అప్పాజీపేట అనన్య చరిత్ర

నల్లగొండ జిల్లా అప్పాజీపేట ఒక చారిత్రక ప్రదేశం. చరిత్ర పూర్వయుగం నుంచి ఆధునిక కాలం దాక మానవవికాసం ఆనవాళ్ళున్న గ్రామం. నల్లగొండ జిల్లా, మండల కేంద్రానికి అప్పాజీపేట 13కి.మీ.ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి మిర్లోని గూడెం, బంటుగూడెం అనే రెండు మధిర గ్రామాలున్నాయి. వెయ్యి కడపల వూరు. సగటున 5వేల మంది జనాభా.
ఊరికి రెండు చెరువులు ఉన్నాయి. ఒకటి ముత్యాలమ్మ చెరువు. రెండోది కాకిచెరువు. ముత్యాలమ్మ గుడి ఉన్నచోట చెరువును ముత్యాలమ్మ చెరువు అంటున్నారు. ఈ చెరువు పక్కననే శివాలయం ఉంది.


అప్పాజీపేటలో ద్వికూటాలయం:
శివాలయం 9,10 శతాబ్దాలలో రాష్ట్రకూటశైలిలో నిర్మించిన గుడి. ప్రధానాలయం ద్వారబంధం మీదున్న కలశాలనుబట్టి, లలాటబింబంగా వున్న గజలక్ష్మి శైలినిబట్టి ఒకప్పుడు ఈ గుడి జైనబసది అయివుంటుంది. ఇపుడు అగుపిస్తున్న దేవాలయంలోని ప్రధానాలయంలో గుండ్రనిపానవట్టంలో ప్రతిష్టించిన బాణలింగం ఉన్నది. శివాలయానికి ఎదురుగా నిరాడంబరమైన గుడికి లలాటబింబంగా సూర్యుడు చెక్కి వుండడంవల్ల ఆ గుడి సూర్యునిగుడి అని నిర్ధారించ వచ్చు. ఆ గుడి ముందరనే సప్తాశ్వాలు చెక్కిన సూర్యుని అధిష్టానపీఠం పక్కనపెట్టివున్నది. దానిమీద ఒక నాగశిల పెట్టివుంది.
సూర్యుని విగ్రహమేమో ఊరిలో పాడువడివున్న వేణుగోపాలస్వామిగుడిలో వుంది. గుడి మధ్యలో కదలీకరణంతో నిర్మించిన విమానం వుంది. లోకప్పులో షట్కోణయంత్రంలో వికసితపద్మం చెక్కివుంది.
గుడిలో శివాలయం ముందర రెండువైపుల భక్తులు కూర్చోవడానికి కక్ష్యాసనాలున్నాయి. గర్భాలయం, ముందర తెరచివున్న రెండుస్తంభాలతో మంటపం, ద్వారమంటపానికి నాలుగు కాకతీయశైలి స్తంభాలున్నాయి.
ఈ గుడికి ఉత్తర, దక్షిణ దిశల్లో మధ్యలో తొవ్వలున్నాయి. గుడికి ఒక మూలన ఉన్న గణపతి చతుర్భుజుడు. వెనకచేతుల్లో పరశువు, అంకుశాలు, ముందుచేతుల్లో విరిగిన దంతం, కుడుములతో, ఎడమవైపుకు తిరిగిన తొండం, పొట్టపై నాగబంధంతో లలితాసనంలో కనిపిస్తున్నాడు. గుడిగోడలకు ఆనించి నిలిపిన కొన్ని నాగశిల్పాలున్నాయి. గుడిలోపల ఒక నాగశిల్పం ఉంది.


వేణుగోపాలస్వామిగుడిలో సూర్యుడు:
ఆ వేణుగోపాలస్వామిగుడిలో మూడు తొలులున్న, వాహనంగా గరుడుని చెక్కిన అధిష్టాన పీఠముంది. ఉండాల్సిన వేణుగోపాలస్వామి శిల్పం లేదు. గుడి విమానం కదలీకరణం పద్ధతిలో పేర్చిన రాతికడీలతో నిర్మించబడ్డది. ఆ గుడిలో సూర్యుని శిల్పమున్నది. సూర్యుడు ద్విభుజుడు. రెండు చేతులలో తామరలను పట్టుకుని స్థానక భంగిమలో ఉన్నాడు. తలపైన పట్టమకుటం ఉంది. మెడలో హారముంది. చెవులకు జూకాలు, వక్షబంధం, మణిమేఖల, పెద్ద యజ్ఞోవవీతంతో కనిపిస్తున్నాడు.
ఆ గుడిలోనే పడివున్న ఒక స్త్రీమూర్తి శిల్పం పెద్ధ ధమ్మిల్లంతో, శిరోభూషణాలతో, మెడలో హారంతో ఎడంచేత ఎడమభుజం మీద పెట్టు కున్న చామరంతో, కుడిచేత (మాదీ) ఫలంతో, నడుమున నీవీబంధంతో, ద్విభంగిమలో నిల్చుని అగుపిస్తున్నది. ఈమె జైనయక్షిణి అయివుండ వచ్చు. ఆ గుడిపైకప్పులో భువనశిల్పంగా పద్మం చెక్కబడ్డది.
ఊరి పాటిగడ్డమీద హనుమంతుని గుడివుంది. 16వ శతాబ్దంనాటిది.
ఊరిబయట జెల్లమ్మ గడ్డ అని పిలిచే ప్రాంతంలో జంబులమ్మతల్లి అని పూజించే శిల్పమొకటి వెలుగు చూసింది. ఈ శిల్పం ప్రతిమాలక్షణాలను బట్టి చాముండి. ఈ దేవత చతుర్భుజి. వెనక పరహస్తాలలో ఢమరుకం, త్రిశూలాలు, ముందుచేతులు విరిగివున్నాయి. కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో రక్తపాత్రలుండాలి. వాహనంగా ఉడుము ఆనవాలుంది. ఈ శిల్పం ప్రతిమాలక్షణాలనుబట్టి కళ్యాణీచాళుక్యుల కాలంనాటిది.
గ్రామం బయటనే సప్తమాత•కాఫలకం ఉన్నది. ఈ శిల్పం 3న్నర అడుగుల పొడవు, 1అడుగు ఎత్తున్న రాతి ఫలకం. సప్తమాత•కాశిల్పాలకు ముందు వీరభద్రుడు, వెనక గణపతి శిల్పాలున్నాయి. ఇది కళ్యాణీ చాళుక్యులకాలంలో వేయించిన సప్తమాత•కాఫలకాల లక్షణం. 7గురు బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి దేవతలకు వరుసగా హంస, నంది, నెమలి, గరుడుడు, వరాహం, ఏనుగు, నక్క 7 వాహనాలున్నాయి. అపురూపమైన శిల్పం.


ఊరిలో, ఊరిబయట ఇన్ని శిల్పాలు కనిపించడంవల్ల ఈ వూరికి ఎన్ని పాటిగడ్డలున్నాయో అనిపిస్తుంది.గ్రామంలో కొత్తగా కట్టిన ఈదమ్మగుడి చాకలికులానికి సంబంధించిన దేవాలయం. వృత్తులవారీగా, కులాలవారీగా కులదేవతలుండడం పరిపాటి. ఈ దేవాలయంలో మడేలయ్య స్వామి, ఈదమ్మ, ఇతర దేవతామూర్తుల శిల్పాలను ప్రతిష్టించారు. వాటిని దేవతామూర్తుల ప్రతిమాలక్షణాలను పాటించి తయారుచేయడం విశేషం. శిల్పి ప్రతిభకలవాడు అనిపిస్తుంది.


అప్పాజీపేట శాసనం:
శివాలయం పక్కన ఉన్న రాతిస్తంభం మీద చెక్కివున్న శాసనం కాకతీయులపాలనాకాలం నాటిది. శాసనం తెల్లరాతిస్తంభం మీద చెక్కబడివుంది. స్తంభం 5దున్నర అడుగుల ఎత్తుంది. శాసనం రెండువైపుల చెక్కివుంది.
శాసన వివరాలు
రాజవంశం: కాకతీయ
రాజు: ప్రతాప రుద్రదేవ చక్రవర్తి
కాలం: శక సం.1198(?). హేమలంబి సం. మాఘశుద్ధ సప్తమి పుణ్యతిథి భానువారము, 1177 జనవరి 9
భాష: తెలుగు
లిపి: తెలుగు
శాసనంలో పేర్కొన్న పేర్లు: ప్రతాపరుద్రదేవ మహారాజులు, శ్రీమన్మహా రాయగజసాహిణి…. బొప్పయరెడ్డి
శాసనం మొదటివైపు పైన
చంద్ర, సూర్యులు
చక్రం, పానవట్టంపై నాగులతో శివలింగం, ఖడ్గం, కామధేనువులున్నాయి
మొదటివైపు:

  1. స్వస్తిశ్రీ
  2. విజయాభ్యు
  3. దయ శక వరుష
  4. 0బులు 11(98?) య
  5. గునేందికి హేమ
  6. ళంబి సంవత్సర
  7. మాఘశుద్ధ..ల
  8. భానువారము
  9. సప్తమి వృతి పో
  10. తయన పుణ్యతిథి
  11. యందు (స్వస్తి) సమధి
  12. గత పంచమహాశబ్దు
  13. మహామండలేశ్వర
  14. కాకతీశ్వర ప్రతాప
  15. రుద్రదేవ మహా
  16. రాజుల ప్రసాదం
  17. బున స్వస్తిశ్రీ మన్మ
  18. హా రాయగజసా
  19. హిణి స్వామిద్రోహ


రెండోవైపు:

  1. ………………………
  2. ……… భళ…………….
  3. …….రెడె పొశ్లుసు……….
  4. ..శంకరగారున్ను…..
  5. వపలి స్తలము నాయ
  6. 0కఱము పళసితా
  7. ….ను బొప్పయరెడ్డి
  8. ఆనతిచ్చి ఆ స్తల….
  9. లోని పిలళుమఱేస్వర
  10. …..దేవరకును ద..ద(గో)
  11. పినాథ దేవరకున్నుభో(గా)
  12. లకు వ్రిత్తి చరు సగదె
  13. ననుహెంద్దో..స్మా….
  14. కాల్వను నీరు…….
  15. ……యల……….
  16. …………………..
  17. ….లును కల్వల ద
  18. …యలుసమ
  19. …యలుసమ
  20. …ను బెటిచిన గ…
  21. …..పిమాం….
  22. ….నుబ్రా…..
  23. ….జలయతు…
  24. ….మున్నుతవి
  25. ……వ…….
  26. …………గా…..
  27. ……………
  28. ………………
  29. త్తి…………………యోడి
  30. లున్ను………ప ఆ
  31. చంద్రార్కంగాను ధా
  32. రపోసితి స్వదత్తాం
  33. పరదత్తావాయో హరేత
  34. వసుంధరార్వష్షష్టి
  35. ర్వరుష సహస్రాణి విష్టాయాం
  36. జాయతే క్రిమిః సామా
  37. న్యోయం ధర్మసేతు నృపాణా
  38. క కాలేకాలే పాలనీయో భవద్భిః
  39. స్సర్వేనేతాన్‍ భావినఃపార్థివేం
  40. ద్రాన్భూయో భూయో యాచ
  41. తే రామచంద్రః శీశ్రీ


శాసన సారాంశం:
శక సం.1198కి అంటే 1276లో హేమలంబి రాదు. హేమలంబి కూడా 1238లో లేదా 1298లో వస్తున్నది. అయితే మొదటి ప్రతాపరుద్రునికాలం, హేమలంబి మాఘశుద్ధ సప్తమి, ఆదివారం క్రీ.శ.1177 జనవరి 9 ఆదివారం అవుతుంది. లేకపోతే రెండో ప్రతాపరుద్రుని కాలం 1298లో మాఘశుద్ధ సప్తమి ఆదివారం కావడంలేదు. కనుక మొదటి ప్రతాపరుద్రుని కాలంలోనే నిర్ధారించడం సరియైన నిర్ణయం అవుతుంది. ఈ శాసనంమొదటిప్రతాపరుద్రదేవుని కాలంలో ఇక్కడి నాయంకరము పాలించే బొప్పయ(రెడ్డి)… మరీశ్వర దేవరకు, గోపీనాథదేవరకు ఇచ్చిన భూదానశాసనం అని అర్ధమవుతున్నది. ఈ శాసనం ‘కొత్త తెలంగాణశాసనాలు’ పుస్తకంలో ప్రకటించబడ్డది.


అప్పాజీపేటలో చరిత్రపూర్వయుగం ఆనవాళ్ళు:
అప్పాజీపేట కోరటిగడ్డ మీద పెదరాతియుగంనాటి పదులకొద్ది కైరన్‍(కుప్ప) సమాధులున్నాయి. బంతిరాళ్ళ సమాధులున్నాయి. కొత్తరాతియుగం పనిముట్లను పదును పెట్టుకున్న నూరుడుగుంత లున్నాయి. కత్తులవంటి వాటిని నూరే గాడులున్న రాళ్ళు ఈ గడ్డ మీద లభిస్తున్నాయి. వ్యవసాయంవల్ల రాతియుగం ఆనవాళ్ళన్నీ చెదిరిపోయాయి. పాతకాలపు నాలుగు రాతిసలపల గుడులలో గ్రామదేవతలు, బీరప్ప, మల్లన్నగుడులు అందులో రాళ్ళే దేవుళ్ళుగా పూజించబడడం పురాకాలపు సాంస్కృతిక విశేషం. అప్పాజీపేట కోరటిగడ్డలో కూడా చిన్నరాతిగూడు గుడి వుంది. ఆ గుడిలో పెట్టి పూజింపబడుతున్నవి అవక్షేపశిలలు. బీరప్పగుడులలో కొత్తరాతియుగం రాతిగొడ్డండ్లను లింగాలుగా, కొన్నిచోట్ల వృక్షశిలాజాలను, గిరిజన ప్రాంతాల్లో డైనోసార్ల కోప్రలైట్స్ ని కూడా పూజిస్తుండడం గమనించవచ్చు. దైవభావన ఉంటుంది కాని, రూపస్థాపన ఉండనివారి ఆరాధనలవి.


ఎన్ని నిలువుల నిలువురాయో!

అప్పాజీపేటలోనే దేశంలోనే ఎత్తైన నిలువురాయి(మెన్హర్‍) ఉంది. 26 అడుగుల ఎత్తైన ఈ నిలువురాయి ఒకవైపు వంపుతిరిగి వుంటుంది. ఇటువంటి నిలువురాయి మరొకచోట లభించలేదు. మెన్‍ హిర్‍ చిత్రాన్ని తెలంగాణ వారసత్వశాఖవారు ప్రచురించిన పుస్తకం మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించడం విశేషం.
స్థానికుడు అప్పాజీపేట వాసి సి. యాదగిరి జర్నలిస్టు వల్ల ఈ గ్రామచరిత్ర వెలుగులోనికి వచ్చింది. అభినందనీయుడు. తాను కొత్త తెలంగాణచరిత్రబబృందంతో కలిసి పనిచేస్తున్నాడు. తనవల్ల అప్పాజీపేట, అవురొండి గ్రామాల శాసనాలు, స్థానిక చరిత్రలు వెల్లడైనాయి.
ధన్యవాదాలు: నాకు ఈ గ్రామపరిశీలన, పురావస్తువుల నిర్ధారణ, ఆలయాలు, ప్రతిమలకాలనిర్ణయం, శాసన పరిష్కారానికి సహకరించిన సి.యాదగిరి, వేముగంటి మురళీకృష్ణ, రాగి మురళి, నాగరాజు, చంటి, అప్పాజీపేట గ్రామప్రజలందరికి.

  • శ్రీరామోజు హరగోపాల్‍, ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *