(గత సంచిక తరువాయి)
(జరిగిన కథ: ఎక్స్కర్షన్ కోసం వచ్చిన స్కూల్ పిల్లలంతా విడిదిలో అవ్వ చెప్పినా వినకుండా అశుభ్రం చేస్తుంటే… వారికి స్వచ్ఛత గురించి అవగాహన కలిగించటానికి హోమ్ థియేటర్ ఓపెన్ చేయాలనుకుంటుంది అవ్వ.)
‘‘పిల్లలూ.. ఈ రోజు మీరు టిఫిన్ తిన్నాక.. బయటకు వెళ్లక ముందు మీకు మంచి సినిమాలు చూపించనా’’ పిల్లల వైపు చూస్తూ అడిగింది అవ్వ.
పిల్లలు సంతోషంగా ‘‘చూస్తామని’’.. తలలూపారు.
‘‘పూటకూళ్ళవ్వ విడిది’’లో ఒక పక్కన హోమ్ థియేటర్ ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. దానికే ఆకర్షితులవుతారని ఎవరికీ ముందుగా చెప్పదు. అవసరమైనప్పుడు ఇలా డైరెక్ట్గా ఓపెన్ చేస్తుంది.
టిఫిన్లు అయ్యాక థియేటర్‍కి తీసుకెళ్ళి మొదట పిల్లలు ఓపిగ్గా కూర్చోవాలని రెండు కార్టూన్ సినిమాలు మూడు నిమిషముల నిడివి ఉన్నవి చూపించింది. ఆ తరువాత ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛభారత్ అంశంపై నిర్వహించిన పోటీ కోసం తీసిన సందేశాత్మక చిత్రం ప్రారంభించింది. సినిమా పేరు ‘‘సూర్యకాంతం’’. పేరు గమ్మత్తుగా ఉండటంతో పిల్లలు ఆ సినిమా చూడటంలో లీనమయ్యారు. ఆ సినిమా ఈ కింది విధంగా ఉంది.
‘‘సూర్యకాంతం’’
ఆ కాలనీలో సూర్యకాంతం నోటికి దడుచుకోని వారుండరు. పేరుకు తగ్గట్టు గయ్యాళి మనస్తత్వం. సినీ నటి సూర్యకాంతం సినిమాల్లోనే గయ్యాళితనం చూపిస్తుండేది. కానీ ఈ సూర్యకాంతం నిజజీవితంలోనూ గయ్యాళి మనిషి. ముఖ్యంగా తన స్వార్థం తాను చూసుకుంటుంది. కానీ వచ్చిన చిక్కంతా దాని గురించే. తన ఇంట్లోని చెత్తంతా ఎదురింటి ముందర, పక్కింటి ముందర పడేసి వస్తుంది. తన ఇంటి చుట్టూ శుభ్రంగా ఉండేలా చూస్తుంది. ఇదంతా ఎవ్వరూ గమనించకుండా చేసేది. కొన్నాళ్ళు గడిచిన తరువాత ఆ కాలనీలో ఉన్న అందరి ఇళ్ళల్లో నెమ్మదిగా ఒక్కొక్కరికీ అనారోగ్యం మొదలయ్యింది. కొందరు దగ్గు.. జలుబు, మరికొందరు జ్వరాలతో బాధపడసాగారు.
ఒక్క సూర్యకాంతం ఇంట్లో మాత్రం అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. అందరి ఆరోగ్యాలు గమనించింది సూర్యకాంతం. ‘‘తానేమైనా తప్పు చేస్తున్నానా’’ అని ఒక్క క్షణం ఆలోచించింది. కానీ తన స్వభావం అది కాకపోవటంతో వెంటనే దులిపేసుకుంది. హా.. అలా తన వల్ల ఏం కాదు.. బయట దవాఖానాలో ఎంత మంది జ్వరాలతో లేరు! అనుకుంటూ తనని తాను సమర్థించు కుంది. తన మీద ఎవరికీ అనుమానం రాకుండా ఒకసారి అందరినీ పలకరించి వద్దామని బయలుదేరింది.
మొదట ఎదురింటికి వెళ్ళింది.
‘‘ఏంటమ్మా ఎలా ఉంది పిల్లలకీ’’ అంటూ ప్రేమ నటిస్తూ అడిగింది సూర్యకాంతం.
‘‘ఏమో ఆంటీ… ఎంతకూ తగ్గటం లేదు.. డాక్టర్‍ను అడిగితే బయట ఇంత అపరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఎలా ఉంటారు… కాస్త శుభ్రంగా ఉంచుకోవాలి’’ అన్నారు.
‘‘ఆంటీ మరి నేను ఇల్లంతా శుభ్రంగానే ఉంచుతాను.. బయట అలా ఎందుకుంటుందో’’ అన్నది.
సూర్యకాంతం ఉలిక్కిపడింది.. ‘‘ఇదేదో తిరిగి తిరిగి నాకే చుట్టుకునేట్టు ఉంది. ఇక్కడి నుండి బయటపడటం మేలనుకుంది’’.
‘‘సరే జాగ్రత్తమ్మా.. నేను మళ్ళీ వస్తాను’’ అంటూ త్వరగా బయటికి వచ్చేసింది.
ఇలా దగ్గరి ఇళ్లకు వెళ్ళటం మంచిదికాదు. ‘‘ఇంటికి కొంచెం దూరంగా ఉన్న ఇళ్లకు వెళ్లి పలకరిద్దాం’’ అనుకుంది. నాలుగైదు ఇండ్ల అవతల ఉన్న ఇంటికి వెళ్లి పలకరించింది.
‘‘అక్కడైతే గుండెల్లో రాయి పడ్డట్టే’’ అయ్యింది.
అక్కడ ఆరోగ్యం బాగా లేదన్న బాధతో.. ‘‘ఏంటో సూర్యకాంతం వదినా! మేము మా ఇంటితో పాటు బయట, చుట్టుపక్కల ఎంతో శుభ్రంగా ఉంచుతాం. కానీ కొన్నాళ్ళ నుండి చూస్తున్నా.. ఎవరో బుద్ధిలేనోల్లు ఎక్కడి చెత్తో తెచ్చి మా ఇంటి ముందు పోస్తున్నారు.. వాళ్ళ జీవితాలు నాశనమైపోను.. మా జీవితాలతో ఆడుకుంటున్నారు’’ అంటూ తిట్టటం ప్రారంభించింది.
సూర్యకాంతంకు చెమటలు పట్టాయి. ఆ టెన్షన్ తగ్గించుకోవటానికి మరో నాలుగు ఇళ్లకు వెళ్ళింది. అక్కడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇక లాభం లేదనుకొని కామ్‍గా ఇంటికి వచ్చేసింది.
ఆ రోజు సాయంకాలం అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందరి ఇళ్లలోకి వచ్చి వెళ్ళటంతో అందరూ సూర్యకాంతం విషయమే మాట్లాడసాగారు. మాటల్లో వాళ్లకు సందేహం రానే వచ్చింది.. ‘‘అసలే సూర్యకాంతం గుణం మంచిది కాదు, దానికి తోడు చెత్త విషయం రాగానే వెళ్ళిపోయింది. కొంపదీసి మన ఇండ్ల ముందట తనే చెత్త పోయటం లేదు కదా’’ అనుకున్నారు.
ఆ రోజు రాత్రి అందరూ వాళ్ల ఇంటి కిటికీల నుండి చూడసాగారు. అనుకున్నట్టే సూర్యాకాంతం విషయం బయట పడింది.
ఒక పెద్దాయన ‘‘ఎందుకిలా చేస్తున్నావని’’ అడిగితే.. ‘‘నేనలా ఏమీ చేయలేదు.. నాకేం తెలియదని’’ దబాయించింది.
ఒకరోజు కాలనీ వారంతా కలిసి సూర్యాకాంతం ఇంటికి వచ్చారు.
‘‘చూడమ్మా… మీరు మరోసారి ఇలాంటి పని చేస్తే సహించేది లేదన్నారు’’.
‘‘ఏమిటి మీరు నాకు చెప్పేది. సహంచేది’’ అంటూ గయ్యిమని వారిపై గట్టిగా అరిచినంత పని చేసింది.
ఆమె నోటి దురుసుతనం చూడలేక, ఆ ధాటికి తాళలేక అందరూ వెనక్కి తిరిగి వచ్చారు.
పరిస్థితి ఏ మాత్రం మారలేదు. ఇక లాభం లేదనుకొని అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారు.
× × ×
అలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి.
‘‘హమ్మయ్య.. నాకు భయపడిపోయి ఇక ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు’’ అని మరింత దర్జాగా ఆ పని వెలగబెట్ట సాగింది.
ఒకరోజు ఉదయమే కాలింగ్ బెల్ మోగింది. ‘‘ఎవరా’’ అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా మున్సిపాలిటీ అధికారులు నిల్చుని ఉన్నారు. వెనకాల స్వచ్ఛభారత్ బండిలో చెత్త ఎత్తుతున్నారు.
‘‘ఏమిటీ… ఇలా వచ్చారు?’’ లోలోన ఆశ్చర్యపోతూ బయటికి మర్యాదగా అడిగింది.
‘‘ముందుగా మీరు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాలి’’ అన్నారు.
‘‘పైనా… ఎందుకు??’’ నోరెల్ళబెట్టింది సూర్యకాంతం.
‘‘ఎందుకేమిటి… మీకు మున్సిపాలిటీ వారు చెత్తబుట్టలు ఇచ్చింది ఎందుకు?’’ ఇలా ఇంటిముందు, రోడ్లపైన చెత్త వేయకుండా ఉండడానికేగా! ‘‘అందరి ఇళ్ల ముందు ఎంత
శుభ్రంగా వుందో, మీ ఇంటి ముందు ఎంత చెత్త వుందో ఒకసారి చూడండి.’’ ‘‘మేం రోజు ఈ స్వచ్ఛభారత్ వాహనం ద్వారా కూడా మైకులో విన్పిస్తూనే వున్నాం. ఇలా బయట చెత్త పడేయకూడదు.. పడేస్తే ఫైన్ కట్టాలని… అయినా మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా! దీని వల్ల ఎంతమంది అనారోగ్యపాలవుతారో తెలుసా?’’ అంటూ గట్టిగా మందలించేసరికి అందరి మీద ఎగిరిపడే సూర్యకాంతం నోరు విప్పలేకపోయింది. ‘‘అయినా తన వాకిట్లో చెత్త ఉండదు కదా’’ అనుకుంటూ వాళ్ళను దాటుకొని ఇంటి బయటికి వెళ్లి చూసి షాక్ అయ్యింది. అంతా చెత్తతో నిండిపోయి ఉంది.
ఇదంతా కాలనీ వారు తనకు బుద్ది చెప్పాలని చేసిన పనే అని అర్థం అయిపోయింది. ఏమీ చేయలేక ఫైన్ కట్టింది.
‘‘ఇంకోసారి ఇలా జరిగితే ఫోరంలో కేస్ పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త’’ అంటూ బెదిరించేసరికి అవమానంతో, సిగ్గుతో తలదించు కుంది.
‘‘తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు’’ అయ్యింది అనుకుంది.
తాను చేసిన పనివల్ల అందరికీ ఎంత ఇబ్బందయ్యేదో తెలిసి వచ్చింది.
‘‘ఇక ముందు అలా జరగదని’’ కాలనీ వారికి క్షమాపణ చెప్పింది.
:: శుభం ::
(మిగతా కథ వచ్చే సంచికలో)
మాదారపు వాణిశ్రీ
ఫోన్ : 9247286668
బొమ్మలు: కైరం బాబు