ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను కొందరు అత్యంత సరళంగా వివరించగలుగుతారు. అందుకు వారి క్షేత్రస్థాయి అనుభవం, ఆలోచన దూరదృష్టి ఎంతగానో ఉపకరిస్తుంది. పర్యావరణ ఉద్యమ నేత సుందర్‍లాల్ బహుగుణ ఒక సందర్భంలో వ్యాఖ్యనిస్తూ మానవాళి ప్రబల శత్రువులుగా మూడింటిని పేర్కొన్నారు. యుద్ధం, కాలుష్యం, ఆకలి ఇవే ప్రపంచానికి హానికారకాలు ముఖ్య శత్రువులు అంటాడు బహుగుణ. అయితే ఈ మూడింటికి ఒకదానితో ఒకటి ముడవడి, విడదీయలేనంతగా దృఢంగా ఉంటాయి. ప్రజలు తమకు ఉన్నదానికంటే మరింత మరింత కావాలనే ఒక విచక్షణా రహిత వాంఛను నేర్పింది సమాజం. ఎప్పుడైతే ఉన్నదానితో సంతృప్తి చెందక ఈ మరింత సంపాదకోసం ప్రయత్నిస్తారో ఆధిపత్య శక్తుల యుద్ధ పోరాటం మొదలవుతుంది. ఈ పోరాటం వనరులు, ఖణిజాలు అధికంగా లభ్యమయ్యే స్థలాల విషయంగా సాగుతూ ఉంటుంది. వారి ప్రభావ శీలత, అధికారం కొనసాగించడానికి నిత్య ప్రయత్నాలూ కొనసాగించవలసి వస్తుంది. తమ ఆధిపత్యాన్ని నెరపడానికి పాశ్చాత్య దేశాలు ఆయుధ వ్యాపారాన్ని సృష్టించుకున్నాయి. ఇవాళ ఆయుధ పరిశ్రమ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా లాభాలను సంపాదించి పెట్టే ముఖ్య సాధనంగా మారింది. ఆయుధ పరిశ్రమలు లాభార్జనే ధ్యేయంగా సాగుతాయి. సంపన్న పెట్టుబడిదారి దేశాలు, ఆ దేశ జీవన ప్రమాణాలు మెరుగుపరచు కొనేందుకు మొగ్గు చూపుతాయి. ప్రజల ఆలోచనా ధోరణి కూడా ఇందుకనుకూలంగా మలచబడుతుంది. పేద దేశాలకు ఈ వెసులుబాటు ఉండదు. తప్పని సరిగా అవి తమ సహజవనరులను ఎగుమతి చేయవలసి వస్తుంది. వాటికి గత్యంతరం ఉండదు. ఇవ్వాళ అడవుల నరికివేత వనరుల వేట నిర్దాక్షిణ్యంగా సాగుతూ ఉన్నది. ఎగుమతుల కోసం ఉత్పత్తిని పెంచాలి. ఉత్పత్తి పెరగాలంటే రసాయన ఎరువులు వాడాలి. తద్వారా నేల, నీరు, గాలి కాలుష్యం బారిన పడతాయి. సారవంతమైన భూములు మొత్తం విదేశీ మారకద్రవ్య ఆర్జనకే ఉపయోగించాల్సి వస్తుంది. ఉన్న ఏ కొద్దో గొప్ప భూమి మిగిలి ఉంటే అది కూడా నిస్సారమవుతుంది. నీరు పరిశ్రమలు వదిలే కాలుష్య కారకాలతో నిండిపోతుంది. ఒక విధంగా చూస్తే ఆయుధాల కోసమని, భద్రత కోసమని భూమిని, నీటిని ఎగుమతి చేసి, కాలుష్యాన్ని దిగుమతిగా పొందుతాయి. నేల, నీరు ఈ రెండే మానవాళి వనరులు ఈ రెండే విధ్వంసానికి గురి చేయబడ్డప్పుడు ప్రజలు ఆకలితో అలమటించవలసి వస్తుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇదెంత వాస్తవమో మనకు అర్థమవుతుంది.

మనిషి తలపెట్టే చర్యలలో అతని హృదయం కంటే ఎక్కువగా మేథ లేదా బుద్ధి కనిపిస్తుంటుంది. నిజానికి మనిషి నడవాల్సింది అతని హృదయాదేశం మేరకు. కానీ, బుద్ధి నడుపుతూ ఉంటుంది. అందుకే ఆధునిక మానవుడిని గురించి ఇలా చెపుతూ ఉంటారు. అతనికి అతిపెద్ద మెదడు ఉంది. ఆశక్తమైన చేతులున్నాయి. కానీ, హృదయమే లేదు. కేవలం భౌతిక ప్రయోజనాల కోసమే పనిచేస్తుంటాం. ఒక అసమతుల్యత ఏర్పడటానికి హృదయ రాహిత్యమే కారణం. ఈ నాడు మనుషులు ప్రతి విషయాన్ని దేనికది విడిగా, శకలీకరించి చూస్తున్నారు. ఒక సంపూర్ణ దృష్టి, సమగ్ర దృక్పథంలో చూడకపోవటం వల్ల పలు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తున్నది. ప్రకృతిలో పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడటానికి మూలం ఎక్కడుంది? మనం ఎక్కడ తప్పటడుగు నేస్తున్నామనేది ఆలోచించాల్సిన విషయం. భారతీయ సామాజిక, తాత్విక చింతనలోనే ఒక అంశం ఇమిడి ఉంది. మానవులు / దానవులు అనే ఈ జంట ప్రత్యర్థి భావనలోనే ప్రకృతి పర్యావరణానికి అనుకూలురు, ప్రతికూలురనే నిర్ధారణ ఉందని భావించవచ్చు. మానవులుగా మనం ప్రకృతిని సకల విదాలుగా గౌరవించేవారం అనే సూచన ఉంది. మరి దానవులో ఎవరూ అంటే ప్రకృతి పట్ల ఏ గౌరవం లేకుండా వివేక రహితంగా దుర్వినియోగపరచే వారని అర్థం చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికత యొక్క బాహ్యభివ్యక్తి సంస్కృతి అని భావించడం జరుగుతుంది. ఒక చిత్ర రచన ఆ చిత్రకారుడి స్ఫూర్తిని అభివ్యక్తం చేసినట్లుగా సంస్కృతి అనేది ఒకానొక సమాజం యొక్క స్ఫూర్తిని తేటతెల్లం చేయగలుగుతుంది. సుందరలాల్ బహుగుణ చెప్పిన యుద్ధం, కాలుష్యం, ఆకలి గురించి కానీ, ఈ మూడింటి పరస్పర సంబంధం గూర్చి కానీ ఆలోచించే తీరుబడి ఎవరికి ఉంది నేడు?
వర్తమానంలో ప్రపంచవ్యాప్తంగా యుద్ధవాతావరణమే ఉంది. దేశాల మధ్య అనేక విషయాలపై విభేదాలు, ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. దేశాల నడుమ యుద్ధాలు నడుపుతూ శాంతిని కాంక్షిస్తున్నట్లు, ప్రపంచశాంతిని ఆశిస్తున్నట్లు కపట ప్రకటనలు వెలువడుతున్నాయి. ప్రతి ఒక్కరూ కాలుష్యానికి కారణభూతులుగా నిలుస్తున్నవారే. ఆకలి అనే రోగాన్ని రూపుమాపే మానవీయ ప్రతిస్పందనలూ అంతగా కనిపించవు.
ఇటువంటి స్థితిలో సుందర్‍లాల్ బహుగుణ చెప్పినట్లు మూడు రకాల వ్యక్తులు వారు ఎక్కడెక్కడున్నా చిన్న చిన్న బృందాలుగా సంఘటితం చేయబడాలి. వారెవరంటే మానవీయతగల శాస్త్రవేత్తలు. వీరు తమ జ్ఞానాన్ని ప్రపంచంలోని సకల దారిద్య్రాలను తొలగించడానికి వినియోగించేవారు. రెండవ కోవకు చెందినవారు సామాజిక కార్యకర్తలు. వీరు అహింసాపద్ధతుల ద్వారా సమాజంలో మార్పును తెచ్చేందుకు కృషి చేస్తారు. ఇక మూడవరకం వారు ఆర్తి, కారుణ్యంగల కళాకారులు, సంగీతజ్ఞులు, పాత్రికేయులు, సాహితీస్పష్టత. ఈ మూడు కోవలకు చెందినవారు ఒకచోట కూడి సమస్యలకు పరిష్కారమార్గాలను వెతకాలి. వీరే జ్ఞాన, కర్మ, భక్తి యోగులు పర్యావరణ హితం వీరివల్లనే సాధ్యం అని బహుగుణ ఆశించాడు.
- డా।। ఆర్. సీతారామారావు
ఎ : 9866563519