మెదక్ జిల్లాలోని మండల కేంద్రం అల్లాదుర్గం మెదక్, ఆందోల్ దగ్గర హైదరాబాద్-నిజాంసాగర్ హైవే మీద వుంది. 1967 ఫిబ్రవరిలో అల్లాదుర్గం చెరువుకింది పొలం యజమాని ఒక గుంటలో గుడికి సంబంధించిన శిలలు, శిల్పాలను చూసినట్లు చెప్పడంతో ఆ ఊరి దేశ్‍ముఖ్‍లు లక్ష్మారెడ్డి, రంగారెడ్డిలిద్దరు పురావస్తుశాఖకు తెలియజేసారు. అప్పటి ఆంధప్రదేశ్ పురావస్తు శాఖ 1967 మార్చిలోనే తవ్వకాలు మొదలుపెట్టింది.
పురావస్తు తవ్వకాలలో అల్లాదుర్గంలో కొలనుపాక, వరంగల్లులలోని తోరణాల లెక్క రెండు తోరణస్తంభాలు బయట పడ్డాయి. అక్కడే ఎన్నో శిల్పాలు, పురావస్తువులు బయట పడ్డాయని, తాము చూసామని గ్రామస్తులు చెప్తుంటారు. ఆ రెండు తోరణస్తంభాలు ముత్యాలసరాలు, కుడులతో కీర్తిముఖాలు, స్తంభశీర్షంలో పద్మపత్రాలు, స్తంభపాదం మీద చతుర్దళపుష్పాలు అలంకరించబడివున్నాయి. స్తంభాలకు రెండింటికి రెండువైపుల బ్రాకెట్ ఫిగర్లు పెట్టడానికి తొలులున్నాయి. ఈ తోరణ స్తంభాలకు సంబంధించిన బ్రాకెట్ ఫిగర్లు సింహం, వీరుని యాళీలు, తోరణం కిందివైపు కనిపించే డ్రాప్స్ మూడు సమీపంలోని పార్వతమ్మగుడి ప్రాంగణంలో పడివున్నాయి.

పార్వతమ్మగుడి:
పార్వతమ్మగుడిలోని దేవత త్రికోణాకృతి తోరణంలో మణిమకుటంతో, హారగ్రైవేయ కాలతో, లలితాసనంలో కూర్చుని కనబడుతున్న దేవత ద్విభుజి. చేతుల్లో వుండాల్సిన ఖడ్గం, రక్తపాత్రలు అస్పష్టం. దేవతాధిష్టానపీఠం మరొక పీఠంమీద అమర్చబడి వుంది. ఆ అథిష్టానం జైనతీర్థంకరుడు మహావీరుని మూడుసింహాలతో కూడినది. ఆ పీఠం సింహాలు రెండింటిని చూపుతున్నది. పక్కనున్నది జైనయక్షిణి చామరధారిణి. దేవత ముందర నేలమీద చాళుక్యశైలి వృత్తాకార పానవట్టంమీద చిన్నలింగం, నంది వున్నాయి. గుడిప్రాంగణంలో రాష్ట్రకూటశైలి స్తంభాలు అగుపించాయి.
బేతాళుని కొలువు:
అల్లాదుర్గంలో తవ్వకాలు జరిపిన చెరువు పక్కన గుడివుంది. గ్రామానికి దక్షిణంవైపు కూలిన చాళుక్యశైలి గుడిశిథిలాలతో కట్టిన మంటప మొకటి కనిపిస్తుంది. మంటపంలో నల్లసబ్బురాయిలో చెక్కిన చతుర్భుజుడు, వైతస్తిక పాదభంగిమలోవున్న స్థానకశిల్పం పరహస్తాలలో ఢమరుకం, త్రిశూలాలు, నిజహస్తాలలో ఖడ్గం, డాలులతో కనిపిస్తుంటే, వీరుని శిల్పమనలేం. చరిత్రబృందం పరిశీలనలో ఆ విగ్రహం వీరభద్రునిదని బోధపడ్డది. కాని, మొదటి నుంచి గ్రామస్తులు బేతాళునిగా కొలుస్తున్నారు.
గుడిలోని ఒక రాతిస్తంభం మీద చాళుక్యరాజు త్రిభువన మల్లదేవుని (1084నాటి) శాసనం చెక్కివుంది. దీనిలో కీర్తివిలాస శాంతినాథ జినాలయమనే జైన బసది సాధువులకు చేసిన నీర్నేల దానవివరాలున్నాయి. మహామండ లేశ్వరుడు ఆహవమల్ల పెర్మానడి ఆ దానంచేసినట్లు చెప్పబడింది.
అక్కడున్న మంటపస్తంభాలు నందికంది మంటపస్తంభాలను పోలిన చిత్రకంఠస్తంభాలు. మొత్తం 16స్తంభాలలో 4స్తంభాలు ప్రత్యేకం. వీటిమీదనే శిల్పాలు, శాసనం ఉన్నాయి. బేతాళుని ముందర శంఖలతాతోరణ భాగాలున్నాయి నేలమీద. బేతాళునికి దేశంలో మంటపంలో నల్లసబ్బురాయిలో చెక్కిన చతుర్భుజుడు, వైతస్తిక పాదభంగిమలోవున్న స్థానకశిల్పం పరహస్తాలలో ఢమరుకం, త్రిశూలాలు, నిజహస్తాలలో ఖడ్గం, డాలులతో కనిపిస్తున్నది. చరిత్రబబృందం పరిశీలనలో ఆ విగ్రహం వీరభద్రు నిదని బోధపడ్డది. కాని, మొదటినుంచి గ్రామస్తులు బేతాళునిగా కొలుస్తున్నారు.
బేతాళుడి గుడులు లేదా శ్రీ బేతాల్ ఆలయం అనేది హిందూ మతంలో ఒక ప్రత్యేకమైన దేవాలయం. ఇవి ప్రధానంగా బేతాల్‍ను యోధుని రూపంలో, శివుని భైరవ రూపంగా కొలుస్తూ, గ్రామ రక్షణ కోసం పూజిస్తారు. బేతాళుడి ఆలయాలు భారతదేశంలో గోవా అమోనా, ఉత్తరాఖండ్‍లోని గొర్లిలు ముఖ్యమైనవి.

ఎల్లమ్మగుడి ఫ్రెస్కోల కాలక్రమణిక:
పురావస్తుశాఖ తవ్వకాలు చేసినపుడు ఎల్లమ్మగుడి ఒక్క మీటరు పొడుగుతోనే బయటపడ్డది. ఎల్లమ్మగుడి గోడలమీద గీసిన రంగుచిత్రాలు (మ్యూరల్స్) 11వ శతాబ్దం నాటివి. ఆ గుడి మూడుగోడల మీద వర్ణచిత్రాలు అగుపించాయి.
తూర్పుగోడమీద లకులీశుడు లేదా శైవాగమగురువు పర్యంకిక ఆసనంలో కూర్చుని వున్నాడు. జేగురురంగు రాయితో చిత్రించబడ్డది చిత్రమంతా. శైవగురువు కుడిచేయి వ్యాఖ్యానముద్ర (ఉపదేశముద్ర)తో, ఎడమచేయి మంత్రదండం (లగుడం) ధరించివుంది. ఆసనం పద్మాసనం కాదు. కొన్ని శిల్పాలలో బుద్ధుని ఆసనాన్ని పోలివుంది. కిరీట మకుటాన్ని పోలిన ఉష్ణీషం లేదా తలపాగా ధరించాడు. కుడిచెవికి మకరకుండలం, ఎడమచెవికి పత్రకుండలాలు ధరించాడు. ఒక భుజం, మోకాళ్ళ వరకు శరీరాన్ని కప్పిన నల్లని వస్త్రం కనిపిస్తున్నది. గురువుకు కుడివైపు 4గురు శిష్యులు కనిపిస్తున్నారు. వారిలో ఒకరు ధూపపాత్ర పట్టుకుని వున్నాడు. ఎడమచేతిలో గంట వుంది. తలకు టోపివుంది. మరొకరు చామరంతో, ఇంకొకరు నమస్కారముద్రలో, 4వ వాడు దీపంతో కనిపిస్తున్నారు.
రెండు అరటిచెట్లు, పులి… గురువు పర్యంకిక కింద గోపురం వంటి చిత్రం వుంది. గుడిలో ద్వారానికి ఎదురుగా ఉమా మహేశ్వరుడు, నంది, భ•ంగి చిత్రించ బడ్డారు. మహేశ్వరుడు త్య్రయం బకుడు, పులిచర్మంతో ఆరు చేతులతో…
అల్లాదుర్గం కుడ్యచిత్రాలను కనుగొనడం భారతీయ మ్యూరల్ పెయింటిగ్సులలో ఎల్లోరా ఫ్రెస్కోల తర్వాత గొప్ప సంగతి. గుడిగోడలకు ప్లాస్టర్ పూత వలె వేయడానికి గులాబిరంగు సున్నం పేస్టు, బంకమన్ను, ఇసుక క్వార్టజ్ ముద్ద, ఎరుపు ఇటుక, కొన్ని గ్రానైట్ ముక్కలు వాడబడినట్టు పురావేత్తలు పరిశోధనాఫలితాలను చెప్పారు.
ప్రస్తుతం ఈ ఫ్రెస్కోలు తెలంగాణ వారసత్వశాఖ రాష్ట్ర పబ్లిక్ గార్డెన్స్ మ్యూజియంలో ప్రదర్శనలో వున్నాయి.
శిలాంకోట ఎల్లమ్మగుడి:
అల్లాదుర్గంలో ప్రధానమైన దైవం ఎల్లమ్మ. శిలాంకోట ఎల్లమ్మగా ప్రసిద్ధి. ఎక్కడెక్కడనుంచో ఎల్లమ్మను తమ కులదైవంగా భావించేవారు ఏడాదంతా వస్తూనేవుంటారు. జాతరపుడు పట్టనంత జనం. ఎల్లమ్మకొలువు గొప్పది. ఈ గుడి ప్రాంగణం ఇపుడు చాలా పెద్దగా కనపడుతున్నది.
ఎల్లమ్మగుడిలో గర్భగుడి మారిపోయింది. రెండుచేతుల ఎల్లమ్మ దేవత చతుర్భుజి ఇపుడు. నల్లరాతిలో చెక్కిన నాలుగడుగుల ఎత్తైన కొత్తశిల్పం. గర్భగుడికి ముందర వుండాల్సిన అంతరాళం లేదు. గర్భాలయ ద్వారబంధంమీద కలశాలు, లలాటబింబంగా చాముండ శిల్పమున్నాయి. గుడిముందర పక్కన రాతిగాబులలో కల్లుతీర్థంగా భక్తులు స్వీకరిస్తుంటారు. దేవతకు నైవేద్యంగా కల్లు, సారా, కోళ్ళు, మేకలు సమర్పిస్తుంటారు భక్తులు.
గర్భగుడి ముందర చిన్నరాతిగోడపై మహిషాసురమర్దిని అడుగున్నర ఎత్తున్న శిల్పముంది. పూజారులు మాతంగి అని చెప్తుంటారు. అది ప్రతిమాలక్షణాల ప్రకారం నిజంకాదు.
ఎల్లమ్మగుడిలో చిల్లమేశ్వరాలయం-శాసనం:
గుడిలో ఒకమూల నైరుతిదిశలో చిన్నగూడువంటి గుడిలో శివలింగం, ఎదురుగా మంటపంలో నంది, కమఠం ఉన్నాయి. అదే చిల్లమేశ్వరాలయం అని గుడివెనక వున్న శాసనంవల్ల తెలుస్తున్నది. కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుని కాలంలో, క్రీ.శ.1094 జనవరి 8న, మహామండలేశ్వరుడు ఆహవమల్ల పెర్మానడిగల్, కిసవళస సవలక్కెయ మంత్రి అధికారి దండ నాయకుడు చిల్లమయ్యగళు రాజధాని శ్రీవర్ధనకోటలోని చిల్లేశ్వరదేవరకు పూజారికి ఆచంద్రార్కం చెల్లేట్లుగ ధారా పూర్వకంగా చేసిన దానాలు వివరించబడ్డాయి.
ఎల్లమ్మగుడి ప్రవేశద్వారం జైనబసది ద్వారబంధంమీద వుండే పద్మపత్రాలు, కలశాలు కనిపిస్తాయి. మరొక ప్రవేశద్వారం మీద ద్వారబంధానికి కుడివైపు కలశం, ఎడమవైపు శైవద్వారపాలకుడున్న చిత్ర పరిస్థితి కనిపిస్తుంది. కాని, రెండుద్వారాల లలాటబింబాలుగా గజలక్ష్ములే వున్నారు. గుడికి ప్రాకారం, ద్వారంపైన కొత్తగా అలంకరించిన గోడలు కట్టివున్నాయి. ఎల్లమ్మగుడి విమానం సోపానశైలిలో వుంది. పురావస్తుశాఖ కనిపించిన దేవాలయ అవశేషాలకు ఇపుడున్న గుడికి పోలికలు లేవు. ఒక్క రాష్ట్రకూటశైలి మంటప స్తంభాలే మిగిలివున్నాయి.
ఎల్లమ్మగుడి ప్రాంగణం:
గుడిమందర దడిలెక్క నిలబెట్టిన నాగశిలలు వేర్వేరు కాలాలకు, వేర్వేరు ప్రతిమలశైలులకు చెందినవి. వీటిలో నరనాగవీరులు, నాగవనితలు, మానసాదేవి శిల్పాలున్నాయి. వాటి మధ్యలో కాకతీయ తొలినాళ్ళ శైలిలో కాలభైరవుని శిల్పమొకటి అగుపిస్తున్నది. వాటివెనక ఈశాన్యంగా పాతకోనేరు కొత్త సిమెంటు మెట్లతో కనపిస్తున్నది.
నాగశిలలపక్కన నిలిపిన రాతి కని దీపస్తంభం లెక్కున్నది. దాని ముందర రాతిబండమీద చెక్కిన పాదాలు ఎల్లమ్మపాదాలని మొక్కుతున్నారు. ఒకప్పటి జైనబసది ఇపుడిట్లా గుర్తు పట్టరానంత మారిపోయింది.

యోగశయనమూర్తి శిల్పం:
గుడి వెనక చెరువు ఒడ్డున మెట్లపక్కన ఒక శిథిల మంటపం ఉంది. దానిని ఆనుకుని వున్న అడ్డంగా నిలిపిన రాతిపలకమీద చెక్కిన ‘యోగశయన విష్ణుమూర్తి’ శిల్పముంది. అనంతుని మీద శయనించిన విష్ణుమూర్తి నిజహస్తాలలో కుడిచేత యోగముద్రపట్టి, పడుకుని వున్నాడు. శ్రీదేవి అతని పాదసంవహన చేస్తున్నది. పై అంతస్తులో ముందర అష్టదిక్పాలకులు రెండువరుసల్లో, ఆ తర్వాత దశావతారాలు చెక్కివున్నాయి. వీటిలో మత్స్య, కూర్మ, వరాహ అవతరాలు, నరసింహ, వామన, పరశురామ, రామ, క•ష్ణ, బుద్ధులవలె మానుషరూపంలో వుండడం విశేషం. కల్కి అశ్వం ప్రతినిధిగా చూపబడ్డాడు.
హనుమదాలయం:
అల్లాదుర్గంలోని బేతాళుని గుడి మంటపస్తంభాలమీద ఉన్న రెండు శాసనాలలో రెండు జైనబసదులు 1. బద్దిగ జినాలయం, 2. కీర్తివిలాస శాంతిజినాలయం ప్రస్తావించబడ్డాయి. ఎల్లమ్మగుడి, హనుమాండ్ల గుడి, బేతాళునిగుడి మూడుచోట్ల కూడా జైనబసదుల ఆనవాళ్ళు లభిస్తున్నాయి.
హనుమాన్ గుడి ద్వారానికి రెండువైపుల ఒక రుషభనాథ, రెండు మహావీరుల ధ్యానాసనభంగిమ శిల్పాలున్నాయి. వాటితోపాటు చాళుక్యశైలి ఆదిత్యుడు, ఏనుగు రెయిలింగ్, కళ్యాణీచాళుక్యుల కాలానికి చెందిన దిక్పాలక సహిత త్రిపురసంహార మూర్తి శిల్పశకలం వున్నాయి. దేవాలయ ద్వారబంధంలో
ఉత్తరాశివరకు కట్ చేసి పెట్టినట్లుంది. దానిమీద పద్మపత్రాలు, లలాటబింబంగా జినుని శిల్పం, ఆ పైన గజలక్ష్మి, ఏనుగులపైన రెండు వానరాలు, తోరణం పై అంతస్తులో విష్ణువు, ఆదిత్యుడు పరిచారకులతో అగుపిస్తున్నారు. పురావస్తుశాఖ అల్లాదుర్గం మోనోగ్రాఫ్ లో ఈ గజలక్ష్మిఫలకం తవ్వకాలలో దొరికినట్లు రాసున్నది. గజలక్ష్మి, కింద జినుని శిల్పం బైరాంపల్లి అంగడివీరన్న గుడి ద్వారబంధాన్ని పోలివుంది. గుడిలోపల మంటపంలో నందికందిగుడిలోని చిత్రకంఠస్తంభాలను పోలిన రాష్ట్రకూటశైలి స్తంభాలు రెండు, మరికొన్ని స్తంభాలు తాండవగణపతి, నరసింహస్వామి, అలసకన్యకలు, కీర్తిముఖాలు, ముత్యాలసరుల శిల్పాలతో కనిపిస్తున్నాయి.
గుడిలో వీరహనుమంతుని విగ్రహానికి కుడివైపు గూటిలో పాలరాతి సింహాసనం, మీద పాదాలు, వెనక గుండ్రని రాతిపలక మీద నాగరిలిపిలో మూడుపంక్తుల శాసనం వున్నాయి. సింహాసనం ముందుభాగాన అభిషేక జలాలు పోవడానికి సింహముఖప్రణాళి వుంది. ఇది జినుల పాదాల సింహాసనం. ఇంతకు మునుపు మరెక్కడా కనిపించని కొత్తశిల్పం. హనుమాన్ దేవాలయం ఒకప్పటి జినాలయమే. ఈ గుడి బద్దెగ లేదా కీర్తివిలాస శాంతి జినాలయాలలో ఒకటై వుంటుంది.

వీరభద్రాలయం:
వీరభద్రదేవాలయం నిర్మాణం శైవమఠభవనం అనిపిస్తున్నది. గుడిముందర మూడు చాళుక్యశైలి శైవద్వారపాలకులు కాళ, మహాకాళ విగ్రహాలున్నాయి.ఇవి పురావస్తు తవ్వకాలలో దొరికాయి. వీరభద్రాలయం గోడలమీద శిల్పాలు, ఫలకలు తాపడం చేసివున్నాయి. లోపల గర్భాలయంలో అడుగెత్తున్న వీరభద్రుని శిల్పముంది. ఆ పక్కన మరొక వీరభద్రశిల్పముంది. గుడిబయట హాలులో దక్షిణంగోడగూటిలో శైవగురువు శిల్పముంది. నందులు చాళుక్యశైలివి.
వేంకటేశ్వరుని గుడి:
వేంకటేశ్వరుని గుడి ప్రవేశద్వారం మీద శైవద్వార పాలకులున్నారు. లోపలున్న శైవదేవాలయానికి సంబంధించిన ద్వారమది. వేంకటేశ్వరుని గుడిలో రాష్ట్రకూటశైలి మంటప స్తంభాలున్నాయి. అంతరాళం, గర్భగుడులున్నాయి. ఎత్తైన వేదిక మీద వేంకటేశ్వరుడు ప్రతిష్టించబడివున్నాడు.
ఆ గుడి పక్కన శివాలయముంది. శివాలయం ముందర రెండు రాష్ట్రకూటశైలి నాగ, నాగినిశిల్పాలున్నాయి. గుడిలో చాళుక్యశైలి వర్తులాకారపు పానవట్టం, శివలింగం, నంది వున్నాయి. లింగం వెనక అమ్మవారు, గణపతి, నాగశిల్పం వున్నాయి.

చాముండ:
అల్లాదుర్గంలో పార్వతమ్మ గుడికి వెళ్ళే దారిలో ఒక రాతివేదిక మీద మూడు శిల్పాలు కనిపిస్తాయి. వాటిలో మూడడుగుల ఎత్తున్న దేవత ద్విభుజి, కుడిచేతిలో వుండాల్సిన ఖడ్గం విరిగిపోయింది. ఎడమచేతిలో రక్తపాత్ర వుంది. మూలాధారాసనంలో కూర్చున్న దేవత తలమీద పెద్దకిరీటం, చెవులకు పెద్దకుండలాలున్నాయి. ఈ దేవత చాముండ. పక్కన చామరిధారి జైనయక్షుని సగం విరిగిన శిల్పముంది. మరోపక్కన వీరునితో సింహయాళి వుంది.
అల్లాదుర్గం శాసనాలు:
ఇప్పటివరకు అల్లాదుర్గంలో లభించినవి 6 శాసనాలు, మెదక్ జిల్లా శాసనాలలో ఉన్నవి 5. హనుదాలయంలోని శాసనం పరిష్కరింపబడవలసివుంది.
తొలిశాసనం జినశాసనం. ఇది కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్లునికాలంలో వేయబడినది. భైరవవీరగల్లు మంటప స్తంభం మీద ఉన్నదని మెదక్ జిల్లా శాసనసంపుటిలో పేర్కొనబడ్డది. స్తంభం చతురస్రపు దిమ్మెమీద 3వైపులున్న శాసనంలో త్రైలోక్య మల్లుని ప్రశస్తి, పంపపెర్మానడి, శ్రీవర్ధనపురం, బద్దిగ జినాలయ ప్రస్తావనలున్నాయి.
మలిశాసనం పాతకోట సమీపంలో భవనంవద్ద ఉన్నట్లు తెలుస్తన్నది. ఈ శాసనకాలం క్రీ.శ.1072. భీమయ తలారి, ఆదిత్యరాజులు ప్రస్తావించబడ్డారు శాసనంలో.
మూడవ శాసనం బేతాళుని గుడిమంటప స్తంభంమీద చెక్కబడ్డది. క్రీ.శ. 1084 సెప్టెంబరు 11న, చాళుక్యచక్రవర్తి త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యునికాలంలో వేయబడిన ఈ శాసనం ఆహవమల్ల పెర్మానడిగల్ ‘కీర్తివిలాస శాంతిజినాలయం’లోని రుషిసముదాయానికి కమలదేవసిద్ధాంతుని కాళ్ళుకడిగి ధారాపూర్వకంగా చంద్రు చెరువు ఒడ్డున 2మర్తురుల భూమినిచ్చినట్లు తెలుపుతున్నది.
నాల్గవ శాసనం ఎల్లమ్మ గుడివెనక రాతిగుండుమీద చెక్కివున్నది. 6వ త్రిభువనమల్ల 6వవిక్రమాదిత్యుడు కళ్యాణపురం నుంచి పాలిస్తున్నపుడు మహామండలేశ్వరుడు ఆహవమల్ల పెర్మానడి కేసవల సవాలక్కను పాలించే మంత్రి. మహాసంధివిగ్రహి దండనాయక చిల్లమయ్య శ్రీవర్దనకోటలోని నెరీలకెరెలో నిర్మించిన చిల్లేశ్వరదేవునికి 25మర్తురుల భూమిని బయ్యనకుంట దక్షిణాన, ఊరికి పడుమట, ఉత్తరందిక్కు సామెకుంట దగ్గర 15మర్తురుల భూమిని, పడుమటి మామిడితోట దగ్గర 15మర్తురులు, చంద్రుపొద్దయ్య చెరువు దగ్గర 2మర్తురులు, 2మర్తురుల తోటను సలేశ్వర గుడికి దక్షిణాన, సగం ముద్రాపణ, ప్రాయశ్చిత్త దశవంధము, పశుపతినాయకుని ఇల్లు, విష్ణుగృహం, దుకాణాల మీద సొంటు అంగభోగానికి, ధూప, దీప, నైవేద్యాలకు ఇచ్చాడు. ఇది 18వ చాళుక్య విక్రమ సం.లో వేయబడిన శాసనం. శ్రీముఖ సం.పౌష్య బహుళ సప్తమి, ఉత్తరాయణ సంక్రాంతినాడు ఇవ్వబడింది. కేసవల సవాలక్కను పాలించే మంత్రి పంపపెర్మానడి పేరు కనిపించే శాసనాలు మెదక్ జిల్లా శాసనసంపుటిలో పలుమార్లు కనిపిస్తాయి. ఈ శాసనంవల్ల అల్లాదుర్గం పూర్వనామం శ్రీవర్ధనకోట అని తెలుస్తున్నది.

5వ శాసనం పాతకోట పరిసరాల్లోని ఒక మంటస్తంభం మీద చెక్కబడివుంది. సరిగా అగుపించని శాసనమిది. 11వ శతాబ్దపు కన్నడలిపిలో ఉంది. రాయరాచగురువు వసుంధరాచారి జిన మూలసంఘ తిలకాయమానమైన శ్రీనందిసంఘం, సరస్వతీగచ్ఛ, బలాత్కారగణ అగ్రగణ్యులు, త్రయోదశ… కీర్తిపద్మారాధకపట్టేశుడు, దయాద్రి దినార్కరుడు, ..విగమచార్యులు ప్రస్తావించబడ్డారు.
చరిత్రకు ఆనవాలుగా శ్రీవర్ధనకోటలోని పాతకోట నిలిచేవుంది. ఈ వూరినే శిలాంకోట, అల్లాదుర్గం అని పిలుస్తున్నారు. వెతికినకొద్దీ ఊరంతట ఏదో ఒక చారిత్రక ఆధారాలు లభిస్తూనేవుంటాయి. ఎన్నోగుడులు, బసదులు ఊరినిండా పరచుకొనివున్నాయి.
అల్లాదుర్గం యాత్రలో సహచరులైన మఠం వినోద్ కుమార్, సిరిపురం నరేందర్ లకు, అల్లాదుర్గం చరిత్ర రాయడానికి పుస్తకమిచ్చి ప్రోత్సహించిన బంగారు రామాచారిగారికి, నా పరిశీలనల గురించి ప్రోత్సాహకంగా నిలుస్తున్న చరిత్రకారుడు స్థపతి ఈమని శివనాగిరెడ్డి, ప్రతిమాలక్షణవేత్త సుపర్ణమహి, పురావస్తుశాఖ మాజీ డీడీఓ శ్రీరంగం రంగాచార్యగారికి ధన్యవాదాలు.
- శ్రీరామోజు హరగోపాల్, 99494 98698