్భుతం. ఇది రూపి భాబా వన్య ప్రాణుల అభయారణ్యం, పిన్‍ వ్యాలీ నేషనల్‍ పార్క్, కనవర్‍ వన్యప్రాణుల అభయారణ్యంతో కలిసి ఉన్నందున, ప్రపంచ వారసత్వ ఆస్తి పరిమాణాన్ని క్రమంగా పెంచాల్సిన అవసరం
ఉంది. ఈ ప్రాంతాలన్నీ కలిసి వాయువ్య హిమాలయాలలో ఏకైక అవిచ్ఛిన్న ప్రాంతం (2,300 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం). సహజరీతిలో వన్యప్రాణుల ఆవాసాలను కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని రాబోయే తరాల కోసం సంరక్షించాల్సిన అవసరం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *