పూటకూళ్ళవ్వ

(జరిగిన కథ: పూటకూళ్ళవ్వ విడిదిలో బస చేసిన అభిరామ్‍ ఫ్రెండ్స్లో ఒకరైన కార్తీక్‍ తను లావుగా ఉంటానని బాధ పడుతుండటంతో అవ్వ అతనికి ఒక మందు గురించి చెప్పి దాని అడ్రస్‍ చెబుతుంది.)


(గత సంచిక తరువాయి)
ఉదయం లేచే సరికి సైకిల్‍ పంక్చర్‍ అయింది. అంత పొద్దున్నే దాన్ని రిపేర్‍ చేసేవారు ఎవరూ కనబడలేదు.
‘‘ఇప్పుడెలా..? అడిగాడు అవ్వను.
‘‘చాలామంది అటువైపు నడిచి కూడా వెళ్తుంటారట మరి నీకు ఇష్టమైతే అలా వెళ్లొచ్చు’’ అంది అవ్వ.
కాసేపు ఆలోచనలో పడినా.. ‘‘మళ్లీ ఇలాంటి అవకాశం రాదు… ఈ ఒక్కసారికి వెళ్ళొస్తాను’’ అనుకొని ‘‘ఏం కాదులే అవ్వ.. వెళ్ళొస్తాను’’ అంటూ వెళ్ళాడు. కానీ, అక్కడ కూడా ఎవ్వరూ లేరు. దారిలో ఎదురయిన వారిని అడిగితే ‘‘అడ్రస్‍ ఇది కాదేమో బాబు..’’ అన్నారు. చేసేదేమి లేక తిరిగి వచ్చేసాడు.
ఈసారి అలసిపోయి వచ్చినా.. ఉదయమే చల్లటి వాతావరణంలో వెళ్లేసరికి మనసుకు, శరీరానికి తేలిగ్గా అనిపించింది. అదే విషయం తిరిగి వచ్చి అవ్వకు చెప్పాడు. ఇంతలో అక్కడే ఉన్న బరువు చూసుకునే మిషన్‍ చూసి తన బరువు చూసుకున్నాడు కార్తీక్‍. రెండు రోజుల్లో కిలో బరువు తగ్గాడు. ఆశ్చర్యపోయాడు కార్తీక్‍. అవ్వ ఇదంతా చూస్తూ ‘‘బాబూ.. నువ్వు లావుగా అయ్యింది తిండి ఎక్కువయి కాదు నాన్నా..! తగిన వ్యాయామం లేకపోతే ఇలాగే అవుతుంది. మీరు చదువులో ఫస్ట్రావాలని ఎప్పుడూ పుస్తకాల ముందే కూర్చోవడం, అది పూర్తి కాగానే విశ్రాంతి కోసం ఫోన్లు, టీవీల ముందు కూర్చోవడంతో ఇలా బరువు పెరుగుతున్నారు. ఏమందులూ నిజానికి నీకు అవసరం లేదు. నిన్న.. ఈ రోజు నీకు శరీరానికి కలిగిన వ్యాయామం వల్లనే ఇంత బరువు తగ్గావంటే.. రోజూ కాసేపు మీరు ఇలా చేస్తే ఎంత బాగుంటుంది ఆలోచించండి’’ అనగానే అవ్వ చెప్పింది నిజం అనుకున్నాడు. మిత్రులు కూడా ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. అక్కడున్న నాలుగు రోజులు… విడిదిలో ఉదయమే వ్యాయామం చేస్తూ రుచికరమైన తిండి తింటూ.. రోజూ ఒకవైపు.. వరంగల్‍లో భద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలు, వరంగల్‍ కోట.. రామప్ప దేవాలయం, లక్నవరం వంతెన ఇలా చూడవలసిన ప్రదేశాలు అన్నీ చూసి సరదాగా గడిపేసి అవ్వకు థాంక్స్ చెప్పి.. ఇక నుండి రోజూ వ్యాయామం చేస్తామని చెబుతూ వెళ్ళిపోయారు.
అవ్వ మాత్రం తను ‘‘మందు గురించి చెప్పింది అబద్దమని, సైకిల్‍ పంక్చర్‍ చేసింది తానేనని… ఇదంతా వ్యాయామం విలువ పిల్లలకు తెలియచేయటం కోసమే అలా చేసిందని’’ వాళ్లకు చెప్పలేదు.


× × ×


‘‘పూటకూళ్ళవ్వ విడిది’’ పేరుకు తగినట్టుగా పెళ్లి విడిదిలా ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. విడిదిలో బస చేసేవారు కూడా రోజు రోజుకీ ఎక్కువవుతున్నారు. అవ్వ అందరితో ప్రేమగా మాట్లాడటం, వచ్చిన వారిలో ఎవరికైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించటం, దానితో వచ్చినవారు సంతృప్తిగా తిరిగి వెళ్లిపోవడంతో.. రాను రాను అది ఒక ‘పరిష్కార నిలయం’గా మారింది.
ఆ రోజు మరో కొత్త కుటుంబం విడిదిలో ఉండటానికి వచ్చారు. భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు కలిసి నలుగురు వచ్చారు. ‘‘పొరుగు రాష్ట్రం నుండి వస్తున్నామని, భద్రాచలం వెళ్తున్నామని, మధ్యలో ఆగి ఒక రోజు విశ్రాంతి తీసుకుని వెళ్దామను కుంటున్నామని’’ చెప్పారు.
అంతా బాగానే ఉంది కానీ సమస్యంతా పిల్లలతోనే ఉంది. ఉదయం నుండి సాయంత్రం దాకా తుపాకీ బొమ్మతోనే ఆడుతున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సైజులో తుపాకీలు తెస్తున్నారు. అక్కడ ఉన్న మిగతా పిల్లలను షూట్‍ చేస్తూ ఆడుతున్నారు. బొమ్మ బుల్లెట్లే అయినా ఎదుటివారు కూడా చిన్న పిల్లవటంతో దెబ్బ తగులుతున్నదని ఏడుస్తున్నారు. అవ్వ ఇక ఆగలేక తల్లిదండ్రులకు నెమ్మదిగా చెప్పింది. ‘‘పిల్లలంతా భయపడుతున్నారు అలా తుపాకీలతో ఆడవద్దని చెప్పండని’’.
వెంటనే వాళ్ళ గుండెల్లోని బాధంతా అవ్వకు చెప్పుకున్నారు. ‘‘అవ్వా! మా ఊళ్ళో మేమిద్దరం మా ఉద్యోగాలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంటాము. పిల్లలిద్దరూ ఒకరు నాలుగవ తరగతి.. మరొకరు ఆరవ తరగతి చదువుతున్నారు. వీళ్లకు మధ్యాహ్నం రెండు గంటల వరకే స్కూల్‍ అయిపోవడంతో ఇంటికి వస్తారు. పిల్లలకు ఏదైనా అవసరమైతే ఉండాలని వాల్ల కోసం ఇంట్లో ఒక ఫోన్‍ ఉంచాం. చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ పోటీ పడుతుంటే అన్నా చెల్లెలిద్దరికీ చెరొక ఫోన్‍ కొనిచ్చాము. బాబు స్కూల్‍ ప్రాజెక్ట్ వర్క్ కోసం కూడా ఫోన్‍ వాడుకునేవాడు. రాను రాను ఫోన్లోని గన్‍ షూటింగ్‍ గేమ్స్కి బాగా అలవాటు పడి ఎక్కడికి వెళ్లినా అన్నా చెల్లెలిద్దరూ తుపాకీ బొమ్మలే కొనివ్వమంటూ వేధిస్తున్నారు. వద్దంటే అలగటం.. ఏడవటం మొదలు పెట్టారు. కానీ ఇలా ఎదుటి పిల్లల్ని కూడా వాటితో ఇబ్బంది పెడుతున్నట్టు ఇప్పుడే తెలిసింది’’ బాధపడుతూ అన్నారు.
‘‘వీళ్లది ఒక వింత సమస్యలా ఉంది. ఇలాంటి అలవాట్లు విపరీత ధోరణికి దారితీస్తాయని వార్తల్లో ఎన్నో సార్లు విన్నాను. ఇది ఒక వ్యసనంలా మారి పెద్ద పెద్ద ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ఇటీవల ఈ అలవాటుతో ఒకరు చనిపోయారని కూడా చెప్పారు. ఇలాంటి వారిని బాగు చేయటానికి చిన్నతనం నుండే గట్టి ప్రయత్నం చేయాలి’’ అనుకుంది అవ్వ.
(మిగతా కథ వచ్చే సంచికలో)

మాదారపు వాణిశ్రీ
ఫోన్‍ : 9247286668
బొమ్మలు: కైరం బాబు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *