
ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ వారసత్వ హోదా కలిగిన ప్రపంచవ్యాప్తంగా వున్న వివిధ ప్రదేశాలను రక్షించడంలో ఎదురవుతున్న సమస్యలను చర్చించి, ఆ అవగాహనతో వాటిని రక్షించే చర్యలను ఆచరణాత్మకం చేయడం ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవ లక్ష్యం. ఇది ప్రపంచంలోని వివిధ సమాజాల సమిష్టి కృషికి, సాంస్కృతిక వారసత్వ అవగాహనకు తోడ్పడుతుంది.
సహజ లేదా మానవ నిర్మిత ప్రాంతం లేదా అంతర్జాతీయ ప్రాముఖ్య కలిగిన నిర్మాణాలు, ప్రత్యేక రక్షణ అవసరమయ్యే స్థలం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిర్వచించబడింది. ప్రపంచవ్యాప్తంగా యునెస్కో 1223 ప్రదేశాలను వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. ఇందులో సహజమైనవి, సాంస్క•తమైనవి రెండూ మిళితమైనవి వున్నాయి. 1982లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ICOMOS) ఏప్రిల్ 18ని ప్రపంచవారసత్వ దినోత్సవంగా ప్రకటించగా 1983లో యునెస్కో జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. విపత్తులు మరియు సంఘర్షణల ముప్పులో వున్న వారసత్వం: 60 సంవత్సరాల ICOMOS చర్యల అధ్యయనం, అవగాహన, ఆచరణ ఈసారి థీమ్‍గా ఉంది.
ఈ సందర్భంలో మనదేశంలో మన సంస్కృతి, వైవిధ్యాన్ని నిర్వచించే అద్భుతమైన చారిత్రక కట్టడాలు, వాటి విశిష్టత, వారసత్వ హోదా గురించి మనం మాట్లాడుకోవాలి. 3,679 మాన్యుమెంట్స్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో వున్నాయి.
డక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు నారాయణపేట జిల్లా కృష్ణా తీరంలోని ముడుమాల్ గ్రామశివారులో వున్న నిలువరాళ్లు వెనుక వున్న చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించింది. గత నాలుగేళ్లుగా అకాడమీ విస్తృత అధ్యయనం చేసింది. 2023లో తెలంగాణ పురావస్తు శాఖతో చర్చించి ఒప్పందం చేసుకొని ముడుమాల్‍పై అధ్యయనం, పరిరక్షణ బాధ్యతను స్వీకరించింది. పలుమార్లు వివిధ రంగాల చరిత్రకారులు, నిపుణులు, పరిశోధకులు, మేధావులు, అధికారులతో క్షేత్రస్థాయి సమాలోచనలు చేసింది. ఇవి మూడువేల నుండి నాలుగువేల సంవత్సరాల క్రితం ఆదివాసులు ఏర్పాటు చేసిన సమాధిరాళ్ళుగా శాస్త్రవేత్తతలు, చరిత్రకారులు భావించారు. ఈ రాళ్ల అమరికలో ఖగోళ విషయాలు దాగున్నాయని పరిశోధకులు నిర్ధారించారు. నక్షత్ర మండంలోని సప్తరుషుల నక్షత్ర సమూహాన్ని ఏమాత్రం తేడా లేకుండా చెక్కిన బండరాయి ఇక్కడ వుంది. వీటి ఆధారంగా దీనిని ఖగోళ సంబంధిత ప్రదేశంగా గుర్తించి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించాలన్న అప్లికేషన్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా యునెస్కో ముందుకు వెళ్ళింది.
ఇప్పటి వరకు భారతదేశంలో 43 శాశ్వత మరియు 56 తాత్కాలిక జాబితాలో వున్నాయి. ఇటీవల తాత్కాలిక జాబితాలో మరో 6 జతయ్యాయి. 62 తాత్కాలిక జాబితాలో ముడుమాల్ వుండటం సంతోషదాయకం. ముడుమాల్ యునెస్కో వారి శాశ్వత హోదా సాధించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమిష్టి కృషి చేయాలి. ముడుమాల్‍తో పాటు తెలంగాణాలో అర్హత కలిగిన ప్రదేశాలను కట్టడాలను గుర్తించి, వాటికి తగిన నిధులు బడ్జెట్‍లో కేటాయించి, వాటిని బలోపేతం చేయాలి వీటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్