న్యాయమూర్తులపదవీ విరమణల్లో కవిత్వం

ప్రతి దానికి ముగింపు వుంటుంది. ఇది అన్నింటికి వర్తిస్తుంది. ఏ పదవిలో వున్న వ్యక్తులైనా ఎప్పుడో ఒకసారి పదవీ విరమణ చేయాల్సిందే. ఉద్యోగులకి వారి పుట్టిన తేదీ వున్న నెలలో ఆఖరి రోజు పదవీ విరమణ చేస్తారు. అది 60 సంవత్సరాలు కావొచ్చు, 61 సంవత్సరాలు కావొచ్చు. రాజ్యాంగ పదవుల్లో వున్న వ్యక్తులు నెలాఖరున కాకుండా 62 సంవత్సరాలు, 65 సంవత్సరాలు నిండి న రోజునే పదవీ విరమణ చేస్తారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాలు నిండిన రోజునే పదవీ విరమణ చేస్తారు. సాధారణంగా ఈ పదవీ విరమణ చేసిన రోజున ఫుల్‍ కోర్టు మీటింగ్‍లో వారికి వీడ్కోలు చెబుతారు. న్యాయవాదుల సంఘం కూడా వారికి వీడ్కోలు సభ ఏర్పాటు చేసి సన్మానిస్తారు. ఈ సన్మాన సభలలో, అదే విధంగా వీడ్కోలు సమావేశాలల్లో వారి గురించి నాలుగు మంచి మాటలు చెబుతారు. ఈ మాటలల్లో కూడా సాహిత్యం చోటు చేసుకుంటుంది. న్యాయమూర్తులు తాము పదవీ విరమణ చేసినప్పుడు కూడా ఏదైనా కవితలోని చరణాలను చదవడం తరుచూ జరుగుతుంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్‍ పనిచేసిన కాలంలో చాలా మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేశారు. ఆ తరువాత కొంత కాలానికి ఆయన కూడా పదవీ విరమణ చేశారు. అన్ని సందర్భాలలో ఆయన కవితా చరణాలని ఉదహరిస్తూ మాట్లాడినారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి యం.ఆర్‍ షా పదవీ విరమణ చేసినప్పుడు ఆయన్ని టైగర్‍ షా గా చంద్రచూడ్‍ అభివర్ణించారు. ఆయన టైగరా కాదానన్నది ఇక్కడ అప్రస్తుతం. అప్పుడు ఏ కవితని ఉదహరించారన్నది మాత్రమే నేను ప్రస్తావించదలిచాను. యం.ఆర్‍.షా గురించి నాలుగు మంచి మాటలు చెబుతూ ప్రముఖ మ్యూజిషయన్‍, కవి జాబ్‍డిలాన్‍ని ఉదహరింఆరు.
‘‘మార్పు అనేది గాలి మాదిరిగా మారినప్పుడు
మీ హృదయం ఎల్లప్పుడూ ఆనందగా ఉండనివ్వండి
మీ పాట ఎప్పుడూ పాడుతూనే వుండాలి
మీరు ఎప్పటికీ యవ్వనంతో వుండాలి’’
ఇక్కడితో చంద్రచూడ్‍ ఊరుకోలేదు. పాకిస్తానీ కవి ఒబైదుల్లా అతీమ్‍ని ఉటంకిస్తూ ఇలా అన్నారు.
‘‘కంటి నుంచి దూరం కావొచ్చు
కానీ
హృదయం నుంచి కాదు
మీరు తరుచూ గుర్తుకొస్తారు’’
మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్రిష్ణమురారీ పదవీ విరమణ చేసినప్పుడు, మిగతా న్యాయమూర్తులు వీడ్కోలు విందును ఏర్పాటు చేశారు. ఆ రోజు సుప్రీంకోర్టు ఆడిటోరియమ్‍ కవిత్వంతో నిండి పోయింది. అది ఒక భావోద్వేగ సాయంత్రం.
చంద్రచూడ్‍ మాట్లాడుతూ జస్టిస్‍ మురారి ఎప్పుడూ ప్రశాంతంగా వుండేవారని, ఎప్పుడూ తన స్థైర్యాన్ని కోల్పోలేదని గుర్తుచేశారు. ఆయన మాటలో కాన్పూరి గొంతు విన్పించేదని చెబుతూ ప్రముఖ కవి బషీర్‍ ములాఖత్‍ మోగీ కవితను ఉదహరించారు.
‘నేను ఒక యాత్రికుడను
నాలాగే మీరు కూడా
మళ్ళీ మనం
ఏదో ఒక సమయంలో కలుద్దాం’
కాగిత రహిత కోర్గుఆ కోర్టుని నడపాలన్నప్పుడు జస్టిస్‍ మురారి మొదట్లో కొంత ఇబ్బంది పడ్డారు. ల్యాప్‍టాప్‍ని, ఐప్యాడ్‍ని ఉపయోగించడానికి కూడా జస్టిస్‍ మురారి సందేహించారు. జస్టిస్‍ పి.ఎస్‍. నరసింహ అతనికి సహాయం చేశారని జస్టిస్‍ చంద్రచూడ్‍ అన్నారు. అలా అంటూ మరో కవితతో తన ప్రసంగాన్ని ముగించారు.
‘మీరో క్షణాలు
జ్ఞాపకాలుగా మారి
ఆ ప్రయాణం
అనేక అనుభవాలని పొందింది’
జస్టిస్‍ క్రిష్ణ మురారీ తన సహచర న్యాయమూర్తులకి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‍కి కృతజ్ఞతలు చెబుతూ ఓ ద్విపదని చెప్పారు.
‘ఒక్క అడుగు వేయకుండానే
ప్రయాణం ముగిసింది
ఆశ్చర్యం!
మార్గాని ఎంత చిన్నదిగా చేసింది.’
జస్టిస్‍ మురారి ఇక్కడితో వూరుకోలేదు. ఇది తనకు ఉద్వేగ భరితమైన కష్టమైన క్షణమని చెబుతూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపేందుకు మరో ద్విపదని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించాడు.
‘నేను ఈ తలుపుల వైపు
గోడల వైపు ఆశగా చూస్తున్నాను
నా తోటి దేశస్థులారా
ప్రయాణం కొనసాగుతుంది
సంతోషంగా వుండండి’
మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‍ సంజయ్‍ కిషన్‍ కౌల్‍ పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. అతను ఆరు సంవత్సరాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. సయింట్‍ స్టీఫెన్స్ కాలేజీలో జస్టిస్‍ కౌల్‍, జస్టిస్‍ చంద్రచూడ్‍ స్నేహితులు. ఎమర్జెన్సీ తరువాత వారిద్దరి మధ్య లెక్కలేనన్ని సంభాషణలు జరిగాయి. ఆ తరువాత ఇద్దరూ స్నేహితులైనారు. అవన్నీ గుర్తు చేసుకుంటూ జస్టిస్‍ చంద్రచూడ్‍ ఫైజ్‍ అహ్మద్‍ ఫైజ్‍ కవితను ఉటంకించారు.
‘పాలన నిర్జనమైంది
సాగరం విచారంలో వుంది
మీరు వసంత ఋతువులోకి వెళ్ళారు’
ఇక్కడితో ఆపలేదు. జస్టిస్‍ కౌల్‍తో వున్న తన కాలేజీ జ్ఞాపకాలను, సుప్రీంకోర్టులోని తన అనుబంధాన్ని వివరించి చివరికి మళ్ళీ మనం కలుస్తామని ప్రముఖ కవి బషీర్‍ బదర్‍ కవితా చరణాలతో తన ప్రసంగాన్ని జస్టిస్‍ చంద్రచూడ్‍ ముగించారు.
‘నేను ప్రయాణీకుడిని
నువ్వు కూడా
మళ్ళీ మనం
ఎక్కడో ఒక చోట కలుస్తాం.’
చివరికి చంద్రచూడ్‍ పదవీ విరమణ సమయం వచ్చేసింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ‘బహుశా అత్యంత ఎక్కువుగా ట్రోల్‍ చేయబడిన న్యాయమూర్తిని మనదేశంలో నేనే అనుకుంటాను. రేపటి నుంచి నన్ను ట్రోల్‍ చేసిన వ్యక్తులకి పని వుండదనుకుంటానని ఆయన నవ్వుతూ అన్నప్పటికి అందులో బాధా, వేదన వుంది. వాళ్ళందరూ నిరుద్యోగులవుతారని కూడా ఆయన అన్నారు. తన ట్రోలింగ్‍ గురించి మాట్లాడుతూ జస్టిస్‍ చంద్రచూడ్‍ ఓ కవితని
ఉదహరించారు.
‘నా విరోధులలో
నా వ్యక్తిత్వం మెరుగుపడ్తుంది
నా శత్రువులపై
నాకు చాలా గౌరవం వుంది’
న్యాయమూర్తులు పదవీ విరమణ చేసినప్పుడు చాలా విషయాలు చర్చకు వస్తాయి. చాలా విషయాలని చెబుతారు. నేను ఆ విషయాల గురించి ఇక్కడ చెప్పదలుచుకోలేదు.
కవిత్వం, సాహిత్యం అనేవి తీర్పులలోనే కాదు ఉపన్యాసాల్లో కూడా కన్పిస్తాయి. ఒక పెద్ద ఉపన్యాసం చేసే పనిని ఓ కవిత చేస్తుంది. ఓ కథ చేస్తుంది. అవి చెప్పడానికే ఈ వ్యాసం. పదవీ విరమణలో కవిత్వ చరణాలు.


-మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *