సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 21, 2025న రెండు బాలల కథాపుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. విద్యార్థులు స్వయంగా రచించిన “అనంతసాగర్ అక్షర కెరటాలు” పుస్తకాన్ని బాల చెలిమి, డెక్కన్ ల్యాండ్ సంపాదకులు మణికొండ వేదకుమార్ ఆవిష్కరించగా, ఏడవ తరగతి విద్యార్థి బి. విశ్వతేజ రచించిన “విశ్వతేజం” కథల పుస్తకాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆచార్యుడు డా. రఘు ఆవిష్కరించారు. ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంటుందని, దానిని భావితరాలకు అందించడానికి పుస్తకాల రూపంలో భద్రపరచడం ఎంతో అవసరమని వేదకుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. చిన్న వయసులోనే విద్యార్థులు సాహిత్యాభిరుచి పెంపొందించుకోవడంతో పాటు తమ రచనల ద్వారా లోకాన్ని ఆకర్షించాలని సూచించారు. బాలల రచనలను ప్రచురించడంలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ముందుకు వస్తుందని, ఉపాధ్యాయులు విద్యార్థులను పుస్తకాల పఠనానికి ప్రోత్సహించాలని చెప్పారు.
అనంతసాగర్ జిల్లా పరిషత్ పాఠశాల వేదికపై నాలుగు బాలచెలిమి గ్రంథాలయాలు ప్రారంభమయ్యాయి. ఈ గ్రంథాలయాలు అనంతసాగర్, కడవేరుగు, పోతారెడ్డిపేట, అనా జీపూర్ గ్రామాలలో స్థాపించబడ్డాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 100 బాలచెలిమి గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సంస్థ పని చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 19 బాలచెలిమి గ్రంథాలయాలు స్థాపించబడ్డాయని, మిగతా గ్రంథాలయాలను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని మణికొండ వేదకుమార్ తెలిపారు.
ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన విద్యా ప్రణాళికలను వివరించారు. కేరళ ప్రభుత్వ నమూనాలో వచ్చే విద్యా సంవత్సరం నుండి పఠన కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1 నుండి 4 తరగతుల వరకు వారానికి ఒక పీరియడ్‌ను ప్రత్యేకంగా పఠన కార్యక్రమాలకే కేటాయిస్తారు. 5 నుండి 12 తరగతివరకు విద్యార్థులు వార్తాపత్రికల పఠనం మరియు ఇతర సాహిత్య విన్యాసాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు ప్రత్యేక హ్యాండ్బుక్‌లు, శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం తోపాటు, స్కూల్ కల్చరల్ ఫెస్టివల్స్‌లో పఠన విభాగాన్ని చేర్చే విషయంలో కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉందని తెలిపారు.
డా. రఘు మాట్లాడుతూ చిన్న వయసులోనే కథలు రాయడం పిల్లల సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుందని, ఆ కథలు వారి జీవన పయనంలో విలువైన దశలుగా నిలుస్తాయని అన్నారు.
ప్రధానోపాధ్యాయురాలు కోట జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, భైతి దుర్గయ్య సంపాదకత్వంలో రూపొందిన పుస్తకాల ఆవిష్కరణ అనంతరం పాఠశాలలో బాల చెలిమి గ్రంథాలయం ప్రారంభించబడింది. ఈ గ్రంథాలయానికి 100 కంటే ఎక్కువ పుస్తకాలను బహుమతిగా అందజేసి సమృద్ధిని తీసుకువచ్చారు. బాల సాహితీవేత్తలు గరిపెల్లి అశోక్, కథల తాతయ్య రాజమౌళి, తోట మధుసూదన్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు, యువకులు, విద్యార్థులు, సాహిత్యప్రేమికులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాల రచయితలకు అభినందనలు తెలిపారు.
ఖైజర్ భాషా, 9030626288