నవభారత దార్శనికుడుఏప్రిల్‍ 14న డాక్టర్‍ బాబా సాహెబ్‍ అంబేద్కర్‍ జయంతి

భారతదేశ ప్రజల్లో సమానత్వం కోసం అహర్నిశలు తపించిన కృషీవలుడు డాక్టర్‍ బాబా సాహెబ్‍ అంబేద్కర్‍.
‘బాబాసాహెబ్‍’గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్‍ బీఆర్‍ అంబేడ్కర్‍ (BR Ambedhkar).. దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికతకోసం తన జీవితం చివరి వరకూ పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్‍ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ (Constitution) రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టం. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వంతంత్ర భారత తొలి న్యాయ మంత్రి, జాతీయోద్యమంలో తొలి దళిత నేత, వ•త్తి రీత్యా లాయరు, బౌద్ధుడు, తత్వవేత్త, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, అర్థికవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త ఇలా ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.


బాల్యంలో అడుగడుగునా ఛీత్కారాలు, అవమానాలకు గురయి.. పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంక•షి, స్వీయప్రతిభతో ఎదిగి స్వతంత్ర భారత తొలి కేంద్ర మంత్రి పదవిని అలంకరించే స్థాయికి చేరుకున్నారు. తన జీవితాంతం అణగారిన వర్గాల గొంతుకను వినిపించి, వారి సాధికారికతకు అంబేడ్కర్‍ పాటుపడ్డారు. కొలంబియా వర్సిటీ, లండన్‍ స్కూల్‍ ఆఫ్‍ ఎకనమిక్స్ నుంచి అర్ధశాస్త్రంలో గౌరవ డాక్టరేట్లు, అలాగే, ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో న్యాయ, ఆర్ధిక, రాజకీయ శాస్త్రాల్లో పరిశోధనలు చేశారు. విద్యాభ్యాసం తర్వాత ఆర్ధికవేత్తగా, ప్రొఫెసర్‍గా, న్యాయవాదిగా పలు పాత్రలు పోషించారు. తరువాత జాతీయోద్యమంలోకి వచ్చారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దళితుల రాజకీయ హక్కులు, సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా సేవలందించి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించారు. అలాగే, రిజర్వ్ బ్యాంకు ఆఫ్‍ ఇండియా స్థాపనలో అంబేడ్కర్‍ పాత్ర ఉంది. హిల్టన్‍ యంగ్‍ కమిటీకి బాబాసాహెబ్‍ అందించిన భావనతో ఆర్బీఐ ఏర్పాటయ్యింది.
జీవితాంతం అణగారిన వర్గాల కోసం పోరాడి, వారికి ఆశాజ్యోతిగా నిలిచారు. తన జీవిత చరమాంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. గౌతమ బుద్దుని బోధనలకు ప్రభావితమైన అంబేడ్కర్‍.. బౌద్ధుడిగా మారారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖం నేటికీ నిప్పు కణికలా జ్వలిస్తూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన. కుల, మత రహిత ఆధునిక భారతావనికి కోసం అంబేద్కర్‍ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల నాటి సమాజంలో ఉన్న వివక్షను పారద్రోలడానికి అంబేద్కర్‍ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.


డాక్టర్‍ బీఆర్‍ అంబేడ్కర్‍ 1891లో ఏప్రిల్‍ 14న మధ్యప్రదేశ్‍లోని అంబవాడేలో రామ్‍ జీ, భీమా బాయి దంపతులకు జన్మించారు. తండ్రి నాటి బ్రిటీష్‍ భారతీయ సైన్యంలో సుబేదార్‍గా పని చేసేవారు. అంబేడ్కర్‍ చిన్నతనం నుంచి అంటరానితనానికి బాధితుడయ్యారు. మెహర్‍ కులానికి చెందిన ఆయణ్ని అప్పట్లో తరగతి గది బయట కూర్చోపెట్టేవారు. అగ్రవర్ణాల ఆధిపత్యపోరుని తట్టుకుని 1900లో ప్రభుత్వ పాఠశాలలో చేరి అప్పటి నుంచే హేళనలు, అవమానాలపై తిరగబడ్డారు.. ఈ వివక్షలన్నింటినీ ఎదుర్కొంటూ మెట్రిక్యులేషన్‍ అత్యధిక మార్కులతో పాసయ్యారు.
బీఏ ఉత్తీర్ణులైన అంబేద్కర్‍.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్‍ స్కూల్‍ ఆఫ్‍ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి విద్యా సంస్థల నుంచి పీజీ, పీహెచ్‍డీ, న్యాయశాస్త్రంలో పీహెచ్‍డీ పూర్తిచేశారు. విదేశాలలో ఎకనమిక్స్లో డాక్టరేట్‍ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు.
భారత్‍కు తిరిగొచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ద•ష్టిసారించారు. ఈ సమస్యలను ఎదిరించాలంటే విద్య ఒక్కటే మార్గమని భావించారు. తనలా అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోరాదని, చిన్నప్పటి నుంచే తనను తాను రక్షించుకోవడమే కాకుండా, అంటరానితనాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *