చెట్టంత మనిషి


ఇప్పుడు చిన్న తరగతుల చరిత్రపాఠాల్లో ఉన్నాదో లేదో కానీ, రహదారుల పక్కన చెట్లు నాటించిన, మండపాలు కట్టించిన, బావులు తవ్వించిన అశోకుడి గురించి మేము చదువుకున్నాము. ఆ తరువాత చాలా మంది పెద్ద పెద్ద రాజుల గురించి, చక్రవర్తుల గురించి తెలుసుకున్నప్పుడు,వాళ్లు పాల్గొన్న యుద్ధాలు, చేసిన దండయాత్రలు, ఆక్రమించుకున్న రాజ్యాలు వంటి విషయాలే తప్ప, అశోకుడి లాంటి మంచి పనులు చేసినట్టు పెద్దగా వినలేదు. పైగా, తన పాలనలోని ‘ధార్మిక’ విలువల గురించి అశోకుడు తానే స్వయంగా శాసనాలు వేయించుకున్నాడు. దారి వెంబడి చెట్లు పెంచడంలో తామే ఫస్ట్ అంటుంది ఐరోపా. అందుకు రెండువేల ఏండ్ల మునుపే, భారతదేశంలో ఆ మూల నుంచి ఈ మూలకు సంచరించడానికి, వాణిజ్యం సజావుగా జరగడానికి రోడ్ల పక్కన చెట్లు, వసతిగృహాలు, ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేసిన దార్శనికత అశోకుడిది.

మానవుడి పురోగతి అంతా చెట్టు చుట్టూతూనే ఎదిగింది. చెట్టును చూసి చాలా నేర్చుకోవచ్చు. ‘చెట్టు నా ఆదర్శం’ అన్నాడు ఒక కవి. కానీ స్వార్థం తలకెక్కితే చెట్టు కలపగా మాత్రమే కనిపిస్తుంది. నిజానికి, చెట్లను కాపాడడం ఆదర్శమో పరోపకారమో కానక్కరలేదు. మనిషికి మనుగడకు అత్యవసరమైన కర్తవ్యం అది. కూర్చున్న కొమ్మను నరుక్కునే మూర్ఖత్వం, లాభం కోసం తన చావును కొనితెచ్చుకునే దుర్మార్గం మానవ వ్యవస్థలను ఆవరించిన తరువాత, గంజాయి వనంలో తులసిమొక్కల వంటి వృక్షప్రేమికులు, పచ్చదనాన్ని ప్రేమించే ఉలిపికట్టెలు అపురూపమైన ఆదర్శమూర్తులయ్యారు. ‘వనజీవి’ రామయ్య వంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఎన్ని లక్షల మొక్కలు నాటారు, అవి ఎన్ని వనాలుగా విస్తరించాయి అన్న లెక్కల కంటె, ఆయన ఒక ఆకుపచ్చని సందేశాన్ని జీవితాంతం మోసుకు తిరిగారు. చరిత్ర దాన్ని గౌరవంగా గుర్తుంచుకుంటుంది.
రెండు వందలేండ్ల కిందట, చెట్లను ఆలింగనం చేసుకుని, ఖండఖండాలై పోయిన ‘బిష్ణోయ్‍’ల త్యాగం గొప్పది. అభివృద్ధి కోసం వనాలను నరికేసే ఆధునిక ధోరణి అప్పుడప్పుడే మొదలయి ఉండాలి. ప్రాచీన, మధ్య యుగాలలో, భూమి విస్తారంగానూ, జనావాసాల సంఖ్య తక్కువగానూ ఉండడం వల్ల, మానవ కృత విధ్వంసం ప్రమాదస్థాయికి చేరలేదు. అయితే, వినియోగానికి మించి చెట్టూచేమలకు హానిచేయవద్దని, ‘కసుగాయలను’ ఏరవద్దని, నీడనిచ్చేచెట్లను నరక వద్దని నమ్మిన సంస్క•తి మనది. అవసరమైన చోట్ల చెట్లను, తోటలను పెంచడాన్ని ఒక ధార్మికవిలువగా పరిగణించారు.

సప్తసంతానాలలో ఉద్యానాల పెంపకం కూడా ఒకటి. మనుషులు రాబోయే తరాలలో కూడా తమ జ్ఞాపకాన్ని కొనసాగించే మంచి పనులే సంతానాలు. కొడుకొక్కడే కాదు, వంశం పేరు నిలబెట్టేది. నువ్వు తవ్వించిన బావి, నువు కట్టిన మండపం, నువ్వు పెంచిన తోట అన్నీ నీ పేరున చిరస్థాయిగా నిలుపుతాయి. అని ధర్మశాస్త్రాఉల, పురాణాలు వృక్షపోషణము ప్రోత్సహించాయి.
దురదృష్టవశాత్తు, కంచే చేను మేసినట్టు, వృక్షాలను, అరణ్యాలను రక్షించవలసిన వారే న ఏడు భక్షకులుగా తయారయ్యారు. అధిక లాభాలనో, ఫలసాయాన్నో, నిట్టనిలువు అభివృద్ధినో అందించే క్రమంలో పర్యావరణాన్ని, పచ్చదనాన్ని నాశనం చేసే ప్రణాళికలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో యథేచ్చగా అమలుచేస్తున్నారు. వాటిని వ్యతిఏకించేవాళ్లను, అడ్డుగా ఉన్నవాల్లను అప్రదిష్టపాలు చేయడమో, మరీ ప్రతిఘటన అధికంగా ఉంటే అడ్డు తొలగించుకోవడమో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము. పర్యావరణ విధ్వంసాన్ని ఒక విధానంగా అమలు చేసే శక్తులకు ఎదురొడ్డుతున్న ఉద్యమాలు ఒక రకం. వ్యక్తిగత స్థాయిలో మొక్కల పెంపకాన్ని ఒక విలువగా ప్రచారం చేసే స్వచ్ఛంద సేవకులు మరొకరకం. ఒక పక్కన అడవులను తుడిచి పెట్టే చర్యలను అనుమతిస్తున్న ప్రభుత్వాలే, మరోవైపున వివిధ పథకాల పేరుతో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తుండడం విచిత్రం. చెట్టుకు ఎంతో కొంత నీడ దొరుకుతుందని సంతృప్తిపడడం తప్ప వృక్ష ప్రేమికులు ఏమి చేయగలరు?

‘వనజీవి’ రామయ్య, మొక్కలు నాటడాన్ని వ్యక్తిగత స్థాయిలో ఒక ఉద్యమంగా చేపట్టారు. అందుకు ప్రభుత్వయంత్రాంగంలోని అనుకూల అంశాల సహాయం తీసుకున్నారు. జీవితం అంతా దాన్నొక వ్యసనంగా మార్చుకున్నారు. సొంత జీవితంలో కూరుకుపోకుండా, పరహితం కోరే ఏదో ఒక కార్యక్రమంలో భాగం కావాలని అనుకునేవారే తక్కువ. పరిమిత స్థాయిలో ఉడతాభక్తిగా చేసేవారు కొందరు. అట్లాకాక, అదే పనిగా జీవితం సాగించడం అరుదు. సమాజంలో ఇటువంటి ‘ఉద్వేగ’ పూరిత ఆచరణ ఉన్న వారి వల్లనే, లోకంలోని చెడుకు ఎంతో కొంత విరుగుడు కుదురుతుంది. ‘పిచ్చిపట్టినట్టు’ పని చేసేవారి వల్లనే మంచిపనులు జరుగుతుంటాయి. దరిపెల్లి రామయ్య అందుకే ధన్యజీవి. అనేకానేక అవార్డులు, చివరగా పద్మశ్రీ పురస్కారం, అన్నీ రామయ్య ప్రస్థానంలో మైలురాళ్లే తప్ప, తల మీద ధరించిన ‘వృక్ష రక్షతి రక్షితః’ అన్న నినాదమే ఆయన ఆచరణకు అసలైన కిరీటం.

రామయ్యలోని ఈ వృక్షావేశపు మూలాలను మూడుతరాల ముందునుంచి తవ్వితీసి జిల్లా నరేష్‍ ఈ పుస్తకంలో పూసగుచ్చారు. అనేక సమస్యలతో, అనుకోని మలుపులతో ఉన్న నాటకీయమైన జీవితమేమీ కాదు రామయ్యది. ఆయన జీవితాన్ని నడిపించిన ఒకే ఆదర్శం. లక్ష్యం, గమ్యం అంతా మొక్కవోని వృక్షదీక్షనే. ఆయన పట్టుదలను చూసి ఎవరైనా ముగ్ధులు కావలసిందే తప్ప. మరో ఆలోచన ఎవరికీ రాదు. అధికారులు కూడా అతి త్వరలోనే రామయ్య నిబద్ధతను చూసి ప్రోత్సాహమో్ప శంసలో ఇవ్వక తప్పేది కాదు. అందుకే ఈ పుస్తకంలోని ఎనిమిది అధ్యాయాలలో రామయ్య ‘‘ఇంతింతై వటుడింతయై.. నభోరాశిపై నంతై’’ ఎదిగిపోయారు. కొన్ని వ్యక్తిగత విషాదాలు, చిన్నచిన్న ఇతర సమస్యలు రామయ్య జీవితంలో లేకపోలేదు. అట్లాగే, ఎన్నో విజయాలు, సన్మానాలు ఆయనకు అందాయి. రాష్ట్రపతి భవన్‍లో పద్మశ్రీ అయ్యారు. ముఖ్యమంత్రులతో కలసి వేదికలు పంచుకున్నారు. ఎదురేలేని జీవిత విజయాలు ఆయనవి. రామయ్య జీవితవిశేషాలు, ఉద్యమవిశేషాలు అన్నీ ఒక్కటి కూడా తప్పకుండా నరేష్‍ ఈ పుస్తకంలో క్రోడీకరించారు.

నరేష్‍ రచనాపద్ధతి, శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పుస్తకం ఆసాంతం ఒక స్థితిమితమైన, సరళమైన వచనంలో సాగింది. కథనాత్మక ధోరణి వల్ల పఠనీయత అద్భుతంగా ఉంది. రచయితకు వనజీవి మీద, ఆయన ఆశయం మీద ఎంతో ప్రేమ ఉన్నదని రచనాపద్ధతిలోనే తెలిసిపోతోంది. పాత్రికేయ నేపథ్యం వల్ల ఇంతటి నైపుణ్యం సాధించారని అనుకోవచ్చును కానీ, అంతకు మించిన రచనాభినివేశం, సాధన లేకపోతే ఇటువంటి పుస్తకం రాయడం కష్టం.
సమాజానికి స్ఫూర్తి అందించే వ్యక్తులు అంటే సమాచార సాధనాలు సెలబ్రిటీలుగా భావించే వారిని, లేదా సంచలనాత్మక విజయాలు సాధించినవారిని మాత్రమే లెక్కించే ఆనవాయితీ ఏర్పడిపోయింది. అట్లా కాక, క్షేత్రస్థాయిలో, సాధారణ జీవితం గడుపుతూ, ప్రజల మధ్యనే తమ సేవాచరణను అందించే అనేక మంది జీవితకథనాలు గ్రంథస్థం కావలసి ఉన్నది. పద్మ అవార్డు గ్రహీత కాబట్టి, రామయ్యకు, ఆయన ఆశయానికి చివరి ఏడెనిమిది సంవత్సరాలలో మంచి ప్రసిద్దే వచ్చినప్పటికీ, దీరఘకాలం ఆయన నిరాడంబరంగా, పరిమితి ప్రచారంలోనే ఉండిపోయారు. నిశ్శబ్ద కృషి చేసేవారిని, సమాజం ఎప్పుడో ఒకప్పుడు గుర్తించాలి. వారి జీవితాచరణను తరువాతి తరాలవారికి తెలియజెప్పాలి. ఆ బాధ్యతను గుర్తించి జిల్లా నరేష్‍ ఈ పుస్తకం రాశారు. అభినందనలు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *