
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2020ని ఒక విపత్కర సంవత్సరంగా అందరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటినీ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్య సంక్షోభానికి గురిచేసింది. ఈ సంవత్సరమంతా రోజువారీ జీవితంలోని ప్రతి ఆలోచననీ ఈ కరోనా ప్రభావితం చేసింది. కాని అదే సమయంలో ఇదే కోవిడ్ అనేక విలువల్ని నేర్పింది. జీవిత విధానాలను మార్చింది. ఆరోగ్య స్పృహను పెంచింది. ప్రకృతిలోనూ, మానవ ప్రవృత్తిలోనూ కాలుష్యాలను తగ్గించింది. మనుషుల మధ్య భౌతిక దూరం పెరిగినా లోలోపల దాగివున్న మానవీయ కోణాలను బయటకు తెచ్చింది. ఆ మానవీయతే వలస కార్మికులకు అండగా నిలిచింది. మనిషి సృష్టి మొదలు యిప్పటిదాకా అనేక అవరోధాలను అధిగమిస్తూనే ఉన్నాడు. ఈ మహమ్మారినీ తట్టుకొని నిలబడ్డాడు. మనిషికి తన మనుగడే ముఖ్యమని నిరూపిస్తూనే ఉన్నాడు.
అతి తక్కువ సమయంలోనే కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం, అదీ మన దేశంలో, మన హైద్రాబాద్ నగరంలో సాధించగలగడం చాలా సంతోషం. ఇది మున్ముందు విపత్తులను ఎదుర్కోగలమనే భరోసాను యిస్తుంది. మన శాస్త్రజ్ఞుల మేధో సామర్థ్యానికి అభినందనలు.
పర్యావరణ, వాయు, నీటి వంటి అనేక కాలుష్యాలతో పాటు ఇవాళ సమాచార కాలుష్యం మరింత కలవరపెడుతున్నది. ప్రజాస్వామ్యానికి నాలుగవ స్థంభం పత్రికా రంగం. సమాచార రంగం. పత్రికలు, ఛానళ్ళు వంటి సమాచార వ్యవస్థ మానవ హృదయ, మేధో నిర్మాణానికి అత్యంత కీలకం. వివిధ అంశాలపట్ల అవగాహన కలిగించడంలోనూ, ఆచరణకు ప్రేరేపించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాని ఇవాళ అవి వాటి స్వభావానికి, లక్ష్యాలకు తిలోదకాలిచ్చి కాలుష్యమయ్యాయి. పర్యావరణ కాలుష్యం వంటివి శరీర ఆరోగ్యానికి హాని చేస్తే ఈ సమాచార కాలుష్యం మానవ మేధస్సుకీ, ఆలోచనా విధానానికీ హాని చేస్తుంది. సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది. ప్రజలకు వాస్తవమైన, అవసరమైన సమాచారాన్ని అందకుండా గందరగోలపరచి హానికరమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక భావజాల స్థిరీకరణకు తోడ్పడుతుంది. సమాచార కాలుష్య వ్యాప్తికి జరుగుతున్న ప్రయత్నాలను మెలకువతో అర్థం చేసుకుని, నివారించడం యిప్పటి అత్యవసర కర్తవ్యం. లేకపోతే తప్పుడు చరిత్రకి నిర్మాతల మవుతాం.
కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తారుమారు చేసిన సందర్భంలో త్వరలో మనకి కొత్త బడ్జెట్ రాబోతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో జాగరూకత చాలా అవసరం. దేశంలోని వివిధ కార్యక్షేత్ర నిపుణులతో చర్చించి బడ్జెట్‍ను రూపొందించుకోవాల్సి వుంది.
2021 జనవరి 26న 72వ గణతంత్ర వేడుకలు జరుపుకోబోతున్నాం. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగానూ, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత యిచ్చిన రాజ్యాంగంగానూ ప్రశంసలందుకుంటున్నది. వ్యక్తిగత స్వేచ్ఛ. భావ ప్రకటనా స్వేచ్ఛ, జీవించే హక్కు, సమాఖ్య (ఫెడరల్) స్వభావం, అధికార వికేంద్రీకరణ మన రాజ్యాంగ మౌలిక లక్ష్యాలలో ముఖ్యమైనవి. ఇంత సువిశాల భారతంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు దేశ మనుగడను, అభివృద్ధిని నిర్ణయించే కీలకాంశాలు. కానీ ఈ 72 సంవత్సరాల కాలంలో రాను రాను రాజ్యాంగ లక్ష్యాలకు ప్రమాదం ముంచుకొస్తున్నది. అన్ని వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యం. ప్రజల్లో రాజ్యాంగ స్పృహను పెంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్
