ప్లాస్టిక్‍ వద్దు.. పేపర్‍ బ్యాగే ముద్దుజూలై 12న ‘పేపర్‍ బ్యాగ్‍ డే’

అణుయుద్ధాలు, కరోనా వైరస్‍ల కంటే ప్రమాదకరంగా చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తోన్న మరో ప్రమాదకారి ప్లాస్టిక్‍. ప్రస్తుతం ప్రతీ రోజు భూమిపై పోగవుతున్న ప్లాస్టిక్‍ను కంట్రోల్‍ చేయకపోతే 2050 నాటికి సముద్రంలో ఉన్న చేపల బరువు కంటే ఎక్కువ ప్లాస్టిక్‍ చెత్త అక్కడ పోగు పడిపోతుందని అంతర్జాతీయ నివేదికలు తేల్చి చెబుతున్నాయి.
పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాస్టిక్‍ను నిషేదించేందుకు అందరూ ముందుకు వచ్చేలా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే వాటిపై మరింత అవగాహన కల్పించడానికి.. ప్రపంచవ్యాప్తంగా జూలై 12న పేపర్‍ బ్యాగ్‍ డేగా నిర్వహిస్తుంది.
మనం వాడే పలుచని ప్లాస్టిక్‍ క్యారీ బ్యాగులు పర్యావరణానికి చాలా హానికరం. ఇవి నీరు, భూమి, వాయు కాలుష్యానికి దోహదకారిగా పనిచేస్తున్నాయి. ప్రతిరోజు ఇంట్లో వాడే చెత్త, చెదారం, తిని మిగిలిపోయిన పదార్థాలు ప్లాస్టిక్‍ సంచుల్లో మూటగట్టి పారవేయడం పరిపాటిగా మారింది. దీనివల్ల మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మూగజీవులు తమ ఆకలి తీర్చుకొనేందుకు మూటగట్టిన ప్లాస్టిక్‍ సంచులను తినడం వల్ల వాటి జీర్ణకోశం చెడిపోయి మరణిస్తున్నాయి. ఈ ప్లాస్టిక్‍ సంచులు భూమిలోనే స్థిరంగా ఉండటం వల్ల భూ కాలుష్యం పెరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకన్‍కు 1,60,000 ప్లాస్టిక్‍ సంచులు వినియోగించ బడుతున్నాయి. వీటివల్ల ప్రపంచానికే ముప్పు పొంచి ఉన్నది.

వీటికి బదులు కాగితపు సంచులు వినియోగించాలి. ఇవి చాలా తక్కువ వ్యవధిలో భూమిలో కలిసిపోతాయి. కాగితపు సంచులను రీసైకిలింగ్‍ ద్వారా పునర్వినియోగించవచ్చు. పేపర్‍ బ్యాగులు 1844లో ఇంగ్లాండులో తయారుచేయబడ్డాయి. 1852లో ఫ్రాన్సిస్‍ వొల్లే అనే ఉపాధ్యాయుడు, అతని సోదరుడు ఒక భారీ పేపర్‍బ్యాగ్‍ తయారీ యంత్రాన్ని కనుగొని ‘యూనియన్‍ పేపర్‍ బ్యాగ్‍’ పేరుతో కంపెనీని స్థాపించారు. ఇంగ్లాండ్‍లోని బర్మింగ్‍ హమ్‍, కింగ్స్ నార్టన్‍కు చెందిన మరొక పేపర్‍ తయారుదారు 1853లో చతురస్రాకారపు కాగితపు సంచులు తయారుచేసే ఉపకరణం కోసం పేటెంట్‍ పొందాడు. 1859లో విలియం గూడెల్‍, మార్గరెట్‍ ఈ నైట్‍ ఒక యంత్రాన్ని కనుగొని 1870లో ‘ఈస్టర్న్ పేపర్‍ బ్యాగ్‍ కంపెనీ’ స్థాపించారు. 1883లో చార్లెస్‍ స్టిల్‍వెల్‍ మరొక యంత్రాన్ని కనుగొని చతురస్రాకారం, ముడతలు గల కాగితపు సంచులను తయారుచేసి వాటిని మడతపెట్టడం, నిల్వ చేయడం సులభతరం చేశాడు.
పేపర్‍ బ్యాగులు కంపోస్ట్ చేసేందుకు పనికివస్తాయి. అవి ఏ మాత్రం హానికరం కావు. గతంలో వలె కాగితం అంటే అటవీ సంపద కలప, వెదురు కాకుండా వ్యర్థ పదార్థాలు చెరకు నుంచి పంచదార తీసిన తర్వాత మిగిలిన గుజ్జు పదార్థాల నుంచి, గడ్డి ద్వారా కాగితం తయారుచేస్తున్నారు. దీనివల్ల రైతులు గడ్డిని కాల్చకుండా నివారించి వాయుకాలుష్యాన్ని నిరోధించ వచ్చు. 1999లో అమెరికాలోని శాన్‍ఫ్రాన్సిస్కో నగరంలో మొట్టమొదటగా ప్లాస్టిక్‍ సంచులపై నిషేధం విధించారు. భారతదేశంలో ప్లాస్టిక్‍ సంచులవాడకంపై నిషేధం ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. నగరాల్లోని సూపర్‍ మార్కెట్లు, కిరాణా దుకాణాదారులు, వినియోగదారుల నిర్లక్ష్యం వల్ల కాగితపు సంచులు వాడటం లేదు. కాగితపు సంచులు ఉపయోగించాలని రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం నిర్వహించాలి. కాగితపు సంచుల దినోత్సవం సందర్భంగా ఉచితంగా పేపరు బ్యాగులు పంచుతూ వాటి ఉపయోగాలు తెలియజేస్తే ప్రజలు వాటి వాడకానికి అలవాటుపడుతారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *