చిన్న పిల్లలకి సహజంగానే జంతువులంటే ఆకర్షణ ఉంటుంది. వాటితో చాలా తొందరగా బంధాన్ని ఏర్పరచుకో గలుగుతారు. వాళ్ల కథల లోనూ, కార్టూన్ల లోనూ కూడా ఎప్పుడూ అవే ఉంటాయి. వాటికి ఎలాంటి కష్టమొచ్చినా అయ్యో అని బాధపడి పోతుంటారు.
అయితే, అలాంటి ఓ పిల్లాడి అనుబంధమే నేడు 200 ఏనుగులు సహా 2000 దాకా జంతువులను కాపాడే ఓ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఏర్పాటుకు కారణమైంది. కొన్ని వందల మంది డాక్టర్లు, నిపుణులు వాటి బాగోగులు చూసుకునే బాటయింది. రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీనే ఆ పిల్లవాడు. ఇక, వింతైన ఆ జంతు ప్రపంచమే గుజరాత్ రాష్ట్రపు జామ్ నగరలో ఉన్న ‘వంతారా జూ’!
అనంత్ అంబానీకి పన్నెండేండ్ల వయసులో తల్లి నీతాతో కలిసి ఓ ఊరికి వెళుతున్నాడు. అందమైన చెట్లు, పరిగెడుతున్నాయా అనిపించే ఊళ్లూ చూస్తూ కూర్చున్నాడు అనంత్. అదే దారిలో ఓ ఏనుగు పిల్ల కనిపించింద తనికి. ఇంకేం, ఎగిరి గంతేసినంత పనిచేశాడు. కానీ పరిశీలించి చూస్తే పాపం అది ఎంతో ఇబ్బందిగా నడుస్తున్నది. మావటి వాడు దాన్ని ఎలాగోలా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అది చూసిన అనంత్ మనసు చలించిపోయింది. ‘పాపం కదా అమ్మా… మనం పెంచుకుందామా దాన్ని’ అని అడిగాడు. ‘సరే నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావా మరి’… అని అడిగింది తల్లి. ‘అవునమ్మా… నేను దాన్ని బాగా చూసుకుంటాను..’ అని చెప్పాడా పిల్లవాడు.

అలా ఆ ఏనుగు పిల్ల అనంత్ దగ్గరికి చేరింది. ‘దాన్ని తీసుకున్నప్పటికి కనీసం అది ఏం తింటుందో కూడా తెలీదు’ అని చెబుతాడు అనంత్. ‘మావటి వాడు ఏం చెబితే అదే పెట్టేవాళ్లం. దానికి ఏమైనా అయితే చికిత్స చేయించడానికి కూడా పెద్దగా నిపుణులు అందుబాటులో లేరు. అయితే ఇన్నాళ్లలో మేం చాలా నేర్చుకున్నాం. ఆ ఒక్క ఏనుగే కాదు, ఎన్నో ఆపదలో ఉన్న జంతువులు మా దగ్గర వచ్చి చేరాయి.
మరెన్నో గాయాల పాలై, ప్రాణాపాయంలో ఉన్న జీవులు ఇక్కడ కోలుకుని ఆనందంగా ఆడుకుంటున్నాయి. వాటికోసం ఎంతో పరిశోధనలు చేసి వందల సంఖ్యలో నిపుణుల్ని నియమించాం. విభిన్న జాతుల జంతువులు ఇక్కడి అడవిలో చక్కగా తిరుగుతూ ఉండటం చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది’… అని తన ఈ ముందడుగు గురించి చెబుతాడు అనంత్. ఇంతకీ వంతారా అంటే ఏమిటో చెప్పలేదు కదూ…. స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్.. అడవి చుక్క అని అర్థం!
ఎక్కడెక్కడి నుంచో
వంతారాలో మొత్తం 43 విభిన్న జాతులకు చెందిన 2000 దాకా జంతువులు ఉన్నాయి. అందులో 200 ఏనుగులు ఉన్నాయి. మంచు చిరుతలు, తెల్ల పులులతో పాటు విభిన్న రకాల చిరుతలు, పులులు, సింహాలు ఇక్కడ తిరుగుతుంటాయి. అనేక రకాల పాములు, మొసళ్లు, జిరాఫీలు, జీబ్రాలు, హిప్పోలు.. భారత్ సహా ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేరాయి. అంతేకాదు, అంతరించిపోతున్న జాతులుగా ఉన్న దేవాంగ పిల్లి, బట్టమేక పిట్ట, రాబందు, ఒకాపి, కారకల్.. లాంటి జంతు, పక్షుజాతులెన్నో ఇక్కడ తమ ఉనికిని పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్‍లో మొత్తం 3000 ఎకరాల్లో ఉన్న దీనిలో ఈ జీవులన్నీ తమ కోసం కేటాయించిన విశాలమైన ప్రాంగణాల్లో సంచరిస్తుంటాయి.

అడవుల నరికివేత వల్ల తమ స్థావరాలను కోల్పోవడం, వేట, స్మగ్లింగ్… లాంటి రకరకాల ప్రమాదాలకు గురయిన జంతువులే ఇవన్నీ. వేరువేరు ఆరోగ్య సమస్యలతో వచ్చే వాటిని ఇక్కడి నిపుణులైన వైద్యులు పరిశీలిస్తారు. ప్రపంచంలోనే అగశ్రేణి వైద్యులు, జంతు సంరక్షణ నిపుణులతో పాటు న్యూట్రీషనిస్టులు, పాథాలజిస్టుల్లాంటి 500 మంది అంకిత భావం కలిగిన నిపుణుల బ•ందం వీటి జబ్బులు, గాయాలను నయం చేసేందుకు పనిచేస్తున్నది.

క్రూర జంతువులా, సాధు జంతువులా, సరీస•పాలా అన్నదాన్ని బట్టి అన్ని జంతువులకూ స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా స్థలాన్ని కేటాయిస్తారు. వీటి బాగోగులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకునేందుకు 2100 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. 75 యానిమల్ అంబులెన్సులు కూడా ఉన్నాయిక్కడ.

వంతారాలో ప్రధాన ఆకర్షణ ఏనుగులే. ఇక్కడ ఉండే 200కు పైగా గజరాజుల సంరక్షణ కోసం 25000 చదరపు అడుగుల్లో ఆసుపత్రి కట్టారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. భారీగా ఉండే ఈ జంతువులకు ఆర్థరైటిస్‍లాంటి ఎముకల సమస్యలు ఏర్పడుతుంటాయి. దానికి హైడ్రోథెరపీ అని చేస్తారు. కాళ్ల సమస్యలు, కీళ్ల నొప్పులు ఉండే ఏనుగులు ఇక్కడి హైడ్రోథెరపీ పూల్స్లో కొన్ని గంటల పాటు సేదతీరి, సాంత్వన పొందుతుంటాయి.
ఇవికాక, ముల్తానీ మట్టి మసాజ్, జకుజీ (బాత్ టబ్ థెరపీ)లాంటివీ వీటి కోసం ఏర్పాటు చేశారు. ఇక, ఇందులో నివసించే జంతువుల ఆరోగ్య పరీక్షల కోసం, శస్త్ర చికిత్సలు, ఇతర చికిత్సల కోసమూ ఏర్పాట్లున్నాయి. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ ఎక్స్-రే, లేజర్ మెషీన్‍లు, సీటీ, ఎంఆర్‍ఐ యంత్రాలు, ఐసీయూ, డయాలిసిస్ కేంద్రం, పాథాలజీ ల్యాబ్, ఆపరేషన్ థియేటర్లు, హైపర్ బారిక్ ఆక్సిజన్ ఛాంబర్లు ఉంటాయి. అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీలాంటివి పరీక్షలు చేసే పరికరాలూ ఇక్కడ ఉన్నాయి.
కేవలం జంతువులను కాపాడి ఆరోగ్యాన్ని బాగు చేయడమే కాదు, వాటి గురించిన పరిశోధనలు జరిపే ప్రత్యేక విభాగమూ వంతారాలో ఏర్పాటయింది. ఆపదలో ఉన్న జంతువుల సంరక్షణ కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN), వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF)లతో కలిసి పనిచేస్తున్నది వంతారా.

వివిధ దేశాల్లోని జంతు సంరక్షణ కేంద్రాలతో పాటు ముఖ్యంగా మెక్సికో, వెనెజుల్లాలో ఉన్న రెస్క్యూ సెంటర్ల భాగస్వామ్యమూ ఉంది. భారత్‍లోని నేషనల్ జూ అథారిటీతోనూ టై అప్ అయ్యింది వంతారా. దేశవ్యాప్తంగా జూలను ఏర్పాటు చేసేందుకు మంతనాలు చేస్తున్నది. ఇటీవలే ప్రధాని అధికారికంగా ఓపెన్ చేసిన ఇది, త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
‘ఆవులో మూడు కోట్ల దేవతలూ ఉంటారంటారు. నేను ప్రతి ప్రాణిలోనూ దేవుడిని చూస్తాను. వాటికి సేవ చేయడం నిజంగా అద•ష్టంగా భావిస్తాను. ఎందుకంటే మనుషులకు సేవ చేసే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ నోరులేని ఈ ప్రాణులకు సేవ చేసే వాళ్లు చాలా తక్కువ. అందుకే అలాంటి జంతువుల కోసం ఈ నా ముందడుగు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.’ అంటూ ప్రేమ పూర్వక గొంతుకతో చెబుతాడు అనంత్. ఆపద నుంచి గట్టెక్కిన ఎన్నో మూగజీవాలకు ఈ నీడ నిజంగా దేవుడి తోడే కదూ!
- కె. సత్యప్రసన్న