తెలంగాణా రాష్ట్రం, జోగులాంబ-గద్వాల జిల్లా, ఆముదాలపాడులో బాదామీ చాళుక్య మొదటి విక్రమాదిత్యుని సా.శ.660 నాటి రాగిరేకు శాసనం దొరికింది. అందులో బాదామీ చాళుక్యులు తాము ‘మానవ్యస గోత్రాణాం హారీతీ పుత్రాణాం సప్తలోక సప్తమాతృరభి వర్థితాణామ్’ అని చెప్పుకొన్నారు. ‘హారీతీ పుత్రాణాం’ అన్న సమాసంలోని హారీతీ ఎవరు? తెలుసుకోవాలంటే బౌద్ధంలోకి తొంగి చూడాలి. రాజగృహానికి చెందిన హారీతి, పంచికుని భార్య. చాన్నాళ్లు ఆమెకు పిల్లలు పుట్టక పోయేసరికి, తోటి స్త్రీలు ఆమెను గేలి చేసేవారు. తట్టుకోలేని హారీతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆడుకొంటున్న చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి, దాచిపెట్టి, వాళ్లంతా తన పిల్లలేనని ఆనందిస్తుండేది.
ఆడుకొంటున్న బిడ్డల ఆచూకీ తెలియని కన్నతల్లులు బుద్ధుని వద్ద తమ గోడును వెళ్లబోసుకొన్నారు. కారణం కనుగొన్న బుద్దుడు, హారీతీ దాచిపెట్టిన వారిలో చిన్నవాడైన పింగళుని తెచ్చి, తనవద్ద దాచిపెడతాడు. పింగళడు కనిపించక తల్లడిల్లిన హారీతీ, బుద్ధుని వద్ద తన బాధను వెళ్లగక్కి, ఎలాగైనా తనబిడ్డను దొరకబుచ్చుకోమని వేడుకొంటుంది. అప్పుడు బుద్ధుడు, ‘హారీతి’! ఒక్క బిడ్డను పోగొట్టుకొని ఇంత బాధపడుతున్నావ్ గదా! మరి ఇందరు తల్లులు తమ బిడ్డల్ని పోగొట్టుకొని ఎంత బాధపడుతున్నారో గమనించావా? అని అడుగుతాడు. ‘బుద్ధ భగవాన్!’ అది ‘అలవికాని బాధ’ అని బదులిచ్చిన హారీతీకి, తాను దాచిపెట్టిన పింగళుని అప్పగించగా సంతోషంతో ఉప్పొంగిపోయిన హారీతీ, నిజాన్ని గ్రహించి, తనవద్దనున్న 500 మంది బిడ్డల్ని వారి వారి తల్లులకు అప్పగించటమే కాక, ఇక నుంచి, తాను అందరిపిల్లలకు రక్షకురాలిగా ఉంటా నని బుద్ధునికి చెప్పింది. లోకమాతగా పేరుగాంచిన ఆమె, బౌద్ధంలో ఆరాధ్య మాతగా ఎదిగింది.
సా.శ.1వ శతాబ్దిలో గాంధార ప్రాంతంలో రాతి హారీతీ శిల్పం పురుడు పోసుకొంది. కుషానుల నాణేలపై కూడా ముద్రించబడింది. సా.శ.3వ శతాబ్దికి నాగార్జునకొండలో హారీతికి ఒక ఆలయం నిర్మింపబడింది. ఇదంతా ఒక ఎత్తైతే, తెలంగాణాలోని, పెద్దపల్లి జిల్లా, ధూళికట్ట బౌద్ధస్థూపం వద్ద జరిపిన తవ్వకాల్లో సా.శ.పూ. 2-1 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన బిడ్డ నెత్తుకొని కూర్చున్న హారీతీ కంచుబొమ్మ బయల్పడి, కళాచరిత్ర కారుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తొట్టతొలి త్రీడీ కంచుబొమ్మ నందించిన తెలంగాణాకు హారీతీ శిల్ప కళాచరిత్రలో మైలురాయి నందించిన ఘనత దక్కింది. తెలుగు నాట హారీతీ ఆరాధనకు నాంది పలికింది.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446