భారతదేశంలో మొట్టమొదటి ఆలయాలు తెలంగాణలో బయటపడ్డాయి – నాగార్జునకొండలో, కృష్ణానది ఉత్తర తీరపు నల్లమల అడవుల్లో. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు భారత పురావస్తుశాఖ నాగార్జున కొండ పరిసరాల్లో చేపట్టిన తవ్వకాల్లో అనేక శివాలయాలు వెలుగు చూశాయి. ఇవి క్రీ.శ.2వ శతాబ్దం నుండి నిర్మించబడ్డాయి. రెండవ శతాబ్దంలో తెలంగాణను పాలించిన శాతవాహనులు తాము పశుపతిని… అంటే శివున్ని, గౌరిని… అంటే పార్వతిని పూజించామని చెప్పుకున్నారు. కాని దేవాలయాలను కట్టించామని చెప్పుకోలేదు.
శాతవాహనుల తర్వాత… అంటే క్రీ.శ.3వ శతాబ్దంలో తెలంగాణను పాలించిన ఇక్ష్వాకులు దేవాలయాలను కట్టించారు, కట్టించామని శాసనాలు కూడా వేయించారు. వారు నాగార్జునకొండ పరిసరాల్లో కట్టించిన శివాలయాల్లో ప్రధానమైనవి పుష్పభద్రస్వామి దేవకులం (దేవాలయం), సర్వ దేవాలయం కాగా శివ పరివార ఆలయాల్లో ముఖ్యమైనవి కార్తికేయ, దేవసేన దేవాలయాలు, నవగ్రహ, కుబేరేశ్వర ఆలయాలు.
భారతదేశంలో నదీనదాలు ఉత్తరం వైపు తిరిగే చోట్లను వారణాశితో సమానమైన పవిత్ర స్థలాలుగా భావించి అక్కడ పవిత్ర శివాలయాలు కట్టడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. అలా కృష్ణానది నాగార్జునకొండ దగ్గర ఉత్తరం వైపు తిరిగే చోట పుష్పభద్ర స్వామి ఆలయం ఇటుకలతో కట్టబడింది. దీనిని ఇక్ష్వాకు రాజు ఎహువల చాంతమూలుని 16వ రాజ్య సంవత్సరంలో అతని భార్య కూపనసిరి, కొడుకు రెండవ వీరపురుషదత్తుడు నిర్మించారు. ఈ ఆలయం గర్భగృహం, 16 స్తంభాల ముఖ మండపం, ధ్వజ స్తంభం, 4 తోరణ ద్వారాలతో కూడిన ప్రాకారం… ఇలా సర్వ హంగులతో కూడిన సంపూర్ణ దేవాలయం. దేశంలో మొదటిది. దీని పశ్చిమ ద్వారం నుంచి కృష్ణానదీ తీరంలో కట్టిన అందమైన స్నానవాటికకు దారి వేసి ఉంది.
నాగార్జునకొండ మీద కృష్ణానది ఒడ్డునే కట్టిన సర్వదేవాలయం చాలా అందమైంది. ఇది రెండంతస్థుల ఆలయం. వరదలను తట్టుకునేందుకు ఇటుకలతో ఎత్తైన అరుగు కట్టి దాని మీద ఆలయం నిర్మించారు. ఈ ఆలయం చాలా విశాలమైన మంటపాన్ని కలిగి ఉండటంతో ఇది సాంకేతికంగా ‘శ్రీ విశాల’ అనే శైలితో తరువాతి కాలపు భారతదేశ వాస్తు నిపుణులకు ఆదర్శప్రాయమై నిలిచింది.
నవగ్రహ ఆలయంలో కూడా శివుడే ప్రధాన దైవం. నాగార్జునకొండలో బయల్పడిన అతి పెద్ద దేవాలయం కుబేరేశ్వర ఆలయం. నల్లమల కొండలు బంగారం, వజ్రాలు, నవరత్నాలకు నిలయాలు కాబట్టి వాటిని ప్రాచీన కాలంలో శ్రీ పర్వతం అని, వాటికి అధిపతి కుబేరుడని, శివ ప్రాధాన్యమైన కొండల్లో నెలకొన్నాడు కాబట్టి కుబేరేశ్వరుడని (కుబేర+ఈశ్వర) అన్నారు. కుబేరేశ్వరాలయం వంద స్తంభాల గుడి. దీనికి దక్షిణాన చల్లగుండం (దదిసరస్) అనే కోనేరుంది.
ఈ ఆలయాలతో పాటు కృష్ణానది తీరంలోనే మరో రెండు శివాలయాలు ఆ కాలపువే మహబూబ్‍నగర్ జిల్లాలో రంగాపూర్, గూమకొండ (గుమ్మడం) గ్రామాలలో ఉన్నాయి. రంగాపూర్ దేవాలయం కర్నూలు-హైదరాబాద్ రహదారి మీద కనిపించే 162 కి.మీ. రాయికి కుడివైపున ఫర్లాంగు దూరంలో కృష్ణానది ఉత్తర గట్టున కన్పిస్తుంది. ఇది సుమారు 2.20 మీటర్ల చతురస్ర వైశాల్యంతో కూడిన గర్భగృహం కలిగి 30X20X8 సెం.మీ.ల పొడవు, వెడల్పు, ఎత్తు కొలతలు గల ఇటుకలతో నిర్మిచబడింది.. క్రీ.శ.300 ప్రాంతంలో. ఈ దేవాలయం సాధారణ మంచక పద్ధతిలో నిర్మించిన అధిష్ఠానంపైన కట్టబడింది. ఆలయానికి చుట్టూ పద్మబంధ జగతి ఉంది. మూల విగ్రహం ఒక పీఠంలో నిలబెట్టిన ఆనవాలు కనిపిస్తుంది.

గూమకొండ (గుమ్మడం) గ్రామ శివారులో పారే పెద్దవాగు తీరంలో మరో రెండు దేవాలయాలున్నాయి. ఇవీ ఇటుక దేవాలయాలే. తూర్పున ఉన్న దేవాలయం వెనుక… అంటే పశ్చిమాన మరో దేవాలయముంది. ఈ రెండింటి చుట్టూ ప్రాకారముంది. తూర్పు దేవాలయానికి మంచక శైలిలో అధిష్ఠానముంది. దాని ‘కటి’కి మూడు పక్కలా దీర్ఘ చతురస్రాకారంలో బయటికి పొడుచుకొచ్చిన నిర్మాణాలున్నాయి. బహుశా అవి భద్రకోష్ఠాలు కావచ్చు. ఆలయం చతురస్రాకారంలో ఉంది. ఆలయం ఈశాన్యంలో ఆవరణ దేవత పీఠం ఉంది. దాని నిర్మాణంలో వాడిన ఇటుకల పరిమాణం 41X20.5X9 సెం.మీలు. ఈ తూర్పు ఆలయానికి వెనుకనున్న ఆలయానికి అర్ధ మంటపం, అగ్రమంటపం కూడా ఉన్నాయి. గర్భ గృహంలో ఉన్న పీఠంలో పచ్చని సున్నపురాయి లింగం ఉంది. ఇది సిద్ధేశ్వర లింగం అయ్యుంటుంది. ఈ ఆలయానికి కర్నూలు జిల్లాలో కృష్ణానది తీరంలో ఉన్న సిద్ధేశ్వరా లయానికి పోలికలుండటంతో దాని నిర్మాణ కాలమైన క్రీ.శ.100 ప్రాంతంలోనే ఈ ఆలయం కూడా నిర్మించబడి ఉంటుంది.
పైన పేర్కొన్న అన్ని ఆలయాలూ కృష్ణానదీ తీరంలోనే ఉన్నాయి కాబట్టి, ఈ ఆలయాల నుంచి నదికి దారులు కూడా ఉన్నాయి కాబట్టి ఆనాటి భక్తులు నదిలో స్నానం చేసి వచ్చి ఆలయంలో శివలింగానికి నదీ జలంతో అభిషేకం చేసేవారని, నదీ తీరంలోనే ప్రసాద వితరణ చేసేవారని అర్ధమవుతుంది.
గూమకొండ సిద్ధేశ్వర లింగం వంటి పచ్చని (ఛాయ) శివలింగం, నంది శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం దగ్గరి ప్రతాపగిరి కోట ‘మూల మలుపు’ ప్రాంతంలో కనిపించాయి. ఇక్కడి ఆలయం పేరు కూడా సిద్ధేశ్వరాలయం. కాబట్టి ఈ సిద్ధేశ్వరాలయానికి కూడా క్రీ.శ.100 ప్రాంతపు చారిత్రక నేపథ్యం ఉండి ఉంటుంది. ఇక్కడ కనిపించే ఆ కాలపు ఇటుకలు ఈ వాదనను బలపరుస్తాయి. పైగా నాగార్జున కొండలోని కుబేరేశ్వరాలయం వలెనే ఇక్కడ కూడా కుబేరేశ్వరాలయముంది. ఈ సిద్ధేశ్వర, కుబేరేశ్వర ఆలయాల మధ్య పారుతున్న ఉమామహేశ్వర వాగు తీరాన గుప్త ఉమామహేశ్వర ఆలయముంది. ఇప్పుడున్న గుప్త ఉమామహేశ్వరాలయం విష్ణుకుండి రాజుల కాలంలో సుమారు క్రీ.శ.5వ శతాబ్దంలో నిర్మించబడింది… రాతితో. ఈ ఆలయ గర్భ గృహానికి ముందు అర్ధ మంటపం, ముఖ మంటపం ఉన్నాయి.
గుప్త ఉమామహేశ్వర ఆలయ పరిసరాల నుంచి పచ్చని అడవుల మధ్య నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరం ఈశాన్యం వైపునున్న ప్రతాపరుద్ర కోట వైపు ఒక రాతి కోట గోడ ప్రయాణిస్తుంది. ఆ ప్రతాపరుద్ర కోట అంచున విష్ణుకుండులు నిర్మించిన రెండు ఆలయాలు ఒకదానికొకటి ఫర్లాంగు దూరంలో ఉన్నాయి. ఈ ప్రతాపరుద్ర కోట కింద నిరంజన్ షావలి దర్గా ఉంది. ఈ దర్గాకు దగ్గరగా కోట కొమ్మున ఉన్న దేవాలయం పక్కన అవబృథ స్నాన వాటిక ఉంది. విష్ణుకుండి రాజులు తాము తమ శాసనాల్లో చెప్పుకొన్నట్లుగా ఈ స్నాన వాటికలో స్నానం చేసి యజ్ఞ కర్మలు నిర్వహించేవారు. ఈ గుడి ముందు కొంచెం దూరంలో దిగుడు బావి వంటి పెద్ద కోనేర్లు సహజమైనవి రెండున్నాయి.
కాకతీయుల కాలం (క్రీ.శ.12వ శాతాబ్దం) నుండి ప్రతాపరుద్రకోటగా పిలువబడుతున్న కోట క్రీ.శ.4-6 శతాబ్దాలలో విష్ణుకుండులకు రాజధాని. ఈ కోటకు నైరుతి మూలలో మూడు కిలో మీటర్ల దూరంలో ఉమా మహేశ్వర క్షేత్రముంది. ఇక్కడి ప్రధానాలయానికి తూర్పున పల్లవేశ్వర లింగం చాలా నునుపుగా, అందంగా ఉంది. దానిని క్రీ.శ.5వ శతాబ్దంలో దక్షిణం నుండి విష్ణుకుండులపై దండెత్తిన పల్లవులు ప్రతిష్ఠించారు. శత్రువుల లింగమే అక్కడున్నదంటే ఆ ప్రాంతపు రాజులు విష్ణుకుండులు అక్కడి ఆలయాలను అభివృద్ధి పరచ కుండా ఉంటారా? విష్ణు కుండులకు ముందువారైన ఇక్ష్వాకుల కాలంలోనే అక్కడ శివాలయాలు నిర్మించబడినట్లు ఆ ప్రాంతంలో పరిశోధనలు చేసిన పురాతత్వ శాఖ రిటైర్డ్ ఉద్యోగి డి.యల్.యన్.శాస్త్రి రాశారు. ఐతే ఉమామహేశ్వరంలో ప్రస్తుతమున్న ప్రధానాలయాన్ని 14వ శతాబ్దంలో దేవరకొండ రాజు మాదానాయకుడు నిర్మించాడు కాబట్టి అంతకు ముందటి విష్ణుకుండుల నిర్మాణాలను ఇప్పుడు చూడలేము. విష్ణుకుండులు చేయించిన పే..ద్ద నగారాను మాత్రం చూడవచ్చు… ఎగువ మహేశ్వరంలో. దిగువ మహేశ్వరంలో కాకతీయుల స్థానిక సామంతులు క్రీ.శ.1280లో కట్టించిన నవలింగాలయాలు అనే 9 శైవాలయాలను చూడవచ్చు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఇక్కడ పంచలింగాలయాలు కూడా ఉండేవి. మరో పంచలింగాలయాల సమూహం ఉమామహేశ్వరానికి ఉత్తరాన 3 కి.మీటర్ల దూరంలో ఉన్న ‘మమ్మాయి బోడల’ మీద ఉంది. ఇలా ఎన్నో శైవాలయాలను కట్టించారు కాబట్టి విష్ణుకుండులు తమనుతాము ‘పరమ మహేశ్వరులం’ అని చెప్పుకున్నారు. అందుకు నిదర్శనంగా వారు కట్టించిన ఇటుక శివాలయాలు ఉమామహేశ్వరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘లొద్ది’లోను, 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సలేశ్వరం’లోను ఉన్నాయి. ఇంకా ఈ నల్లమల అడవుల్లో మరెన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో చాలావాటిని పేర్కొన్న క్రీ.శ.1300 ప్రాంతంనాటి పాల్కురుకి సోమనాధుని ‘పండితారాధ్య చరిత్ర’ గ్రంధం ఆధారంగా పరిశోధించి గుర్తించవచ్చు.
విష్ణుకుండుల తొలి కాలంలో… అంటే క్రీ.శ.4వ శతాబ్దంలో నల్లమల ప్రాంతాన్ని పాటలీపుత్రం (ఈనాటి బీహార్ రాజధాని) రాజు సముద్రగుప్తుడు జయించినట్లు అలహాబాద్ స్తంభ శాసనంలో ఉంది. అతని కొడుకు రెండవ చంద్రగుప్తుని కూతురు చంద్రావతి ఈ నల్లమలలో కొన్ని దేవాలయాలను కట్టించింది. వాటిలో శైవాలయాలను ఇప్పుడు మనం ఉమామహేశ్వరం దగ్గరలో ఉన్న రంగాపురం శివారు ‘చంద్రబండ’ గుహల్లో చూడవచ్చు. శ్రీశైలానికి ఉత్తరాన కృష్ణానది ఎడమ గట్టునున్న ‘చంద్రగుప్తి’ పట్టణంలో కూడా ఒకటి రెండు శివాలయాలున్నాయి. ఇక్కడ ప్రతి పౌర్ణమినాటి అర్ధరాత్రి వెన్నెలలో దేవకన్యలు నాట్యం చేస్తారని వారిని చూసినవారు తనకు చెప్పారని ఈ ప్రాంత తహశీల్దారు సయ్యద్ గౌస్ ‘బాలా-ఎ-కోహ్ అమ్రాబాద్’ అనే తన ఉర్దూ గ్రంథంలో 1923లో రాశారు. ‘ఇప్పటికీ పౌర్ణమి రాత్రి భయంతో అటువైపు చేపల వేటకు వెళ్ళమని’ ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో చేపలు పట్టేవారు ఈ వ్యాస రచయితకు చెప్పారు.

ఉమామహేశ్వరానికి పశ్చిమ దిశలో సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండనాగుల గ్రామ శివారులో ఉన్న దేవాలయాలను కూడా మొదట విష్ణుకుండులే కట్టించారు. ఈ దేవాలయాలు రెండూ రెండు కొండలపై ఉండటం వల్ల, ఈ దేవాలయ ద్వారాలకు రెండు వైపులా నాగుపాముల శిల్పాలు చెక్కి ఉండటం వల్ల ఇక్కడున్న గ్రామానికి ‘కొండనాగుల’ అనే పేరు వచ్చింది. స్థానికులు ఇక్కడి చిన్న కొండ పైనున్న దేవాలయాన్ని చిన్నగట్టు గుడి అని, పెద్ద కొండపైనున్న దేవాలయాన్ని పెద్దగట్టు గుడి అని పిలుస్తున్నారు.
ఈ రెండు దేవాలయాల ద్వారబంధాల కింది భాగంలో ప్రత్యేకమైన పూర్ణకుంభ శిల్పాలుండడాన్ని బట్టి ఇవి విష్ణుకుండుల కాలానివని చెప్పవచ్చు. ఈ రెండు ఆలయాలకూ దక్షిణం వైపు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అంటే ఈ ప్రాంతపు ప్రధాన క్షేత్రమైన ఉమామహేశ్వరాన్ని చూస్తున్నట్లుగా ఉన్నాయి. రెండు ఆలయాలూ గర్భగృహం, అర్ధ మండపం ముఖ మండపాలతో శోభిల్లుతున్నాయి. చిన్నగట్టు ఆలయంలో 16 స్తంభాలతో కూడిన నవరంగ (తొమ్మిది గదుల) మంటపం ఉండగా, పెద్దగట్టు ఆలయంలో 36 స్తంభాలతో కూడిన 25 గదుల మంటపం చతురస్రాకారంలో ఉంది. ఈ రెండు దేవాలయాలకూ చుట్టూ ప్రాకారాలున్నాయి. వీటి పరిసరాల్లో సహజసిద్ధమైన సరస్సులు చిన్నచిన్నవి ఉన్నాయి. పెద్దగట్టు శివాలయం ముందున్న కోనేరు తీరాన విష్ణుకుండులనాటి లఘు శాసనమొకటుంది. రెండు దేవాలయాల మంటపాల్లో కూర్చుని ఆనాటి శిల్పుల పనితనాన్ని కొనియాడకుండా ఉండలేము. చిన్నగట్టు దేవాలయం రాచకొండ పద్మనాయక రాజుల కాలంలో లక్ష్మీచెన్నకేశవాలయంగా మారి గత మూడు శతాబ్దాల కాలంలో స్థానిక కొండనాగుల ప్రభువుల అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకుంది. ఇప్పటి ఆలయ ధర్మకర్త కారెంచేడు కోదండ రామాచారికి ఇప్పటికీ 130 ఎకరాల మాన్యం ఉందంటే ఇంకా వెనుకట ఈ ఆలయం ఎన్ని వేలు, లక్షల మంది శివభక్తులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు.
(‘తెలంగాణ కొత్త విహార స్థలాలు’ పుస్తకం నుంచి)
ప్రతులకు: తెలంగాణ రిసోర్స్ సెంటర్, చంద్రం 490, వీధి నెం.12, హిమయత్‍నగర్, హైదరాబాద్-29. తెలంగాణ. వెల: రూ.100
–ద్యావనపల్లి సత్యనారాయణ
ఎ : 94909 57078
