కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం నందు సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సింగరేణి ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ ఎన్.బలరామ్, ఐఆర్‍ఎస్ గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఎస్•పిసి సిబ్బంది, స్కౌట్స్ కలర్ పార్టీ ముఖ్య అతిథిని వేదిక వద్దకు తీసుకొని రాగా, ముఖ్య అతిథి శ్రీ ఎన్.బలరామ్, ఐఆర్‍ఎస్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని మరియు తెలంగాణా గీతాన్ని ఆలపించారు. అంతకు ముందు సింగరేణి ప్రధాన కార్యాలయము నందు డైరక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎల్.వి.సూర్యనారాయణ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ప్రకాశం స్టేడియం నుండి కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్ వద్ధ గల తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు తెలంగాణ రన్ నిర్వహించి అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన తెలంగాణ వీరులకు ఎన్.బలరామ్ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎన్. బలరామ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన అలుపు లేని పోరాటంలో, తమ సర్వస్వం ధారపోసి, ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర సాధన
ఉద్యమంలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొని, తమ వంతు బాధ్యత నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణీయులకు కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అనేక రాష్ట్రాల కన్నా ముందు నిలబడుతోంది. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిని కూడా జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయి కంపెనీగా నిలపడం కోసం రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశంలో అనేక కొత్త ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు.
ఈ శుభ సందర్భంగా సింగరేణి భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి, ప్రస్తుతం సింగరేణి ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, బాధ్యతల గురించి తెలిపారు.
సింగరేణి సంస్థ ఆరు జిల్లాల్లో 12 ఏరియాల్లో, 39 గనుల్లో 41 వేల మంది కార్మికులతో ఏడాదికి సుమారు 700 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకి సరిపడ బొగ్గును అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తును అందించటంలో సింగరేణి పాత్ర ఎంతో ఉంది.
మన రాష్ట్రానికే కాదు పక్కనే ఉన్న ఆంధప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 20 పెద్ద విద్యుత్ సంస్థలకు సింగరేణి బొగ్గు అందిస్తుంది. అలానే మరో రెండు వేల చిన్న పరిశ్రమలకు కూడా బొగ్గు అందిస్తుంది. ఈ విధంగా సింగరేణి సంస్థ రాష్ట్ర సేవలో, దేశ సేవలో తరిస్తుంది. ఇది సింగరేణి సంస్థకు ఎంతో గర్వకారణ మన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ జి.వి. కిరణ్ కుమార్ – జిఎం (పర్సనల్), శ్రీ ఎల్.వి. సూర్యనారాయణ – వెల్ఫేర్ & సిఎస్‍ఆర్, డైరెక్టర్ (ఆపరేషన్స్), శ్రీ కే.వెంకటేశ్వర్లు – డైరెక్టర్(పా) & (పి&పి), కే.రాజ్ కుమార్ – గుర్తింపు సంఘం (ఏఐటియూసి) జనరల్ సెక్రటరీ, ఎస్.పితాంబర రావు – ప్రాతినిధ్య సంఘం (ఐఎన్‍టియూసి) వైస్ ప్రెసిడెంట్, పి.రాజీవ్ కుమార్ – సిఎంఓఏఐ వైస్ ప్రెసిడెంట్, కార్పొరేట్ పరిధిలోని వివిధ శాఖల జనరల్ మేనేజర్లు, వివిధ శాఖల అధిపతులు, యూనియన్ నాయకులు, ఉత్తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వెల్ఫేర్ సిబ్బంది, ఎస్&పిసి సిబ్బంది, సేవ సెక్రటరీలు, ఇతర అధికారులు, ఉద్యోగులు, కళాకారులు, కళాశాల మరియు పాఠశాలల విద్యార్ధులు పాల్గొన్నారు.
-చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ప్రభుత్వ సంస్థ)
ప్రజా సంబంధాల విభాగం, హైదరాబాద్