ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల మనిషి.
స్వాతంత్య్ర సమరయోధుడు.
ప్రముఖ గాంధేయవాది.
నిజాం రాజ్యం నుండి ఎదిగిన జాతీయ నాయకుడు.
ఆయన వ్యక్తిత్వం విశిష్టమైనది.
జీవిత లక్ష్యాలు మహోన్నమైనవి.
పదవులకోసం ఎన్నడూ అర్రులు చాచని ధీరోదాత్తుడు
ఆచార్య కొండా లక్ష్మన్ బాపూజీ జీవితం తెరిచిన పుస్తకం.
కొండా లక్ష్మణ్ కేవలం రాజకీయ నాయకుడు కాదు. అనేక సామాజిక రంగాల్లో కృషి చేసిన ఉద్యమకారుడు.
కొండా లక్ష్మణ్ బాపూజీ లాలాలజపతిరాయ్, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, గాంధీజీల వారసుడు.
కొండా లక్ష్మణ్‍బాపూజీ తన యవ్వన కాలంలో భగత్‍సింగ్, సుభాష్ చంద్రబోస్, దామోదరం సంజీవయ్య, లోక్‍నాయక్ జయప్రకాశ్ నారాయణ, రామమనోహర్ లోమియా వంటి మహానాయకులవలె మిలిటెంటు ఉద్యమాలు నిర్మించిన యువకుడు.
97 సంవత్సరాల నిండు జీవితం జీవించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితంలో ఎన్నో పరిణామాలు చూడవచ్చు.
బాపూజీ జీవితం పరిశీలిస్తే ఆయన జీవితాన్ని వ్యక్తిత్వాన్ని, పరిణామాల్ని దశలవారీగా పేర్కొనవచ్చు.
జాతీయోద్యమం, ఆనాటి సమాజం, కుల వ్యవస్థ, కుల వృత్తులు, పేదరికం, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక స్థితిగతులు మొదలైనవాటి గుండా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం సాగుతూ వచ్చింది.
యువనాయకుడుగా మల్లయోధుడుగా అనేక క్రీడలకు సారధిగా తిరిగిన కాలాన్ని బాపూజీ జీవితంలో మొదటి దిశగా చెప్పవచ్చు.
రెండవ దశలో ఆదిలాబాద్ జిల్లాలో తానున్న ప్రాంతంలో మొట్టమొదటి విద్యావంతుడుగా, ఉన్నత విద్య కోసం నిరంతర కృషి చేశారు.
సంఘ సంస్కర్తగా పరిణతి చెంది జీవితాంతం కృషి చేసిన బాపూజీ వ్యక్తిత్వాన్ని మూడవ దశగా చెప్పవచ్చు.
ఉద్యమ కాలంలో కొండా లక్ష్మణ్ నైజాం వ్యతిరేక ఉద్యమకాలం నుండి చేనేత కష్టనివారణ, పద్మశాలి సంక్షేమ సంఘం, సహకార సంఘాల నిర్మాణం, హైకోర్ట్ నిర్మాణంలో చురుకైన పాత్ర నిర్వహించారు.
కొండా లక్ష్మణ్ రాజకీయనాయకుడుగా, శాసన సభ్యుడిగా, మంత్రివర్గాల్లో వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీలో మానవీయ, సంస్కృతి, నైతిక విలువలు, ఆదర్శ వ్యక్తిత్వం నేటికీ ఆదర్శప్రాయం.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా వాంకిడి గ్రామంలో అమ్మమ్మ గారింట 1915 సెప్టెంబరు 27 తేదీన జన్మించారు.
కొండా పోశెట్టి, అమ్మక్క దంపతులకు కొండా లక్ష్మణ్ ఐదవ సంతానం. తండ్రి పోశెట్టి పోస్టిమ్యాన్‍గా పని చేసేవాడు. కొండా లక్ష్మణ్ రెండున్నరేళ్ల పసిప్రాయంలోనే తల్లి మరణించింది. కొండా లక్ష్మణ్ ఐదో సంతానం. ఐదుగురు సంతానంలో నలుగురు మగపిల్లలు, ఒక్కరు ఆడపిల్ల, కొండా పోశెట్టి పోస్ట్మ్యాన్ ఉద్యోగం చేస్తున్నపుడు ప్రభుత్వ రికార్డుల్లో బాపూజీగా చేర్చబడింది. పోశెట్టి పేరు బాపూజీగా మారింది.
పోశెట్టి (బాపూజీ) సేవను గమనించి గుమస్తాగా.. క్యాషియర్, సబ్ పోస్ట్మాస్టర్‍గా ప్రమోషన్‍లు ఇచ్చారు. కొండా లక్ష్మణ్ ఉర్దూ, మరాఠీ మీడియంలలో పాఠశాల విద్యను కొనసాగించాడు. తండ్రి లక్ష్మణ్‍ను రాజూర, మాణిక్‍ఘర్‍లో నాలుగవ తరగతిలో చేర్చారు. మాణిక్‍ఘర్ ఆనాడు నాలుగువేల జనాభాతో ఒక తాలూకా కేంద్రం. కొండా లక్ష్మణ్ చదువుతున్న రాజురా… మాణిక్‍ఘర్‍కు 20 కిలోమీటర్ల దూరంలో ఉండేది.
అది మరాఠీ మాట్లాడే ప్రాంతం. మహాత్మాగాంధీ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో చాందా (చంద్రపూర్) రావటం జరిగింది.
అప్పుడు కొండా లక్ష్మణ్ వయస్సు 15 సంవత్సరాలు. మహాత్మాగాంధీ వస్తున్నాడనే వార్త కొండా లక్ష్మణ్‍కు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. కొండా లక్ష్మణ్ చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయ వర్గం మహాత్మాగాంధీ పర్యటనకు ఎవ్వరూ వెళ్లవద్దని ఆదేశించారు. అయినా కొండా లక్ష్మణ్ కొంతమంది విద్యార్థులను రహస్యంగా తీసుకొని చాందా వెళ్ళి మహాత్మాగాంధీ ఉపన్యాసాన్ని వినటం జరిగింది. ఆనాడు మహాత్మాగాంధీ ఇచ్చిన ఉపన్యాసం, దర్శనం కొండా లక్ష్మణ్ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది.
కొండా లక్ష్మణ్ తన తెల్ల ప్యాంటును చించి స్వయంగా గాంధీ టోపిని తయారు చేసుకొని ధరించటం 1932 నుంచి ప్రారంభించారు. నిజాం రాజ్యంలో తెల్ల టోపి ధరించటమనేది ప్రభుత్వ ధిక్కారానికి చిహ్నంగా ఉండేది. కొండా లక్ష్మణ్ 17వ ఏట ప్రాథమిక విద్యను పూర్తి చేసి మిడిల్ స్కూల్‍లో 1935లో 7వ తరగతి పాసయ్యేనాటికి ఆయన వయస్సు 20 ఏండ్లు. బాపూజీ 1935లో ఏడవ తరగతి ఉత్తీర్ణుడైన తరువాత హైదరాబాద్ సిటీలో విద్యనభ్యసించాడు. ఈ సందర్భంలో అన్ని తరగతులకు మానిటర్ గా వ్యవహరించాడు.
1936-37 ప్రాంతంలో గణేశ్ వ్యాయామశాల్లో వ్యాయామం అభ్యసించాడు. 1938-39 ప్రాంతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన వందేమాతరం ఉద్యమం పట్ల ఆసక్తి కనపర్చాడు. పాఠశాలలో లక్ష్మణ్ గణితంలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. కబడ్డీ పోటీల్లో జిల్లా స్థాయిలో పాల్గొనడంతో పాటు హాకీ, ఫుట్‍బాల్‍ల్ కెప్టెన్‍గా కూడా నియమించబడ్డాడు. ఆదిలాబాద్ రెజ్లింగ్ (కుస్తీ) పోటీల్లో ఫస్ట్ వచ్చాడు. చదువుతోపాటు ఆటలపోటీల్లో అన్ని రంగాల్లో చురుగ్గా ఉండేవాడు. కొండా లక్ష్మణ్ హనుమాన్ వ్యాయామశాల స్థాపించడంలో కీలకపాత్ర వహించాడు.
1938లో కొండా లక్ష్మణ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1938లో హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ నిజాం రాజ్యంలో ప్రజల పౌరహక్కుల సాధన కొరకు సత్యాగ్రహం చేయటం ప్రారంభించింది. హిందూ మహాసభ, ఆర్య సమాజం వారు కూడా అదే సంవత్సరం సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. మొదటి సత్యాగ్రహం హైదరాబాద్‍లోని పుత్లీబౌలి క్రాస్‍రోడ్స్ వద్ద జరిగిన సందర్భంలో కొండా లక్ష్మణ్ వారికి అనుకూలంగా నినాదాలు ఇచ్చి ప్రోత్సహించి సందువల్ల అరెస్టు అయినారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1940లో 3వ గ్రేడు వకీలు కోర్స్ పాసయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాలోనూ, హైదరాబాద్ లోని కొన్ని కోర్టులలో ప్రాక్టీస్ ప్రారంభించాడు.

1940-43 జాతీయ చైతన్యాన్ని రగిలించడానికి చర్చాగోష్టులను నిర్వహించే 40 సంస్థలను ప్రారంభించి నడపడంలో కీలకపాత్ర వహించాడు. వాటికి చైర్మన్‍గా ఎన్నికయ్యాడు. 1941-42 నిజాం ఆంధ్రమహాసభలో పౌరహక్కుల, ప్రజాస్వామిక హక్కుల కోసం చురుకుగా పాల్గొన్నాడు.
1940లో న్యాయవాదిగా కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి తరపున వాదించి కేసులను గెలిపించేవాడు. కొండా లక్ష్మణ్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు.
1947 డిసెంబర్ 4న నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బ•ందంలో కొండా లక్ష్మణ్. మార్గదర్శి. 1944లో 2వ గ్రేడ్ వకీలు డిప్లొమా కోర్సు పాసయి హైదరాబాద్ హైకోర్టులోను, సెషన్ కోర్టులోను వకాలత్ ప్రారంభించాడు. 1945లో 1వ గ్రేడ్ వకీలు డిప్లొమా కోర్సు పాసయి హైదరాబాదు రాజ్యంలోని జుడీషియల్ కమిటీ (సుప్రీం కోర్టు)లో వకాలతు ప్రారంభించాడు.
కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయ నేపథ్యం గల అన్ని కేసులను ఫీజు లేకుండా ఆరోజుల్లో వాదిస్తూ వచ్చినాడు. కొన్ని పర్యాయాల్లో కేసుల ఖర్చు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీయే భరిస్తూ వచ్చాడు. కొండా లక్ష్మణ్ అన్ని పార్టీల వారికి న్యాయవాదిగా తన సహాయాన్ని అందించాడు. అన్ని పార్టీల వాళ్ళు కొండా లక్ష్మణ్‍ను వారి స్వంత మనిషిగా భావించేవారు. కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణ రెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీని ఎంతో ప్రేమగా చూసేవారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు 1942లో జరిగిన 9వ ఆంధ్రమహాసభ కాలం నుండి బాపూజీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ 1952 నుండి 1978 వరకు శాసనసభకు ఎన్నికయ్యారు. బాపూజీ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ 1975లో కాంగ్రెస్‍ను విడిచిపెట్టినా గాంధేయవాదిగానే జీవితాంతం కొనసాగారు. 23 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‍గా, వైస్ ప్రెసిడెంట్‍గా, రెండుసార్లు కేబినెట్ మంత్రిగా విశిష్టమైన సేవలందించి తనదైన శైలిలో చరిత్ర సృష్టించారు. ఎన్నో అంశాలను తెరమీదకు తెచ్చి వాటిని పరిష్కరించడంలో కొండా లక్ష్మణ్ కృషి ఎంతో గొప్పది.
ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విషయానికి వస్తే…
1969లో జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. బాపూజీని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విడుదలయ్యాక తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ కొనసాగించారు. 1972లో శాసనసభకు భువనగిరి నుండి మరోసారి ఎన్నికయ్యారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, జె. ఈశ్వరీబాయి, టి.ఎన్. సదాలక్ష్మి రాజకీయ రంగం నుండి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి, యువజన ఉద్యమాలకు మద్దతు ఇస్తూ, సామాజిక ఉద్యమంలోకి దూకిన సమరశీలురు.
జీవితమంతా కొండా లక్ష్మణ్ బాపూజ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మగౌరవంతో జీవించారు. అందువల్ల 1978 నుండి 1988 మధ్య గవర్నర్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ చంచాగిరి చేయడం ఇష్టం లేక వదులుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చూడకుండానే సెప్టెంబరు 21, 2012న 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో తన సామాజిక, రాజకీయ, జీవనయాత్రను చాలించారు.
తొమ్మిది దశాబ్దాల తెలంగాణ సామాజిక చరిత్ర. ఉద్యమాలు, కార్యక్రమాలు, సహకార రంగ వికాసం, సామాజిక, ఆర్థిక న్యాయం, సమసమాజం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి సంబంధించిన అనేక సంఘటనలు, పరిణామాలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి. జీవితంతో ముడిపడి వున్నాయి..
కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వ్యక్తిత్వం, సౌశీల్యం, సంకల్ప బలం, త్యాగశీలత నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమైనవి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అట్టడుగు వర్గాల నుండి స్వయంకృషితో ఎదిగిన జాతీయ నాయకుడు. ప్రజల మనిషి స్వాతంత్య్ర సమరయోధుడు సామాజిక న్యాయం, సామాజిక మార్పు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-బి.ఎస్.రాములు
ఎ : 833196698