స్టోన్‍హేంజ్‍ సరసనమన ముడుమాల్‍!


ప్రపంచ ఖ్యాతికి అడుగు దూరంలో ముడుమాల్‍ నిలువురాళ్లు
ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కే అవకాశం
యునెస్కోగుర్తింపు పక్రియలో సానుకూల పరిణామాలు.. ఇటీవలే తాత్కాలిక జాబితాలో చోటు

అవన్నీ ఆదిమానవులు పాతిన స్మారక శిలలు.. కొన్నేళ్ల క్రితం వరకు అవి మూడువేల ఏళ్ల కింద ఏర్పాటు చేసిన సమాధి రాళ్లు (మెన్హిర్స్) గానే భావించారు. కానీ, అవి మామూలు స్మారక శిలలు కాదు, ఖగోళ వివరాల గుట్టు విప్పే ఓ అబ్జర్వేటరీ అని పరిశోధకులు తర్వాత గుర్తించారు. అదే తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణా నదీ తీరంలోని ముడుమాల్‍ గ్రామ శివారులోని నిలువురాళ్ల వెనక దాగిన చారిత్రక రహస్యం. కానీ, ఖగోళ గుట్టు విప్పేంత ప్రత్యేకత ఈ రాళ్లకు ఉందా అన్న అనుమానాలూ లేకపోలేదు. కానీ, ఓ క్రమపద్ధతిలో ఆ రాళ్లను అమర్చిన తీరు అసాధారణమే అని, వాటి అమరిక వెనక ఓ ఖగోళ రహస్యముందని ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సంస్థ యునెస్కోకు సమర్పించబోతున్నారు. ఈమాత్రం ప్రత్యేకతలు కూడా లేని ఇంగ్లండ్‍లోని స్టోన్‍హేంజ్‍ రాతి అమరికను గుర్తించిన తరహాలో.. అంతకంటే ప్రత్యేకమైన ఈ రాళ్లకు కూడా ఆ గుర్తింపు ఇవ్వాలని భారత ప్రభుత్వం సగర్వంగా యునెస్కోను అడగబోతోంది. ఇటీవలే తెలంగాణలోని విఖ్యాత శైవ క్షేత్రం రామప్ప నిర్మాణంలో నాటి కాకతీయ నైపుణ్యానికి యునెస్కో అబ్బురపడి గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోసారి ఆ ఖ్యాతి తెలంగాణను పలకరించేందుకు అవకాశం రాబోతోంది.


యునెస్కో గుర్తింపు పొందదగిన ఎన్నో చారిత్రక ప్రాంతాలు తెలంగాణలో ఉన్నప్పటికీ, వాటి వివరాలను ఇంతకాలం శాస్త్రీయ పద్ధతిలో ఆ సంస్థ ముందు ఉంచలేకపోయారు. రామప్ప విషయంలో విజయం సాధించిన నేపథ్యంలో, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్టు నడుం బిగించింది. ఆ సంస్థ ముఖ్యులు వేదకుమార్‍ ఆధ్వర్యంలో 2021లో అధ్యయనం ప్రారంభించారు. 2023లో డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్టు డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో ముడుమాల్‍ ప్రత్యేకతలపై పరిశోధించిన హైదరాబాద్‍ సెంట్రల్‍ యూనివర్సిటీ ప్రొఫెసర్‍ కేపీ రావు మరియు ఆర్కిటెక్ట్ నిపుణులు సూర్య నారాయణమూర్తి తదితరుల నిపుణులను కలుపుకొని DHATపరిశోధిస్తోంది. పరిశోధించిన వివరాలను సమర్పించగా వరల్డ్ హెరిటేజ్‍ సెక్షన్‍ (WHS), ఆర్కిలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా (ASI), మినిస్ట్రీ ఆఫ్‍ కల్చర్‍ సెంట్రల్‍ గవర్నమెంట్‍ ఆఫ్‍ ఇండియా వీటిని యునెస్కోకు సమర్పించింది. ముడుమాల్‍తోపాటు వేర్వేరు రాష్ట్రాల్లోని మరో ఐదు ప్రాంతాలను కూడా చేర్చింది. వెరసి ఆరు ప్రాంతాలకూ యునెస్కో తాత్కాలిక జాబితాలో మార్చి 2025లో చోటు కల్పించింది. ఇప్పుడు పూర్తిస్థాయి గుర్తింపు కోసం తుది సమగ్ర నివేదిక తయారీపై తెలంగాణ ప్రభుత్వం, డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ తెలంగాణ శాఖ మరియు డక్కన్‍ అకాడమీ ట్రస్ట్ దృష్టి సారించాయి.


యునెస్కో ముందుంచే కీలక అంశాలివీ..

  • సప్తరుషుల మండలంగా పేర్కొనే నక్షత్ర సమూహం (ఉర్సా మెజర్‍)లో పైన ఉండే రెండు నక్షత్రాలు దుభే, మిరాక్‍లను అనుసంధానిస్తూ ఓ సరళ రేఖను గీస్తే అది ఉత్తరం వైపే సూచిస్తుంది. ఏ దిక్కూ తెలియని స్థితిలో ఉన్నవారు.. ఆ నక్షత్రాల ఆధారంగా ఉత్తర దిక్కును సులభంగా గుర్తించొచ్చు. మరి పగటి వేళ నక్షత్రాలు కనిపించని సమయంలో దిక్కులను గుర్తించేదెలా?
  • దీనికి దాదాపు మూడు వేల ఏళ్ల క్రితమే నాటి మానవులు పరిష్కారం చూపారు. నక్షత్ర మండలంలోని సప్తరుషుల నక్షత్ర సమూహాన్ని ఏమాత్రం తేడా లేకుండా ఓ బండరాతిపై చెక్కారు. వాటిలోని ఆ రెండు నక్షత్రాలను సమాంతరంగా ఉండే కోణం ప్రకారం ఉత్తర దిక్కును, తద్వారా మిగతా దిశలను గుర్తించొచ్చు. ఇక ఆ రెండు నక్షత్రాలను మేళవిస్తూ రూపొందించే సరళరేఖ సూచించే ఉత్తర దిశలో నేరుగా చూస్తే ఉత్తర ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది.
  • రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భూగమనం ఆధారంగా ఆ నక్షత్రాలు మారిపోతుంటాయి. కానీ ఆ రెండు నక్షత్రాలు మాత్రం ఎటువైపు ఉన్నా, అవి ఉత్తర దిశనే సూచిస్తుండటం విశేషం.
  • శ్రీ ముడుమాల్‍ నిలువురాళ్ల వద్ద ఓ బండరాతిపై ఈ నక్షత్ర సమూహం అచ్చుగుద్దినట్టు చెక్కి ఉంది. దీన్ని మూడువేల ఏళ్ల క్రితమే రూపొందించినట్లు పరిశోధకులు గుర్తించారు.
  • కొరియా, జపాన్‍లలో ఇలా నక్షత్ర మండలాన్ని బండరాళ్ల మీద ఆదిమానవులు చెక్కిన ఆధారాలను గతంలోనే పరిశోధకులు గుర్తించారు. అయితే, వాటిల్లో దుభే, మిరాక్‍ నక్షత్రాలు కచ్చితంగా ఉత్తర దిశను గుర్తించేలా లేవని, వాటి స్థానాల్లో తేడాలున్నాయని, ము•డుమాల్‍లో మాత్రమే ఆ కచ్చితత్వం ఉందని.. దీనిపై పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్‍ డాక్టర్‍ కేపీ రావు చెప్పారు.
  • నక్షత్ర మండలాన్ని పోలిన గుర్తులను గతంలోనే వెలుగులోకి తేగా, తాజాగా నక్షత్ర మండలంలో లియో (సింహరాశి)ను పోలిన నక్షత్ర సమూహాన్ని గుర్తించారు. సింహరాశిని సూచించే నక్షత్ర కూటమి ఎలా ఉంటుందో, అచ్చు అదే పోలికతో ఓ గుండుపై చెక్కి ఉంది.


ఏటా జూన్‍ 21న మరియు డిసెంబర్‍ 21న..
సూర్య గతిని మన పూర్వీకులు కచ్చితంగా గుర్తించే పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండులోని స్టోన్‍హేంజ్‍లో కీ స్టోన్‍గా పిలుచుకునే ప్రధాన నిలువు రాయి.. దానికి సరిగ్గా ఎదురుగా ఉండే (అక్కడి రాళ్ల అమరిక వృత్తాకారంలో ఉంటుంది) మరో రెండు రాళ్ల మధ్య సూర్యోదయం కనిపిస్తుంది. ఇది సరిగ్గా ప్రతి సంవత్సరం జూన్‍ 21న మొదలవుతుంది. అలా నాలుగైదు రోజులు ఆ స్థితి ఉంటూ క్రమంగా మారుతుంది. జూన్‍ 21న సూర్యుడు తన ఆయణాన్ని మార్చుకుంటాడన్నమాట.
ముడుమాల్‍లో సరిగ్గా అదే రోజు ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ సూర్యోదయం వేళ ఒకే వరస క్రమంలో ఉండే మూడు భారీ నిలువరాళ్ల నీడ ఒకే గీతలా కనిపిస్తుంది. వాటి వెనక నిలబడితే కాసేపు సూర్యుడు మనకు కనిపించడు. ఆ స్థితి సరిగ్గా అదే రోజు కనిపించి నాలుగైదు రోజుల్లో క్రమంగా మారుతుంది. అంటే, రుతుపవనాలు మొదలయ్యాయని దాన్ని చూసి గుర్తించొచ్చు.

  • కట్టా ప్రభాకర్‍, ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *