క్రీడాస్ఫూర్తిని చాటిన ధ్యాన్‍చంద్‍ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం

భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్‍ చంద్‍. భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు ధ్యాన్‍చంద్‍. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతట చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్‍ ధ్యాన్‍చంద్‍దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29ని జాతీయ క్రీడాదినోత్సవం జరుపుకోవడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అయితే జాతీయ క్రీడాదినోత్సవం గురించి చాలా మందికి తెలియదు. ధ్యాన్‍చంద్‍ చరిత్ర, హాకీ క్రీడలో సాధించిన ఘన విజయాలు పాఠ్యాంశంగా చేర్చటం వలన బాల, బాలికల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతుంటారు.

ధ్యాన్‍చంద్‍ ఉత్తరప్రదేశ్‍లోని అలహాబాద్‍లో 1905లో ఆగస్టు 29న జన్మించారు. మధ్య ప్రదేశ్‍లోని ధ్యాన్‍చంద్‍ నగరంలో పెరిగారు. ఆయనకు చిన్న తనం నుంచే హాకీ క్రీడ అంటే చాలా ఇష్టం. హాకీ స్టిక్‍ అతని చేతిలో మంత్రదండగా మారిపోతుంది. బంతిపై నియంత్రణ, డ్రిబ్లింగ్‍ చాతుర్యం, పాసింగ్‍లో అసాధారణ నైపుణ్యం ఉత్తమ ప్రతిభ కలిపి ధ్యాన్‍చంద్‍ను హాకీ మాంత్రికుడిగా చేశాయి. అతను బంతిని నియంత్రించే విధానం చూసి మైదానంలోని అభిమానులతో పాటు తోటి ఆటగాళ్లు కూడా మంత్ర ముగ్దులయ్యేవారు. ప్రపంచ హాకీలో ‘ది విజార్డ్’, ‘మెజిషియన్‍’ గా ధ్యాన్‍చంద్‍ గుర్తింపు పొందాడు. 1928 ఆమ్‍స్టర్‍డామ్‍, 1932 లాస్‍ ఏంజిలెస్‍, 1936 బెర్లిన్‍ ఒలింపిక్‍ గేమ్స్లో భారత్‍కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్‍చంద్‍కే దక్కింది. ధ్యాన్‍చంద్‍ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ పతకాలను గెలిచింది. 1936లో లాస్‍ ఎంజిల్స్ లో జరిగిన పోటీలో అమెరికాపై ధ్యాన్‍చంద్‍ 9 గోల్స్ చేసి భారత్‍ ను గెలిపించారు. ధ్యాన్‍చంద్‍ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‍ను 1948లో ఆడాడు. తన అంతర్జాతీయ హాకీ కేరీర్‍లో 400కు పైగా గోల్స్ను నమోదు చేసాడు. ధ్యాన్‍చంద్‍ ఆటకు ముగ్ధుడైన జర్మనీ నియంతన హిట్లర్‍ ధ్యాన్‍చంద్‍కు జర్మనీలో కల్నల్‍ హోదా ఇస్తామని విజ్ఞప్తి చేయగా ధ్యాన్‍చంద్‍ తన మాతృదేశాన్ని వీడనని చెప్పటం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం.

హాకీలో భారత్‍కు చారిత్రాత్మక విజయాలు అందించడంతో పాటు ధ్యాన్‍చంద్‍ ఎన్నో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు. భారత్‍ పేరు ప్రపంచపటంలో మారుమ్రోగి పోవడంలో ధ్యాన్‍ చంద్‍ కీలకపాత్ర పోషించాడు. క్రీడా రంగంలో ధ్యాన్‍చంద్‍ చేసిన కృషికి ప్రభుత్వం 1956లో భారతీయ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్‍తో సత్కరించింది. క్రీడా రంగంలో ఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలిచిన ధ్యాన్‍చంద్‍ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ క్రీడా దినోత్సవ ప్రధాన లక్ష్యం క్రీడల ప్రాముఖ్యత గురించి యువతలో అవగాహన కల్పించడం, ఆటల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయడం. యూత్‍ ఫిట్‍గా ఉంటేనే దేశం ఫిట్‍గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రధాని మోదీ 2019లో జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్ట్ 29న ఫిట్‍ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు.

మేజర్‍ ధ్యాన్‍ చంద్‍ పేరును ఖేల్‍ రత్న అవార్డుకు పెట్టాలని భారతదేశం నలుమూలల నుండి తనకు అనేక అభ్యర్ధనలు వస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వారి మనోభావాలను గౌరవిస్తూ, ఖేల్‍ రత్న అవార్డును ఇక నుంచి మేజర్‍ ధ్యాన్‍ చంద్‍ ఖేల్‍ రత్న అవార్డు అని పిలుస్తారని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశానికి గౌరవం, కీర్తిని తెచ్చిన భారతదేశపు అగ్రగామి క్రీడాకారులలో మేజర్‍ ధ్యాన్‍ చంద్‍ ఒకరని మన దేశ అత్యున్నత క్రీడా గౌరవానికి ఆయన పేరు పెట్టడం సముచితమని ప్రధాని అన్నారు.

  • కె. సచిన్‍,
    ఎ : 86866 64949

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *