ఎవరో ఒకరు… ఎపుడో అపుడు, నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు… మొదటివాడు ఎప్పుడు ఒక్కడేమరి, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి…!! అన్న సుకవి మాటలు భారతీయ వ్యోమగామి శుభాంశుశుక్లాకు అతికినట్లు సరిపోతాయి. ఎప్పుడో 41 సం।।రాల కిందట ఇండియా నుండి తొలిసారి రాకేశ్‍శర్మ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తరువాత, యాగ్జియం-4 మిషన్‍ద్వారా మళ్ళీ ఇన్నేళ్ళకు అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడిగా, ఇంటర్నేషనల్ స్పేస్‍స్టేషన్ (ఐఎస్‍ఎస్)లో అడుగిడిన తొలి ఇండియన్‍గా, మొత్తం మీద 634 వ్యోగమామిగా శుభాంశు చరిత్ర సృష్టించడాన్ని చూసి యావత్ భారత జాతి పులకించిపోయింది. జూన్ 25న అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి అంతరక్షింలోకి వెళ్ళిన శుక్లా, జూన్ 26న ఐఎస్‍ఎస్‍లోకి ప్రవేశించి 18 రోజుల పాటు అక్కడ గడిపి జులై 15న కాలిఫోర్నియా సముద్ర తీరంలో సురక్షితంగా భూమిని చేరుకున్నారు. ఇస్రో మానవ సహిత అంతరిక్షయాత్ర ‘‘గగన్‍యాన్’’ ప్రాజెక్ట్ 2022 నాటికే వాస్తవ రూపం దాల్చాల్సి ఉండగా, కోవిడ్ తదనంతర పరిణామాలతో అది 2027కి వాయిదాపడింది. ఆ యాత్రకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుక్లా కూడా ఒకరు. గగన్‍యాన్ ఇప్పటికే తొంభై శాతం పని పూర్తిచేసుకొని తుదిదశ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసేకోవాలని ఆపై అయిదేళ్ళకు చంద్రుడిపై కాలుమోపాలన్నది భారతావని సంకల్పం. దాన్ని నెరవేర్చుకునే క్రమంలో శుభాంశు అంతరిక్ష యాత్ర ఖచ్చితంగా ఒక ముందడుగేనని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం కూడా శుభాంశు అంతరిక్షయాత్రకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందామా!!
అసలేమిటీ యాగ్జియం-4:
యాగ్జియం స్పేస్ అన్నది టెక్సాస్ (యూఎస్‍ఏ)కు చెందిన ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ. ఇది అంతరిక్ష మౌళిక సదుపాయాలను అభివృద్ధి పరిచే విధులను నిర్వర్తిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం హ్యూస్టన్‍లో ఉంది. దీనిని 2016లో కామ్‍గఫారిన్ మరియు మైఖెల్ సఫ్రెడిని స్థాపించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను చేర్చే విధులను కూడా ఈ సంస్థే నిర్వహి స్తోంది. ఆ వరుసలో ఇది నాల్గవ అంతరిక్ష యాత్ర. అందుకే దీనికి యాగ్జియం-4 అన్న పేరు వచ్చింది.
యాగ్జియం-4 అంతరిక్ష యాత్రలో భాగంగా భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు స్లోవోస్ట్ ఉజ్నాన్ స్కీ (పోలాండ్), టిబర్ కపు (హంగేరీ), పెగ్గీ హిట్సన్ (యూఎస్‍ఏ)లు కూడా జూన్ 26న ఫాల్కన్-9 రాకెట్, డ్రాగన్ వ్యోమనౌక ‘‘గ్రేస్’’ ద్వారా ఐఎస్‍ఎస్‍కు చేరుకున్నారు.
యాగ్జియం-4 మిషన్‍లో యాగ్జియం సంస్థతో పాటు, నాసా (NASA), స్పేస్ ఎక్స్, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సహచర భాగస్వాములుగా ఉన్నాయి. ఇందులో నాసా ఐఎస్‍ఎస్, స్పేస్ ఎక్స్ రాకెట్, డ్రాగన్ క్యాప్యూల్ తయారీ, నిర్వహణ, యాగ్జియం సంస్థ పూర్తిస్థాయిలో మిషన్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాయి. శాస్త్రీయ ప్రయోగాల నిర్వహణ బాధ్యతను ఇస్రో మరియు ఈఎస్‍ఏ నిర్వర్తించాయి.

నాటి నుండి నేటి వరకు ఇస్రో పరిణామం:
1984లో మొదటి భారతీయ వ్యోమగామి రాకేశ్‍శర్మ రష్యన్ వ్యోమ నౌక సోయూజ్-టీ11 ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన సమయంలో ఇస్రో నేతృత్వంలో భారతీయ అంతరిక్ష కార్యక్రమం బుడి బుడి అడుగులు వేసే దశలోనే ఉంది. శర్మ సాధించిన విజయాన్ని ఉత్పాదకంగా వినియోగించుకొనే మౌళిక సదుపాయాలు మరియు సామర్థ్యం అప్పట్లో ఇస్రో వద్దలేవు. భవిష్యత్‍లో భారతీయ అంతరిక్ష రంగం ఎలా ఉండాలి అన్న విషయంలో కూడా ఇస్రో వద్ద ఖచ్చితమైన ప్రణాళికలు లేదా రోడ్ మ్యాప్‍లు లేవు. మానవులను అంతరిక్షంలోకి పంపాలన్న ఆశయం కూడా అప్పట్లో ఇస్రోకు లేదు. అందువల్ల అప్పట్లో రాకేశ్ శర్మ సాధించిన విజయం ఒక ప్రతీకాత్మక సంఘటనగా మిగిలిపోయింది. కానీ శుక్లా అంతరిక్షయానం, శర్మతో పోలిస్తే పూర్తి భిన్నమైనది. అప్పట్లో శర్మ అంతరిక్ష యానం భారీ స్థాయి సంకేతాత్మక (Symbolic) మరియు ప్రేరణాత్మక అంశంగా నిలవగా, శుక్లా యాత్ర ఆచరణాత్మక ప్రయోజనాలను కలిగి ఉంది. ఇటీవలికాలంలో ఇస్రో అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష మిషన్లను అమలు చేయడంలో ప్రపంచంలోని మేటి అంతరిక్ష సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇస్రో సాధించాల్సిన లక్ష్యాలలో ‘‘మానవ సహిత అంతరిక్ష యానం’’ ఒక్కటే మిగిలి ఉంది. గగన్‍యాన్ మిషన్- 2022 నాటికే మానవసహిత అంతరిక్షయాత్ర చేపట్టాలన్నది ఇస్రో ప్రవచిత లక్ష్యం. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సరికే మనం మానవులను అంతరిక్షంలోకి పంపి ఉండేవాళ్ళం. ముందే చెప్పుకున్నట్లు కారణాంతరాల వల్ల అది వాయిదా పడింది. కానీ ఈ గ్యాప్‍లో యాగ్జియం-4 మిషన్ ద్వారా శుభాంశుశుక్లా అంతరిక్షంలోకి వెళ్ళడం మనకు ఆయాచిత వరమని చెప్పవచ్చు. శుక్లా అనుభవం మరియు అభ్యాసాలు మనకు గగన్‍యాన్ మిషన్‍లో ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంది.
గగన్‌యాన్‌కు ముందు శుక్లా అంతరిక్షయానం – ప్రాముఖ్యత
మానవసహిత అంతరిక్షయానాలు ఎన్నో సవాళ్ళతో కూడుకొని ఉంటాయి. అదే తొలిసారైతే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా ఉంటాయి. మానవరహిత అంతరిక్ష యాత్రలతో పోలిస్తే, మానవ సహిత అంతరిక్ష యాత్రలు భద్రతాపరమైన నిబంధనలతో కూడి ఉన్నందున రెట్టింపు సంక్లిష్టతలతో కూడి
ఉంటాయి. గగన్‍యాన్ మిషన్‍లో ఇస్రో ఎదుర్కోనున్న అతిపెద్ద సవాలు ఇదే. ప్రమాదాలను తగ్గించి మిషన్ యొక్క భద్రతను పెంచే ప్రతీ ఇన్‍పుట్ ఈ సందర్భంలో అత్యంత విలువైనదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎఎక్స్-4 మిషన్ ద్వారా శుభాంశు శుక్లా సాధించిన అనుభవం ఇస్రో నిర్వహించబోయే గగన్‍యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్వహణలో ఈ క్రింది విదంగా తోడ్పడే అవకాశం ఉంది. అవి i) ప్రీలాంచ్ క్వారంటైన్ విధానాలు ii) అంతర్జాతీయ అంతరిక్ష సహకార నిబంధనల అవగాహన iii) అంతరిక్షనౌక ప్రవేశం మరియు నిష్క్రమణ విధానాలు iv) మైకోగ్రావిటీలో వైద్య పరిధోనలు v) ఆరోగ్య సంసిద్ధతా నియమాలు.
విలువైన శాస్త్రీయ పరిశోధనలు
యాగ్జియం-4 మిషన్ బయాలజీ మరియు బయో ఇంజనీరింగ్‍పై దృష్టి కేంద్రీకరిస్తూ ఈ క్రింది విధంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు నిర్వహించడం జరిగింది.
సూక్ష్మ గురుత్వాకర్షణలో మొలకల పెరుగుదల:
విత్తనాలు మొలకెత్తడం మరియు పెరుగుదల అనేది అంతరిక్షంలో ఎలా ప్రభావిత మవుతుంది అన్నది ఈ ప్రయోగం అన్వేషిస్తుంది. సుదీర్ఘ అంతరిక్ష యాత్రలలో వ్యోమగాములకు స్థిరమైన ఆహార వనరులను సృష్టించడం ఈ ప్రయోగ లక్ష్యం. భూమిపై కరువు కాటకాలు ఏర్పడినపుడు అంతరిక్షంలో ఆహారాన్ని సమర్థవంతంగా ఎలా ఉత్పత్తి చేయాలో అర్థం చేసు కోవడానికి ఈ ప్రయోగం దోహద పడుతుంది.

- పట్టణ వ్యవసాయ అభివృద్ధి, అంతర (Indoor) వ్యవసాయం పురోగతిలో ఈ పరిశోధన ఫలితాలు విస్తృత ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
- నగరాల్లో స్థిరమైన ఆహారోత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, పట్టణ జనాభా ఆహారం కోసం బాహ్య సరఫరాలపై ఆధారపడడం తగ్గించుకొని తమ ఆహారాన్ని తామే ఉత్పత్తి చేసుకొనేందుకు ఈ పరిశోధన తోడ్పడుతుంది. ఈ పరిశోధనకు యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, ధార్వాడ్ మరియు ఐఐటీ ధార్వాడ్ నేతృత్వం వహించాయి.
సూక్ష్మ శైవలాల పెరుగుదల:
సూక్ష్మ శైవలాలు (మైక్రో ఆల్గే) ఆహారం, ఇంధనం మరియు జీవనాధారానికి ఆధార వనరులు.
ఈ ప్రయోగం తీసేస్తుంది సూక్ష్మ గురుత్వాకర్షణ సూక్ష్మ శైవలాల పెరుగుదలను మరియు వాటి జీవ క్రియను ఎలా ప్రభావితం చేస్తుందో అధ్యయనం చేస్తుంది. మైక్రో ఆల్గేను అంతరిక్ష కార్యకలాపాలలో బయోరీజైనరేటిన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‍లలో
ఉపయోగించవచ్చు.
వీటిని ఇప్పటికే భూమిపై జీవ ఇంధనాలు, వ్యర్థాల నిర్వహణ మరియు పోషక పదార్థాల కోసం వినియోగిస్తున్నారు.
ఈ పరిశోధన ఆహార ఉత్పత్తి మరియు పునరుత్పాదక శక్తి వనరులను గూర్చి మన ఆలోచనా విధానాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పర్యావరణ అనుకూల ఇంధన వనరులు మరియు స్థిరమైన ప్రత్యామ్నాయ ఆహార ఉత్పత్తికి దోహద పడుతుంది. ఈ పరిశోధనకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ICGEB), న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ అండ్ రీసెర్చ్ నేతృత్వం వహించాయి.
అంతరిక్షంలో కండరాల క్షీణత (మయోజెనిసిస్):
అంతరిక్షంలో వ్యోమగాములలో కండర క్షీణతకు దారితీసే సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితులలో, కండరాలు పనిచేయక పోవడాన్ని అవగాహన చేసుకోవడం ఈ ప్రయోగ లక్ష్యం.
మయోజెనిసిస్‍లో పరమాణు మార్గాలను (Molecule Pathways) గుర్తించడం ద్వారా సుదీర్ఘ అంతరిక్ష యాత్రల సమయంలో కండర క్షీణతను నివారించి, దాని నివారణకు తగు చికిత్స విధానాలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రయోగం దోహదం చేస్తుంది.
ఈ పరిశోధన భూమిపై రోగులకు ముఖ్యంగా వృద్ధులకు మరియు కండరాల బలహీనత (Muscle Dysrophies) లేదా దీర్ఘకాల చలన రహిత స్థితితో (Prolonged Immobility) బాధ పడేవారికి కండర క్షీణత చికిత్సలను మెరుగుపరిచి, భూమిపై మెరుగైన ఆరోగ్య వాతావరణానికి దోహద పడుతుంది. ఈ పరిశోధనకు ఇన్సిస్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీ జెనారేటివ్ మెడిసిన్ (Instem), బెంగళూరు నేతృత్వం వహించింది.
జీవనాధారం కోసం (Life Support) సయానో బ్యాక్టీరియా:
కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే సామర్థ్యం కారణంగా అంతరిక్ష నౌకలలో జీవనాధార వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి సయానో బ్యాక్టీరియా చాలా ముఖ్యమైనది. ఈ ప్రయోగం అంతరక్షింలో సయానో బ్యాక్టీరియా పెరుగుదల మరియు వాటిలోని జీవరసాయన కార్యకలాపాలను అధ్యయనం చేస్తుంది. అంతరిక్షంలో ఆక్సిజన్ మరియు ఆహార ఉత్పత్తి కోసం క్లోజ్ లూప్ వ్యవస్థలను సృష్టించడంలో సహాయపడుతుంది.
ఈ ప్రయోగ ఫలితాలు పర్యావరణ నియంత్రణ వ్యవస్థల రూపకల్పనలో ప్రధానంగా స్థిరమైన భవనాల రూపకల్పనలోనూ, నీటి శుద్ధీకరణ, ఏకాంత లేదా పట్టణ ప్రాంతాలలో గాలి నాణ్యత నిర్వహణలో తోడ్పడుతాయి.
ఈ ప్రయోగానికి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ICGEB) నేతృత్వం వహించింది.
అంతరిక్షంలో మనిషి మరియు ఎలక్ట్రానిక్ డిస్ప్లేల మధ్య ఇంటరాక్షన్:
ఈ ప్రయోగం ఎలక్ట్రానిక్ డిస్‍ప్లేలను వినియోగించడంలో సంబంధం ఉన్న భౌతిక మరియు మానసిక చలనాత్మక విధులను మైక్రో గ్రావిటీ ఎలా ప్రభావితం చేస్తుందో అధ్యయనం చేస్తుంది.
అంతరిక్ష నౌక సాంకేతికత రూపకల్పనను మెరుగుపరచడం దీని లక్ష్యం.
ఈ పరిశోధన ఫలితాలు స్మార్ట్ పరికరాలు, గేమింగ్ సిస్టమ్‍లు మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో వినియోగదారుల అనుభవాలను మరియు ఉత్పాదకతను మెరుగు పరచగలవు.
రోజువారీ సాంకేతికత వినియోగంలో మానవ సౌకర్య వంతమైన నమూనాల (ఎర్గోనామిక్ డిజైన్స్) రూపకల్పన, ఒత్తిడిని తగ్గించి, సామర్థ్యాలను పెంచుతాయి. దీనికి ఐఐఎస్‍సీ బెంగళూరు నేతృత్వం వహించింది.

అంతరిక్షంలో టార్టిగ్రేడ్ల మనుగడ:
టార్డిగ్రేడ్‍లు అనబడే జీవులు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని (స్థితిస్థాపకత) జీవించ గలగడంలో ప్రసిద్ధి చెందాయి. అంతరిక్షంలో వాటి మనుగడ, పునరుజ్జీవనం మరియు పునరుత్పత్తిని అధ్యయనం చేయడం వల్ల కఠిన పరిస్థితులలో నిలదొక్కుకోవడం (స్థితి స్థాపకత) యొక్క పరమాణు విధానాలను గుర్తించడంలో సహాయపడుతుంది.
ఈ పరిశోధనా ఫలితాలు భూమిపై బయోటెక్నాలజీ మరియు వైద్య పరిశోధనల పురోగతికి దోహదం చేస్తాయి. అదే విధంగా బయోమెడికల్ ప్రిజర్వేషన్, రీజెనరేటివ్ మెడిసిన్, తీవ్ర పర్యావరణ పరిస్థితులను తట్టుకో గలిగే విధానాల రూపకల్పనకు దారితీస్తాయి. దీనికి కూడా ఐఐఎస్‍సీ బెంగుళూరు నేతృత్వం వహించింది.
అంతరిక్షంలో పంటల పెరుగుదల మరియు దిగుబడి:
అంతరిక్షంలో పంటలు ఏ విధంగా పెరుగుతాయి వాటి దిగుబడులు ఎలా ఉంటాయి అన్న అంశంపై కూడ పరిశోధనలు నిర్వహించారు. దీనికి ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కేరళ), కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నేతృత్వం వహించాయి.
ఇస్రోకు బహుళ ప్రయోజనాలు:
గగన్‍యాన్ మిషన్ ప్రయోగానికి ముందు ఇస్రో యాగ్జియం-4 మిషన్‍లో భాగస్వామి కావడం ద్వారా ఈ క్రింది విధంగా బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
i. ట్విన్ పిల్లర్స్ ప్రయోగానికి కీలకం:
ఇస్రో 2035లో సొంతంగా భారతీయ అంతరిక్ష స్టేషన్‍ను (BAS)ను నిర్మించతల పెట్టింది. దీనికి సంబంధించిన తొలి ప్రయోగం 2028లో ప్రారంభం కానుంది. అదే విధంగా 2027లో గగన్‍యాన్ మిషన్‍ను ప్రయోగించనుంది. ఈ రెండింటిని ఇస్రో ట్విన్ పిల్లర్స్గా అభివర్ణిస్తారు. ఈనేపథ్యంలో యాగ్జియం-4 మిషన్ ద్వారా శుక్లా సంపాదించిన అనుభవం క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాలను ధృవీకరించడంలోనూ మిషన్ సంసిద్ధతను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది.
ii. మెరుగైన అంతర్జాతీయ భాగస్వామ్యం:
ప్రపంచ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎఎక్స్-4 మిషన్, నాసా, యాక్జియం స్పేస్ మరియు ఇతర అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో ఇస్రో యొక్క సంబంధాలను బలోపేతం చేస్తుంది. మెరుగైన అంతరిక్ష ఒప్పందాలను చేసుకోవడానికి దోహదపడుతుంది. సైన్స్ దౌత్యం, సాంకేతిక ప్రగతి యొక్క అభివృద్ధిని మరింత ప్రోత్సహిస్తుంది.
iii. భవిష్యత్ ప్రయోగాలకు దిక్సూచి:
ఎఎక్స్-4 మిషన్ అనేది కేవలం ఒక అంతరిక్ష యాత్ర మాత్రమే కాదు. శాస్త్రీయ ఆవిష్కరణలను పెంచడం, భూమికి అవతల ఉన్న మానవాళి ఉనికిని అన్వేషించ డానికి ఒక సాహసోపేతమైన ముందడుగని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నలుగురితో పాటుగా కాకుండా అంతరిక్ష అన్వేషణా రంగంలో ఫ్రంట్‍రన్నర్ ఇండియా ఎదిగేందుకు ఎఎక్స్-4 మిషన్ ఒక శక్తివంతమైన స్ఫూర్తిదాయక చిహ్నంగా నిలుస్తుంది.
iv. బయో ఇంజనీరింగ్ విధానాలకు అనుకూలం:
ఎఎక్స్-4 మిషన్ ద్వారా ఇస్రో బయో ఇంజనీరింగ్ రంగంలో నిర్వహించిన పరిశోధనలు ఇండియా యొక్క బయో ఈ3 (BIOE3 Policy) విధానానికి అనుకూలంగా ఉన్నాయి. తద్వారా పర్యావరణ అనుకూల వ్యవస్థలను రూపొందించడంలోనూ, బయోటెక్ మరియు స్పేస్ బేస్‍డ్ లైఫ్ సైన్సెస్ రంగంలో ఇండియా దిగ్గజశక్తిగా రూపాంతరం చెందడానికి ఎఎక్స్-4 మిషన్ దోహదపడుతుంది.

v. నాయకత్వం వహించే ముందు నేర్చుకో (learning before leading) విధానానికి అనుకూలం:
ఇండియా మొదటి నుండి అంతర్జాతీయ సంస్థలతో భాగ స్వామ్యం కుదుర్చుకోవడం, వాటి నుండి జ్ఞానాన్ని సంపాదించడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, తదుపరి స్వదేశీ సాంకేతిక వ్యవస్థలను రూపొందించడం అనే పక్రియను అనుసరిస్తోంది. ప్రారంభంలో సోవియట్ యూనియన్, నాసాలతో భాగాస్వామ్యం కుదుర్చుకొని శాటిలైట్ టెక్నాలజీ, వాహక నౌకలు, గ్రహాంతర నౌకలు రూపొందించి, ప్రస్తుతం ఎఎక్స్-4 మిషన్ సహకారంతో మానవ సహిత అంతరిక్ష నౌకను తయారు చేసింది. ఈ విధంగా learning before leading Phylosophy ద్వారా ఇస్రో అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించేందుకు ఎఎక్స్-4 దోహదం చేసింది
vi. యువతకు ప్రోత్సాహం:
ఎఎక్స్-4 మిషన్ ద్వారా శుక్లా అంతరిక్షంలోని కక్ష్యలోఉండగా భూమిపైన ఆన్ గ్రౌండ్ మిషన్‍లో పాల్గొన్న అనేకమంది భారతీయ యువశాస్త్రవేత్తలు సంక్లిష్ట అంతరిక్ష మిషన్లను నిర్వహిచండంలో వెలకట్టలేని నైపుణ్యాలను పొందారు. ఈ విధంగా భారతీయ యువ శాస్త్రవేత్తలు స్పేస్ మెడిసిన్, కక్ష్య కార్యకలాపాలు, సిబ్బంది నిర్వహణ, మిషన్ ప్లానింగ్ మరియు బయో ఆస్ట్రోనాటిక్స్ల నందు రియల్‍టైమ్ అనుభవాన్ని సంపాదించేందుకు ఎఎక్స్-4 మిషన్ దోహదపడింది.
చివరగా:
భారత అంతరిక్ష కార్యక్రమాల్లో సుస్థిర ప్రగతి కోసం పరిశోధన అభివృద్ధి (ఆర్‍అండ్‍డీ) కార్య కలాపాలను ప్రోత్సహించాలని జాతీయ అంతరిక్ష విధానం (ఐఎస్‍పీ-2023) పిలుపుని స్తోంది. దేశీయంగా పౌర సేవలను విస్తృత పరచడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపకరిస్తుందని ఐఎస్‍పీ సూచిస్తోంది. అంతరిక్షరంగంలో ఖర్చుచేసే ప్రతి రూపాయికి అంతకు రెండున్నర రెట్ల ప్రతిఫలం లభిస్తోందని అధ్యయనాలు చాటుతున్నాయి. ఈ నేపధ్యంలో అంతరిక్ష రంగానికి ప్రభుత్వం మారి నిధులు కేటాయించాలి (ప్రస్తుతం ఇండియా జీడీపీలో 0.05% కేటాయించారు). ప్రస్తుతం 800 కోట్ల డాలర్లుగా భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ, రాబోయే కాలంలో 4400 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా. ఆ స్థాయి ప్రగతి సాధ్యపడాలంటే పెట్టుబడులు పెరగాలి. అదే విధంగా చిన్నప్పటి నుండే విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంచుతూ, మౌళిక పరిశోధనల వైపు వారిని నడిపించినట్లయితే ఇండియా అంతరిక్ష రంగంలో సమున్నత స్థాయిని చేరుతుందనడంలో అతిశయోక్తిలేదు.
-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప,
ఎ : 955029004