ఉపోద్ఘాతం:
దక్కన్‍లో రాష్ట్రకూటుల పాలన సాగుతున్నప్పుడు చాళుక్యులలోని ఒక శాఖను తెలంగాణ ప్రాంతానికి సామంతులుగా నియమించారు. వీరు ముందుగా పోతన లేదా బోధన్‍ను రాజధానిగా చేసుకొని సపాద లక్ష దేశమును పరిపాలించారు. అనంతరం వీరు మూలవాగు ఒడ్డున ఉన్న వేములవాడకు తమ రాజధానిని మార్చి పాలించడం ప్రారంభించారు. నాటి నుండే వీరు వేములవాడ చాళుక్యులుగా ప్రసిద్ధిపొంది చరిత్రలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ వంశంలో మొదటివారు వినయాదిత్య యుద్ధమల్లుడు. వీరు సా.శ.750లో రాజ్యానికి రావడంతో వేములవాడ రాజ్యపాలన ప్రారంభమైంది. తెలంగాణలోని పశ్చిమోత్తర మొత్తం భూభాగంతో పాటు మరికొన్ని ప్రాంతాలు వీరి రాజ్యంలో అంతర్భాగాలుగా ఉండేవి. వేములవాడ చాళుక్యులు మొత్తం 11మంది రాజులు సా.శ. 750 నుండి సా.శ. 973 వరకు దాదాపుగా 223 సంవత్సరాలు అప్రతిహతముగా ఈ ప్రాంతాన్ని పాలించారు. వేములవాడ రాజులందరికెల్లా అగ్రగణ్యుడు రెండవ అరికేసరి. ఈ వంశంలో చివరివారు మూడవ అరికేసరి. మూడవ అరికేసరి కాలంలో కళ్యాణి చాళుక్యులు దాడిచేసి ఈ రాజ్యాన్ని అంతమొందించారు. రెండు శతాబ్దాల వీరి పాలనలో అన్నిరంగాలు అభివృద్ధి సాధించాయి. ముఖ్యంగా తెలంగాణలో చాళుక్యులు వాస్తు, శిల్ప, సాహిత్య, సాంస్కృతిక విషయాలలో తమదైన ముద్రను వేయడం జరిగింది. ప్రధానంగా విద్య, సాహిత్యం కూడా గొప్ప మార్పులకులోనై అభివృద్ధిని సాధించింది.
విద్యా వ్యవస్థ:
వేములవాడ చాళుక్యులు కన్నడ, సంస్క•త భాషలను పోషించారు. కన్నడం రాజభాషగా వర్ధిల్లింది. కన్నడ భాషకు వీరి కాలాన్ని స్వర్ణయుగం అంటారు. తెలుగు జనవ్యవహారంలో ఉండి సామాన్య భాషగానే ఉంది. అప్పుడప్పుడే తెలుగులో గద్య, పద్య రచనలు వెలుగులోకి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. పాలకులు తమ శాసనాలను ఎక్కువగా కన్నడంలో వ్రాయించారు. మరికొన్ని శాసనాలలో కన్నడంతో పాటు సంస్కృతం, తెలుగును కూడా
ఉపయోగించడం జరిగింది. ఈ శాసన భాష తెలుగన్నడ లిపిగా ప్రసిద్ధి పొందింది. వేములవాడ చాళుక్యుల కాలంలో దేవాలయాలు, మఠములు, జైనబసదులు, బౌద్ధవిహారములు విద్యావ్యాప్తికి కృషి చేశాయి. మఠములు, బసదులలోని సన్యాసులు, మునులు, విద్యార్థులకు విద్యాబోధన చేసినట్లు తెలుస్తుంది. దేవాలయ అరుగులపైన లేదా గ్రామంలోని చెట్ల క్రింద చదవడం, రాయడం సామాన్యలెక్కలు గురువుల ద్వారా బోధింపబడేవి. ఊరులోని ప్రతి బ్రాహ్మణ కుటుంబం విద్య బోధన చేసినట్లు తెలుస్తోంది. ప్రతి అగ్రహారం ఒక గురుకులంగా వెలుగొందిందని చెప్పవచ్చును. ఇవి కాకుండా ప్రత్యేక విద్యాస్థానములు, కేంద్రాలు ఉన్నట్లు శాసనాల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వీటిలో ఉచిత భోజనవసతి ఉండేదని వేములవాడ శాసనం ద్వారా అర్థం అవుతుంది.
ఇక మఠములు సన్యాసుల నివాస స్థానాలుగానే కాకుండా సకలకళాశాస్త్రాలకు కేంద్రాలుగా భాసిల్లేవి. విద్యకై వచ్చేవారికి ఆచార్యులు, పండితులు ఉచితంగానే బోధించేవారు. విద్యార్థులు మఠములలోనే నివాసం ఉండేవారు. ఈ విద్యా కేంద్రాలలో ప్రధానంగా నైతిక విలువలు, వేదములు, శాస్త్రములు, ఆగమములు, పురాణములు, ఇతిహాసములు, నాటకములు, కావ్యాలు, తర్కం, వేదాంతం, వ్యాకరణం, మీమాంస మరియు వివిధ కళలు బోధించబడేవి. కొన్నిసార్లు రాజనీతి, యుద్ధవిద్యలను సైతం బోధించినట్లు తెలుస్తోంది. ఇందు కొరకు నిష్ణార్థులైన ఆచార్యులు, పండితులు ఉండేవారు. విద్యాకేంద్రాలలో, మఠాలలో నిరంతరం సమాజ హితంకై పండిత చర్చలు కొనసాగేవి. మఠాలు ఎల్లప్పుడు విద్యావ్యాసంగములో ఉండుటచేత వీటి నిర్వహణ కోసం రాజులు భూదానములు, గ్రామదానములను ఆయా మఠాధిపతుల పేరు మీదుగా ఇచ్చేవారు. కొన్ని సందర్భాలలో సత్రములను, ఉద్యాన వనములను, తటాకములను మఠాలకు దగ్గరలో నిర్మించడం కూడా చేసేవారు. ఇలాంటి మఠములు, బసదులు రాజ్యంలో అనేకం కలవు. వాటిలో ముఖ్యమైనవి ఏలేశ్వరకాలముఖ మఠం మరియు బొమ్మలమ్మ గుట్ట వద్ద గల త్రిభువన తిలక జైనబసది పేర్కొనదగినవి.

ఏలేశ్వరకాలముఖ మఠము:
వేములవాడ చాళుక్య మొదటి అరికేసరి (సా.శ. 775-800) పావన క్రిష్ణానదీ తీరమునున్న ప్రసిద్ధ ఏలేశ్వర శైవక్షేత్రమున ఉన్న ఏలేశ్వరస్వామిని దర్శించుకొని దానిదగ్గరలో ఉన్న కాలముఖ మఠమును సందర్శించడం జరిగింది. ఆ సందర్భంలో కాలముఖ మఠాధిపతిగా ఉన్న సద్యోశివాచార్యుని శిష్యుడైన ముగ్ధశివాచార్యునకు రామడుగు విషయములోని బెల్మొగ గ్రామము విద్యాదాన నిమిత్తము దానమిచ్చినట్లుగా కొల్లిపర తామ్రశాసనం తెలుపుతుంది. ఏలేశ్వరం శ్రీశైల ఉత్తరమున గల సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ కాలముఖ శాఖతో పాటు, పాశుపత శాఖ కూడా వర్థిల్లుతుండేది. మఠంలో వేదవిద్యాపారంగతులు, మహిమాన్వితులైన పండితులు, ఆచార్యులు ఉండేవారు. ఏలేశ్వర విద్యాపీఠాధిపతిని ఏలేశ్వరోపాధ్యాయుడిగా పిలిచేవారు. కాలక్రమంలో వీరు లకులేశ్వర పండితులుగా పిలవబడ్డారు. ఈ పీఠమును సందర్శించిన అరికేసరి అక్కడి ముగ్ధశివాచార్యుని గొప్పతనంనకు పాండిత్యమును మెచ్చి విద్యాదానముకై సహాయం చేశారు. శివాచార్యులు వేదవేదాంగాలలో, ఉపనిషత్తులలో, షడ్ దర్శనాలలో, వేదాంతం, తర్కం, కళలలో, శైవాగమములలో బోధించడం లో దిట్టఅని శాసనం తెలుపుతుంది. ఈ పీఠములో వేదాలు, వివిధ శాస్త్రములు, కళలు, శైవాగమములు, శైవతత్వమును ప్రధానంగా బోధించబడుతుండేవి.
అలాగే రెండవ అరికేసరి (సా.శ. 930-955) తంత్రపాలుడు పెద్దనార్యుడు వేయించిన వేములవాడ గుడి ప్రాంగణ శాసనంలో శైవమతాచార్యులైన మల్లిఖార్జున, వ్యక్తిలింగ, విద్యారాశి మరియు వాఖ్యానిభట్టారకులు చెప్పబడ్డారు. వీరందరూ వేములవాడలో వివిధ దేవాలయాలకు ఆస్థానాధిపతులు. వీరు కూడా వేములవాడలో వివిధ దేవాలయ మంటపములలో విద్యాబోధనలను చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుత భీమేశ్వరాలయ ప్రాంగణంలో మొన్నమొన్నటి వరకు సభలు, సమావేశాలు హరికథ కాలక్షేపాలు నిర్వహించడం ఇందుకు తార్కాణం.
త్రిభువన తిలకబసది:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల-కొండన్నపల్లి శివారులో ఉన్న బొమ్మలమ్మగుట్టపై సా.శ. 945లో వేయించిన గల సంస్క•తాంధ్ర కన్నడ భాష శాసనం ఈ త్రిభువనతిలక జైనబసది గురించి వివరిస్తుంది. ఈ శాసన ప్రకారం నాడు వేములవాడను పాలిస్తున్నది రెండవ అరికేసరి. ఇతడి ఆస్థానంలో కన్నడ ఆదికవి పంపన కలరు. వీరు కన్నడంలో విక్రమార్జున విజయం, ఆదిపురాణం కావ్యాలను రచించారు. విక్రమార్జున విజయంను అరికేసరికి అంకితమిచ్చెను. దీనికి సంతోషించిన రెండవ అరికేసరి ధర్మపుర అగ్రహారము దానమిచ్చినట్లుగా శాసనంలో కలదు.
పంపమహాకవి సోదరుడు జినవల్లభుడు. ఇతడు సకలకళలయందు ప్రావీణ్యం కలవాడు. భవ్యరత్నాకరుడు, గుణపక్షపాతి, చతురకవిత్వరచనయందు నేర్పరి, కావ్యరచన యందు దురంధరుడు, కవిత్వాతత్త్వము తెలిసినవాడు. ఆచార్య పీఠమలంకరించిన మహనీయుడు. సంగీతశాస్త్ర పారంగతుడు. జినభవనములను నిర్మించుటలో, జినమునులకు ఆశ్రయం ఇచ్చుటలో అత్యంత ఆసక్తికలవాడు. ఇన్ని గొప్ప ఉదార్ధగుణములు కలిగిన జినవల్లభుడే ఈ శాసనమును వేయించెను.
శాసనంలో జినవల్లభుడు తన అన్న పంపమహాకవి గొప్పతనము, వారి వంశక్రమమును వివరించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో జైనులకోసము త్రిభువన తిలకమను పేరున జైన బసదిని నిర్మించానని, దానికి దగ్గరలోనే కవితాగుణార్ణవం అనే చెఱువును తవ్వించి, మదనవిలాసమను తోటను ఏర్పరచినట్లు దానిలో ప్రకటించారు.
ఈ త్రిభువన తిలక బసది వేములవాడ చాళుక్యుల కాలంలో గొప్ప విద్యాకేంద్రంగా విరాజిల్లింది. ఈ విద్యాకేంద్రంలో కన్నడ ఆదికవి పంప, అతని తమ్ముడు జినవల్లభుడు, వాదీభసింహ, వాదీభచూడామణి, మల్లియరేచన, పెదనభట్టు వంటివారు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ శాసనంలో తొలి తెలుగు కంద పద్యంను మనం చూడవచ్చును. ఈ జైనబసదిని దేశం నలుమూలల నుంచి జైనాచార్యులు, పండితులు సందర్శించినట్లు తెలుస్తుంది. అలాంటి వారిలో ముఖ్యుడు మహాదార్శనికుడు, సంస్కృతభాషా కోవిదుడు, అసాధారణ కవితాశక్తి సంపన్నుడు, జైనప్రసిద్దగురువు అయిన సోమదేవసూరి కూడా ఇక్కడే ఉన్నట్లు చెప్పుకున్నారు. మొత్తం దక్షిణాదిలోనే గొప్ప జైనవిశ్వవిద్యాలయ నాడు బొమ్మలమ్మ గుట్ట జైనబసదిగా వెలుగొందిందనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ జైనవిద్యాశాస్త్రాలు, జైనతత్త్వము, జైనమత సారం ఆచార్యులచేత ప్రభోదించబడినవి. అలాగే వీటితో పాటుగా ఇతర విద్యలు కూడా బోధించబడినట్లు తెలుస్తుంది. పరిసర ప్రాంతాలలో ఉన్న ఆధారాలను బట్టి చూస్తే ఇక్కడ ఆయుధ శిక్షణ, సైనిక తరగతులు కూడా నిర్వహించబడినట్లు అర్థమౌతుంది.

రెండవ బద్దెగుడు వేములవాడలో నిర్మించిన శుభదామ జినాలయమునకు సోమదేవసూరిని స్థానాధిపతిగా నియమించారు. ఈ బసది నిర్వహణ కోసము మూడవ అరికేసరి ఒక గ్రామమును దానం చేసినట్లు పర్భణి తామ్రశాసనం తెలుపుతుంది. సోమదేవసూరి ఈ జినాలయములో విద్యాబోధనను చేసిఉంటారు. వీరు రెండవ అరికేసరి కాలంలో ఉత్తర భారతం నుండి వచ్చి త్రిభువన తిలకబసదిలో నివసించారు. ఈయన రెండవ బద్దెగుడికి ఆయన కుమారుడు మూడవ అరికేసరికి గురువై ఉంటాడు. ఇలా వేములవాడ రాజులు గురువులను గౌరవిస్తూ స్థానాధిపతులుగా నియామిస్తూ వారిచే విద్య బోధన చేయించడం జరిగింది. ఈ పరంపరలో భాగంగానే ప్రస్తుతం వేములవాడ దేవస్థానం వారు సంస్కృత విద్యాసంస్థలు నిర్వహించడం జరుగుతుంది అనవచ్చును.
వీటితో పాటు బోధన్, కొలనుపాక, మునులగుట్ట తదితర ప్రాంతాలలో జైన విద్యా కేంద్రాలు ఉండేవి. ఇక్కడ జైనంతో పాటు అన్ని విద్యలు బోధించబడేవి. ఈ విధంగా వేములవాడ చాళుక్యుల కాలంలో దేవాలయాలు, మఠములు, బసదులు ప్రధానంగా మతవ్యాప్తికై వెలసినను పరోక్షంగా విద్యావ్యాప్తికి కృషి చేయడం గమనార్హం.
ఆధారాలు:
- Inscription of Andhra Pradesh, Karimnagar District,1974. Hyderabad.
- Sitaram Jagirdar-Pampa’s Samadhi, Epigraphia Andhrica Vol.II.p.32-35.
- Venkata Ramanaiah: Chalukyas of Vemulawada, Hyderabad, 1953.
- Krishna Kanth Handiqui: Yashasthilaka and Indian Culture, Mumbai,1949.
- ‘ఆంధప్రదేశ్ గెజిటీర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్’, హైదరాబాద్, 1974.
- ‘కరీంనగర్ మండల చరిత్ర’, శ్రీ త్యాగరాయ లలిత కళాపరిషత్, కరీంనగర్.
- డా. కొల్లూరు సూర్యనారాయణ: ‘వేములవాడ చాళుక్యుల సాహిత్య పోషణ’, భారతి, మార్చి, 1986.
- డా. ఎం.చిదానంద మూర్తి, ‘కరీంనగర్ జిల్లాలో పంప మహాకవి సోదరుడు జినవల్లభుడి శాసనం-మరికొన్ని పరిశోధనాంశాలు’, భారతి, మార్చి,1980.
- డా. రమణయ్య జైశెట్టి: ‘కరీంనగర్ జిల్లా చరిత్ర-సంస్కృతి’, జగిత్యాల, 2003.
- నాగేంద్రశర్మ సంకెపల్లి: ‘వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర చరిత్ర, కరీంనగర్’, కరీంనగర్.
- నాగేంద్రశర్మ సంకెపల్లి: ‘రాజన్న సిరిసిల్ల జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర’, హైదరాబాద్, 2020.
- ‘పంప భారతం(విక్రమార్జున విజయం)’,1898.
- ప్రభాకర శాస్త్రి వేటూరి: ‘ప్రబంధ రత్నావళి’, పీఠిక.
- బి.ఏన్.శాస్త్రి: ‘వేములవాడ చరిత్ర- శాసనములు’, హైదరాబాద్,1991.
- మలయశ్రీ: ‘కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర’, కరీంనగర్,1997.
- వెంకటరమణయ్య నేలటూరు: ‘పల్లవులు-చాళుక్యులు’, మద్రాస్, 1969.
- వెంకట రావు నిడుదవోలు: ‘మన కవులు’1953.
- శేష శాస్త్రి ఆర్, సదానందం జె: ‘కవిజనాశ్రయ కర్తృత్వము- పునఃపరిశీలనం’. భారతి, జూలై,1988.
- శ్రీరామోజు హరగోపాల్: ‘పంప మహాకవి గాథ’, దక్కన్ ల్యాండ్, సెప్టెంబర్, 2021.
-డాక్టర్ సందెవేని తిరుపతి
ఎ : 984961811