ఇనుపయుగంలోనేతెలంగాణాలో శస్త్రచికిత్సలు

చరిత్రలో ఒక్కో యుగానికి ఒక్కో ప్రత్యేకత. అప్పటి వరకూ అమలులో కొచ్చిన జీవన విధానంలో, ఒక్కో యుగంలో జరిగిన ఆవిష్కరణలు మానవ జీవన వికాసానికి నిదర్శనాలు. రాతియుగాన్ని దాటిన నాటి మానవుడు లోహాన్ని కనుగొని, మునుపెన్నడూ లేని కొత్త జీవన రీతులకు తెరలేపాడు. ఆ తరువాతిదైన ఇనుపయుగం, జీవన విధానంలో ఒక పెద్ద విప్లవాన్నే తెచ్చిందని చెప్పాలి. క్రీ.పూ. 2000 ప్రాంతంలో ప్రారంభమైన ఈ కాలం ఇనుపగుళికళ్ని కక్కి, కొత్త జీవితానికి కిక్కిచ్చింది.


పంటపొలాలకే కాక ఇంటి పనులకు కూడా పనికొచ్చే అనేక ఇనుప పనిముట్లు పుట్టుకొచ్చాయి. అడవుల్ని సైతం నరికి, వ్యవసాయాన్ని ముందుకురికించాయి. వలసలు ఆగిపోయాయి. గుడిసెలు లేచాయి. గుంపులు, గుంపులుగా ఒకేచోట కుదురుగా నివసించటంతో తొట్టతొలి ఊళ్లు వేళ్లూనుకొన్నాయి. అప్పటికింకా కులాలు లేవు. ఉన్నవన్నీ కొత్తకొత్తగా వాడుకలోకి వస్తున్న హలాలు, కొద్దికొద్దిగా విస్తరిస్తున్న వరిపొలాలు. కర్రల స్థానంలో కత్తులొచ్చాయి. ఆ కత్తులు ఆయుధాలై, అధికారానికి అర్థం చెప్పాయి. అదిగో అలా ప్రారంభమైన ఇనుపయుగం, మానవ జీవనవికాస సంరంభమైంది. ఊహించని రీతిలో కొత్తకొత్త ఆలోచనలు చిగురించి, ఆచరణలో కొచ్చాయి. చనిపోయిన వారిని గుంటల్లో పాతి పెట్టే, వివిధ రకాల సమాధులు రూపు దిద్దుకొన్నాయి. మరణించిన మనిషి, జీవిత కాలంలో వాడిన పరికరాలు, పాత్రలు, ఆభరణాలు, ఆహార పదార్థాలు ఒకటేమిటి, ఆయనవనుకొన్నవన్నింటినీ, ఆయనతోపాటే, సమాధిలో నిక్షిప్తం చేసి, ఆయనంటే తమకున్న గౌరవాన్ని నిలబెట్టుకొనేవారు.
ఇలా రూపుదిద్దుకొన్న పరికరాల్లో అతి చిన్న ఇనుప అస్త్రాలు, శస్త్ర చికిత్సలకు కూడా దారిచూపాయన్న ఆధారాలు, ప్రస్తుత నాగర్‍కర్నూలు జిల్లా, కొల్లాపురం మండలంలోని చిన్నమరూరు, పెద్దమరూరులలో జరిపిన తవ్వకాల్లో వెలుగు చూచి, ఆధునిక సర్జన్లను సైతం ముక్కున వేలేసుకొనేట్లు చేశాయి. పెద్దమరూరులో తవ్వకాలు జరిపిన అప్పటి పురావస్తు శాఖ అధికారి వి.వి.కృష్ణశాస్త్రి గారికి, ఒక గూడు సమాధి గదిలో పూడ్చిపెట్టిన మరణించిన వారి ఎముకలు, స్పటికపు పూసలు, నలుపు-ఎరుపు రంగు మట్టి పాత్రలతో పాటు అతిచిన్న సైజు ఇనుప పరికరాలు కూడా దొరికాయి. పరిశీలించగా, సన్న, చిన్న, మొనదేలిన ఈ చిన్న పరికరాలు, అలనాటి శస్త్రచికిత్సలకు వాడిన ఉపకరణాలు (సర్జికల్‍ ఇన్‍స్ట్రిమెంట్స్) అని కృష్ణశాస్త్రిగారు తేల్చి చెప్పారు. మధ్యయుగాల్లో మెతుకుసీమలో మెరిసిన శస్త్రచికిత్స వైద్యనిపుణుడు అగ్గలయ్యకు రెండువేల ఏళ్లకు పూర్వమే శస్త్రచికిత్సలు అందుబాటులో ఉండేవన్న విషయాన్ని తెలిపిన పెద్దమారూరు ఇనుపపనిముట్లు తెలంగాణా చరిత్రలో చెరగని మైలురాళ్లు!

-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *