పర్యావరణహిత మైనింగ్‍ను పాటిస్తూ, కోట్లాది మొక్కలను నాటి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న సింగరేణి సంస్థ, తాజాగా సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల అభివృద్ధికి ‘‘సింగరేణి నీటిబింధువు – జల సింధువు’’ అనే నినాదంతో ఒక విశిష్ట పర్యావరణహిత, ప్రజోపయోగ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
సకల జీవరాసులకు, పంటలకు ప్రాణప్రదమైన నీటి విలువను గుర్తిస్తూ, మైనింగ్ ప్రాంతంలోనూ, ప్రాంతానికి వెలుపల రెండు కిలోమీటర్ల పరిధిలోను 50 మినీ చెరువులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుత చెరువులలో పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 7న నిర్వహించిన వీడియో సమీక్ష సమావేశంలో సీఎండీ ఎన్.బలరామ్ ఏరియాల జీఎంలతో, అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనురుల వృద్ధికి కొన్ని మార్గదర్శ కాలను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ ఎన్.బలరామ్ మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచడం కోసం, సమీప గ్రామాల ప్రజలకు ఎండాకాలంలో సైతం స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం, ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసే చర్యల్లో భాగంగా నీటి బిందువు- జలసింధువు అని నినాదంతో జల వనరుల పెంపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు.
సింగరేణి చేపట్టనున్న చర్యల వల్ల సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, తాగునీరు, సాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో భూగర్భ జలాల పెంపుదలకు తీసుకోవలసిన చర్యలపై చర్చించి ప్రాథమికంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
- సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటికే బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ సంపుల్లో నీటి శాతాన్ని పెంచాలని, తద్వారా సమీప ప్రాంతాల్లో వాటర్ టేబుల్ (నీటిఫలకం) ను వృద్ధి చేయాలని నిర్ణయించారు.
- ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ డంపుల మధ్య ఏర్పడే లోతట్టు ఖాళీ ప్రదేశాలను ఇకపై చిన్నపాటి నీటి తటాకాలుగా తీర్చిదిద్దాలని, వీటిని వర్షపు నీటితో, లేదా ఓపెన్ కాస్ట్ నుండి బయటకు పంపించే నీటితో నింపాలని భావిస్తున్నారు. పైవిధంగా ఏర్పాటు చేసిన జల వనరు కేంద్రాల లోనికి నీరు చేరడానికి, చేరిన నీరు బయటకు పంపించి సద్వినియోగం చేయడానికి కొన్ని సివిల్ నిర్మాణపు పనులు కూడా శాఖాపరంగాచేపట్టాలని నిర్ణయించారు.
- అలాగే సింగరేణి గని ప్రాంతాలకు వెలుపల 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తరాల నాటి చెరువులు, కుంటలను కూడా అభివృద్ధి చేయాలని, వాటిలో ఎక్కువ నీరు నిలువ ఉంచేందుకు పూడిక తీయడం వంటి పనులు కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు స్థానిక గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల అంగీకారాన్ని పొంది, ఈ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చూడాలని కూడా నిర్ణయించారు.
- పై చర్యల వల్ల సింగరేణి ప్రాంతంలో భూమి లోపల నీటి ఫలకం పెరిగి జలవనరులు వృద్ధి చెందుతాయని, ఈ నీటిని తాగునీరు, సాగునీటికి కూడా వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఈ తటాకాలు కేవలం జల వనరుల పెంపుదలకు మాత్రమే కాక ఆ ప్రాంత జీవావరణ పరిరక్షణ కూడా ఉపయోగపడతాయని, వీటిలో చేపలు, కప్పలు వంటి జలచరాలను కూడా వృద్ధి చేయవచ్చు అని భావిస్తున్నారు.
- సింగరేణి ఏర్పాటు చేయనున్న ఈ జల వనరుల కేంద్రాల లోని నీటిని శాస్త్రీయంగా ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ నాణ్యత పెంపుదలకు చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు
- కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ వారి సూచన మేరకు సింగరేణి సంస్థ ఈ భారీ పర్యావరణహిత పథకాన్ని అమలు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు (ఈఅండ్‍ఎం), ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వెంకటేశ్వర్లు (పా, పిఅండ్‍పి), హైదరాబాద్ కార్యాలయం నుండి ఈడీ (కోల్ మూమెంట్) ఎస్ డి ఎం.సుభానీ, ఫారెస్ట్ అడ్వైసర్ మోహన్ పరిగెన్ పాల్గొన్నారు.
-చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ప్రభుత్వ సంస్థ)
ప్రజా సంబంధాల విభాగం, హైదరాబాద్