కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీశాడు బబ్లూ. ఊరి నుంచి మామయ్య వచ్చాడు.
‘‘బాగున్నాలా అంగుల్’’ అంటూ పలకరించాడు బబ్లూ.
‘‘బాగానే వున్నా గానీ, నీ గొంతుకేమైంది?’’ తిరిగి ప్రశ్నించాడు మామయ్య ఈశ్వర్.
‘‘జళుబు మామయ్యా! ఊపిరాద్దం లేదు’’ అన్నాడు బబ్లూ కూడదీసుకుని.
‘‘డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదా? మందులు వాడలేదా?’’ గబగబా ప్రశ్నించాడు ఈశ్వర్.
‘‘మందు వాడినా తగ్గలేదు రా?’’ నవ్వుతూ సమాధాన మిచ్చాడు బబ్లూ నాన్న సురేష్ లోపలి నుండి వస్తూ.
‘‘ఋతువు మారింది కదా! వానలు పడుతున్నాయి కదా! సహజమేలే’’ అన్నాడు మళ్ళీ తనే.
‘‘అవును బావా! జలుబు మందు వాడితే ఏడురోజుల్లో తగ్గుతుంది. వాడకపోతే వారం రోజుల్లో పోతుంది అని కదా సామెత’’ అన్నాడు నవ్వుతూ ఈశ్వర్.
‘‘అదేంటి మామయ్యా?’’ ఆశ్చర్యంగా అడిగాడు బబ్లూ.
‘‘అదంతేరా! జలుబు నుంచి ఉపశమనం పొందడానికే ఇంగ్లీషు మందులు ఉపయోగ పడతాయి కానీ తగ్గించలేవు. అయినా బాధపడకు నాదగ్గర దానికి మందుందిలే’’ అభయమిచ్చాడు ఈశ్వర్.
తాను రెండు సంచుల్లో తెచ్చిన కూరగాయలు బబ్లూ తల్లి చేతికిచ్చి ‘‘కాస్త తమలపాకులు జీలకర్ర ఇవ్వు చెల్లెమ్మా!’’ అన్నాడు ఈశ్వర్.
ఈశ్వర్, బబ్లూ తల్లి శారద యొక్క పెదనాన్న కొడుకు. వారి ఊరు క•ష్ణాపురం. అక్కడ శారదకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పొలముంది. ఆ పొలం వ్యవహారాలు ఈశ్వర్ చూస్తుంటాడు. పండిన కూరగాయలు, పండ్లను తెచ్చిస్తుంటాడు.
శారద తెచ్చిన తమలపాకులను అయిదింటిని తుంచి ఒక గిన్నెలో వేశాడు ఈశ్వర్. జీలకర్రను దంచి అందులోనే వేశాడు. గ్లాసు నీటిని పోశాడు. దాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించాడు. కషాయం తయారయింది. దాన్ని వడకట్టి ఒక గ్లాస్‍లో పోశాడు. అందులో ఒక చెంచాడు తేనె కలిపి బబ్లూను తాగమన్నాడు. కషాయమంటే చేదుగా వుంటుందని బబ్లూ మొదట కంగారుపడ్డాడు. కానీ అది తియ్యగా వుంది.
బబ్లూ ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాడు.
తెల్లారి లేచాక హుషారుగా ‘‘మామయ్యా! రాత్రి ముక్కు నుంచి నీరు కారలేదు. జలుబు తగ్గి పోయింది. రోజూ నేను తాగే సిరప్ చేదుగా వుండేది. అది తాగినా జలుబు పోలేదు. కానీ నువ్వు చేసిన తమలపాకు రసం బాగుంది, తొందరగా పడిశమూ తగ్గింది’’ అన్నాడు.
‘‘మన కొచ్చే జబ్బులకన్నిటికీ ప్రక•తి లోనే పరిష్కారా లున్నాయ్. వీటిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో ఆయుర్వేదం అనే శాస్త్రం రచించారు మన పూర్వీకులు. మన చుట్టూ ఎన్నో ఔషధ మొక్కలు వున్నా మనం గుర్తించం. పట్టించుకోం. వేపాకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలలో పసుపు కలిపి తాగితే జలుబు తగ్గుతుంది. తులసి ఆకులు నమిలి మింగితే కడుపులోని చెడు బాక్టీరియా తొలగి పోతుంది. బొప్పాయి ఆకులు, జీలకర్ర కలిపి నీటిలో మరిగించి, దాన్ని వడకట్టి తేనె కలుపుకుని తాగితే మలేరియా జబ్బు నయమవుతుంది. ఉలవలు తింటే కిడ్నీలో రాళ్ళు చేరవు. మెంతులు, మెంతి ఆకు తింటే మధుమేహం అదుపులోకి వస్తుంది. ఇలా పండ్లు, కూరగాయలే కాదు ఆకులు, వేర్లు, కాండంతో సహా మొక్కల లోని ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఇంట్లో మొక్కలను పెంచుకోవాలి’’ చెప్పాడు ఈశ్వర్. మామయ్య చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు బబ్లూ.
‘‘నిజమే మామయ్యా! నాకూ ఎప్పటినుంచో మొక్కలు నాటి పెంచాలనే కోరిక ఉంది. మొక్కల వల్ల ఇన్ని లాభాలున్నాయని ఇప్పుడు అర్ధమవుతోంది. ఇకనుంచి మేం కూడా తీరిక ఉన్నప్పుడు పొలానికి వస్తాం’’ అన్నాడు బబ్లూ.
తర్వాత ఆదివారం బబ్లూ కుటుంబం అంతా క•ష్ణాపురం వెళ్ళారు. తమ పొలంలో ఖాళీగా వున్న నేలలో బబ్లూ తనకు నచ్చిన మొక్కలు నాటాడు. ప్రక•తికి దగ్గరగా ఉండటం వల్ల అందరిలో ఏదో తెలియని ఆనందం కలిగింది. వీలు దొరికినప్పుడల్లా తమ పొలానికి రావాలని నిర్ణయించుకున్నారు.
-పల్లా వెంకటరామారావు
ఎ: 9949043019