జానపద ఇంద్రజాల కళారూపాలు

జానపద కళారూపాల్లో ఇంద్రజాల కళారూపాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇంద్రజాల కళారూపాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించటమే కాకుండా ఇతర కళారూపాల కంటే ప్రేక్షకునికి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించి సంభ్రమాశ్చర్యంలో ముంచుతాయి. అందుకే ఇంద్రజాల కళారూపాలకు ఆదరణ ఎక్కువగా ఉంది. ఇంద్రజాలం అంటే ‘‘మాయ’’ అని, మంత్రౌషధాదుల చేత ఒక విధమైన పదార్థాన్ని మరొక విధంగా చూపే విద్య అని, నిఘంటువులు అర్ధాలు చెపుతున్నాయి.
ఇంద్రజాలకుడు అంటే కనికట్టు వాడు, ఇంద్రజాలం చేయువాడు అనే అర్థాలు కన్పిస్తాయి. అట్లాగే కనికట్టు అనే పదానికి ‘‘కన్నులకు గట్టెడు కట్టు గంత’’ అని నిఘంటువులో అర్థం ఉంది. ఇవే కాకుండా గారడి అనే పదం కూడా ఇంద్రజాలం అనే అర్ధాన్ని సూచిస్తుంది. ఇంద్రజాలం పదానికి అర్ధాలు ఎలా ఉన్నప్పటికీ ఈ విద్యను ప్రదర్శించే కళాకారులను మాయ మంత్రగాళ్లు అని, మంత్ర తంత్రాలు చేస్తారని చేతబడి చేయుటలో నేర్పరులని జానపదులు ఇప్పటికీ విశ్వసిస్తారు.
ఇంద్రజాలికుల ప్రస్తావన ప్రాచీన గ్రంథాల్లో, పురాణాల్లో కూడా కనిపిస్తుంది. శ్రీహర్షుని రత్నావళి నాటకం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర, కొరవి గొపరాజు రచించిన సింహాసన ద్యాత్రింశిక, కాళిదాసు మేఘసందేశం, పింగళి సూరన కళాపూర్ణోదయం, కావ్యాలలో ఇంద్రజాలంశాల ప్రస్తావన కనిపిస్తుంది. ఇంద్రజాలం అనేది అరవై నాలుగు కళల్లో ఆసక్తికరమైన కళ. ఇది అందర్నీ అలరించే కళ. ఇందులో సైన్స్కు సంబంధించిన అంశాలు నిమిడీకృతమై ఉంటాయి. వీటిని ప్రదర్శన ద్వారా అవన్నీ మంత్ర తంత్ర విద్యలుగా నమ్మిస్తారు. ఇంద్రజాల కళారూపాల్లో సాధనశూరులు, విప్రవినోదులు, బీరన్నలు, కాటికాపరులు, కూచిపూడి గారడి వేషం, గారడి, మోడి, మహమ్మదీయులు మోళీ, యక్షగానం మొదలైన ఇంద్రజాల కళారూపాలు కనిపిస్తాయి. ఇందులో కేవలం ఒక కులాన్ని మాత్రమే ఆశ్రయించే ఇంద్రజాల కళారూపాలు మూడు ఉన్నాయి. ఒకటి సాధనాశూరులు, రెండు విప్రనోదాలు, మూడు బీరన్నలు. ఇందులో సాధనాశూరులు. పద్మశాలి కులానికి ఆశ్రిత కళారూపం. విప్రవినోదులు బ్రాహ్మణులకు ఆశ్రిత కళారూపం.
సాధనాశూరులు: పద్మశాలి వంశాన్ని రక్షించటం కోసం పద్మశాలీలలోని ఆడపు, గంజి, భీమనపల్లి, వంగరి, గంజి, అనే ఇంటి పేరు గలవారు ధైర్యంతో సాహసం చేసి కృష్ణ గంధర్వుడు అనే రాజును సంహరించటంతో పద్మశాలీల వారితోనే సాధనాశురులుగా కొలువబడ్డారు. మీరు కేవలం పద్మశాలి కులాన్ని మాత్రమే ఆశ్రయిస్తారు. వీరికి దాత• కులం దగ్గర హక్కులు కలిగి ఉంటారు. సాధనాశురులు కళాకారులు ప్రదర్శించే ఇంద్రజాలాంశాల్లో ప్రత్యేకమైనవి 1) తలపై పొయ్యి పెట్టి పూరీలు కాల్చడం 2) చొప్పల పల్లకిలో ఊరేగించటం 3) గుడారంలో ఒక మనిషిని స్తంభానికి కట్టి ఉంచి మరొక స్తంభానికి మార్చటం 4) గుడారంలో దేవతా విగ్రహాలను సృష్టించటం 5) గుడారంలో వెళ్లిన మనిషి వికృత రూపంలో బయటికి రావటం 6) చిలుక కట్టటం అంటే ఏ ఆధారం లేకుండా గాలిలో చిలుకను నిలబెట్టడం 7) శరీరంపై రాళ్లను పగలగొట్టుట 8) కరెంటు బల్బులను నమలటం 9) అగ్నిలో కాల్చిన కాగితం మరియు దారాన్ని తిరిగి రప్పించటం మొదలైన ఇంద్రజాలాంశాలు ప్రదర్శించడంలో వీరి ప్రత్యేకత.
విప్రవినోదులు: విప్రులకు వినోదాన్ని అందించే వారే విప్రవినోదులు. వీరు బ్రాహ్మణులకు ఆశ్రితులు. ప్రదర్శనలో గుడారంలో అలమార ఉంచి. అందులో దేవతా విగ్రహాలను సృష్టించటం. ఒక మామిడి పిక్కను పాతిపెట్టి, కొద్ది సమయం తర్వాత అడుగుఎత్తు పెరిగిన మామిడి మొక్కను చూపిస్తారు. కప్పలను తేళ్లను చిలుకలను సృష్టించటం అంతేకాకుండా అరచేతిలో విభూతిని స•ష్టించటం వీరి ప్రత్యేకత. కొందరు విప్రవినోదులు రోప్‍ ట్రిక్‍ అని ఇంద్రజాల విద్యను ప్రదర్శించేవారు. ఈ విద్యలో ఒకరు త్రాడును ఆకాశం పైకి ఎగరవేయగా, అది అలాగే నిలబడి పోతుంది. మరొక ప్రదర్శనకారుడు ఆత్రాడును పట్టుకొని పైకి ఎక్కి మాయమైపోతాడు. ఈ విద్యను ప్రముఖ లండన్‍ ఇంద్రజాలికుడు పాల్‍ డేనియల్‍ ప్రశంసించి భారతీయులు దీన్ని ప్రదర్శించటం లేదని అంతరించి పోయిందని పేర్కొన్నాడు.
బీరన్నలు: బీరన్నలు కురుమ జాతికి చెందినవారు. కానీ వీరు కురుమలకు పూజారులుగా వ్యవహరిస్తారు. కురుమలు, గొల్లలు బీరన్నలు పండుగ చేసే సందర్భంలో బీరన్నలు ఏడు రోజులు కథ చెపుతారు. ఇందులో భాగంగా ఐదవ రోజున ఇంద్రజాలాం శాలను ప్రదర్శిస్తారు 1) మొక్కజొన్నలు రుమాలులో వేసి వాటిని వేడి చేయించకుండానే పేలాలుగా మార్చటం 2) గొంతులో కత్తి దింపుకోవటం 3) పురిత్రాడును నిటారుగా మరియు అడ్డంగా నిలుపటం 4) సమాధి లోనికి వెళ్లి కొద్ది సమయం వరకు ఉండి తిరిగి బయటకు రావటం 5) చేతులకు కాళ్లకు బేడీలను విప్పుకోవటం 6) అగ్నిలో నడవటం, నోటిలో లింగాలను అప్పటికప్పుడు పుట్టించటం 7) ఖాలీ పాత్ర నుండి రూపాయి నాణాలను సృష్టించటం 8) గడ్డిలో నుండి రూపాయలు నోట్లను స•ష్టించడం మొదలైన అంశాలను ముఖ్యంగా ప్రదర్శిస్తారు.
కాటికాపరులు: కాడులో పాపల మాదిరిగా పడుకుంటారు. కాబట్టి కాటి పాపలు అనే పేరు వచ్చిందంటారు. మరో కథనంలో కాటికి కాపర్లుగా ఉండటంతో కాటికాపర్లు అంటారని చెపుతారు. వీరి వేషధారణ భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. భుజాన కావడి దానికి రెండు వైపులా జోలలు. ఒక చేతిలో బోనుగ మరొక చేతిలో ఎముక పట్టుకుంటారు. వీరి దగ్గర ఎప్పుడు రాగి శాసనం, శంఖం ఉంటుంది. కాటి పాపలు గ్రామంలో తిరుగుతూ ఇంద్రజాల అంశాలను ప్రదర్శిస్తారు. 1) తెల్ల కాగితాన్ని చూపి రూపాయి నోట్లను సృష్టించటం 2) కప్పలు పాములు తేళ్లను సృష్టించటం 3) నోట్లో నుండి గోలీలను గవ్వలను తీయటం, నోటిలోకి మేకులు మ్రింగి బయటికి తీయటం వంటి విద్యల్ని ప్రదర్శస్తారు.


కూచిపూడి గారడి: కూచిపూడి వారు వేసే వేషాలలో గారడి వేషం ఒకటి. వీరు అగ్నికి సంబంధించిన విద్యలు ప్రదర్శిస్తారు. 1) కొలిమిలో కాల్చిన గడ్డపారలను చేతిలో పట్టుకోవటం 2) కొలిమిలో కాల్చిన ఇనుప గుళ్లను పళ్లతో పట్టుకోవటం 3) తలపై పోయ్యి పెట్టి గారెలు వండటం మొదలైన అంశాలు ప్రదర్శిస్తారు.
గారడి: గారడి అనే పదానికి నిఘంటువులు చెప్పిన అర్థాన్ని బట్టి మాయ మంత్రం తెలిసినవాడు. పాములు పట్టేవాడు, విషమంత్రం తెలిసినవాడు, ఇంద్రజాల మని అర్థం చేసుకోవచ్చు. వీరు పూర్వకాలం నుండి నేటి వరకు గారడి విద్యలు ప్రదర్శిస్తున్నారు. వీరు 1) వేపాకులు తెంపి తేళ్లను తెప్పించటం 2) అరచేతిలో రూపాయలు సృష్టించటం 3) మామిడి పిక్కను పాతిపెట్టి మొక్కగా చేయటం 4) మనిషిని బుట్టలో పెట్టి మాయ చేయటం 5) వస్తువులను మాయం చేసి చూపించటం వీరి ప్రత్యేకత!
మోడి: వీరు ప్రదర్శించే ఇంద్ర జాలాంశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రదర్శనలో కళాకారులు రెండు పక్షాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు మంత్ర తంత్రాలు ప్రయోగించుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ప్రదర్శన ప్రారంభంలో 1) తెల్ల కాగితాన్ని రూపాయి నోటుగా మార్చటం 2) పొడి ఇనుమును కాపి తిరిగి కోడి ఇసుకనే తీయటం 3) తడి బట్టపై పేలాలు వేయించటం 4) మండే నిప్పును మింగటం 5) నాలుకను కోసినట్లు చూపించటం 6) ఎర్రగా కాలిన గుండును నోటితో త్రాకటం 7) ఇనుప కత్తిని మింగటం 8) కళ్లు పీక్కోవటం 9) మంత్రించిన కందులు ఒకరిపై చల్లగా అవి కందిరీగల్లాగ కుట్టటం వంటి ప్రత్యేకమైన ఇంద్రజాలాంశాలను ప్రదర్శిస్తారు.
మహమ్మదీయుల మోళీ: ఈ విద్యను మహమ్మదీయుల్లోని ఒక వర్గం వారు ప్రదర్శిస్తారు. వీరి ప్రదర్శించే మోడీ పాముల వారు ప్రదర్శించే మోడీకి భిన్నంగా ఉంటుంది. ప్రదర్శనలో 1) బుట్టలల్లో పాములను చూపించి తిరిగి మాయం చేయటం 2) ఖాళీ బుట్టలను చూపించి పాములను సృష్టించటం 3) ఒక కుర్రవాడి కాళ్ల మధ్యన ఖాళీ డబ్బా పెట్టి ఆ కుర్రవాడి పిర్ర మీద ఒక దెబ్బ కొట్టగా డబ్బాలోకి రూపాయలు కురిపించటం 4) చేతుల్లో పట్టుకొన్న రూపాయలను మాయం చేయటం 5) ఒకరి ఉంగరాన్ని మాయం చేసి మరొకరి చేతికి ప్రత్యక్షం చేయటం వీరు ప్రదర్శిస్తారు!
ముగింపు: ఇంద్రజాల కళారూపాలు ప్రదర్శించే కళాకారులు ప్రదర్శన సమయంలో నిష్టగా ఉంటారు. ప్రదర్శన రక్తి కట్టించడానికి వారి అనుభవంలో ఉన్న ప్రదర్శన నైపుణ్యాన్ని సందర్భాన్ని బట్టి ప్రయోగిస్తారు. ఈ కళాకారులకు వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. ప్రదర్శనలో వాక్చాతుర్యంతోనే హస్తలాఘవం, కనుకట్టుకు సంబంధించిన అంశాలను ప్రదర్శించగలుగుతారు.ప్రదర్శనాద్యంతం ప్రేక్షకున్ని ఆకట్టుకునే లా హాస్యంతో కూడిన సంభాషణలు ప్రయోగిస్తారు. అంతేకాకుండా ప్రదర్శన సందర్భంలో వీరి బృందంలోని వ్యక్తి ఒకరు హస్యగాని పాత్ర పోషిస్తూ, ప్రేక్షకులకు కలిగే సందేహాలను ప్రశ్నలను అడుగుతూ వాటిని నివృత్తి చేస్తూ ప్రదర్శించటం వీరి నైపుణ్యం. సున్నితమైనా హస్యం సమాజంలోని సంఘటనలు, కుల ప్రస్తావన, నిత్య అవసరాల ప్రస్తావన మొదలైన అంశాలను ఇతివృత్తంగా చేసుకొని సంభాషణ కొనసాగిస్తారు అవసరమైతే ప్రదర్శనలో తిట్లు శాపనార్ధాలు వంటివి ప్రయోగిస్తారు.

ఇంద్రజాంశాలను ప్రదర్శించే కళాకారులు కొన్ని ఇంద్రజాలాంశాలను ప్రేక్షకులతోనే చేయించటం, తద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందటం వీరి నైపుణ్యంగా చెప్పవచ్చు. కళాకారుల నైపుణ్యం ఆయా ఇంద్రజాలాంశాలను ప్రదర్శించేటప్పుడు, వారు ఉపయోగించే వస్తువులు ప్రదర్శనలో నిర్మించే గుడారాల నిర్మాణంలోనే మర్మం దాగి ఉంటుంది. ఇది తరతరాలుగా వారికి సంక్రమించిన ప్రదర్శనా నైపుణ్యం. వారి ప్రదర్శనలోని రహస్యాన్ని చెప్పటం ఒక రకంగా వారి కళా మాయా జీవితాన్ని. వారి వృత్తి ధర్మాన్ని కోల్పోయిన వారవుతారు. అందుకే కళాకారులు ఇంద్రజాలాంశాలకు సంబంధించిన రహస్యాలను బయటి ప్రపంచానికి తెలియకుండా, వారు కులం కట్టుబాట్లు ఏర్పరుచు కున్నారు.
సంస్కృతిలో భాగమైన ఇంద్రజాల కళారూపాల పరిరక్షణ పోషణ నేటి ఆధునిక యుగంలో చాలా అవసరం. నేటి ఆధునిక మెజీషియన్స్కు ధీటుగా హంగు ఆర్భాటాలు లేకుండా, కేవలం తమకు అందుబాటులో ఉండే వస్తువులతోనే జానపదులను సంభ్రమాశ్చర్యంలో ముంచే నైపుణ్యం కలిగిన జానపద ఇంద్రజాల కళారూపాల ఆవశ్యకత చాలావరకు ఉంది.

  1. కళా తెలంగాణం, మామిడి హరికృష్ణ,సం-భాషా సాంస్కృతిక శాఖ 2017
    2 జానపద గిరిజన సాంస్కృతికాంశాలు డా. శ్రీమంతుల దామోదర్‍, సుమంత్‍ ప్రచురణలు 2017.
  2. పద్మశాలి ఆశ్రిత కులాల సాహిత్యం -ఒక పరిశీలన డా. బాసని సురేష్‍, స్వప్న ప్రచురణలు 2011.
  3. పటం కథలు-కథకులు, డా. గడ్డం వెంకన్న భగత్‍ ప్రచురణలు, 2011
  4. తెలంగాణ కళాసౌరభాలు, డా.బాసని సురేష్‍, భాషా సాంస్కృతిక శాఖ, 2023
  5. తెలుగు వారి జానపద కళారూపాలు, మిక్కిలినేని రాధాకృష్ణ, 1992.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *