మనిషి మనస్సులోని అంతరార్థాన్ని సాటి మనిషి కూడా అంచనావేయలేడనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ఒక విన్నూత సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఉపకరణాలు మాత్రం, మనిషి మానసిక స్థితిని సాధికారికంగా అంచనా వేసి తదనుగుణంగా, అతనికి సేవచేసే రోజు త్వరలోనే సాకార మవుతుందని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు.
సాధారణంగా అలెక్సా, సిరి లాంటి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత డిజిటల్ అసిస్టెంట్లు, మనకు ఫలానా పాట కావాలని అడిగితే ఆ పాటను ప్లే చేస్తాయి. వాతావరణం ఎలా ఉందని అడిగితే వాతావరణ వివరాలు అందిస్తాయి. అయితే ఫలానా పాట కావాలని అడిగితే, ఇప్పుడు మీరున్న మానసిక స్థితికి ఆ పాట కాకుండా, ఇంకో పాట వినాలని లేదా ప్రస్తుత వాతావరణ పరిస్థితి బాగా లేదు కాబట్టి రేపు మీరు వెళ్ళాలనుకున్న ఫీల్డ్ ట్రిప్ రద్దు చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం మానవాళికి చేరువయ్యే రోజు మరెంతో కాలం పట్టకపోవచ్చు. ఇంతకీ ఆ వినూత్న, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానమేంటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉందా! దాని పేరే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్ (ఏజీఐ) ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి తెలుసు, మరి ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్ అంటే, ఏంటో… పదండి తెలుసుకుందాం…!!

ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్ అంటే:
మానవుడు చేయగలిగే ఎలాంటి మేధోపరమైన పనినైనా యంత్రాలు లేదా సాఫ్ట్వేర్ సహాయంతో చేయగలిగే విన్నూత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్ (ఏజీఐ) అంటారు. ఇందులో తార్కికం (Reasoning), సాధారణజ్ఞానం (Common Sense), నేపథ్యజ్ఞానం(Background knowledge), అమూర్త ఆలోచన (Alast ract thinking), కారణము మరియు ప్రభావాల మధ్య తేడాను గుర్తించడం లాంటి సామర్థ్యాలు మిళితమై ఉంటాయి.
ఏజీఐ అనేది ఒక రకమైన కృత్రిమ మేధ. ఇది అర్థం చేసుకోగలదు, చదవగలదు మనుషుల మేధస్సు మాదిరిగా తన తెలివి తేటలను రకరకాల పనులకు వాడుకోగలదు. ప్రస్తుత ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) మనం నిర్దేశించిన పనులను మాత్రమే చేస్తుంది. కానీ ఏజీఐకి అర్థం చేసుకునే సామర్థ్యమూ ఉంటుంది. వేర్వేరు రంగాల్లో సమస్య లను పరిష్కరిస్తుంది. నేర్చుకోవడం, తనను తాను మెరుగుపరుచుకోవడం ద్వారా వ్యవసాయం, వైద్యం, రక్షణ లాంటి విభిన్న రంగాల్లో తన సేవలను అందిస్తుంది. అయితే ఈ సాంకేతికత ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది.
ఏజీఐకి ఆద్యుడెవరు!!
థిమరిటికల్ కంప్యూటర్ సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు పితామహుడిగా భావించే అలెన్ట్యూరింగ్ అన్న శాస్త్రవేత్త 1950లో ‘‘కంప్యూటింగ్ మెషినరీ అండ్ ఇంటలిజెన్స్ అన్న పరిశోధనా పత్రంలో ‘‘ట్యూరింగ్ టెస్ట్’’ ను ప్రతిపాదించడం ద్దారా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్ అన్న భావనకు నాంది పలికాడు.
ట్యూరింగ్ టెస్ట్ అంటే: యంత్ర మేధస్సును అంచనావేయడానికి ఉపయోగించే సాధనాన్నే ‘‘ట్యూరింగ్ టెస్ట్’’ అంటారు. ఈ పరీక్షలో ఒక యంత్రం మానవుడితో సంభాషిస్తున్నపుడు, సంభాషిస్తున్న మానవుడు తాను మరొక మానవుడితో మాట్లాడుతున్నాడా లేక యంత్రంతో మాట్లాడుతున్నాడా అన్న బేధాభిప్రాయం గుర్తించలేనపుడు, సంభాషిస్తున్న యంత్రం ‘‘మానవుడి లాంటి మేధస్సు (Human Like Inteligence) కలిగిఉన్నట్లు’’ గా పరిగణిస్తారు.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ – పరిణామక్రమం:
i. ఆర్టిఫిషియల్ న్యారో ఇంటలిజెన్స్:
ఇది మొదటిదశ సాధారణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్నే న్యారో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంటారు.
దీని పనితీరులో మెషిన్‌లర్నింగ్, అనే సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఒక అంశానికి మాత్రమే పరిమితమై, ఒక సమస్యను పరిష్కరించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఉదా: సిరి, అలెక్సా, కార్ట్నా
ii. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్:
ఇది రెండవ దశ. దీని పనితీరులో మెషిన్ ఇంటలిజెన్స్ అన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రధానపాత్ర పోషిస్తుంది.
ఇందులో కంప్యూటర్ మానవ మెదడులాగా స్మార్ట్ పనితీరును ప్రదర్శిస్తుంది. ఇది అభివృద్ధి దశలో ఉంది.
iii. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటలిజెన్స్:
ఇది మూడవదశ. మెషిన్ కాన్షియస్నెస్ అన్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ దశలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రతీరంగంలో మానవమెదడు కన్నా మెరుగైన పనితీరు ప్రదర్శించే అవకాశం ఉంది. దీనినే ‘‘సూపర్ మేధ’’ గా వ్యవహరిస్తారు. ఇది కూడా అభివృద్ధి దశలో ఉంది.
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్ గురించి ఓపెన్ ఏఐ మాజీ పరిశోధకుడు లియోపాల్డ్ అషెన్ బెన్నర్ ఇటీవల తన సిద్ధాంత వ్యాసంలో కొన్ని విషయాలు పేర్కొన్నాడు. అవి సాంకేతిక రంగ నిపుణులను ఆలోచనలో పడేస్తున్నాయి. ఏజీఐ పోటీ ఇప్పుడిప్పుడే మొదలైందని ఇది 2027 లేదా 2028 కల్లా పూర్తిగా ఊపదుకుంటుందని, 2030 నాటికి సూపర్ఇంటలిజెన్స్ను సాధిస్తుందని ఆయన చెబుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఆలోచించగల, కంప్యూటీకరణ, వివేచనశక్తి గల యాంత్రాలను సృష్టించే పనిలో పడ్డాయని, ఇది 2025 లేదా 2026 డిగ్రీ విద్యార్థులనూ మించగలవని అంచనా వేస్తున్నారు. ఈ దశాబ్దం చివరికి మనుషులను మించిన తెలివితేటలను, మేథస్సును, సాధించగలవనీ అంటున్నారు. ప్రస్తుతం కేవలం కొద్దిమందే ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారనీ త్వరలోనే ప్రపంచానికంతా తెలిసివస్తుందని వివరిస్తున్నారు. కృత్రిమ మేధ అతి త్వరలోనే సొంతంగా పరిశోధనలు నిర్వహించే స్థాయికి చేరుకోవచ్చన్నది అషెన్బ్రెన్నర్ జోస్యం.
అదే నిజమైతే ఏఐ వ్యవస్థలు తమకు తామే పరిశోధనలు చేపట్టగలవు. కృత్రిమ మేధ కోసం మరింత మెరుగైన డిజైన్లను, పద్ధతులను సృష్టించగలవు. ఈ డిజైన్లు కేవలం బేసిక్ ఫీడ్ బ్యాక్ ద్వారానే మరింత అధునాతన ఏఐ వ్యవస్థలను రూపొందించగలవు. ఇలా చివరికి సూపర్ ఇంటలిజెన్స్ మారగలవు.
ఏజీఐ అనువర్తనాలు:
ప్రస్తుత ఏఐ కేవలం అందుబాటులోని డేటా ఆధారంగా సమాచారాన్ని వేగంగా అందిస్తోంది. అడిగిన దానికి తనలో నిక్షిప్తమైన సమాచారాన్ని వేగంగా జల్లెడ పట్టి సరైదనుకున్న సమాధానాన్ని ఇస్తుందంతే, గొంతు గుర్తు పడుతున్నా, ఎవరి గొంతునైనా అనుకరిస్తున్నా మా•ల్లోని వ్యంగ్యాన్ని, ఉద్వేగాల్ని, గొంతు హెచ్చుతగ్గుల్లోని వ్యత్యాసాల మార్పులను ఏఐ పట్టుకోలేక పోతోంది.
అదే ఏజీఐ అయితే మనిషిలా ఆలోచిస్తుంది. మన అవసరాలను, అలవాట్లను అవగాహన చేసుకొంటుంది. మానవ అభిజ్ఞ నైపుణ్యాలను (కాగ్నిటివ్ స్కిల్స్), తర్కాన్ని జోడించి… ఏది మంచో, ఏది చెడో కూడా గుర్తించి, సూచిస్తుంది. సలహాలిచ్చి, మార్గదర్శకంగా కూడా చేస్తుంది. రోజు రోజుకూ తన పనితీరు నుంచి, నిర్ణయాల నుంచి నేర్చుకుంటూ మేధస్సును మెరుగుపర్చుకోవడం ఇందులోని ప్రత్యేకత. విభిన్న రంగాల్లో ఏజీఐ అనువర్తనాలు కింది విధంగా ఉన్నాయి.

i. వైద్య, ఆరోగ్య రంగం: పెద్ద మొత్తంలో సమాచారాన్ని (డేటా) క్రోడీకరించడం, విశ్లేషించడం ద్వారా వైద్య, ఆరోగ్య రంగంలో రోగ నిర్థారణ, చికిత్స విధానాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించడం, వ్యక్తిగతీకరించిన వైద్యసేవలు అందించడంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ii. ఆర్థికరంగం: ఆర్థికరంగానికి చెందిన సంక్లిష్ట పక్రియలను ఇది సమర్థవంతంగా నిర్వహిస్తుంది. నిజసమయ విశ్లేషణలు (రియల్‌టైమ్ అనలిటిక్స్) మరియు ఖచ్చితమైన మార్కెట్ అంచనాలను అందించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలలో సత్వర నిర్ణయాలను తీసుకోవడాన్ని వేగిరపరుస్తుంది. దాని అధునాతన గణన సామర్థ్యాలతో పరిశ్రమల నిర్వహణను మెరుగుపరుస్తుంది.
iii. విద్యారంగం: విద్యార్థుల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అనుకూల అభ్యాసవేదికలను సృష్టించడం ద్వారా, విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు వారి స్థాయి మరియు నేపథ్యంతో సంబంధం లేకుండా వ్యక్తిగతీకరించిన అభ్యాసాన్ని అందుబాటులోకి తెస్తుంది. తద్వారా విద్యను ప్రజాస్వామ్యీకరిస్తుంది. ధనిక, పేద విద్యార్థుల మధ్య నాలెడ్జ్ గ్యాప్‌ను తగ్గిస్తుంది.
iv. స్వయం ప్రతిపత్తి వ్యవస్థలు (Autonomous Systems): ఇది స్వీయ డ్రైవింగ్ కార్లు, డ్రోన్లు, రోబోలు. మరియు స్మార్ట్ మౌలిక సదుపాయాలతో కూడిన అత్యంత అధునాతన స్వయం ప్రతిపత్తి వ్యవస్థల అభివృద్ధికి దోహదపడుతుంది. అని అప్పటికప్పుడు స్వీయ నిర్ణయాలు తీసుకొని ప్రవర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
v. శాస్త్రీయ పరిశోధన (Scientific Research): ఇది విస్తారమైన డేటాను విశ్లేషించడం, నమూనా పరిశోధనలను నిర్వహించడం ద్వారా శాస్త్రీయ పరిశోధనను వేగవంతం చేయగలదు. ఏజీఐ భౌతిక, రసాయన, జీవ మరియు ఖగోళ శాస్త్ర రంగాలలో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది.
vi. సుస్థిరాభివృద్ధి (Sustainable Development): పర్యావరణానికి సంబంధించిన డేటాను, విశ్లేషించడం, ఇంధన వినియోగాన్ని క్రమబద్దీకరించడం, వాతావరణంలో వచ్చే హానికర మార్పులను నిరోధించడానికి స్థిరమైన పరిష్కార మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా వాతావరణ మార్పులు, వనరుల నిర్వహణ, మరియు పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో ఏజీఐ కీలకపాత్ర పోషిస్తుంది.
vii. అంతరిక్ష అన్వేషణ: ఏజీఐ, అంతరిక్ష పరిశోధన కోసం డ్రోన్, రోబోల వంటి స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను నిర్వహించగలదు. విభిన్న స్పేస్ మిషన్ల ద్వారా సేకరించిన విస్త•తస్థాయి సమాచారాన్ని విశ్లేషించగలదు. తద్వారా సరికొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తుంది.
viii. రక్షణా రంగం: రక్షణ రంగంలో నిఘా, సైనిక వ్యూహాలు, మరియు పోరాట వ్యూహాలను మరింత సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది.
సవాళ్లు:
ఏజీఐ వల్ల ఈ క్రింది సవాళ్ళు తలెత్తగలవని సాంకేతిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
i. పర్యావరణ ప్రభావం: ఏజీఐని అభివృద్ధి పరచడంలో భాగంగా అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ల నెట్‌వర్క్‌ను అనుసంధానించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అత్యంత ఆధునిక, శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను వినయోగిస్తారు. పెద్ద మొత్తంలో ఇంధనాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో హానికర వాయువులు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణంలోకి విడుదలయ్యే అవకాశం ఉంది.
ii. ఉపాధిపై ప్రతికూల ప్రభావం: ప్రపంచ వ్యాప్తంగా జనాభా గణనీయంగా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన పరిస్థితిలో, ఉన్న ఉపాధి అవకాశాలను కూడా ఏజీఐ భర్తీ చేస్తే, ఉద్యోగార్థులు ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. తద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది.
iii.అధికార అసమతుల్యత: సింగ్యులారిటీనెట్ అనే సంస్థ ఏజీఐని అభివృద్ధి పరిచేదిశగా అత్యంత బలమైన సూపర్ కంప్యూటర్లను అనుసంధానిస్తోంది. డీప్‌మైండ్ అన్న సంస్థ కూడా పరిశోధనలు చేస్తోంది. ఫేస్బుక్ అధిపతి మార్క్‌జుకర్‌బర్గ్ కూడా ఈ దిశగా 10 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నారు. ఇలా ఏజీఐ నియంత్రణ కేవలం కొన్ని సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతమైతే సామాజిక ప్రయోజనాలకు తక్కువ ప్రాధాన్యత లభించి, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్ద పీట వేసే అవకాశం ఉంది. తద్వారా దోపిడీ పెరిగి సామాజిక ఆర్థిక అసమానతలు పెరుగుతాయి.
iv. భద్రతా పరమైన ఆందోళనలు: ఒక నాణేనికి బొమ్మాబొరుసు ఉన్నట్లే, ఏజీఐ అభివృద్ధి చెందే కొద్దీ భద్రతాపరమైన సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. డేటా ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ పరంగా సమస్యలు తలెత్తి, జాతీయ భద్రత కూడా ప్రమాదంలో పడవచ్చు.
v. నైతికపరమైన ఆందోళనలు: ఏజీఐ యొక్క అసాధారణ సామర్థ్యాలు మానవ సంబంధాలు, విలువలు, సొంతంగా ఆలోచించి, నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం లాంటి అంశాలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది నైతిక విలువల క్షీణతకు దారితీసే ప్రమాదం ఉంది.
vi. మానవ నియంత్రణ కోల్పోవడం: ఏజీఐ మానవాళి ఆలోచనా పరిధిని, నియంత్రణను మించిపోయే అవకాశం ఉంది అన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ఇది సమాజంలో అనూహ్య లేదా అవాంఛనీయ ఫలితాలకు దారితీస్తుంది.

చివరిగా: మనిషి తను సృష్టించిన సాంకేతికతను తన అదుపులో
ఉంచుకున్నపుడే అది ఉపయుక్తగా మారి అతని మనుగడను ఎవరెస్టు ఎత్తుకు తీసుకెళుతుంది. కళ్లేలు వదిలేస్తే సమస్యలు, సంక్షోభాల లోయల్లోకి పడదోస్తుంది. ఏజీఐ లాంటి ఎంతటి అత్యాధునిక సాంకేతికత అయినా ఇందుకు మినహాయింపు కాదు.
మానవ సమాజ తీరుతెన్నులు, మానవాళికి కలిగే ప్రయోజనాలు, మానవ సమాజ శ్రేయస్సు తదితర అంశాలను గమనంలో ఉంచుకొని మానవీయ విలువలు, భద్రతా ప్రమాణాల కనుగుణంగా ఏజీఐ అభివృద్ధి ముందుకు సాగాలి. ఇందుకోసం అంతర్జాతీయ సహకారంతో పాటు అంతర్ విభాగ పరిశోధనా సంస్థలు, బలమైన నియంత్రణా సంస్థలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ఏజీఐ లాంటి కృత్రిమ మేధ, మనిషి మేధనే కృత్రిమంగా మార్చే ప్రమాదం తప్పుతుంది. సినిమాటిక్ భాషలో చెప్పాలంటే గంగ, గంగగా ఉన్నంత వరకూ ప్రమాదం లేదు. ఎటొచ్చీ గంగ చంద్రముఖిగా మారితేనే సమస్య అలా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మానవాళి చేతుల్లోనే ఉంది. మీరేమంటారు!!
-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప,
ఎ : 955029004